ఎండలు
బాబోయ్ ఎండలు
ఎండలు బాబోయ్ ఎండలు. ఎవరి నోటి విన్నా ఇదే మాట. ఎండాకాలంలో ఎండలు కాయక వానలు కురుస్తాయా అని కొందరు అంటారు. కాదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగేయి అంటూ ప్రతి సంవత్సరం ఒకటే గోల. ప్రతి ఏటా సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. భూలోకం మీద అంత మమకారం ఎందుకో.ఏ నోట చూసినా అదే మాట. ఏ పని చేయబుద్ధి కాదు. తీక్షణమైన ఎండ చూస్తే వికారం. ఇంట్లో కూర్చున్న చెమటలు. గాలి లేదు. ఫ్యాన్ గాలి తప్పితే. ఏసీ గది వదిలి రా బుద్ధి కావడం లేదు.
అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జీవితం ఎలా నడుస్తుంది. మూడు చక్రాల బండి స్టీరింగ్ తిప్పితే గాని తన బతుకు గడవదు ఒకరికి. నడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినా పొలం గట్ల మీద కలుపు మొక్కలు పీకక పోతే డొక్క నిండదు ఒకరికి. సర్కారు నౌకరు అయిన ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వరు కదా. పగలంతా ఏదో ఒక పని చేయవలసిందే. పిల్లలకి స్కూలు సెలవిచ్చిన అమ్మకి వంట పని తప్పుతుందా. ఏ జీవన చక్రాన్ని ఆపలేం. అలా నడుస్తుంటేనే నాలుగు వేళ్ళు లోపలికి పోతాయి ఎవరికైనా సరే. ఏ స్థాయి వాళ్ళకైనా సరే. మరి ఇంత ఎండలో ఆ ఊరు నుంచి ఈ ఊరికి జనాలను మోసుకుపోయే, సరుకులు తీసుకుపోయే లారీలు బస్సులు రైళ్లు విమానాలు నడిపే ఆ రథసారధి కష్టాలు ఇంకా చెప్పేదేముంది.
ఒకపక్క ఇంజనులో నుంచి వచ్చే వేడి గాలులు, ఒత్తిడితో మరుగుతున్న రక్తం పరిస్థితి ఊహించుకుంటే వర్ణనాతీతం.
ఎండ చూసి జనం బయటకు రాకపోతే వ్యాపార చక్రం ఏం నడుస్తుంది. బడుగు వ్యాపారి బతుకు ముక్కలు అయిపోతుంది.
బడుగు వ్యాపారి మీద ఆధారపడి బతుకు ఈడుస్తున్న బడా వ్యాపారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.
సమాజాన్ని రక్షించే పోలీస్ శాఖ వారు ఆ ఎండలో చమటలుకక్కుతూ వాహనాల నుండి వచ్చే వేడి గాలులను పీలుస్తూ తన విధి నిర్వహణ చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విశ్రాంతి దొరకడం అనేది చాలా కష్టం. నాలుగు రోడ్ల కూడలిలో 8 గంటల సేపు నిలబడి మనకి సహాయం చేసే పోలీస్ శాఖ ఉద్యోగులకు నిజంగా సెల్యూట్. తల మీద టోపీ, ఎర్రటి ఎండ ,గాలి చొరబడని దుస్తులు అయినా తప్పని విధి నిర్వహణ. ఊహించుకుంటేనే కష్టంగా ఉంది.
పోలీస్ శాఖ వారి పరిస్థితి ఇలా ఉంటే ఇక దేశాన్ని రక్షించే సైనికుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని మనం చెప్పక్కర్లేదు ఈ వేసవికాలంలో. వాళ్ల కష్టం ముందు మన కష్టం ఎంత అనిపిస్తుంది నాకు.
సమాజంలో తన కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎన్నో బడుగు శ్రామిక కార్మిక జనం ఈ ఎండకి మలమల మాడిపోతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు మీద పనిచేసే కార్మికులు రహదారి పక్కన క్షణం విశ్రాంతి తీసుకుందామంటే కనుచూపుమేరలో ఎక్కడ పచ్చదనమే లేదు.
పచ్చదనం చూసి మనకు కన్ను కుట్టి రహదారులు పెంచుకుంటూ పోయాము. ఎక్కడ చూసినా ఎర్రటి ఎండ పచ్చటి మొక్క లేదు. అశోకుడు దారి పక్కన చెట్లు నాటించెను అని చరిత్రలో చదువుకున్నాం. చిన్నప్పుడు చదువుకున్న పాఠం అప్పుడు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత చెట్టు ఒక బాటసారి కి ఎంత ఉపయోగమో మనము బాటసారి అయిన తర్వాత మనకు అర్థమైంది.
మానవుల సంగతి ఇలా ఉంటే మూగజీవుల సంగతి చెప్పక్కర్లేదు . గాలిలో ఎగిరే పక్షి ,నీటిలో తిరిగాడే చేప, పాకలోని పశువు వాటి పరిస్థితి తలుచుకుంటే జాలిగా ఉంటుంది. ఇవన్నీ వేసవికాలం కష్టాలు. ఈ కష్టాలు తీరడానికి అందరూ జాగ్రత్తలు చెప్తున్నారు . కానీ ఒక ఉద్యమంలా చెట్లు నాటే కార్యక్రమం అయితే జరగడం లేదు.ఉన్న చెట్లు పోయి బహుళ అంతస్థులు భవనాలు లేచిపోతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు చూసి ముచ్చట పడిపోతున్నాం కానీ రేపొద్దున్న రాబోయే తరం వాళ్లకి పీల్చడానికి గాలి ఉండదేమో ఒకసారి ఆలోచించవలసిన విషయం. మొక్కను చంపితే మానవ మనుగడకే ప్రమాదం వచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి.
గాలి మాట అలా ఉంచితే త్రాగే నీరు ఇప్పటికే కొనుక్కుంటున్నాం. ఎవరూ త్రాగునీటికి నూతులు మీదగాని చెరువులు మీదగాని ఆధారపడటం లేదు. అందరూ అందమైన ప్యాకింగ్ లో వచ్చే సీసాలు మీద ఆధారపడుతున్నారు. ఈ పెరిగే జనాభా కి భూగర్భ జలాలు సరిపడటం లేదు. ఇప్పటికే కొన్ని మహానగరాల్లో నీటి ఎద్దడి పెద్ద సమస్యగా ఉంది. మరి ప్రభుత్వం సూచించిన ఇంకుడు గుంటలు ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భవిష్యత్తులో నీటి కష్టాలు ఇంకా ఎన్నో. భవిష్యత్తు అవసరాలకు బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లే వర్షాకాలంలో నీటిని దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
పీల్చడానికి గాలి ఉండదు ,త్రాగడానికి నీరు ఉండదు ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించుకుంటే ఆందోళనకరంగా ఉంటుంది. పచ్చటి అడవులను నరికేస్తుంటే మూగజీవాలు తినే తిండి లేక రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల రహదారి పక్కన కోతులు కనబడుతున్నాయి. పెద్ద పులులు దారితప్పి వచ్చాయి అనే మాట వినబడుతోంది. దారితప్పి కాదు అడవుల్లో తిండి దొరక్క. ఇలా ఉంది మన అడవుల పరిస్థితి.
ఎండలలో తిరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నా యి. ఈ విపత్తుకి మూల కారణం అందరికీ తెలిసిందే దానిని ఎదుర్కొనే విధంగా సమాజం కూడా కృషి చేయాలి.
ప్రతి వేసవికాలంలోనూ ఒక అనుభవం గుర్తుకొస్తుంది. ఇది జరిగి సుమారు యాభై ఏళ్లయింది అనుకుంటాను. అప్పట్లో పల్లెటూర్లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మేము అందరం సాయంకాలం పూట ముంజు కాయలు తినేవాళ్ళం. అలా ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని పిలిచి తాడిచెట్టు ఎక్కుతావా అని అడిగాము. ఎక్కుతానండి నాకు అలవాటే అని చెప్పాడు. అతనికి పాపం కాస్త మెల్లకన్ను. ఎటు చూసేది మనకు తెలియదు. తీరా ఆ తాడిచెట్టు కాలవ గట్టు మీద ఉంది
కాలవ గట్టు రమారమీ నాలుగు అడుగుల ఎత్తు ఉంటే అక్కడి నుంచి తాడిచెట్టు ఆరడుగుల పొడవు ఉంది. పాపం సదరు వ్యక్తి ఏ పని చేతకాదని చెప్పడు. అలా చెప్పడం అతనికి ఇష్టం ఉండదు. ఆ విషయం మాకు తెలియదు. మొత్తానికి కాలవ గట్టు ఎక్కి తాడిచెట్టు కొందరు మేరకు వెళ్ళిన తర్వాత అక్కడినుంచి గట్టిగా అరిచాడు. గురువుగారు నాకు ఇక్కడి నుంచి ఏం కనబడట్లేదు ఎండ కళ్ళకి కొట్టేస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. ఇప్పుడు ఏం చేయాలో గట్టు మీద ఉన్న మాకు ఏమీ తోచలేదు. వెంటనే మా అన్నయ్య అక్కడి నుంచి దూకెయ్యి అని కోపంగా అరిచాడు.
వాడు ముందు వెనుకలు చూసుకోకుండా నిజంగానే అక్కడ నుంచి దూకేసి కాలువలో పడ్డాడు. దేవుడు మా యందు ఉన్నాడు. వాడికి ఏమీ జరగలేదు. వాడు మామూలుగా నవ్వుకుంటూ లేచి నిలబడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని మా నాన్నగారు మామూలుగా కాదు మొహం వాచేటట్లు చివాట్లు పెట్టారు వాడితో సహా అందరికీ. మేమందరం ఏడుపు మొహాలు పెడితే వాడు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి