రంగుల పండుగ
రంగుల పండుగ
ఇది రంగుల పండుగ. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుని సంతోషం ప్రకటించే పండుగ. పండగ అంటే ఏమిటి సాధారణంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండగలు చేసుకుంటాం.
పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస రాజైన హిరణ్యకశిపుడు కొడుకు. రాక్షసులకి విష్ణువు శత్రువు. తన కుమారుడు విష్ణువుని ఆరాధించడం హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదు. విష్ణు మీద ప్రేమ పెంచుకోవద్దని ప్రహ్లాదుని అనేక బాధలు పెడతారు. చివరికి రాక్షస రాజు చెల్లెలు హోళికాదేవి ప్రహ్లాదుడిని మంటలలో పడవేస్తుంది. దైవానుగ్రహం వలన విష్ణు మాయ వలన ప్రహ్లాదుడు తప్పించుకోగలుగుతాడు. కానీ హోలికాదేవి మంటలలో మాడి మసైపోతుంది. ఆరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి. ఆరోజునే హోలీ పండగ జరుపుకుంటాం.
సాధారణంగా పెళ్లికి లేదా పండగ సమయంలో మనం నివసించే ఇంటికి రంగులు వేసుకుంటా ము. అది శుభకరం. ఏ వేషానికి తగినట్లు ఆ వేషానికి రంగుల పూసుకుని రంగస్థలం ఎక్కుతారు కళాకారులు. అలా ఒంటికి పూసుకున్న రంగుల తోటి పరకాయ ప్రవేశం చేసి రెండు మూడు గంటలసేపు ఆడే నాటకం కడుపుకి వారికి ఇంత అన్నం పెడుతుంది. ఆ రంగస్థలం మీద కళాకారుడు ఆడే నాటకం ప్రేక్షకులకు ఆనందం తెచ్చిపెడుతుంది.
రంగులు లేకుండా కళాకారుడు రంగస్థలం మీద ఆడిన పాడిన ఎవరు పెద్దగా పట్టించుకోరు. రంగుల తోటే ఉంది లోకం.
మరి నిజజీవితంలో కూడా రంగులు పూసుకోరు కానీ జీవితం రంగుల మయంగా ఉండాలని అనుకుంటారు. అంటే ఖరీదైన బంగాళా కారు చేతినిండా డబ్బు ఇది ప్రతివారు కోరుకునే జీవితం. కొంతమంది కష్టపడి సంపాదించి ఉన్నదానితో జీవితం రంగుల మయం చేసుకుంటారు. మరి కొంతమంది లేనిదానిని సృష్టించుకుని ఉన్నదానికి రంగులు వేసుకుని మాటలలో చేతలలో సప్తవర్ణాలు చూపిస్తారు. ఆకాశంలో ఇంద్రధనస్సు కొద్దిసేపు ఉన్న మనిషికి ఆనందం కలిగిస్తుంది. అందరూ ఆకాశం వైపు చూసేలా చేస్తుంది. కొంత సమయం తర్వాత ఇంద్రధనస్సు మాయమైపోతుంది. మరి అలాంటిదే మాయలోకం.
రంగులు లేకుండా అసలు జీవితాన్ని ఊహించుకోగలమా. రంగులు కంటికి మనసుకి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలగజేస్తాయి. ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని
రోజు చూసిన రంగులు ఎంత బాగున్నాయని అనుకోకుండా ఉండలేం. నేను లేకపోతే మీకు వేడి ఉండదు.మీ జీవన గమనం ఆగిపోతుందంటూ సూర్య భగవానుడు మనకి ప్రపంచంలో బ్రతికేందుకు అవకాశం కల్పిస్తాడు. .రాత్రివేళ ఆకాశంలో చందమామ ఎప్పుడు రంగు మార్చుకోకుండా నేను స్వచ్ఛమైన వాడినని అందుకనే తెల్లగా ఉంటానని చెబుతూ మెరిసిపోతూ ఉంటాడు. ఆకాశంలోని నక్షత్రాలు ఎప్పుడు రంగు మారవు.
వీచే గాలి మన కంటికి కనపడదు మనకు రంగు తెలియదు. అయితే మటుకు మన మనుగడకి అదే ప్రధానo. అలాగే నీరు లేకుండా బ్రతకలేం. కానీ రంగు చెప్పలేము. ఎగిరే సీతాకోకచిలుకని అన్ని రంగులు పూసుకున్న ప్రకృతిని చూసినప్పుడల్లా కంటికి ఆనందమే.
నేను రంగుల్లో కింగు ని . అందరి రక్తం ఎరుపు నేను లేకపోతే మనిషి తెల్ల మొహం వేస్తాడు. నీరసించి పోతాడు. నేను మీ శరీర అవయవాల అన్నింటికీ శక్తినిస్తాను అంటూ ఎరుపు రంగు గర్వంగా చెప్తుంది. ఎర్రగా ఉండే రక్తం చూస్తే కొంతమందికి భయo కలుగజేస్తుంది. అందరికీ ప్రేమ తెలియజేయడానికి గుర్తుగాను ప్రమాదం తెలియచేసే హెచ్చరికగాను మానవ జీవితానికి మేలు చేస్తున్నానని చెబుతుంది ఎరుపు రంగు. నుదుట పెట్టుకున్న కుంకుమ బొట్టు సౌభాగ్యానికి గుర్తు.
నేనేమీ తక్కువ దానిని కాదు. అందరికి ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుని దర్శించినప్పుడల్లా నేను కూడా కనబడతాను. నీల మేఘశ్యాముడని ప్రార్థించినప్పుడు నా పేరు వినపడటం నాకు ఎంతో గర్వం. స్మశానలో కాపురం ఉన్న, వెండి కొండ మీద ఉన్న నేను ఆ పరమశివుని కంఠంలో ఉండే కాలకూట విషo ఎప్పుడూ నా రంగులోనే ఉంటుంది. అలాగే పంచభూతాల్లో ఒకటైన ఆకాశం నీలం రంగు వేసుకుని అందంగా ఉంటుంది.
అందరూ తెల్లగా మల్లెపూల మెరిసిపోవాలని అనుకుంటారు కానీ నలుపు కూడా నాణ్యమే. నల్లగా ఉంటే మటుకు ఏమిటి పలక మీద అందంగా మాస్టారు నేర్పిన అక్షరాలు జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాళ్ళ కింద నలిగిపోతే నేమి భూమిరంగు నలుపే. ఆ భూమిలో వేసిన విత్తు మొలకెత్తి పెరిగి పెద్దదై ఇంత ముద్ద పెడుతుంది మానవ లోకానికి. పండ్లు కాయలతో అందంగా మెరిసిపోతూ నోరులేని మూగజీవాలకి ఇంత ఆహారం పెడుతుంది. నల్లగా ఉంటే తప్పేంటి పదిమందికి ఇంత ఉపకారం చేస్తోంది మట్టి. ఆ మట్టితో తయారుచేసిన కుండ కడదాకా సాయం వచ్చి తన గుండె బద్దలు కొట్టుకుంటుంది అది కూడా మనకోసం. కారుమబ్బు కరుణిస్తే గాని నీటి చుక్క రాదు.
ఎవరినైనా తెల్లగా ఉన్న వాళ్ళని చూడగానే అబ్బా ఎంత తెల్లగా మెరిసిపోతున్నారు అని అనుకుంటారు. తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నం. శాంతికి చిహ్నం. ఎర్రకోట పై రెపరెపలాడే త్రివర్ణ పతాకంలో నేను భాగమే అంటూ గర్వంగా చెప్తుంది తెలుపు రంగు. పురాణం కాలం నుంచి నాకు ప్రాముఖ్యత ఎక్కువే. ఇంద్రుడి వాహనం ఐరావతం తెలుపు రంగే. చదువుల తల్లిని పోతన మహాకవి తెలుపు రంగులో ఉంటుందని తన ప్రార్థనలో తెలియచేసాడు.
తెల్లవారి లేస్తే నేను లేకుండా జీవిత గమనం గడవదు. ప్రతి పూజలోను దైవ కార్యక్రమాలలోనూ నేను నా కూతురు పంచామృతాల్లో భాగమై భగవంతుడికి అంకితమైపోతాము అంటూ చెప్పే పాలు పెరుగు కూడా తెలుపు రంగే. తెలుపు రంగులో ఉండే వెన్న ముద్దంటే నల్లనయ్యకి చాలా ఇష్టం.
కంటికి ఇంపుగా ఉండి ఆకుపచ్చ ని ఆకులతో మెరిసిపోయే మొక్క ఎంతో ఉపయోగకరమో మనం చెప్పక్కర్లేదు. పరమశివుడి లాగా కాలకూట విషాన్ని మింగేసి
ప్రాణవాయునందించే చెట్టు ఆకుపచ్చగా మెరిసిపోతుంది. శుభకార్యాలలో ముందుగా వచ్చే అతిధిని నేనే అంటూ మావిడాకులు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఇంటికి అందం తీసుకొస్తాయి. దేశ స్వాతంత్ర సమర విజయానికి గుర్తుగా అన్ని కార్యాలయాల మీద ఎగరవేసే జాతీయ జెండా లో నేను భాగమే అంటుంది ఆకుపచ్చ.
సప్తవర్ణాలలో ఏ వర్ణంలోపించిన కన్నులకింపుగా ఉండదు. ఇంక పసుపు రంగు శుభానికి సంకేతo. గడపకి ఎన్ని రంగులు పులిమినా కాస్త పసుపు రాస్తే మెరిసిపోతూ ఉంటుంది. కోటీశ్వరుడు పెళ్లి కూడా పసుపు తాడుతోనే జరుగుతుంది.
మానవ జీవితానికి రంగులకి దగ్గర సంబంధం ఉంది. బాల్యంలో ఒక అమ్మ తప్పితే ఏ రంగు గురించి తెలియదు. యవ్వనం వచ్చేటప్పటికి ఆ ఇంద్రధనస్సు చూసి అటువంటి జీవితం రావాలని కావాలని కలలు కంటారు కృషి చేస్తారు. జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలనే తాపత్రయంలో కొంతమంది సఫలీకృతులు అవుతారు. కొంతమంది నిరాశ పడతారు.
మానవ ప్రయత్నం ఎంత చేసిన విధి రాత ఎలా ఉంటే అలాగే జరిగిపోతుంది. జీవితంలో ఏదీ మన ప్రయోజకత్వం కాదు. సంపాదించిన డబ్బు గాని కడుపున పుట్టిన పిల్లల తలరాతలు కానీ . మనం ప్రయత్నం చేస్తాం. ఆ రంగుల లోకాన్ని అందుకోలేము ఒక్కొక్కసారి. అప్పుడు లోకమంతా నల్లగా కనబడుతుంది. సరే అందిన రంగులు పుచ్చుకుని ఒక మెట్టు ఎక్కి ఇంకో దశలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని రంగుల గురించి సంపూర్ణజ్ఞానం తెలిసిన ఇంకా ఎక్కడో ఆశ చావదు.
జీవితాన్ని రంగుల మయ చేసుకోవడానికి ప్రయత్నం చేసి చేసి కంటి చూపు తగ్గిపోయి కాళ్లు ముందుకు సాగనని మొరాయించి మూలన కూర్చుంటాం. రంగస్థలం నటుడు ఆట అయిపోయిన తర్వాత రంగస్థలం దిగిన తర్వాత ముఖానికి వేసుకున్న రంగులన్నీ కడిగేసుకుని మళ్లీ ఇంకో కొత్త పాత్రకు సరిపడే రంగులు వేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అయితే ఆఖరి దశలో మట్టిలో కలిపేసిన మనిషిని ఆ దేవుడు ఏదో పాత్ర సృష్టించి రంగులు పూసి లోకంలోకి పంపిస్తాడు. రంగస్థలంమీదనైనా జీవితంలోనైనా రంగులు లేకపోతే ఇంకేముంది. దొరికిన వాటి తో ఆనందంగా బతకడమే జీవితం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి