ఇది సత్యం
ఇది సత్యం.
" ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో.
సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు.
సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు.
ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాలి అని సుందర రామయ్య అనుకుంటూ ఉండగా ఇంతలో పిల్లల దగ్గర నుంచి గ్రూప్ కాల్ వచ్చింది. పిల్లలందరూ తల్లిని తండ్రిని కుశల ప్రశ్నలు వేసి మేమందరము కార్లలో బయలుదేరి భోగి పండుగకి రెండు రోజులు ముందుగా మన ఇంటికి వస్తాము అని పిల్లలు చెప్పేసారు.
ఆడపిల్లలు కదా!పుట్టింటికి పరుగులు పెట్టాలని మనసు ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. అలా చెప్పేసరికి జానకమ్మ గుండెల్లో రాయి పడింది. ఇంతకీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించే సరికి బాగానే ఉందని జానకమ్మ సుందరామయ్య సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు సుందర రామయ్య కి మనసుకి సంతోషాన్ని ఇచ్చే యి. ఈసారి అమ్మ వంటింట్లోకి రావక్కర్లేదు. మేము నలుగురం కలిసి ఇంటి పనులు వంట పని చేస్తాం. ఏ పని చెయ్యక్కర్లేదు అమ్మ అంటూ అందరూ ముక్తకంఠంతో చెప్పారు.
తల్లిదండ్రులకు పిల్లలు వస్తున్నారు అంటే సంతోషమే కానీ ఇప్పటి వాళ్ల ఆరోగ్య పరిస్థితిలు భయంకరంగా ఉంటున్నాయి. ఎవరికైనా సరే డబ్బుకు సమస్య లేదు.
కానీ వంటింట్లో చొరబడి నాలుకకి రుచికరంగా నాలుగు రకాలు చేసుకొనే శక్తి పెద్ద వాళ్ళకిరాను రాను సన్నగిల్లి పోతోంది. ముఖ్యంగా యువతలో ఈ శక్తి అసలు లేదనే చెప్పాలి. అందుకే హోటళ్ళకి అంత గిరాకీ.
సుందరరామయ్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే జానకమ్మ గారు నలుగురు అమ్మాయిలు పిల్లలు భర్తలతో కలిసి పండగ ఎల్లుండి అనగా ఆ సాయంకాలానికి కార్లలో భాగ్యనగరo నుండి వచ్చారు. ఆ వృద్ధ దంపతులు పిల్లలందరినీ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అయిన తర్వాత మీరు స్నానాలు చేసి రండి టిఫిన్ రెడీ చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ. సుందర రామయ్య చేతి సంచి పట్టుకుని జానకమ్మ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. ఎప్పుడూ లేనిది మీరు వంటింట్లోకి వచ్చారు ఏమిటి అంది జానకమ్మ. సుందరామయ్య ఏమి మాట్లాడకుండా సంచిలోంచి టిఫిన్ ప్యాకెట్లు తీసి ప్లేట్లో పెట్టడం ప్రారంభించాడు. అదేమిటి నేను పక్కింటి సుబ్బారావు అన్నయ్య చేత టౌన్ నుండి దోసెల పిండి తెప్పించాను. వేడివేడిగా దోశలు వేసి పెడదామని రెడీ చేస్తున్నాను అంది జానకమ్మ. హుష్ మాట్లాడుకు అన్నట్టు నోటి మీద వేలు వేసుకున్నాడు సుందరరామయ్య.
స్నానాలు చేసి వచ్చిన పిల్లలు ఆకలి మీద ఉన్నారేమో జానకమ్మ పెట్టిన టిఫిన్ చాలా బాగుందంటూ మెచ్చుకుని తినేసి మారు మాట్లాడకుండా గదుల్లోకి వెళ్లిపోయారు. గదిలోకి వెళ్లే ముందు అమ్మ నువ్వు ఏమి చేయకు మేం తొందరగా లేచి వంటింటి పనులు చూస్తాం అంటూ చెప్పారు జానకమ్మ పిల్లలు.
ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేవడం అలవాటు సుందర రామయ్యకి. అలా లేచి వీధిలోనే అటు ఇటు నడుస్తున్న సుందర రామయ్యకి 6 గంటలైనా జానకమ్మ లేవకపోవడం పిల్లలు లేచిన అలికిడి లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకుని హాల్లోకి వచ్చి తాగడం ప్రారంభించాడు.
వంటింట్లోంచి వచ్చిన చప్పుడు చూసి జానకమ్మకి మెలకువ వచ్చి మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చేటప్పటికి ఏడు గంటలు అయింది. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా
టిఫిన్ తినేయడం సుందర రామయ్యకి అలవాటు. ఒకసారి పిల్లల గదిలోకి తొంగి చూసి జానకమ్మ తదుపరి కార్యక్రమం మొదలుపెట్టి వంట కూడా పూర్తి చేసేసింది.
అప్పటికి ఉదయం 10 గంటలు అయింది. అమ్మ సారీ మెలుకువ రాలేదంటూ జానకమ్మ పెద్ద పిల్ల, ఒళ్లంతా అలిసిపోయిందంటూ రెండో పిల్ల, రాత్రి నిద్ర పట్టలేదు అంటూ మూడో పిల్ల, ఇంకా నిద్ర సరిపోలేదంటూ ఆఖరి పిల్ల ఏవేవో చెబుతూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంకేముంది తల్లి మనసు కదా!
పిల్లలంతా స్నానాలు చేసి వచ్చేటప్పటికి 12:00 అయింది.
అమ్మ ఇంకా ఏకంగా భోజనం చేసేస్తా ము అటు పిల్లలు చెప్పిన మాటకి సరే అని చెప్పి జానకమ్మ అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది. కాఫీలు తాగేసిన పిల్లలు ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. ఇంకేముంది వాట్సాప్లు ఫేస్బుక్లు వాటితోటే కాలక్షేపం. ఎంతసేపు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతారో తెలియదు. గంటల తరబడి మాటలు. పుట్టింటికి వచ్చినా వాటి తోటే కాలక్షేపం. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో కాలక్షేపం చేయాలని ఎన్నో కలలు కంటారు. ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకుంటారు. మనవల తోటి ఆడుకోవాలని అనుకుంటారు. ఏమి లాభం పరిస్థితి అంతా చేయి దాటిపోయింది.
ఇంకేమిటి కబుర్లు అంటూ పిల్లల్ని రెండు మూడు సార్లు పలకరించిన ఇంకేమీ లేవమ్మా అంటూ పిల్లల చెప్పిన సమాధానానికి జానకమ్మకు ఒళ్ళు మండిపోయింది.
ఆ మొబైల్ లో మాట్లాడుకోవడానికి బోలెడు మాటలు వచ్చు వీళ్ళకి. మనతో మాట్లాడడానికి సంగతులు లేవంటారు . ఊరు నుండి వచ్చి అప్పుడే ఒకరోజు అవుతోంది. ఒక మాట లేదు మంతి లేదు. ఏమిటో ఈ పిల్లలు అనుకుని ఎంతసేపటికి పిల్లలు భోజనానికి రాకపోవడంతో ఆ దంపతులిద్దరూ భోజనాలు చేసేసి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్లి ఒక గంట సేపు పడుకుని వచ్చిన జానకమ్మకి పిల్లలు అప్పుడు అన్నం తింటూ కనిపించారు. అప్పుడు టైం చూస్తే మూడు గంటలు అయింది. అలా ఆ రోజు గడిచిపోయింది.
ఒకప్పుడు పండక్కి వచ్చిన పిల్లలందరితోటి కలిసి ఒకేసారి భోజనాలు చేసేవారు. కాలం మారిపోయింది. పిల్లల టైమింగ్లు మారిపోయాయి. ఆరోగ్య పరిస్థితులు సహకరించక పెద్దవాళ్లు, ఆఫీస్ టైమింగ్ లో అలవాటయి పిల్లలు తమ దినచర్యని మార్చుకోలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది ఇప్పుడు. కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తే ఆ ఆనందం వేరు.
కాలం ఎవరి గురించి ఆగదు. తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. అలాగే భోగి పండుగను కూడా తీసుకొచ్చేసింది. అతి కష్టం మీద పిల్లలందరినీ పెoదరాలే లేపి తలంటు అంటి భోగి మంట వేయించింది జానకమ్మ.
అక్కడి నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పడాలతో మధ్యాహ్నం వరకు పండగ గడిచిపోయింది. వంటిల్లు మాటే పిల్లలు మర్చిపోయారు. జానకమ్మ మటుకు పిల్లలందరికీ ఏమీ లోటు లేకుండా తన బాధ్యత అంతా సంపూర్తిగా నెరవేరుస్తూనే ఉంది. మధ్యాహ్నం నుంచి భోగిపండ్ల పేరంటాలుతో కాలం గడిచిపోయింది. పేరంటానికి పిలిచిన వాళ్ళని పలకరించకుండా పిల్లలకి రకరకాల రోజులలో ఫోటోలు తీయడంతోటి కాలక్షేపం చేసేసారు జానకమ్మ ఆడపిల్లలు.
ఆ రోజు రాత్రి పిల్లలు ఎప్పుడూ పడుకున్నారో తెలియదు కానీ చాలాసేపటి వరకు గదులలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.
మర్నాడు తోటలు దొడ్లు కాలువలు చూసి వస్తావని బయలుదేరిన వాళ్లు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు. పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక వాళ్లు వచ్చేవరకు ఉండలేక ఆ వృద్ధ దంపతులు భోజనాలు చేసేసి హాల్లో కూర్చున్నారు. ఏమ్మా ఇంత ఆలస్యం అయింది అని అడిగిన జానకమ్మకి అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము. మీరు కూడా వస్తే బాగుండేది అని అడిగిన పెద్ద పిల్ల మాటలకి ఏడవలో నవ్వాలో తెలియలేదు జానకమ్మకి.
పిల్లలు రావడం భోజనాలు చేయడం ఆ తర్వాత కాసేపు విశ్రాంతి సాయంకాలం మళ్ళీ అమ్మవారు గుడి దగ్గర జరిగే జాతరకి తయారయ్యి వెళ్లిపోయారు. జాతర నుండి తిరిగి వచ్చి ఆ జాతరలో తీసిన వీడియోలన్నీ తల్లికి చూపించి మురిసిపోయారు.
ఊరంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయిన పిల్లలు మర్నాడు మళ్ళీ మామూలుగానే 10 గంటలకు లేచా రు. అక్కడి నుంచి రేపే మా ప్రయాణం మళ్లీ ఎప్పుడు వస్తా మో! నీ మీద నాన్న మీద చాలా బెంగగా ఉంటుంది. మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. పిల్లల రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లి పోదాం అంటారు అటు పెద్ద పిల్ల చెప్పిన మాటలకి జానకమ్మకు నవ్వొచ్చింది. పుట్టింటికి వచ్చినప్పుడు కనీసం ఒక గంట సేపు కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు. మళ్లీ కబుర్లు చెప్తున్నారు అనుకుంది జానకమ్మ.
పుట్టింటికి వచ్చినప్పుడు నుంచి పిల్లల ప్రవర్తన గమనించిన జానకమ్మ ఏమే పెద్ద పిల్ల మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తగారికి మామగారికి పండగ శుభాకాంక్షలు చెప్పారా! అని అడిగిన ప్రశ్నకి అప్పచెల్లెళ్లందరూ తప్పు చేసిన వాళ్ళలా తలదించుకున్నారు. మీ మొగుళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది . మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
ఎంతసేపు ఆ టూర్లుకి వెళ్లి ఆ సెల్ ఫోన్లు పట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పండగలకి పబ్బాలకి అత్తవారింటికి కూడా వెళ్లి వాళ్లతో కూడా కాలక్షేపం చేసి రావాలి. మనవలంటే వాళ్లకు కూడా సరదాగా ఉంటుంది కదా. మా మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పిన జానకమ్మ మాటలతో పిల్లలు తాము చేసిన తప్పు ఏమిటో అర్థమైంది.
పండగలకు వచ్చే పిల్లల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ల రాగానే ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని ఎక్కడలేని సందడి ఉంటుందని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశ పడతారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి కరువైపోయింది. ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకుని కూర్చుంటున్నారు. ఫోటోలతోటే జీవితం అంతా గడిచిపోతుంది. అంతకంటే పండగ ఆనందం ఇంకేమీ లేదు. పండగ నాడు చేయవలసిన పనులు ఏమిటి మన సాంప్రదాయం ఏం చెప్పింది అని ఒకరు కూడా ఆలోచించట్లేదు. ప్రతిరోజు లాగే ఆరోజు కూడా మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పండక్కి మామూలు రోజుకి అర్థమేముంది. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుతుంది ఈ యంత్రం. అనవసరపు ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఎక్కడలేని అనవసరపు విజ్ఞానాన్ని చెబుతోంది.
మార్పు సహజమే. కాలంతో పాటు మనం కూడా మారాలి కానీ మన హద్దులు మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. ఏదో మొక్కుబడిగా పండగలు చేసుకుంటున్నాం అని తల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి పిల్లలకి. అమ్మ ఆవేదన అర్థమైంది. చేసిన తప్పు ఏమిటో అర్థమైంది.
ఈ లోకంలో జానకమ్మ లాంటి తల్లులు కరువయ్యారా!
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి