ఆణిముత్యం
ఆణిముత్యం
సమాజంలో అనేక మంది వ్యక్తులు రోజు జన్మిస్తుంటారు మరణిస్తుంటారు. కొంతమంది మాత్రమే మన గుండెల్లో సజీవంగా ఎప్పటికీ ఉంటారు. రక్తసంబంధీకులు సరే. మరి ఆయనతో మనకున్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన ఒక వేద పండితుడు మా వివాహాలన్నీ ఆయనే చేయించారు అనేకమంది శిష్యులకి ఇంత విద్య నేర్పి తన కాళ్ళ మీద తాము నిలబడేలాగా దారి చూపించిన మహానుభావుడు, మా నాన్నగారికి ఆప్త మిత్రుడు అని ఇలా రకరకాల కారణాలు చెప్పొచ్చు.ఆయన చిరునామా ఎవరికీ చెప్పక్కర్లేదు. వివరాలు కూడా చెప్పనవసరం ఎందుకంటే తన విద్యతో అందరి మనసుల్ని ఆకర్షించిన మహోన్నత వ్యక్తి. ఇంకెవరు ఆ గ్రామంలో ఉన్న ఏకైక వేద పండితులు బ్రహ్మశ్రీ తాతపూడి రామకృష్ణ అవధానులు గారు. కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామ నివాసి
ఆ గ్రామంలో అడుగుపెడుతుంటేనే వేదం నాదం రెండు ముందుగా పలకరించేవి నిన్నటి వరకు. నేడు ఆ ప్రదేశం సందర్శించగానే ఒక్కసారి నిశ్శబ్దం అంతా ఆవరించి ఉంది. ఏ మూల నుంచి అయినా వేదనాదం కాని సంగీత స్వరంగాని వినపడుతుందని ఆశగా చూస్తే మౌనమే అక్కడ రాజ్యమేలుతోంది. ఎప్పుడూ తోటలోని మామిడి చెట్టు క్రింద కానీ అరుగు మీద కానీ తన శిష్యులకు పాఠం బోధించే గురువు లేక అవి చిన్నబోయినట్లుగా అనిపించింది.
ఒక క్షణం మనసు కన్నీటి సముద్రం అయ్యింది. అయినా జనన మరణాలు మన చేతుల్లో ఏమీ లేవు. ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది. నిన్నటి వరకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిలా ఉన్న మహానుభావుడు ఒకప్పుడు రోడ్డుమీద శిష్యులతో నడిచి వెళ్తుంటే వశిష్ట మహర్షిలా ఉండేవారిని అందరూ అనుకునేవారు.
గుండ్రటి మొహం. తెల్లగా మెరిసిపోయే శరీరం. వైదిక ధర్మాన్ని అనుసరించి వస్త్రధారణ గుండు ,పిలక చేతులకి ఆయన ప్రతిభకు తొడిగిన పురస్కారం చూడగానే ఒక సరస్వతీ పుత్రుడు లాగా ముఖ వర్చస్సు,ఆ గొంతు వేదo పలుకుతుంటే పదేపదే వినాలని అనిపించేది. ఒక వివాహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ ఉపనయనం జరుగుతున్నప్పుడు కానీ మరి ఏ ఇతర వైదిక కార్యక్రమం జరిగిన మధ్యలో ఆ మంత్రార్ధం అందరికీ తెలియచెప్పి ఎందుకు చేస్తున్నారో చెప్పగల సరస్వతీపుత్రులు అవధానులు గారు.
వేద పండితులు చాలామంది ఉంటారు. కానీ ఈ మహానుభావుడు ప్రత్యేకత ఏమిటంటే శాస్త్రం విధించిన నియమం, నిష్ట అనేవి రెండు ఈయన ఆయుధాలు. ఉదయం లేచిన వెంటనే దేవతార్చన చేసుకుని తన కార్యక్రమ నిర్వహణకు బయటకు వెళ్లిన మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని నియమం పెట్టుకుని జీవితాన్ని సాగించిన మహానుభావుడు.ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తన వ్రతాన్ని కొనసాగించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులుగా వేద పఠనం కొనసాగిస్తూ ఎంతోమంది విద్యార్థులకు వైదిక విద్య నేర్పిన మహా గురువు. సాధారణ విద్య నేర్చుకున్న గురువులకి శిష్యులకి సంబంధం ఆ పాఠశాల చదువు అయిపోగానే తెగిపోతుంది. కానీ ఈ వైదిక విద్యలో సంబంధం ఎప్పటికీ కొనసాగుతుందని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. గురువుగారు చదువు చెప్పడంతో పాటు శిష్యుడికి బ్రతుకుతెరువు కూడా చూపించేవారు . అలా కోనసీమ నుంచి మా పల్లిపాలెం గ్రామానికి వచ్చి న విద్యార్థికి గురువుగారు విద్య నేర్పి పల్లిపాలెం లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసిన ఆ గురువుగారు శిష్యుడు నాగాభట్ల నారాయణమూర్తి గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆ ఇద్దరి అనుబంధం చూస్తుంటే తండ్రి కొడుకులు అనుబంధం లా అనిపిస్తుంది. ఎప్పుడూ శిష్యుడు బాగోగులు గురించి ఆలోచించే గురువులు చాలా అరుదుగా ఉంటారు.
అంటే చిన్నతనంలో ఎక్కడో దూరం నుంచి గురువుగారి దగ్గరకి విద్య నేర్పుకోవడానికి వచ్చిన ఆ చిన్న పిల్లలని ఆదరించి గురువుగారు విద్య నేర్పితే వారానికి ఒకసారి భోజనం పెట్టి కడుపు నింపే కుటుంబాలు కూడా ఉండడం ఆ ఊరు చేసుకున్న అదృష్టం. అలా పరోక్షంగా ఆ కుటుంబాలు వైదిక విద్యకి ప్రోత్సాహం ఇచ్చాయి.
శ్రీ అవధానులు గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన సంస్థలు ఆ గ్రామస్తుల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉండడమే కాకుండా ఒక క్రమబద్ధమైన జీవన సరళని అలవాటు చేశాయి.. గురువు ఒక మార్గదర్శి. జ్ఞానమార్గం బోధించి దారి చూపించేవాడు. అంటే అందరూ వైదిక విద్య నేర్చుకున్న వాళ్ళే శిష్యులు కాదు. ఆయన చూపించిన మార్గంలో నడిచిన వాళ్ళు కూడా ఆయనకి శిష్యులే.
మానవ శరీరం శాశ్వతం కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్రతికున్న రోజుల్లో చేసిన మంచి పని ఏదైనా సరే పదిమందికి ఉపయోగిస్తే అటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయి ఉంటాడు. విద్యాదానం చేసి పదిమంది బ్రతకడానికి దారి చూపించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఆ మహానుభావుడికి శత సహస్ర వందనాలు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి