వేసవి కాలం
బాల్యంలో వేసవికాల అనుభవం
పిల్లలకు తీయని వరం.
ప్రతి సంవత్సరం ఆఖరి పరీక్షలన్నీ వేసవికాలంలోనే
పేపర్లు దిద్దుతూ మాస్టారు గారు ఇంట్లో
బడి తాళాలు మాస్టారు జేబులో
పిల్లలు అమ్మమ్మ గారి ఊరి ప్రయాణoలో
అమ్మమ్మ తాతయ్య సంతోషం కళ్ళల్లో
కలబోసి వేసవి కాలం సందడి.
చెట్ల వెంట పుట్ల వెంట గట్ల వెంట
బాల్య స్నేహితులతో చెట్టాపట్టాలు.
చల్ల కుండ లోంచి తీసిన తరవాణి అన్నం
గట్ల వెంబడి పెరిగే తాటి చెట్ల ముంజలు
వేసవి తాపానికి ప్రకృతి ఇచ్చిన బహుమానం.
మామిడి తోపులో ఏరుకున్న పిందెలు
ఉప్పు కారం నంజుకు తింటే అదోరకం మజా.
అమ్మమ్మ చేతిలో పెట్టిన కొత్తావకాయ ముద్ద
అమ్మమ్మ ఆప్యాయత కన్నా ఎక్కువ రుచి.
కమ్మగా ఉండే కంది పొడి ముద్ద గొంతు దిగుతుంటే
కనుల ముందు కనపడేది స్వర్గo.
పంటి కింద గుమ్మడి వడియం
వెల్లుల్లి వేసిన పప్పు పులుసు
అప్పుడే కావు నుండి తీసిన బంగినపల్లి మామిడి పండు.
గడ్డ పెరుగు మీగడ తో ఆవకాయ ముక్క నంజుకుంటే
కంచంలో మెతుకు మిగిలితే ఒట్టు.
నడవ లో నడ్డి వాల్చి తీసే మధ్యాహ్నపు కునుకు.
చల్లబాటు వేళ అమ్మమ్మ జేబులో పోసిన జంతిక ముక్కలు.
నోరూరించే పనస పండు తొనలు.
వీధిలో చేరి స్నేహితులతో మళ్లీ షికారుకు తయారు.
ఊళ్లో జరిగే అమ్మవారి జాతరలు ,తీర్థాలు
అమ్మమ్మ పెట్టే పోలి పూర్ణం బూరెలనైవేద్యాలు.
కన్నుల పండుగగా గరగల నృత్యాలు.
రంగులరాట్నం, రంగురంగుల కళ్ళజోడు
కోడి పందాలు, కోడి పందెంలో పుల్లయ్య చేసే హడావిడి,l
రంగురంగుల కళ్ళజోడు పెట్టుకొని ఊరంతా బలాదూర్
మరిచిపోలేని మధురానుభూతి.
పశువులను నడ్డి మీద ఎక్కి ఊరేగడం.
అవి పరుగు లంఘించుకుంటే నేల మీద పడి పోవడం.
గల్లీ క్రికెట్ లో కొట్టుకుపోయిన మోకాలి చిప్పలు.
కోతికొమ్మచ్చి ఆటలు కాలువలో ఈత లు
గోనీబిల్ల ఆటలు చింతపిక్కల తో ఆటలు
వేసవికాలం అంటేనే ఆహ్లాదం ఆనందం
పిల్లల మానసిక వికాసానికి అదే ఆలవాలం.
ఆరుబయట పట్టెమంచం మీద రాత్రివేళ పడక.
నక్షత్రాలను చూస్తూ పైర గాలిని ఆస్వాదిస్తూ.
అమ్మమ్మ చెప్పే కథలన్నీ నీ కంచి కి వెళ్లే సరికి
అమ్మమ్మ మెడ గట్టిగా పట్టుకొని నిద్రలోకి.
తెల్లవారితే మళ్ళీ షరా మామూలే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి