పలకని మొబైల్

 పలకని మొబైల్


ఉదయం 10:00 గంటలు అయింది 


అప్పుడే మార్కెట్లోని షాపులన్నీ తీస్తున్నారు. రోడ్డుమీద ఎక్కువగా జనం లేరు.  


ఎప్పటిలాగే శంకరం తన మొబైల్ షాప్ తలుపు తీస్తున్నాడు. మొబైల్ అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా చేస్తుంటాడు శంకరం షాప్ అంతా శుభ్రం చేసి సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడ చూసిన మొబైల్ కనపడుతున్నాయి. మొబైల్ కూడా నిత్యవసర వస్తువుల తయారైంది. రోజు రిపేర్ కోసం అని, మొబైల్ లు కొత్తవి తీసుకోవడానికి జనం వచ్చి పోతుంటారు. 


మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొంతమంది పాతవి అమ్మేస్తుంటారు. నిత్యజీవితంలో మొబైల్ అవసరం ఎంత బాగా పెరిగిపోయింది అంటే అది లేకుండా జీవితం గడపడం కష్టం అయిపోయింది. 


మనిషిలా తోడుగా ఉంటుంది. కబుర్లు మోసుకొస్తుంది. మనసుకు ఆనందపరుస్తుంది. అలాంటిది మొబైల్ ఒక రోజు పని చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. అలాగే ఉంది పరమేశ్వర రావు పరిస్థితి. అప్పుడే నెల రోజుల నుంచి మొబైల్ ఉలుకు పలుకు లేదు . అసలు రింగ్ రావట్లేదు. ఏం పాడయిందో ఏమిటో! పోనీ రిపేర్ కి తీసుకెళ్దాం అంటే ఈ ఆశ్రమం నుంచి రిపేర్ షాప్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరినైనా సాయం తీసుకుని వెళ్లాలి. నడుచుకుంటూ వెళ్ళలేము. సాయం అడుగుదామంటే అందరూ బిజీ బిజీగా ఉంటారు. 


బతిమాలగా బతిమాలగా క్యాంటీన్లో పని చేసే రాము అనే కుర్రాడు సాయం వస్తానన్నాడు. ఇటు ఆటో కి యాభైరూపాయలు అటు నుంచి మళ్లీ యాభై రూపాయలు మొత్తం వంద రూపాయలు రాము చేతిలో కూడా ఎంతో కొంత పెట్టాలి అయినా తప్పదు . మళ్లీ రిపేర్ కి ఎంత అడుగుతాడు ఏమిటో. వెంటనే రిపేర్ చేసి ఇస్తాడా లేదో. మళ్లీ వెళ్లాలంటే ఇదే వరుస అంటూ ప్యాంటు షర్టు వేసుకుని తల మీద టోపీ పెట్టుకుని కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చేతి కర్ర పట్టుకుని మొబైల్ జేబులో పెట్టుకుని రాము వెంట రాగా ఆటో ఎక్కి శంకరం షాపు ముందు దిగాడు. 


శంకరం గ్లాస్ డోర్ లోంచి నడవలేక నడవలేక నడుస్తూ ఎవరినో సాయం తీసుకుని వస్తున్న ముసలాయన్ని చూసాడు. పరమేశ్వర షాపులోకి రాగానే తన జేబులోని మొబైల్ ని శంకరం చేతులు పెట్టాడు. ఏమైందండీ అని ప్రశ్నించాడు శంకరం. 

నెలరోజుల వరకు బాగానే ఉండేది. ఇప్పుడు రింగు రావటం లేదు అన్నాడు పరమేశ్వరరావు. శంకరం మొబైల్ విప్పి అన్ని చూశాడు .ఎక్కడ ఏం తేడా లేదు అన్నాడు శంకరం. అప్పుడు పెద్దాయన కళ్ళల్లో నీళ్లు వచ్చే యి నా పిల్లలు ఫోన్ చేసి నెల పైనే దాటిపోయింది. నేను ఇన్నాళ్లు మొబైల్ పాడయిందనుకున్నాను. కానీ పాడయింది మొబైల్ కాదు. మనసు లేని నా పిల్లలు అని ఏడుస్తూ మెట్లు దిగాడు. ఈ వింత అనుభవానికి శంకరం కళ్ళలో నీళ్లు వచ్చే యి. 


అప్పుడు అర్థమైంది పరమేశ్వరావుకి తన మొబైల్ ఎందుకు పలకటం లేదు అన్న విషయం . గత రెండు మూడు నెలలుగా ఆ శరణాలయంలో ఒంటరిగా ఉండలేనని కొడుకులతో పాటు తీసుకెళ్ళిపోమని వాళ్లు ఫోన్ చేసినప్పుడల్లా ఇంచుమించుగా అడుగుతున్న పట్టించుకోని కొడుకులు చివరికి ఫోన్ చేయడం మానేశారు అదే చేదు నిజం అర్థమైంది పరమేశ్వరావుకు.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట