మాతృ దినోత్సవం

మాతృ దినోత్సవం.
"
దేవుడు అమ్మని ఎందుకు పుట్టించాడో తెలుసా. అన్నిచోట్ల దేవుడు ఉండలేక. అంటే అమ్మ దేవుడికి ప్రతిరూపం. అమ్మకి మనకి సంబంధం ఎవరు నిర్వచించలేనిది. 9 నెలలు కడుపులోనూ భూమి మీద పడిన తర్వాత అమ్మ కనుమూసే వరకు ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది. బొడ్డు కోసి వేరు చేసినంత మాత్రాన మనకి అమ్మకి ఉన్న సంబంధం తెగిపోదు. అమ్మ మన ఇంట్లో ఉన్న దేవుడు. బాల్యంలో అమ్మానాన్న మనం ఒకటే. రూపాలే వేరు. మనం గట్టిగా ఏడిస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ నవ్వులు చూసి అమ్మ కళ్ళల్లో వెలుగు. బాల్యంలో మన లాలన పాలన అంతా అమ్మే.

నిప్పుకి ,ఉప్పుకి తేడా తెలియదు వాటిని బూచిలా చూపించి దూరంగా ఉంచేది. ఏది తప్పు ఏది ఒప్పు ఉగ్గుపాలతో నేర్పించేది అమ్మ. బంధాలు బంధుత్వాలు మనకు తెలియవు. చూపుడు వేలుతో నాన్నని చూపించేది అమ్మ. నాన్నకు రికమండేషన్ చేసి నాన్నకు తాహతకు మించిన స్కూల్లో చేర్పించేది అమ్మ. నాన్నకి మనకి మధ్య వారధి అమ్మ. తను కొవ్వొత్తి లా కరిగిపోతూ మన బ్రతుకులో వెలుగులు పంచేది అమ్మ . అందుకే అమ్మంటే కనిపించే దైవం అంటూ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసమిచ్చి తన సీట్ లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్ హనుమంతరావు గారు. 

ఆరోజు మాతృ దినోత్సవం. అది హడావిడి. అలా ఆ కళాశాలలోని అధ్యాపకులు, తర్వాత ఉత్సాహవంతులైన విద్యార్థులు అందరూ ఒక్కొక్కరు వేదిక మీదకు వచ్చి అమ్మ మీద ఉపన్యాసాలు దంచుతూ మాతృ దినోత్సవ సభ విజయవంతమైందని ఫేస్బుక్ లో చిత్రాలు షేర్ చేసి మురిసిపోయారు.

చూడవే రమ్య మన కాలేజీ ఫోటోలంటూ ఫేస్బుక్లోని ఫోటోలు చూసి మురిసిపోతున్న స్నేహితురాలు కవిత వైపు పేలవంగా చూసింది రమ్య. ఆ సమావేశం జరిగిన దగ్గర్నుంచి రమ్య మనసు బాగాలేదు. అమ్మ గురించి చెప్పిన అన్ని మాటలు బాగానే ఉన్నాయి. అవి మాటలు వరకే ఉంటున్నాయి. ఆచరణ శూన్యం. రమ్యకి ఒక్కసారి తన ఇంటి దగ్గర పరిస్థితి గుర్తుకొచ్చింది. తన బామ్మ సంగతి గుర్తుకు వచ్చింది. పాపం బామ్మ ఆ శరణాలయంలో ఎలా ఉంటుందో. కడుపుని పుట్టిన వాళ్ళందరూ హాయిగా సంపాదించుకుంటున్న మనస్పర్ధలు పెంచుకుని తల్లిని వదిలేసారు. అందరికంటే పెద్దవాడు కాదు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్ కూడా ఆయన కూడా అందరిలాగా అదే మార్గంలో నడిచాడు. 
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కళాశాలలో అధ్యాపకులు ఆదర్శవంతంగా ఉంటేనే విద్యార్థుల వారిని అనుసరిస్తారు. కానీ ఆచరణలో అది శూన్యం. ఇందులో ఎవరు కూడా తల్లిదండ్రులు తన దగ్గర ఉంచుకోవట్లేదు. అందరూ అనాధ శరణాలయానికే. తన తండ్రి కూడా అదే పని చేశాడు. పైగా ఆయన ఈ కళాశాలకు ప్రిన్సిపాల్. ఒకరికి మంచి చెడ్డ చెప్పవలసిన వ్యక్తి
ఎందుకో తెలియదు బామ్మకి అమ్మకి పడేది కాదు. బామ్మ కి వయసు రీత్యా చాదస్తం. అమ్మకి వయసులో ఉందని గర్వ o. ఇద్దరు మాటలతో దెబ్బలాడుకునేవారు. నాన్న అమ్మకు చెప్పలేక బామ్మ ని కోప్పడేవారు.

 పాపం బామ్మ ఆర్థికంగా స్వతంత్రులు కాదు. తాతగారు వ్యవసాయం చేసేవారు. ఉన్నదంతా పిల్లల చదువులకి పెళ్లిళ్లకి పేరంటానికి ఖర్చుపెట్టి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పెద్దకొడుకు దగ్గరికి చేరింది. మొదట్లో అమ్మ బామ్మ కలిసి పని చేసుకునే వారు. బామ్మ పని చేసినంతకాలం అమ్మ ఏమి మాట్లాడలేదు. ఒక్కసారి అనారోగ్యం వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది. బామ్మ కి చాకిరీ చేయలేకపోతున్నాను అంటూ అనేకసార్లు నాన్నతో చెప్పడం విన్నాను. కోడలుగా ఆమె కి బాధ్యత లేదా అప్పుడు తెలియలేదు ఇప్పుడు ప్రశ్నించుకుంటే అమ్మ తప్పు అర్థమవుతుంది. సాటి ఆడదానిగా కూడా జాలి చూపలేదు. ముసలి వయసు కదా. రాత్రిపూట నిద్రపోయేది కాదు. 

ఏదో పద్యాలు పాటలు పాడుకునేది. దానితో అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా రోజు తిడుతూనే ఉంది. బామ్మ కి బాగా చెముడు. ఇవేవీ వినపడవు. వినబడిన వాళ్లలో పెద్దవాళ్లు ఉన్న ఏమి చెప్పకుండా వినపడలేనట్టు ఉండేవారు. ఆవిడ మంచం నుంచి లేవలేరు. అన్నీ మంచం మీద. ఎంత మనిషిని పెట్టి చేయించిన అమ్మ అన్నం కలిపి పెట్టవలసి వచ్చేది. దానికే పెద్ద శ్రమ పడిపోతున్నట్లు అనుకునేది అమ్మ.
 రోజు ఈ బాధలు చూడలేక ఈ గొడవలు వినలేక ఇంకేముంది మన చేతిలో ఉన్న ఆయుధం బామ్మ అనాధ శరణాలయానికి దాంతో అమ్మ నోటికి తాళం.

పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అందుకే సమాజ సేవలో దిగింది అమ్మ. ఉన్న అత్తగారిని ఇంట్లోంచి వెళ్లగొట్టింది. వీధిలో ఉన్న అనాధ శరణాలయనకి డొనేషన్ ఇస్తుంది ట. పండ్లు కాయలు పంచి పెడుతుందిట. ఫోటోలు తీసి గర్వంగా అందరికీ చూపించుకుంటుంది ట. అందరూ తన సమాజ సేవ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అది ఆవిడ ఉద్దేశం . పేపర్లో తన పేరు చూసుకోవాలి. అంటే ఊరి వాళ్ళందరి దృష్టిలో మంచిదనిపించుకోవాలి. ఈ పేరు కోసమే ఆవిడ తాపత్రయపడు తోంది. అందుకే ఈరోజు ఉదయం హడావిడిగా ఇంట్లో బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడ మీటింగ్ జరిగిన మీటింగ్ విశేషాలు ఫోటోలు చూపిస్తూ ఎంతో హుషారుగా ఉండే అమ్మ ఈరోజు ఎందుకో నీరసంగా ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోకుండా గదిలోకి వెళ్లి పడుకుంది. ఎందుకు అబ్బా ఏమై ఉంటుంది అనుకుంటూ స్నేహితురాలికి ఫోన్ చేసింది రమ్య. రమ్య స్నేహితురాలు కవిత తల్లి కూడా ఆ లేడీస్ క్లబ్ లో మెంబర్. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకసారి కవిత చెప్పిన మాటలు విని రమ్యకి బుర్ర పనిచేయలేదు. 

అమ్మ ఉపన్యాసం చెప్పడానికని వేదిక మీద వెళ్ళినప్పుడు ఎవరో గట్టిగా ఇంట్లో ఉన్న అత్తగారిని అనాధ శరణాలయం పంపేసిందిట. వీధిలో ఉన్న అనాధ శరణాలయాన్ని ఉద్ధరిస్తుందుట అని గట్టిగా అరిచారట. ఆ మాటలు విని అమ్మ స్టేజ్ దిగిపోయి కోపంగా ఇంటికి వచ్చేసిందిట అని చెప్పింది కవిత.. కాసేపటికి అమ్మ స్నానం చేసి బట్టలు మార్చుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.

తన కుటుంబానికి వచ్చిన ఈ చెడ్డ పేరు నుండి బయటపడాలంటే ఏదో ఒక మార్గం ఆలోచించాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది రమ్య.

రమ్య కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆటో ఎక్కి బామ్మ ఉండే అనాధ శరణాలయంలోకి అడుగుపెట్టింది. అప్పటికే రమ్య తల్లి అనాధ శరణాలయ o యజమానితో మాట్లాడుతోంది. కాసేపటికి అనాధ శరణాలయం ఉద్యోగులు బామ్మని,బామ్మ సామాన్లు తీసుకొచ్చి అమ్మకి అప్పచెప్పారు. అమ్మ బామ్మ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి పెట్టె తీసుకుని కారు దగ్గరికి నడిచింది. నేను బామ్మ వీల్ చైర్ తోసుకుంటూ బామ్మతో సహా కారు ఎక్కాను. ఎవరి మధ్య మాటలు లేవు. నాన్న వీధిలోకి ఎదురు వచ్చి బామ్మనీ తన గదిలోకి తీసుకు వెళ్తుంటే అక్కడ కాదు నాన్న ఇక్కడ బామ్మ మంచం ఏర్పాటు చేశాను నా గదిలో అంటూ చెప్పా ను. అలా బామ్మ చనిపోయే వరకు నా గదిలోనే నాతో పాటు . నేనే బామ్మ కి అన్నీ.....

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం