పండుగ
పండుగ
అబ్బా మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాము
అంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్ లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ చూడండి నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది. జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి చూశారు. ఏం సమాధానం చెప్పాలని.
ఆడపిల్లలు మనవలని ఎత్తిన భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి చిన్నది ఫోన్లు పెట్టేసారు.జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి ఇద్దరేసి పిల్లలు పుట్టారు.
ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు.
పిల్లలందరూ పండగలకు వస్తారుట అంటూ సంతోషంగా పక్కనే ఉన్న భర్త రామారావు గారికి చెప్పింది. రామారావు గారు ఒక సామాన్య రైతు. ఉన్న నాలుగు ఎకరాలు సొంత వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా ఆ పల్లెటూర్లో కాలక్షేమం చేస్తున్నాడు. పిల్లలందరూ వచ్చేలోగా ఇంటి పనులు చక్క పెట్టుకోవాలి. ఈ ఏడాది పొలం నుంచి ఒక పది పైసలు కూడా ఆదాయం రాలేదు. అనుకోని తుఫాను వలన పంట అంతా మట్టి కొట్టుకుపోయింది. పండగ అంటే మాటలు కాదు బోల్డు ఖర్చులు పిల్లలందరికీ బట్టలు కొనాలి. ఇల్లంతా వెల్లలు వేయించాలి. బోల్డు పనులు అనుకుంటూ నేను అలా పొలం వరకు వెళ్లి వస్తాను అంటూ భార్యకి చెప్పి రామారావు గారు పొలం వెళ్ళిపోయారు
రామారావు గారి ఇంటికి తిరిగివచ్చేటప్పటికి భార్య జానకమ్మ గారు వాకిలంతా శుభ్రంగా ఉంచి కళ్ళాపు జల్లి ముగ్గులు పెడుతున్నారు. ఈ ధనుర్మాసం వచ్చిందంటే చాలు అన్ని వాకిళ్లు ముగ్గులతో నిండిపోతాయి. విష్ణు ప్రీతికరమైన మాసం. ఉదయమే నగర సంకీర్తనలు తిరుప్పావై ప్రవచనాలు గోదాదేవి కళ్యాణం చాలా సందడిగా ఉంటుంది దేవాలయం. ప్రకృతి కూడా మంచుదుప్పటి కప్పుకుని ఆహ్లాదకరంగా ఉంటుంది. నేల మీద ముగ్గుల తెలుపు తల ఎత్తి పైకి చూస్తే మంచుతెలుపు. కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మాసంలో బంతి చామంతి విరగబూసి తెలుగు లోగిళ్ళకి గుడిలోని దేవతలకి దీక్ష వహించే స్వాములకి మెడలో హారమై తమ జన్మ ధన్యం చేసుకుంటాయి
పండక్కి ఇంటికి రావచ్చని పిల్లలు, నమ్ముకున్న వ్యవసాయం ఆదాయం తెచ్చిపెడుతుందని రైతులు, బహుమతులు ఇస్తారని పని వాళ్లు ,ఈ పెద్ద పండుగ కోసం ఎదురు చూస్తుంటారు అనుకుంటూ రామారావు గారు స్నానం చేసి వచ్చి వాలు కుర్చీలో కూలబడ్డారు.
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ ఊరిలో వాహనాల రాకపోకలతో పండగ సందడి మొదలైంది. ఏ వాహనం చప్పుడైన పిల్లలు వస్తున్నారు ఏమో అని జానకమ్మ వీధి గుమ్మoల్లోకి తొంగి చూస్తోంది. పండగకి ముందు రోజు వస్తావని పిల్లలు ఫోన్ చేసి చెప్పిన ఆ తల్లి మనసు అలా అనిపిస్తోంది. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి ఇంటి పనులుతో ఊపిరాడటం లేదు జానకమ్మ గారికి. ఒక పక్క ఇంటికి రంగులు వేయించడం లో రోజంతా బిజీ బిజీగా ఉండేది. ఇంకా సంక్రాంతి వస్తే ఏముంది మన పల్లెటూర్లో పిండివంటలు స్వయంగా తయారు చేయడంలో
ఆ ఆనందమే వేరు ఆ పాతకాలం వాళ్ళకి. పిల్లలకి అల్లుళ్ళకి మనవలకి ముని మనవలకి బట్టలు కొనడం కూడా పెద్ద పని. పిల్లలకు వాట్స్అప్ కాల్ లో రంగులు చూపించి వాళ్లకి ఇష్టమైనవి కొనడం జానకమ్మ గారికి మొదటి నుంచి అలవాటు.
పిల్లలందరి కోసం భోగి దండలు తయారు చేయించి రెడీగా ఉంచింది. పూర్వకాలంలో ప్రతి రైతు ఇంట్లోనూ పశు సంపద ఉండేది. అందులో తప్పనిసరిగా గోవులుండే వి. ఇప్పుడు గోమయం సంపాదించడమే కష్టం అయిపోయింది పల్లెటూర్లో.
భోగి పిడకల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది పల్లెటూర్లో
ఇలా ఉంది పల్లెటూర్ల పరిస్థితి
పండగ నాడు చేయవలసిన పిండివంటల పేర్లు కాగితం మీద వ్రాసుకొని దేవుడు గూట్లో పెట్టుకుని అలసటగా ఉండి గదిలో మంచం మీద అలా పడుకుని నిద్రలోకి జారుకుంది.
తెల్లవారి లేచేటప్పటికి బారెడు పొద్దు ఎక్కింది. లేచి కాల కృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేసుకుని వచ్చేటప్పటికి
రెండు కార్లు గుమ్మం ముందు ఆగే యి. జానకమ్మ గారి పిల్లలు మనవలు అల్లుళ్ళు మనవరాళ్లు భర్తలు మనవరాళ్లు పిల్లలు గబగబా కార్లోంచి దిగారు. జానకమ్మ గారు రామారావు గారు సాదరంగా ఆహ్వానించారు.
రామారావు గారి ఇంట్లో పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది .
పండగ అంటే ఏముంది పదిమంది కలిస్తేనే పండగ. మనసులు విప్పి మాట్లాడుకుంటేనే పండగ. కష్టo సుఖం పంచుకుంటేనే పండగ. నలుగురు కలిస్తే కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటుంటే రోజు కంటే ఎక్కువ తింటాము. అది అమ్మకు పండగ.
కడుపుని పుట్టిన వాళ్ళందరూ ఎదురుగుండా కనబడుతూ అలా ఆనందంగా కనబడుతుంటే అమ్మకు అదే పండగ. మనవరాళ్ళని ముని మనవరాళ్ళని చూస్తేనే ఆమెకు పండగ. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఏదో వెలితిగా ఫీల్ అవుతూ మాటిమాటికి వీధిలోకి తొంగి చూస్తున్నారు జానకమ్మ గారు. చిన్నపిల్ల రాలేదేంటి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. ఏమిటో ఆందోళనగా ఉంది అనుకుంటూ గుమ్మాలకి పసుపు రాసి మామిడాకులు తోరణాలతో అలంకరించి బంతిపూల దండలు కట్టేటప్పటికీ సాయంకాలం అయ్యింది.
భోజనాలు అయిన తర్వాత పిల్లలు అందరూ కబుర్లలో పడ్డారు. పిల్లలు పడుకోండి పెందరా ళే లేవాలి తలంటుకుని భోగి మంటలు వేసుకోవాలి అంటూ పిల్లల్ని హెచ్చరించింది. ఇంట్లో నలుగురు పిల్లలు కలిస్తే అందరూ కలిసి ఏ సినిమాయో చూస్తూ ఉంటారు. రాత్రి పొద్దుపోయె వరకు. ప్రొద్దున్న లేవరు. దానికి తోడు చలికాలం ఒకటి ముసుగు తన్ని పడుకుంటారు. భోగి మంటలు తెల్లవారకుండానే వేయాలి. అది పద్ధతి.
తెల్లవారు లేచేటప్పటికి చిన్న కూతురు అల్లుడు తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని కాళ్ళకు నమస్కరించారు. జానకమ్మ గారు ఆనందానికి హద్దులు లేవు. మాకు ఫ్లైట్ బాగా లేట్ అయింది. రాత్రి మేము వచ్చేటప్పుడు బాగా పొద్దుపోయింది నువ్వు పడుకున్నావు అంటూ కూతురు ఆలస్యానికి కారణం చెప్పింది.
ఇంట్లో ఉన్న పాత కర్ర సామాన్లు, దొడ్లో ఉన్న భోగి పిడకలని
అన్నిటినీ తన ఒడిలో చేర్చుకుని అగ్నికి ఆహుతి చేస్తుంది భోగిమంట. భోగి మంటలు చుట్టూ జనం. వీధి నిండా అరుగుల నిండా చుట్టాలు పక్కాలు స్నేహితులతో ఆ ఊరంతా ఆనందంగా ఉంది. సాయంకాలం ముని మనవరాళ్లు అందరికీ
భోగి పళ్ళు పేరంటంతో భోగి పండుగ సందడి అయిపోయింది.
ఆ ఊరికి ఇంటి ఆడపడుచులు బంధువులు పిల్లలు కాకుండా ఏడాదికో మారు మల్లికార్జున స్వామి ఎత్తుకొని ప్రతి ఏట వచ్చే బిచ్చగాళ్ళు, గంగిరెద్దుని తోలుకుని వచ్చే గంగిరెడ్డి వాళ్ళు
సందడితో పెద్ద పండుగ అంతా హడావిడిగా ఉంది. ఇంట్లోంచి పిండి వంటలు వాసన వీధిలో పేకాట రాయుళ్ల కేకలు అమ్మవారి గుడి దగ్గర కోడిపుంజులాట, తీర్థానికి వెళ్లొచ్చే జనo హడావుడి
సాయంకాలం బొమ్మల పేరంటం తో పెద్ద పండగ వెళ్ళొస్తానని చెప్పకుండా వెళ్ళిపోయింది.
ముచ్చటగా మూడో రోజు పండగ కనుమ. ఏడాదంతా తనతో పాటు పొలంలో సహాయకారిగా ఉన్న ఆ మూగజీవాలను సత్కరించుకోవడం ఆరోజు ప్రత్యేకత. కనుమనాడు కాకి కూడా కదలదంటా రు. కనుమ నాడు మినుముతో తయారుచేసిన పిండి వంట తినాలంటా రు. జానకమ్మ గారికి శాస్త్రం పట్ల నమ్మకం ఎక్కువ. నూటికి నూరుపాళ్ళు పాటిస్తుంది.
మూడు రోజులు పండగలు ఇట్టే గడిచిపోయాయి. నాలుగో రోజు పిల్లలందరి ప్రయాణాలు . రధం ముగ్గు సందు చివరి వరకు లాగించి అలసటగా కూర్చున్న తల్లి చుట్టూ చేరి అమ్మ ఒకటి అడుగుతాము నిజం చెప్పు. నీ మెడలో పుస్తెలతాడు చేతికి ఉన్న గాజులు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. అదా లేని నవ్వు తెచ్చుకుని పుస్తెలతాడు పెరిగిపోతేను మళ్లీ చేయించుకోవడానికి ఇచ్చాను. గాజులు ఎప్పుడో నా పెళ్లి నాటివి . అరిగిపోయాయి. అవి కూడా మళ్లీ చేయించడానికి ఇచ్చాను అంటూ చెప్పింది జానకమ్మ.
లేదమ్మా నిజం చెప్పంటూ పిల్లలు గద్దించేసరికి జానకమ్మ గారికి దుఃఖం ఆగలేదు. మొన్న వచ్చిన తుఫాను వల్ల మనం పొలం అంతా మునిగిపోయింది. ఒక గింజ కూడా ఇంటికి తీసుకురాలేదు. మనమే కాదు మన ఊరంతా అలాగే అయింది. రేపోమాపో కోతలు అనుకున్నాము. చేతికొచ్చిన పంట ఇంటికి రాలేదు.కట్టవలసిన బ్యాంకు అప్పు తడిసి మోపిడయింది. ఇంట్లో ఖర్చులు పండగ ఖర్చులు నాన్నగారు బాధ చూడలేక గోల్డ్ లోన్ తీసుకున్నాము. సంసారం అన్నాక తప్పదు కదా అమ్మ అంటూ విషయం చెప్పింది.
తండ్రి ఒక ఉద్యోగస్తుడైతే ఎదో అప్పో సప్పో చేసి అనుకోకుండా వచ్చే ఖర్చులు తట్టుకుంటాడు. కానీ రైతుకి చే బదులు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఆ పొలoమీద నుంచి వచ్చే ఆదాయమే ఆధారం. మరి ఈ సమయంలో ఆదుకునేది ఎవరు. రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కదా అని పిల్లలు ముగ్గురు ఆలోచించుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు ప్రయాణమైపోయారు.
అదేంటి పిల్లలు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏదైనా సాయం చేస్తారు అనుకున్నాను. మొగుళ్ళకి ఇష్టం ఉందో లేదో. అనవసరంగా చెప్పాను పిల్లలకి చాలా సిగ్గుగా ఉంది పోఅంటూ జానకమ్మ గారు మనసులో బాధపడసాగింది.
పండగ సందడి అంతా రథం ముగ్గు ఎక్కిఊరి పొలిమేరలు దాటింది. గడిపిన మధుర క్షణాలు ఆ ముసలి ప్రాణాలకి ఊపిరిచ్చాయి. లేని శక్తి తెచ్చుకొని ఎక్కడలేని మర్యాదలతో పిండివంటలతోపండగనిపంపించేశారు.ఆచంటిపిల్లలకుభోగిపళ్ళు పోసిన కుర్చీలు రాజుగారి సింహాసనంలా కనబడ్డాయి. ఆ కొత్త బట్టల్లో పిల్లలు యువరాణుల్లా కనబడ్డారు. తీరా తడిమి చూస్తే అది కొయ్యి కుర్చీయే. పండగ ముస్తాబు చేసుకుని నట్టింట్లో తిరుగాడే ఆడపిల్లలు మహాలక్ష్మి దేవిలా కనపడ్డారు. రోజు కాపురం ఉండే మా ఇల్లు స్వర్గంలా కనబడింది.
రోజంతా పిల్లల అరుపులు గోలలు కేకలు ఈలలు తో మా ఇల్లు టూరింగ్ టాకీస్ లా ఉండేది. ఏడాది నుంచి ఎదురుచూసిన పండగ ఇట్టే వెళ్లిపోయింది. వచ్చినంత సేపు పట్టలేదు. ఇప్పుడు ఈ లంక అంత కొంపలో నేను ఆయన అనుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ దగ్గుతూ వచ్చే ఏడాదికి ఏమో దైవ నిర్ణయం అని కళ్ళు మూసుకుని నడవలో నడుo వాల్చారు.
పండగ జ్ఞాపకాలతో పది రోజులు గడిచాయి.ఒకరోజు రామారావు గారు రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి అంటూ పోస్ట్ మాన్
సంతకం తీసుకుని కవరిచ్చి వెళ్ళాడు. రామారావు గారు కవరు ఓపెన్ చేయగానే ఒక లెటర్ ఒక డ్రాఫ్ట్ కనబడ్డాయి. పెద్ద కూతురు దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం. ప్రియమైన నాన్నకి ఇందులో లక్ష యాభై వేల రూపాయలు డి డి పంపుతున్న
అమ్మకు ఇది మా పండగ కానుక. నాన్న నీ కొడుకు లేరు కదా కడుపుని పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యతలు పంచుకోవచ్చు. మీరు మాతో బాధలు పంచుకోవాలి.
ఆడపిల్లల కదా అని మీ కష్టాలు ఏమి చెప్పకుండా ఉండకూడదు. ఆస్తిలో సగభాగం పంచి ఇస్తున్నారు కదా. కాలం మారింది. ఆడపిల్లలంటే అక్కడ ఉండే పిల్ల కాదు. ఎప్పటికీ తల్లిదండ్రుల గుండెల్లో ఉండే పిల్ల. ఇది మా భర్తలతోటి ఆలోచించి ముగ్గురము మేము దాచుకున్న సొమ్ము నుంచి పంపిస్తున్నాము. అమ్మకి విషయం చెప్పు అని ఉత్తరం పైకి చదివి వినిపించాడు రామారావు గారు. జానకమ్మ గారు పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనలో తాను పశ్చాత్తాప పడ్డారు. అందుకే తొందరపడి ఏ మాట మనసులో కూడా అనుకోకూడదని నిర్ణయించుకున్నా రు. ఎంత బాధ్యత గల పిల్లలు. ఆడపిల్ల అయితే నేమి మగపిల్లలయితేనే మి ఈరోజుల్లో అందరూ ఒకటే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి