కాలక్షేపం

కాలక్షేపం

" రేపే రిటైర్మెంట్ కాగితాలు సబ్మిట్ చేయడానికి ఆఖరి రోజు.
 హెడ్మాస్టర్ దగ్గర సంతకాలు తీసుకోవాలి సాయంకాలం లేటుగా వస్తాను .కంగారు పడకంటూ కాగితాలు తీసుకుని క్యారేజీ తీసుకుని స్కూల్ కి వెళ్ళిపోయారు రామశాస్త్రి మాస్టారు. రామశాస్త్రి గారిది చాలా అదృష్టవంతమైన జీవితం. విద్యార్థిగా విద్య నేర్పిన పాఠశాల ఉపాధ్యాయుడిగా జీతమిచ్చి ఇన్నాళ్ళు ఆదరించింది. 

అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. రామ శాస్త్రి గారు లెక్కల మాస్టారే కాకుండా అన్నింటికీ లెక్కలు వేసుకుని, ప్రణాళికలు వేసుకుని, జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. సొంత ఊరుకి స్కూలు దగ్గరైన పిల్లలు చదువులు కోసం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న 
నగరంలో కాపురం పెట్టి రోజు బస్సు మీద స్కూల్ కి వెళ్లి వస్తుండేవాడు. అలా ముప్పై అయిదు సంవత్సరాలు గడిచిపోయే యి. పిల్లలందరికీ సర్వీస్ లో ఉండగానే పెళ్లిళ్లు చేయాలని తాపత్రయపడి కింద మీద పడి కడుపున పుట్టిన ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసాడు. ఆయనకు మగ సంతానం లేదు. 
హమ్మయ్య ఇవాళ్ళతోటి రిటైర్మెంట్ కాగితాల పని అంతా అయిపోయింది అనుకుంటూ రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి కుర్చీలోకూల పడ్డాడు రామ శాస్త్రి మాస్టారు. ఇప్పుడు మాస్టర్ కి ఒక బెంగ పట్టుకుంది.
 ఇన్నాళ్లు సర్వీస్ లో ఉండగా స్కూల్లో పిల్లల తోటి ఇంటికి వచ్చిన తర్వాత కడుపున పుట్టిన పిల్లలతోటి కాలక్షేపం అయిపోయేది. పిల్లలతోటి గడపడం అనేది దేవుడిచ్చిన వరం. అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే కుదురుతుంది. ఏపూటైనా పాఠాలు చెప్పబుద్ది కాకపోతే ఆనందంగా వాళ్ళతోటి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయొచ్చు. ఆ పిల్లలు చేసే చిలిపి పనులకు అల్లరికి ఒక్కొక్కసారి విపరీతంగా కోపం వచ్చిన నవ్వు కూడా వస్తుంది. ఒక క్లాసులో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలు ఉంటారు. కొంతమంది ఎంత కొట్టినా ఏడవరు. కొంతమంది ఎంత గట్టిగా కొట్టినా నవ్వుతూ ఉంటారు. బాగా అల్లరి చేసే వాళ్ళు ,బుద్ధిగా పాఠాలు నేర్చుకునే వాళ్ళు ఇలా అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. అందరినీ మెప్పించి తన దారిలోకి తెచ్చుకుని పాఠాలు వినే విధంగా చేసుకోవడంలోనే ఉపాధ్యాయుడు గొప్పతనం ఉంది. 
అలా పిల్లలతో ఈనాటి వరకు కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయితే పిల్లలు ఎవరు కనపడరు. ఇంటి దగ్గర కూడా పిల్లలు ఎవరూ లేరు . అందరూ ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతసేపని పేపర్లు చదువుతాం . టీవీలు చూస్తాం. ఉదయం సాయంకాలం గంట అలా వీధిలోకి వెళ్లి వచ్చిన మిగిలిన కాలం ఏం చేయాలన్నది సమస్య. నిజానికి రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది మన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మొదలు పెడతాం. భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేస్తూ ఉంటాం. ఒక్కసారి పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బు ఎలా పొదుపు చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటాo. 
ఏది ఏమైనా ఈ వయసులో సొమ్ము భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి మనకు నచ్చిన చోట పొదుపు చేసుకుంటాo. అక్కడ తోటి ఆర్థిక భద్రత అయిపోయింది. మరి కాలక్షేపం. మళ్లీ ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేద్దామని అనుకున్న వయసు కూడా సహకరించదు. మరి కాలం గడపాలంటే ఏం చేయాలి ఇది మన రామ శాస్త్రి గారి సమస్య.
సెలవు రోజుల్లో అలా సాయంకాలం పూట వీధిలో ఎదురుపడిన స్నేహితులు ఏమిటి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ అడిగినప్పుడు ఇంకా ఏమీ అనుకోలేదు అంటూ మాట దాటేసేవారు రామశాస్త్రి.

ఆ రావలసిన శుభ ముహూర్తం రానే వచ్చింది . అదే స్కూల్లో మొత్తం సర్వీసు కంప్లీట్ చేసినందుకు సన్మాన సభలో అందరూ రామ శాస్త్రి గారిని పొగిడి ఒక శాలువా కప్పి తమ బాధ్యత తీర్చుకున్నారు పాఠశాల వాళ్ళు. 

విచారంగా ఇంటికి వచ్చిన రామ శాస్త్రి గారికి భార్య సుభద్ర టీవీలో "మిధునం సినిమా చూస్తూ కనిపించింది. కాసేపు అలా పడకుర్చీలో వాలి సినిమా చూడటంలోమునిగిపోయాడు రామశాస్త్రి. అందమైన ఇల్లు, చుట్టూ అన్ని రకాల మొక్కలు, ఒక మూలగా ఆవు దూడ ,వయసు మళ్ళిన ఒక జంట జీవిత కథని చాలా అద్భుతంగా చిత్రీకరణ చేసిన దర్శకుడిని సినిమా చూస్తున్నంత సేపు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రామ శాస్త్రి. ఆ సినిమా అయిపోయిన వెంటనే తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది రామశాస్త్రి కి.

లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా లెక్కలన్నీ చూసుకుని ఇద్దరు మనుషుల్ని పిలిపించి మర్నాడు పెరట్లో ఒక రేకుల షెడ్ వేయించాడు. రామశాస్త్రి గారు చేస్తున్న పని భార్యకి ఏమి అర్థం కాలేదు. మర్నాడు ఊర్లో ఉండే తన చిన్ననాటి స్నేహితుడు నీ వెంట పెట్టుకుని తుని పశువుల సంతకు వెళ్లి ఒక నల్లటి ఆవుని, దూడని కొనుక్కొచ్చి ఆ రేకుల షెడ్ లో కట్టివేసి నిశ్చింతగా నిద్రపోయాడు. దానికి సాంబ అని నామకరణం చేశాడు

మరునాడు ఉదయమే అంబా అని పిలుపుతో రామశాస్త్రి గారు బాధ్యత గుర్తుచేసింది ఆ కర్రి ఆవు. లేస్తూనే మూలన ఉన్న తట్ట తీసుకుని రేకుల షెడ్డు శుభ్రం చేసి ఆ గోమాత కడుపు నింపి పాలు పితికి అలా ఆ గోమాతకు కావాల్సినవన్నీ సమ కురుస్తూ రోజంతా గడపడం మొదలెట్టాడు. ఆ వచ్చిన కొత్త ప్రాణి సపర్యల తోటి రామశాస్త్రి గారికి కాలమే తెలియడం లేదు. ఆ సాంబడికి రామశాస్త్రి గారికి బాగా అనుబంధం పెరిగిపోయింది. సాంబడి బిడ్డకు కూడా లక్ష్మి అని పేరు పెట్టుకుని అది చెంగుచెంగున గంతులు వేస్తుంటే వచ్చేమువ్వల చప్పుడికి చిన్నప్పుడు తన ఇంట్లో పిల్లలు అల్లరి చేసేటప్పుడు కాలి గజ్జలు చప్పుడులా అనిపించి ఆనందపడేవాడు. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు సాంబడు మరియు దాని పిల్ల అరుపులతో సందడిగా ఉంటోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి దాని కడుపు నింపడం కోసం నానా పాట్లు పడేవాడు రామశాస్త్రి.

 బయటకు వదులుదామంటే సాంబడి నీ లక్ష్మిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం. అందుకే ఎంతసేపు ఆ రేకుల షెడ్ లోనూ లేదంటే దొడ్లో ఉన్న మామిడి చెట్టు కింద కట్టి పోషించేవాడు. వీధి చివర్లో ఉండే పశువుల డాక్టర్ గారి తోటి స్నేహం పెంచుకుని ఎప్పటికప్పుడు ఈ పశువుల ఆరోగ్యం గురించి పెంపకం గురించి తెలుసుకునేవాడు.

ప్రతిరోజు ఉదయం రామశాస్త్రి గారి భార్య గోపూజ చేసుకుంటూ ఆ గోమాత సేవలో భార్యాభర్తలు ఇద్దరు అమితానందం పొందుతూ వచ్చారు.రామ శాస్త్రి గారి నిపిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే "లేదమ్మా మా సాంబడిని లక్ష్మిని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అందుకనే మేము ఎక్కడికి రాము అంటూ సున్నితంగా చెప్పేవారు. "నాన్న మీరు సర్వీస్ లో ఉండగా ఎలాగా రాలేదు. ఇప్పుడు ఖాళీయే కద నాన్న అంటూ పిల్లలు అడిగేసరికి ,లేదమ్మా ఇప్పుడే నా అసలు సర్వీస్ మొదలైంది. ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను. ఇది నా ఆత్మ సంతృప్తి కోసం. నా గురించి నేను ఆలోచించుకునే సమయం ఇదే అందుకే నాకు నచ్చిన రంగం ఎంచుకున్నాను అంటూ పిల్లలతో చెప్పేవాడు. 
ఆ నగరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇళ్లల్లో కాని స్నేహితుల ఇళ్లలో కానిగృహప్రవేశం జరిగితే సాంబడిని,లక్ష్మి ని తీసుకుని వెళ్లి తిరిగి తీసుకొచ్చి రామశాస్త్రి గారు చేతికి కొంత సొమ్ము ఇవ్వబోయే వారు. రామ శాస్త్రి గారు సున్నితంగా తిరస్కరించి ఇది దైవకార్యo నా వంతు సహకారం అందిస్తున్నానంటూ చెప్పేవారు.
 ఎందుకంటే నగరాలలో గృహప్రవేశాలు లాంటివి జరిగినప్పుడు ఆవు దూడలను తీసుకువచ్చి ఈ మధ్యకాలంలో చాలా సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు . 

ఈమధ్య గోమాత ప్రాముఖ్యత గురించి అందరూ టీవీల్లో ప్రవచనాలు విని గోమూత్రం గోమయం ఆవు పాలు కావాలంటూ రోజు ఎవరో ఒకరు వచ్చి అడిగి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు.

 ఎక్కడెక్కడ నుంచో వచ్చి అడిగి మరీ పట్టుకుని వెళ్తున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో ను మరియు పండగ సమయాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. నగరాల్లో ఎక్కువ ఖరీదు ఇస్తానన్న స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడ దొరకవు. ఇలా రామశాస్త్రి గారి ఇంటికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. పాలు లేవని చెప్పలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి రామ శాస్త్రి గారే పాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇది పుణ్యకార్యం కాబట్టి రామశాస్త్రి గారు మౌనంగా ఉండి పోతున్నారు.
రామశాస్త్రి గారు ఆవును పెంచడం మొదలెట్టిన తర్వాత వాళ్ల పురోహితుడు గారికి సంపాదన పెరిగింది. ఎవరైనా మరణించినప్పుడు ఈ ఆవును తీసుకుని వెళ్లి గోదానాలు బదులు సొమ్ము తీసుకుని జేబు నింపుకుంటున్నాడు. పాపం సాంబడికి లక్ష్మికి ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. దూర ప్రయాణాలు చేసి నీరసపడిపోతున్నారు. ఎప్పుడూ అలాగే పడుకుని ఉంటున్నాయి తల్లి కూతురు. 
ఏదో తనకు వ్యాపకం ఉండాలని కోరి తెచ్చుకుంటే ఆ ప్రాణిని బాధ పెట్టినట్లు అయిందని అనుకుంటూ ఈ గండం నుండి గట్టు ఎక్కడానికి ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పి అనుకుని "ఆవుకి మూడో నెల అంటూ సంతోషంగా అడిగిన వాళ్ళకి అడగనివాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. 

కొన్నాళ్లు పాటైనా ఆ మూగ జీవులను బాధపెట్టకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆ మధ్య గృహప్రవేశానికి వెళ్లిన సాంబడిని మూడో అంతస్తులో ఉన్న ప్లాట్ ఎక్కించడానికి ప్రయత్నం చేశారని తెలిసింది రామ శాస్త్రి గారికి. ఇంటికి వచ్చిన సాంబడికి లక్ష్మికి కాళ్ళకి కొబ్బరి నూనె రాసి వేడినీళ్ల కాపడం పెట్టాడు . అంత ప్రేమ ఆ మూగజీవులంటే రామశాస్త్రి గారికి.
పల్లెటూరులో పుట్టి పెరిగిన రామ శాస్త్రి గారి వాళ్ల నాన్నగారికి కూడా పశువులను పెంచడం అలవాటు. 

అలాగే ఏ విషపూరిత రసాయనాలు కలిశాయో తెలీదు గానీ ఒంటినిండా పెట్టిన పసుపు కుంకుమ బొట్లుకి పాపం సాంబడికి ఎలర్జీ వచ్చేసింది.

 ఆ మధ్యలో ఒకచోట పరమాన్నం నోము చీకటపడే సమయానికి చెల్లకపోతే వీధుల్లో తిరిగే ఆవుకి పెట్టారట. పాపం దానికి వాతం చేసి ఆవు చనిపోయింది. వ్రత ఫలం మాట దేవుడెరుగు పాపం చుట్టుకుంది . అలాంటి వార్తలన్నీ వింటున్నాం భయంగా ఉంది ఎప్పటికీ సాంబడి ని బయటికి పంపించకూడదు అని నిర్ణయించుకుని ఏవో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి సాంబడిని ఎక్కడికి పంపించడం మానేసాడు. అలా సాంబడు అల్లార ముద్దుగా పెరుగుతూ రెండేళ్లకు ఒకసారి ఒక దూడకు జన్మనిచ్చి రామ శాస్త్రి గారికి గో సంపద పెంచింది.

అలా పెరటి నిండా ఉన్న గో సంపదని చూసి వాటికి సేవ చేస్తూ తనకు సహాయం చేయడానికి ఒక పని వాడిని కూడా పెట్టుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు రామశాస్త్రి గారు. ఈ కాలక్షేపం రామశాస్త్రి గారికి ఆత్మ సంతృప్తిని ఆరోగ్యాన్ని దానితోపాటు ఆనందాన్ని ఇచ్చింది . రామశాస్త్రి గారి కాలక్షేపం చూసి స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు. ఈ వయసులో కూడా కాలాన్ని వృధా చేయకుండా ఏదో ఒక మంచి పని చేస్తున్నాడని ఆనందపడ్డారు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం