ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త 

"ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు.

మనకు పశువులు ఎందుకు ?నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు.

లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు.

రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు. 

పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ భూమిని నమ్ముకున్న ఆ తండ్రి కొడుకులు ఇద్దరు చేసే వేరే పని లేక స్నేహితుడు సుబ్బిరెడ్డి పొలంలో ఇద్దరు పనికి కుదిరిపోయారు. సుబ్బిరెడ్డి ఆ ఊరిలో వంద ఎకరాలు ఉన్న ఆసా మి. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు కాలక్షేపం చేస్తున్నారు. మరి పొలాలన్నీ పోయాయి . పశువులు సంతకు ఎందుకు.

తండ్రి కొడుకులిద్దరూ సంతకు చేరేటప్పటికి ఉదయం ఏడు గంటలు అయింది. బహిరంగ ప్రదేశంలో సరుకులు అమ్మే ప్రదేశం సంత అంటారు. కూరగాయల అమ్మేదాన్ని కూరగాయల సంత ప్రత్యేకంగా చేపల అమ్మే చోటును చేపల సంత పశువుల అమ్మే చోటు పశువుల సంత అంటారు. 

ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో ప్రతి శనివారం జరిగే సంత పశువుల అమ్మకానికి కొనుగోలుకి చాలా ప్రసిద్ధమైనది. దూర ప్రదేశాల నుంచి కూడా రైతులు పశువులను కొనుక్కోవడానికి అక్కడికి వస్తారు. అక్కడ మేలు జాతి పశువులు, వయసులో ఉన్నవి, వయసు మీరినవి, అయిన కాడికి వదిలించుకుందామని ఉద్దేశంతో తీసుకొచ్చినవి ,సమస్యలతో బాధపడేవి, లేని అర్హతను ఆ ఒక్క రోజుకి ఉన్నట్టుగా చూపించేవి, తల్లి లేని లేగ దూడ, కోడెదూడలు, ఎద్దులు, ఎదకు సిద్ధంగా ఉన్న దూడలు దూర దూరంగా నిలబడి కొన్ని, పడుకొని కొన్ని మలమూత్ర విసర్జన చేస్తూ నేలంతా చిందర వందర చేస్తూ ఉన్నాయి. ఈవేళ ఈయన మనకు తిండి పెట్టే యజమాని రేపటి యజమాని ఎవరో వాటికి తెలియదు. ఎవరో అయిన కాడికి కొనుక్కొని వెళ్ళిపోతారు. అందరూ ఒకలాగా చూడరు. కొందరు చంటి పిల్లల్లా చూస్తారు. కొందరు పేర్లు పెట్టుకుని ఆప్యాయంగా పిలుస్తారు. కొందరు కడుపునిండా తిండి పెడతారు కానీ దగ్గరకు రావడానికి భయపడతారు. ఒకరోజు పశువులు కాపరి వేళకు రాకపోతే పాపం వాటి గతి అంతే. మాట వచ్చిన మనిషిలాగే పశువుకి కూడా పూర్వజన్మల కర్మల ఫలితంగా మంచి యజమాని దొరుకుతాడు.

అక్కడ బేరగాళ్లదే రాజ్యం. ప్రస్తుతం వారిని బ్రోకర్స్ అంటారు.ఆ సంతే వాళ్ళ ఉపాధి. తరతరాలుగా చాలామంది పశువుల అమ్మడం కొనడం చేస్తూ పశువుల బేరగాళ్ల నే నామధేయం తగిలించుకుని జీవనం గడిపేస్తున్నారు.

వినియోగదారు నీ పడగొట్టడంలో వాళ్లకు వాళ్లే సాటి. మాటలు చెప్పడం వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. సాధారణంగా రోజుకు రెండు లీటర్లు ఇచ్చే పశువు దగ్గరనుంచి ఆ సంతలో రోజుకి నాలుగు లీటర్ల పాలు తీసి కొనుగోలుదారుని పడగొట్టేస్తారు. ఎవరో పట్టణవాసపువాడు తప్పితే మామూలుగా పశువు గురించి తెలిసిన రైతు ఎవడు ఆ బుట్టలో పడడు.

అలా సంతలోకి అడుగుపెట్టి రామారెడ్డి సంత అంతా చుట్టూ తిరిగి వచ్చాడు. ఆ ప్రదేశం అంతా రామారెడ్డికి కొట్టిన పిండే. ఎన్నోసార్లు సొంతానికి స్నేహితులకి పశువులు కొనడానికి తిరిగిన ప్రదేశమే. అయినా రైతుకి పశువు నాణ్యం తెలుసుకోవడo పెద్ద కష్టo కాదు. అప్పటికి ఉదయం పది అయింది. కావలసిన దానికోసం ఎదురుచూస్తూ అక్కడే ఉన్న టీ కొట్టు దగ్గర ఉన్న బెంచి మీద కూలబడ్డారు తండ్రి కొడుకులు. ఆత్మారాముడిని కాస్త సంతృప్తి పరిచి అలా ఎదురు చూస్తూ ఉండిపోయారు. తండ్రి రామారెడ్డి సంతకిఎందుకు వచ్చాడో తెలియదు. ఏం కొనాలో చెప్పలేదు. అయినా దేని కోసం ఎదురు చూస్తున్నాడు ? ప్రశ్నించే ధైర్యం లేదు శ్రీనివాస్ రెడ్డికి.

ఇంతలో దూరంగా ఒక వ్యాన్ వచ్చిఆగింది. ఆ వ్యాన్లోంచి సుమారు రెండు సంవత్సరంల వయసున్న రేపు మా పో ఎదకు వచ్చే ఆవు దూడలు క్రిందకు దించి సంతలో మూలగా నిలబెట్టారు.. తెల్లటి శరీరం చిన్న చిన్న కొమ్ములు బారెడు తోక అందమైన వీపు ఎత్తుగా ఉన్న దూడలు చూసి రామారెడ్డి గబుక్కున బెంచ్ మీద నుంచి లేచి పరుగు పరుగున వాటి దగ్గరకు వెళ్ళాడు. ఆ దూడలు చుట్టూ తిరిగి చూసి సంతృప్తి పడి ఆ బేరగాడితో మాట్లాడి జేబులోంచి సొమ్ము తీసి ఆ బేరగాడు చేతిలో పెట్టి ఒక వ్యాను మాట్లాడి ఆ దూడల్ని ఎక్కించి దూరంగా ఉన్న కొడుకుని పిలిచాడు. శ్రీనివాస్ రెడ్డికి ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు.

"ఒరేయ్ నువ్వు బండిమీద నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను వ్యాన్లో దూడలతో పాటు వస్తాను అంటూ తండ్రి చెప్పిన మాటకి తల ఊపి మారు మాట్లాడకుండా ఇంటికి ప్రయాణం అయిపోయాడు శ్రీనివాస్ రెడ్డి. సాయంకాలానికి రామారెడ్డి కూడా దూడలతో పాటు ఇంటికి చేరేడు. ఎప్పటిలాగే దూడలకి హారతి ఇచ్చి పశువులు పాకలోకి తీసుకెళ్లింది గాని భర్త ఎందుకు ఈ పని చేస్తున్నాడో అర్థం కాలేదు. ఎవరైనా పాలు కోసం అయితే పాలిచ్చే వాటిని కొనుక్కుంటారు. ఈ దూడలెందుకు. వీటిని పెంచి సంవత్సరం పాటు పోషించాలి . అప్పటికి గాని ఇవి అందిరావు అని ఆలోచిస్తూ వాటి కావాల్సిన ఆహారం అందించింది.

ఇలా సంవత్సర కాలం గడిచింది. ఉదయమే లేచి ఆ పశువులు బాగోగులు చూసి సుబ్బిరెడ్డి గారి పొలం నుంచి గడ్డి తెచ్చి పడేసి వాటిని పోషిస్తూ వచ్చాడు. కాలం కలిసి వస్తే అంతా మంచే జరుగుతుంది. పశువుల డాక్టర్ గారు చెప్పిన ఆ శుభ వర్తమానం విని రామారెడ్డికి ఆనందం పట్టలేకపోయాడు. వాటిని పువ్వుల్లో పెట్టి చూసుకో సాగాడు. అదే లోకం. వాటి మీదే ధ్యాస.
ఓ రోజు తెల్లవారేసరికి ఆ రెండు దూడలు మరి రెండు బుడ్డి దూడలకు జన్మనిచ్చి ఆప్యాయంగా నాకుతూ కనిపించాయి. రామారెడ్డి ఆనందానికి అవధులు లేవు. 

అలా రెండేళ్లు గడిచే యి. రామారెడ్డికి అనారోగ్య సమస్యలు ఏవి లేవు ఈ మధ్య కాలంలో ఇదివరకు అంతా ఉత్సాహంగా ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్న వాడిలాగా కోల్పోయిన వాడిలాగ ఉంటున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి కూలబడిపోయాడు రామారెడ్డి. నిన్న మొన్నటి వరకు బాగా తిరిగిన మనిషి ఇలా అయిపోయాడు ఏమిటి అనుకుంటూ బంధువులంతా విస్తు పోయారు. ఆ ఊరి పెద్ద సుబ్బారెడ్డి గారు కూడా వచ్చి శ్రీనివాస్ రెడ్డిని ఓదార్చి పక్కకు పిలిచి ఒక కవర్ చేతిలో పెట్టాడు. కవర్ బరువుగా ఉంది. ఏముంది ఇందులో అనుకుంటూ కవర్ ఓపెన్ చేస్తే 20000 రూపాయలు ఒక లెటర్ అందులో కనబడ్డాయి. శ్రీనివాస్ రెడ్డికి చదువు రాదు సుబ్బారెడ్డి గారే ఆ లెటర్ చదవడం మొదలుపెట్టారు .

చిరంజీవి శ్రీనివాసరెడ్డికి
 నాకు నెల రోజుల నుంచి కడుపు నొప్పి వస్తోంది. సుబ్బారెడ్డి గారి అల్లుడు డాక్టర్ కదా. అన్ని పరీక్షలు చేయించుకున్నాను. ఒక భయంకరమైన నిజం తెలిసింది. నా కడుపులో క్యాన్సర్ ఉందని బతకడం కష్టమని తేల్చి చెప్పారు. మరణం అనేది ఎప్పుడైనా తప్పదు. ఎవరికైనా తప్పదు. సుబ్బారెడ్డి గారు వైద్యం చేయిస్తానని చెప్పారు. లక్షల లక్షలు ఖర్చు పెట్టే స్థోమత మనకు లేనప్పుడు వేరొకరి చేత అంత సొమ్ము ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. నేను సుబ్బా రెడ్డి గారి దగ్గర ఇరవై వేల రూపాయలు దాచుకున్నాను. అవి ఎందుకో నీకు అర్థం అయ్యే ఉంటుంది ఈపాటికి. 

ఈ సొమ్ము లేకపోతే ఆ రోజున నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. ఎవరిని అడగలేవు. ఇచ్చే దాత కూడా ఉండడు. నీకు బయటకు వెళ్లి డబ్బు తెచ్చుకోవడానికి కుదరదు. నాకు దైవభక్తి ఎక్కువ . శాస్త్రాల మీద నమ్మకం ఎక్కువ. కర్మకాండలు మీద నమ్మకం ఎక్కువ.నువ్వు ఇదివరలో పశువులు కొన్నప్పుడు నన్ను ప్రశ్నించావు.దానికి నేను సమాధానం చెప్పలేదు .

 మనిషి చనిపోయినప్పుడు చేసే దానాల్లో గోదానం చాలా ముఖ్యమైనది. మన హిందూ మతంలో ఈ గోదానం ద్వారానే చనిపోయిన వ్యక్తి స్వర్గలోకానికి చేరుతాడని శాస్త్రం చెప్తుంది.
చాలామంది అడిగేవారు ఎవరు ఉండరని ఈ ప్రత్యక్ష గోదానాలు చెయ్యరు. ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకనే రెండు ఆవుదూడల్ని ముందు జాగ్రత్తగానే కొనుక్కుని పెంచుకున్నాను . అందులో ఒక ఆవుని దానం కింద ఇచ్చేయి. ఇంకొకటి ఎందుకో నేను విడమర్చి చెప్పక్కర్లేదు. ఇది విచిత్రంగా మీ అందరికీ అనిపించొచ్చు. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అన్ని ముందు జాగ్రత్తగా ని ప్లాన్ చేసుకున్నాను. ముందు జాగ్రత్త నాకు మొదటి నుంచి అలవాటు. అమ్మ జాగ్రత్త. ఇట్లు నాన్న. 
అని సుబ్బారెడ్డి గారు చదివి వినిపించారు. అది వింటున్న వాళ్ళందరూ కళ్ళు దుఃఖంతో నిండిపోయి ఎంత ముందు జాగ్రత్తగల వ్యక్తి అనుకుంటూ అందరూ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు.

  ప్రతి మనిషి తను సంపాదించిన ఆస్తిపాస్తులు అన్నిటికి తను బ్రతికుండగానే వీలునామా తయారు చేసుకుంటాడు. తన మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సమస్యలేవీ రాకూడదని. అది మంచి ఆలోచనే కానీ తన మరణం తర్వాత జరగవలసిన కార్యక్రమాల గురించి ఈ కథ నాయకుడు రామారెడ్డి లా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి అవి కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం