తప్పదు మరి
తప్పదు మరి.......
" ఏమిటమ్మా ఎప్పుడు చూసినా అలా నీరసంగా ఉంటున్నావు. ఇదివరకులా ఉత్సాహంగా లేవు. ఏమైనా అనారోగ్యమా లేదంటే, అల్లుడు గారితో గొడవలా ,కుటుంబ సమస్యలా పిల్లలు ఇద్దరు కూడా చాలా నీరసపడిపోయారు ఏమిటో చెప్పు అంటూ పార్వతమ్మ పండక్కి వచ్చిన కూతురు సుజాత పక్కలో పడుకుని ఏడుస్తూ అడిగింది.
"ఏమీ లేదమ్మా మామూ లే అని అంది సుజాత. పార్వతమ్మ అందుకు ఒప్పుకోలేదు. నిజం చెప్పు లేకపోతే 'నా మీద ఒట్టే అని గట్టిపట్టు పట్టింది పార్వతమ్మ.
" నేను ఆ ఇంట్లో ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను అమ్మా , ఉదయం లేచిన దగ్గర్నుంచి హడావుడిగా అన్ని పనులు చేసి పెట్టిన ఎప్పుడూ ఆఫీసుకి ఆలస్యంగానే వెళ్ళవలసి వస్తోంది. రోజు మేనేజర్ గారి చివాట్లు తినవలసి వస్తోంది. ఉదయం లేచి అందరికీ కాఫీలు ఇచ్చి టిఫిన్ ,వంట తయారు చేసి బాక్సులు సర్దుకుని అత్తయ్య గారికి మామయ్య గారికి టేబుల్ మీద సర్ది పిల్లల్ని డే కేర్ లో వదిలేసి ఆఫీస్ కి బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడూ 20 నిమిషాలు లేటు అవుతోంది. ఇంట్లో ఎవరు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. దానికి తోడు అత్తయ్య గారు మామయ్య గారు పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు. అత్తయ్య గారికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదనుకుంటాను. చీటికిమాటికి ఏదో వంక పెట్టి సాధిస్తూనే ఉంటారు
ఆయన ఎంతసేపు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ తిరుగుతాడు గాని ఆయనకి ఒక టైం ఉండదు. కస్టమర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ వ్యాపారంలో దిగాడు మా ఆయన. ఎప్పుడూ టెన్షన్. అర్ధరాత్రికో అపరాత్రికో ఇంటికి చేరుతాడు. దానికి తోడు మా బ్యాంకులో ఆడిటింగ్ అని ఇన్స్పెక్షన్లని ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది. పిల్లలు డే కేర్ నుంచి వచ్చి వీధిలో ఆడుకుంటూ ఉంటారు. పాపం నేను వెళ్లే వరకు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కులేదు. వాళ్ళ బాగోగులు ఎవరూ చూడరు. పిల్లలకు ఒంట్లో బాగా లేకపోతే ఖచ్చితంగా సెలవు పెట్టుకోవాలి తప్పితే వేరే ఆధారం లేదు.
నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఇంటి పని అంతా నేనే చేసుకోవాలి. పనిమనిషి మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది. అక్కడున్న గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చి వెళ్ళిపోతుంది. మళ్లీ నేను వంటిల్లు పనంతా పూర్తి చేసుకుని మావయ్య గారికి అత్తయ్య గారికి భోజనాలు పెట్టి మేము భోజనాలు తిని పడుకునేసరికి ఆయన వస్తారు. మళ్లీ ఆయన పనులు మామూలే. ఇవన్నీ అయ్యేటప్పటికి ప్రతిరోజు లేట్ అయిపోతుంది.
ఉదయం లేటుగా లేస్తే పనులు అవ్వడం లేదు. ఇలా ఉంది నా పరిస్థితి. దానికి తోడు నాకు చికాకు పెరిగి గట్టిగా అరిస్తే మా ఇద్దరికీ దెబ్బలాటలు కూడా జరిగేయి. ఇంకా ఆదివారం వస్తే బట్టల పని. రోజంతా దాంతోటే సరిపోతుంది. అసలు రెస్ట్ ఉండట్లేదు. ఇంక పండగలు వస్తే నేను చెప్పక్కర్లేదు . ఇంటి శుభ్రత విషయంలో నేను సరియైన శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. మొన్న ఎవరో ఈయనకు తెలుసున్న ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు ఆయన గూట్లో ఉన్న బొమ్మలు చూస్తూ ఒక బొమ్మ చేత్తో పట్టుకుని చూస్తూ వెంటనే వాష్ బేసిన్ ఎక్కడ అండి అని అడిగాడు. ఇంతకీ చేతినిండా దుమ్ము నాకు చాలా సిగ్గేసింది.అంటూ ఏడుస్తూ చెప్పిన సుజాత మాటలు విని పార్వతమ్మ ఆలోచనలో పడింది
ఎక్కడ చూసినా ఉద్యోగస్తురాలు అయిన ఆడదాని జీవితం ఇలాగే ఉంది. అష్ట కష్టాలు పడుతోంది. ఆడపిల్ల మన ఇంటి దగ్గర ఉన్నంతకాలం సుఖంగా ఉంటుంది. కానీ ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఉద్యోగం చేసే స్త్రీ పరిస్థితి ఇలాగే ఉంది. అటు ఇంటి పని ఇటు ఉద్యోగం భార్యగా తన బాధ్యత అన్నింటికీ న్యాయం చేయలేకపోతోంది. ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంది. లేదంటే వాళ్ళ మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది . ఈ వయసులోని స్త్రీలకి కుటుంబ బాధ్యత తో పాటు పిల్లల బాధ్యత చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మగవాడు చేయగలిగిన పని కాదు.
ఈ రోజుల్లో స్త్రీ శుభ్రంగా చదువుకుని ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుందని మనము సంతోషిస్తున్నాము కానీ దాని వెనుక ఉన్న కష్టం నష్టం చాలామందికి తెలియడం లేదు. అలసిపోయి ఇంటికి వచ్చిన స్త్రీ భర్తకు న్యాయం చేయలేక పోతే సంసార సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరైనా అన్ని పనులకు న్యాయం చేయలేరు.
స్త్రీకి స్వాతంత్రం కావాలని అంటూ నినాదాలు చేస్తున్నాం గానీ ఆ ఉద్యోగం చేసే స్త్రీ ఎన్ని బాధలు పడుతుందో బయట ఇంట్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొంటుందో చెప్పలేం. మరి ఎందుకమ్మా ఉద్యోగం మానేయొచ్చు కదా అంటే అందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం. మా ఆయనకి సహాయం గా ఉండాలని అంటారు. పూర్వకాలంలో మగవాడు మాత్రమే సంపాదించాడు. ఉద్యోగం చేసే స్త్రీలు చాలా తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఆడపిల్లలు అందరికీ ఇదే సమస్య.
అలసిపోయి ఇంటికి వచ్చిన ఒక స్త్రీకి కప్పు కాఫీ ఇచ్చే దిక్కు ఉండదు. ఆ కాలపు స్త్రీలకి ఉన్న శక్తిసామర్థ్యములు వేరు. ఇప్పుడు స్త్రీలకు శారీరక బలం తక్కువ. ఇదివరకు మగవాడి ఒక సంపాదనతోటే కాలం గడిపేవారు. ఇప్పుడు అన్ని కోరికలు పెరిగిపోయాయి. దానికి తోడు ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. సొంత ఇల్లు ,సొంత కారు ,ఫర్నిచర్, టూర్లు ఇలాంటి కోరికలు తీరాలంటే ఇద్దరు ఉద్యోగాలు చేయాలి. ఏది ఏమైనా బరువు అంతా ఆడదాని మీద పడుతుంది . మగవాడు ఎంత పని చేసినా ఆడదానిలా చేయలేడు. చాలామందికి అసలు కాఫీ పెట్టుకోవడం కూడా చేతకాదు.
అందుకునే చాలామంది పెళ్లి వద్దు ,పిల్లలు వద్దు అంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు.అని ఆలోచిస్తూ పార్వతమ్మ భర్త రాగానే ఈ విషయం చెప్పింది.
పార్వతమ్మ మాటలు విన్న రామారావు ఆలోచనలో పడ్డారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందో అని అనుకుంటూ కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని చూడమ్మా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు ఉద్యోగం మానేయడమే. ఆడపిల్లలకి చదువు విజ్ఞానం కోసమే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికి అండగా ఉండవలసిన సమయంలో లేకపోతే దాని ఫలితాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నీకు ఇంట్లో అన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి. ఎదిగే పిల్లలు ఉన్నారు, వయసు మీరిన అత్తమామలు ఉన్నారు. వీళ్ళందర్నీ వదిలేసి నువ్వు ఉద్యోగానికి వెళ్లి బండ చాకిరీ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నీకు ఎవరు చేసే వాళ్ళు ఉండరు.
ఆడది లేని ఇల్లు స్మశానంతో సమానం. ఇంటికి ఇల్లాలే అందం. నేను చదువుకున్నాను కదా అని ఊరికే బాధలు పడిపోయి సంపాదించాల్సిన అవసరం లేదు కదా నీకు అంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు నెల రోజులు సెలవు పెట్టి ఇక్కడే ఉండు. కాస్త నువ్వు పిల్లలు తేరుకున్న తర్వాత వెడుదురు గాని. ఆడదానికి తల్లి తండ్రి ఉన్నంతకాలం ఎవరైనా పుట్టింటికి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. ఇది లోక సహజం నేను ఎవరిని నిందించడం లేదు.
నేను అల్లుడు గారికి కూడా కబురు పంపుతాను అంటూ చెప్పుకు వచ్చాడు తండ్రి ఇక్కడ సుజాత పరిస్థితి యి లా ఉంటే అక్కడ సుజాత భర్త కేశవ రావుకి సుజాత వెళ్ళిన తర్వాత ఇంటి పనితోటి, తల్లి తండ్రి పని తోటి ఎక్కడా ఖాళీ ఉండట్లేదు. బయటకు వెళ్లాలంటే కుదరటం లేదు. తల్లి తండ్రికి తనే వండి పెట్టాలి. బయట హోటల్ తిండి తినలేరు. ఎప్పుడు అలవాటు లేని పని. కాఫీ కూడా కలపడం చేతకాని రామారావు అన్ని ఫోన్లో సుజాత నడిగి చేస్తున్నాడు. ఎప్పుడొస్తావని పదేపదే అడుగుతున్నాడు. సుజాత ఏమి సమాధానం చెప్పలేదు. సుజాత ఏమైనా ఒంట్లో బాగోలేదా. ఏమైనా దాస్తోందా. లేకపోతే ఇంటి పని ఆఫీస్ పని పిల్లల పని చేయలేకపోతోందా అని అప్పుడు అనుమానం వచ్చింది కేశవ రావుకి .కేశవ రావు తల్లిదండ్రులు కూడా పిల్లలు లేకపోతే ఇల్లంతా బోసి పోయిందిరా అంటూ అడుగుతున్నారు.
నిజమే ఇప్పుడు సుజాత లేకపోతే ఇంటి పని కష్టం ఏమిటో తెలిసి వచ్చింది. పాపం సుజాత ఇంటి పని పిల్లల పని ఆఫీసు పని ఎలా నెగ్గుకుంటూ వస్తుందో. ఏనాడు సహాయం చేయమని అడిగినా చేయకపోగా ఒకటి రెండుసార్లు దెబ్బలాడేను. మావయ్య నిన్న ఫోన్ చేసినప్పుడు పిల్లలు సుజాత చాలా నీరసంగా ఉన్నారని చెప్పాడు. అంటే పిల్లలు భార్య అంత నీరసంగా ఉంటే నువ్వు ఏమి చేస్తున్నావ్ అని అడిగినట్లు అనిపించింది
ఏదో ఇంట్లో నడిచిపోతుంది కదా అని అనుకుంటాo గాని సుజాత అంత నీరసంగా ఉందని ఎప్పుడు గమనించుకోలేదు. ఎప్పుడు వ్యాపారంలో పడి భార్యను పట్టించుకోలేదు. ఎప్పుడొస్తున్నావ్ అని ఫోన్ చేసినప్పుడు అడిగితే ఒక నెల రోజులు పాటు రెస్ట్ తీసుకుంటానండి అంటూ చెప్పింది సుజాత. అలాగే ఉద్యోగం మానేసి ఇంటిపట్టున ఉండాలని నిర్ణయించుకున్నాని చెప్పింది. ఇది నిజమేనా.
నన్ను ఆటపట్టించడానికి ఆ మాట అంటోందా ఏమో అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ సుజాత ఉద్యోగం మానేస్తే ఎలాగా. ఇంతవరకు సుజాత జీతంతోటి ఇంటి ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి. నిల కడలేని ఆదాయంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకు రాగలను అనుకుంటూ మదన పడుతూ ఉండగా కేశవ రా వు తల్లి తండ్రి కోడలు ఎప్పుడొస్తుందంటూ ప్రశ్న మీద ప్రశ్నలు కురిపించారు. సుజాతకి ఆరోగ్యం బాగా లేదంటూ సమాధానం చెప్పాడు గాని ఎప్పుడొస్తుందో తెలియదు అని చెప్పా డు. తమ్ముడు దగ్గరకి కొద్దిరోజులు ఉండి వస్తామ ని చెప్పి కేశవరావు తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఈ నిర్ణయానికి కేశవరావు మౌనంగా ఉండిపోయాడు. తల్లిదండ్రులు ఎందుకు వెళ్లిపోయారు . వాళ్లకి ఇక్కడ సౌకర్యంగా లేదు. నేను పెట్టే తిండి తినలేక పోతున్నారు అని అనుకున్నాడు. ఇందులో ఎవర్ని తప్పు పట్టలేము. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ లోకంలో నడుచుకోవాల్సిందే.
ఆ ఒక్క మనిషి ఇంట్లో లేకపోతే రోజు ఇన్ని సమస్యలు. ఆమెకి పొద్దు పొడిస్తే బ్రతుకంతా రణరంగమే కళ్ళు తెరిచి పద్మవ్యూహములో జొరపడి వీరంగం చేయడమే ఆమె విథి నిర్వహణ.బరువులు బాధ్యతలు తెచ్చి పెట్టుకున్న బంధాలు విధాత రాసిన కర్మలు ఏ ఒక్కటి ఊపిరి పీల్చుకోనివ్వవు ఒక్క క్షణం.అందరూ పల్లకి ఎక్కి కూర్చుని బోయిలు ఎవరంటే భుజాలు తడుపుకుంటారు.
జరిగిన తప్పులకు జవాబుదారిని చేస్తారు ఉరిమే చూపులతో ప్రశ్నిస్తారు.అందరికీ ఆదివారం సెలవు మరి ఆమెకి రోజు ఉండే ఒక క్షణం విరామానికి ఆరోజు సెలవు. ఎన్నెన్నో ప్రణాళికలు
ఎన్నెన్నో పూజలు కనిపించని దేవుళ్ళు అందరికీ మ్రొక్కులు
ఆమె కోరిక ఒక్కటే ఆ కుటుంబ క్షేమం. పూర్వకాలంలో ఉండే మనుషులు చాలా బలంగా ఉండేవారు. పైగా ఉమ్మడి కుటుంబాలలో అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవడం వలన ఎవరికీ పెద్దగా శ్రమ అనిపించేది కాదు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద సంసారాలు అయినా గృహిణి ఎప్పుడూ చలాకీగా పనులు చేసుకుంటూ ఉండేది. మంచి ఆరోగ్యాలు ఉండేవి . ఇంట్లో చేసుకునే పని ఆమెకు వ్యాయామం. కాలక్రమేణాఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి స్త్రీ కూడా ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడి సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం వలన మనుషులందరూ బలహీనంగా తయారైపోయి శారీరక మానసిక అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. అటు కుటుంబ నిర్వహణ ఇటు పిల్లల పెంపకం అటు భర్తల పని ఉద్యోగ నిర్వహణ ఇన్ని పనులను ఒక మనిషి చేయాలంటే చాలా కష్టం.
అందుకే ఆమెకి ఎక్కడలేని అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి.
ఒక గృహిణి అనారోగ్యం పాలవుతే ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. కుటుంబం కుంటుపడుతుంది. సంసార చక్రం సరిగా నడవదు. ఒక గృహిణి కుటుంబంలో చాలా ప్రధానమైన వ్యక్తి. ఆమె మీద కుటుంబం యొక్క ఆర్థిక మానసిక శారీరక ఆరోగ్యాలు ఆధారపడి ఉన్నాయి అంటూ టీవీలో వచ్చిన ప్రవచనం విని కళ్ళు చెమర్చాయి కేశవరావుకి. వెంటనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు
మరునాడు ఉదయమే కేశవరావు అత్తవారింటికి వెళ్లి సుజాత నీ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 8 గంటలు అయింది.రాగేనే ఇల్లంతా ఒకసారి చూసుకుని అత్తయ్య మామ ఏరి అని అడిగింది సుజాత. తమ్ముడు దగ్గరికి వెళ్లారు అంటూ సమాధానం ఇచ్చాడు కేశవరావు. ఇల్లంతా చాలా నీట్ గా సర్దేసి ఉంది. గూట్లోని బొమ్మలు అన్ని మెరిసిపోతున్నాయి. ఈ పనులన్నీ ఎవరు చేశారు భర్త ఏమీ చెప్పలేదే, ఉద్యోగ విషయం కూడా ఏమీ మాట్లాడలేదు అనుకుంటూ ఆ రాత్రి అలాగే పడుకుంది. ఉదయం ఐదు గంటలకి కాలింగ్ బెల్ మ్రోగడంతో మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత పొద్దున్నే అనుకుంటూ తలుపు తీసి ఎదురుగుండా ఒక స్త్రీ నిలబడి ఉంది. నమస్కారం అమ్మ నా పేరు రామలక్ష్మి ఇంట్లో వంట పనికి ఇంటి పనికి పిల్లలను చూసుకోవడానికి అయ్యగారు పెట్టారు అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళింది. ఒక్కసారిగా సుజాత మనసు పొంగిపోయింది. అంటే భర్త తన గురించి ఆలోచించాడన్నమాట అనుకుని ఇంకా నిద్ర వస్తుండడంతో అలా పక్క మీదకు వాలిపోయింది.లేచేటప్పటికి ఉదయం 8 గంటలయింది.
అలాగే బ్రష్ చేసుకుని స్నానం చేసి టిఫిన్ తినేసి బాక్స్ పెట్టుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి అన్ని టేబుల్ మీద రెడీగా ఉన్నాయి. పిల్లలు స్నానం చేసి హాయిగా.ఆడుకుంటున్నారు. హమ్మయ్య యిన్నాళ్ళకి కాస్త రిలీఫ్ దొరికింది అనుకుంటూ ఊరికి వెళ్లి అత్తగారిని మామగారిని తీసుకొచ్చేసింది. ఇలా ఒక నెలరోజులు గడిచింది. నెలాఖరికి ఆ రామలక్ష్మికి భర్త ఇస్తున్న జీతం చూసి ఆశ్చర్యంగా తల పట్టుకుని కూర్చుంది. సుజాత సంపాదనలో సగభాగం రామలక్ష్మి జీతం.
ఇంత అనవసరం ఖర్చు. పైగా సరుకులు కూడా పొదుపుగా వాడటం లేదు. ఇష్టం వచ్చినట్లు నూనె పోసి వండేస్తోంది. రుచి అంతంత మాత్రమే అని అనుకునిఆ మర్నాడు రామలక్ష్మకి ఊస్టింగ్ సుజాత మళ్లీ యధా స్థానంలో. ఎందుకంటే ఆమె బాధ్యత గల గృహిణి. ఎన్ని బాధలు ఉన్నా ఆమె కుటుంబం కోసం భరిస్తుంది. కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. తరతరాలుగా మన స్త్రీలందరూ ఇలాగే ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టడం కాదు మన బాధ్యత ఏమిటో మగవాళ్ళు కూడా ఆలోచించాలి. కాలం మారింది. ఒకప్పుడు మగవాళ్ళు సంపాదించాలి ఆడవాళ్లు ఇంటి బాధ్యత చూసుకోవాలనేది ఉండేది. ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మర్నాడు కేశవరావు సుజాత తో పాటు లేచి స్నానం చేసి వంటింట్లోకి వచ్చాడు. భర్తలోని ఈ మార్పుకు ఆశ్చర్యపడింది సుజాత. తప్పదు మరి
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి