ఇది మోసమా
ఇది మోసమా
ఉదయం 5 గంటలు అయింది. కార్తీక మాసం కావడంతో ఆలయం ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి ఉంది. ఏడుకొండలవాడా వెంకటేశా గోవిందా గోవిందా అంటూ గోవింద నామాలతో భక్తులు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ స్వామి దర్శనం కోసం కొంతమంది క్యూలో నిలిచి ఉన్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి దైవ దర్శనం పూర్తి చేసుకుని తమ తమ ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. భక్తుల అరుపులతో కేకలతో ఆ ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది. నిజమే అక్కడ ఎవరి హడావుడి వారిది.
ఆలయం లోపలికి వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళతో ముఖ మండపం రద్దీగా ఉంది. ఈ ముఖం మండపం సుమారు 20 అడుగుల వెడల్పు ఉంటుంది పొడవు సుమారు 100 మీటర్లు ఉంటుంది . ముఖమండపం పై కప్పు పైన అందమైన అష్టదళ పద్మాలు చెక్కి ఉన్నాయి. ముఖమండపం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు కుడిపక్క ఎడంపక్క అందమైన నల్ల రాతి అరుగులు వాటిపైన గుర్రాలు ఏనుగులు అందమైన దేవత మూర్తులు విగ్రహాలు తో చూడడానికి చాలా అందంగా ఉంది.
అవును అది ఎవరి దేవాలయం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల ఆలయం. ద్వారకుడు అనే మహామునికి చీమల పుట్టలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడట. అందుకే అది ద్వారకాతిరుమలైంది. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటారు. మహా మహిమగల దేవుడు.
భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం. ఇక్కడ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు.ఈ వెంకన్నను కొలవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఎంతోమంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ఆలయం మీద ఆధారపడి బతుకుతున్నారు..ఆ ముఖ మండపానికి కుడిపక్క ఎడంపక్క పిల్లల ఆట వస్తువులు పూజా సామాగ్రి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు అమ్మే దుకాణాలు, కూల్ డ్రింకులు రకరకాల తినుబండారాలు అమ్మే దుకాణాలు, ఏదైనా ఒక ప్రత్యేక ప్రదేశానికి వచ్చినప్పుడు దానికి గుర్తుగా ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లు, దైవ దర్శనానికి వచ్చే భక్తులను చెయ్యి చాచి అడుక్కునే బిచ్చగాళ్ళు ఇలా ఎంతోమందితో ఆ ముఖ మండపం కోలాహలంగా ఉంది.
ఇలా వచ్చే భక్తులు ఎవరితోటి సంబంధం లేకుండా గోవింద నామాలు పలుకుతూ సుమారు 70 ఏళ్ళు ఉంటాయి ఒక వృద్ధురాలు అంత చలిలోనూ నిలబడి వెంకటేశ్వర స్వామి మూడు నామాల్ని వచ్చే పోయే భక్తులకి నుదుట పెడుతూ కనిపించింది. ఎవరిని ఏమీ అడగడం లేదు.నోటి వెంట నామాలను ఉచ్చరిస్తూ భక్తి పారవశ్యంతో తన పని తాను చేసుకుంటూ పోతోంది.చాలామంది నామాలుపెట్టించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.కొంతమంది ముందుకు కదిలి పోయినా వారి వెంబడి పడి నామాలు పెడుతోంది.
ఈ వృద్ధురాలికి ఇది అంత అవసరమా .ఇది ఏమైనా వ్యాపారమా అని ఆలోచిస్తే కాదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ కనిపించింది. ఎవరో ఒక భక్తుడు జేబులోంచి పది రూపాయల నోటు తీసి మామ్మగారి చేతులో పెట్టాడు. ఆ మామ్మగారు ఒక చిరునవ్వు నవ్వి తిరిగి ఆ అబ్బాయికి ఇచ్చేసి ఇది నేను దేవుడికి చేసుకొనే సేవ బాబు చావు బతుకుల్లో ఉన్న నా బిడ్డని రక్షించమని సేవ ద్వారా వేడుకుంటున్నాను. నేను భారీ ఎత్తున మొక్కలు ఇవ్వలేను. నేను కడు పేదరాలని అంటూ కన్నీళ్లు కారుస్తూ చెప్పింది .
"ఏమైంది మీ అబ్బాయికి? అంటూ ప్రశ్నించారు చాలామంది చుట్టూ చేరి. మా అబ్బాయి ఇద్దరు బిడ్డల తండ్రి. హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. చిన్నప్పటినుంచి చుట్టలు తాగే అలవాటుంది. ఈమధ్య గొంతు నొప్పి వస్తోందని డాక్టర్ గారికి చూపించుకుంటే క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు హాస్పిటల్ లో చావు బతుకులో ఉన్నాడు. అక్కడ మా కోడలు పిల్లలు తల తాకట్టుపెట్టి వైద్యం చేయిస్తున్నారు. నేను ఈ వయసులో ఏమీ చేయలేక ఇలా దేవుడు గుడి ముందు నామాలు పెట్టి సేవ చేసుకుంటూ ఉంటాను. ఆర్థికంగా నేను ఏమీ సహాయం చేయలేను ఇది తప్ప అంటూ భోరున ఏడ్చింది . అక్కడ ఉన్న వాళ్లకి ఈ కథ వినేసరికి కన్నీళ్లు వచ్చే యి. అందరూ జేబులోంచి అందిన సొమ్ము తీసి ఆ ముసలమ్మ చేతిలో పెట్టి మీ అబ్బాయి వైద్యానికి ఉంచు అంటూ చెప్పారు.
ముసలమ్మ అందరికీ నమస్కరించి వెళ్లిపోయింది. ఈలోగా వెనక నుండి తెల్ల బట్టలు వేసుకుని ఐడి కార్డు జేబుకు తగిలించుకుని అవన్నీ ఉత్తి మాటలండి. ఎవర్ని నమ్మకండి. రోజు విడిచి రోజు మామ్మ గారు ఇలాగే చేస్తారు. ఇదో రకమైన సంపాదన అంటూ చెప్పి వెళ్లిపోయాడు. నిత్యం అక్కడ ఉండే ఉద్యోగులకు ఏది నిజం ఏది అబద్దమో తెలిసిపోతుంది. అందరి జాతకాలు వాళ్ల దగ్గరే ఉంటాయి. మామ్మ గారు చేసేది ఒకరకంగా ఇది మోసమైనా ఆవిడ పరిస్థితి ఏమిటో ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నాయో , బాధ్యతలు ఉన్నా లేకపోయినా తనని ఈ వయసులో చూసే వాళ్ళు లేకపోవడం వలన ఇలా ఈ గుడి దగ్గర బ్రతుకుతోందని ఇదో రకం బతుకు తెరువు కాబోలనుకుని ఎవరి దారిని మళ్ళీ వెళ్ళిపోయారు.
నిజమే కోట్లు కోట్లు మోసాలు చేసే వ్యక్తులు ఉన్న ఈ దేశంలో తన కడుపు కోసం ఒక రకమైన నాటకం ఆడుతున్న మామ్మ గారిది ఏ రకమైన మోసం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి