అమ్మాయి కోరిక

అమ్మాయి కోరిక

" అమ్మా సీత ఆ హైదరాబాద్ సంబంధం వాళ్లు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు చేశారు. మనం ఏదో ఒక సమాధానం చెప్పకపోతే బాగుండదు అంటూ అడిగిన తండ్రి నరసింహాచార్యులకి " నాన్న ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. వద్దని చెప్పండి అంటూ చెప్పిన కూతురు సీతవైపు అయోమయంగా చూశాడు నరసింహచార్యులు. ఆ సంబంధానికి ఏమైంది? కుర్రవాడు బంగారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బోల్డంత జీతం. పైగా కుర్రవాడు అందగాడు. తల్లి తండ్రి కూడా ఉద్యోగస్తులే. వంక పెట్టవలసిన పనిలేదు ఏమిటో ఈ పిల్ల. ఏమి అర్థం కాకుండా ఉంది. అలా అని బలవంతంగా చేస్తే రేపొద్దున పిల్లల కాపురం చేయరు. అప్పుడు కూడా మనమే బాధపడాలి అనుకుంటూ గుడి వైపు అడుగులు వేశాడు నరసింహాచార్యులు.

నరసింహ ఆచార్యులు గుడికి వెళ్ళాడు కానీ మనసంతా ఏదో బాధగా ఉంది. ఇప్పటికయిదారు సంబంధాలు ఏదో వంక పెట్టి తిప్పి పంపేసింది. లేక లేక పుట్టిన సీతను చాలా గారాబంగా పెంచాడు నరసింహ ఆచార్యులు. నరసింహ ఆచార్యులు తాతల కాలం నుండి ఆ గుడిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఆదాయం అంతంత మాత్రం. కానీ ఏనాడు దేవుడికి లోటు చేయకుండా ఊరివారి సహాయంతో అన్ని ఉత్సవాల్ని అందంగా చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు నరసింహచార్యులు.
 అది రాజమండ్రి పక్కనున్న ఒక పల్లెటూరు. సీత తెలివైన పిల్ల కావడంతో రాజమండ్రి కాలేజీలో చేర్పించి బీఎస్సీ కంప్లీట్ చేయించాడు. తర్వాత అక్కడే బీఈడీ కూడా చదివించాడు నరసింహాచార్యులు.. సీత ఏకైక సంతానం కావడంతో మేనల్లుడు కృష్ణమాచార్యులుకి ఇచ్చి పెళ్లి చేయాలని నరసింహాచార్యులు సంకల్పం.

కానీ ఎందుకో సీత మొదట్లో పెద్దగా ఇష్టం చూపలేదు ఆ సంబంధానికి. ఎందుకో తెలియలేదు. అయినా ఇష్టం లేని పెళ్లి చేయకూడదని బయట సంబంధాలు చూడడం ప్రారంభించాడు నరసింహాచార్యులు.

అలా ఉదయం పూజలన్నీ ముగించుకుని దేవాలయానికి తాళం వేసి ఇంటికి చేరిన నరసింహాచార్యులు అమ్మా సీత అంటూ గట్టిగా పిలిచాడు. లేదండి మీ చెల్లెలు గారి ఇంటికి వెళ్లింది అంటూ సమాధానం చెప్పింది భార్య సుభద్రమ్మ. 

నరసింహాచార్యులు గారి చెల్లెలు భర్త రామాచార్యులు అదే గ్రామంలో రామాలయంలో పనిచేస్తుంటాడు. రామాచార్యులు గారికి ఒకే ఒక కుమారుడు కృష్ణమాచార్యులు. నాలుగు వేదాలు చదువుకుని అదే గ్రామంలో ఉంటూ ఒకపక్క గుడిని మరొకపక్క విద్యార్థులకి వేద పాఠాలు నేర్పే గురువుగా మంచి వేద పండితుడిగా పేరు సంపాదించుకున్నాడు.

"ఒకపక్క ఆకలి దంచేస్తోంది ఇంకా సీతా రాలేదేంటబ్బా అంటూ ఎదురు చూస్తున్న నరసింహ ఆచార్యులకి గుమ్మoల్లో అడుగు పెట్టిన సీత కనబడింది." ఏమ్మా ఇంత లేట్ అయింది అంటూ ప్రశ్నించిన తండ్రికి అత్తయ్యకి జ్వరం వచ్చింది కాస్త వంట చేసి పెట్టి వచ్చేటప్పటికి లేట్ అయింది అంటూ సమాధానం చెప్పిన కూతురు సీతవైపు అయోమయంగా చూశాడు సీత తండ్రి
అదేమిటి సీతలో ఎంత మార్పు వచ్చింది చిన్నప్పుడు ఎప్పుడైనా మేనత్తగారింటికి వెళ్ళమంటే అరిచి గీ పెట్టిన వెళ్ళేది కాదు . ఈ మధ్యన ఆ కుటుంబం వాళ్లకి సహాయం చేస్తోంది. ఏమిటో ఈ మార్పు అనుకున్నాడు నరసింహాచార్యులు. తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి భోంచేసిన తర్వాత మడిబట్టి విప్పేసి తండ్రి కునుకు తీయడానికి తన గదిలోకి వెళ్తూ ఆ హైదరాబాద్ వాళ్లకి సంబంధం వద్దని కబురు పంపించేశాను అన్నాడు. 

"అలాగే నాన్న ఇంకా మీరు ఏ సంబంధాలు చూడకండి. నేను బావ ని పెళ్లి చేసుకుంటాను అంటూ తండ్రికి మనసులో మాట చెప్పేసింది సీత. అదేంటమ్మా ఇదివరకు అడిగితే ఇష్టం లేదు అన్నావు కదా! ఆ పౌరోహిత్యం చేసే వాళ్ళని చేసుకోను అన్నావు కదా! చూడు మా వృత్తిలో నిలకడగా ఉండే ఆదాయం రాదు. దానికి తోడు ఉద్యోగస్తుల్లాగా వేళపాళ ఉండదు. బొట్టు కట్టు అంతా కూడా సాంప్రదాయ బద్ధంగా ఉంటుంది. మమ్మల్ని చూసి కొంతమంది నవ్వుతూ ఉంటారు. సినిమాల్లో మా పాత్రని హేళన చేస్తూ చూపిస్తారు. అందరూ ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సులు చదవగలరు. లాయర్ గా రాణించగలరు. కానీ వేద పండితుడు కావాలంటే దైవ కృప ఉండాలి. 
నిజమైన సరస్వతీ కటాక్షం అంటే అదే. భక్తుల కన్నా గుడిలో పనిచేసే పూజారే చాలా అదృష్టవంతుడు . కారణం ఏమిటంటే గుడిలో ఉండే పూజారి ఎక్కువసేపు దేవుడి దగ్గర గడుపుతాడు. అంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది. పైగా జీవితం కూడా నియమాలు పెట్టుకుని జీవిస్తారు. 

విచిత్రం ఏమిటంటే ఈ రోజుల్లో సాంప్రదాయకమైన దుస్తులు ధరించి నుదుటన ఎర్రటి బొట్టు గుండు పిలక పెట్టుకుని పౌరోహిత్యం చేసే కుర్రవాళ్ళకి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. భౌతికమైన అందం చూస్తున్నారు కానీ దాని వెనుకున్న మంచి మనసుని ఎవరూ చూడటం లేదు. మన పూర్వీకులు వంశాన్ని చూసి పిల్లనిచ్చేవారు. ఇప్పుడు వంశం మాట దేవుడు ఎరుగు భౌతిక సంపదలు చూసి పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాలం పిల్లలకి ఎంత సేపు అమెరికా వేపే చూపు. ఊహల్లో తేలిపోతున్నారు. నువ్వు రామాచార్యులను వద్దన్నప్పుడే నేను ఈ విషయాలన్నీ నీకు చెబుదామనుకున్నా ను. ఎన్నాళ్ళకి నీ మనసులో చల్లటి మాట చెప్పావు . కానీ నీలోని మార్పు కి కారణం ఏమిటి?ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ అడిగిన తండ్రి ప్రశ్నకి

 "నాన్న మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు. కానీ నాకు డబ్బు మీద అంతగా కోరిక లేదు. ఉన్నదానితో సంతృప్తిగా ఎలా జీవించాలో మీ పెంపకంలో చాలా నేర్చుకున్నాను. నాకు ఎవరినో పెళ్లి చేసుకుని నేను ఎక్కడో చాలా దూరంగా ఉంటే మీ పరిస్థితి ఏమిటి. 
మీ ముసలి వయసులో మిమ్మల్ని చూసుకోవడానికి వేరే వ్యక్తి ఎవరు లేరు.ఆ వచ్చినవాడు మిమ్మల్ని ఆదరిస్తాడని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే అతనికి కూడా నాలాగే బాధ్యతలు కూడా ఉండొచ్చు.ఈ రెండు బాధ్యతల్ని సమానంగా నిర్వర్తించే స్తోమత అతనికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ వచ్చేవాడికి మనతో రక్తసంబంధం ఏమి ఉండదు. కేవలం తెచ్చిపెట్టుకున్న బాధ్యత మాత్రమే. 
నేను ఎక్కడో అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ మిమ్మల్ని ముసలితనంలో చూడకుండా వెళ్ళిపోతే ఇంక కూతురిగా నా జన్మకు సార్ధకతలేదు. పైగా పెళ్లి లాటరీ లాంటిది. వచ్చేవాడు మనసున్న వాడు అయితే మంచిగా జీవితం సాగిపోతుంది. లేదంటే చెప్పేదేముంది. క్రిందట సంవత్సరం మా స్నేహితురాలు రమ పెళ్లికి వెళ్లాను గుర్తుంది కదా. పాపం మంచి ఉద్యోగస్తుడని అందంగా ఉన్నాడని వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంది. తీరా అబ్బాయికి లేని వ్యసనం అంటూ లేదుట. ఏడాది వరకు జీవితం సాఫీగానే జరిగింది. అప్పటి నుంచి మొదలయ్యాయి గొడవలు. మొన్ననే విషయం ఫోన్ చేసి చెప్పింది . అప్పటినుంచి నాకు తెలియని సంబంధాలు అంటే భయం పట్టుకుంది. నాకైతే బావని చేసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ మరి బావ మనసులో ఎవరున్నారో తెలుసుకుందామని అత్తయ్య ద్వారా అడిగించాను. పైగా ఈ ఊర్లో అత్తయ్య కుటుంబం ఎల్లవేళలా మనకి చేదోడువాదోడుగా ఉంటున్నారు. మనం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు.. మనం కూడా వాళ్లకు అవసరమైనప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం.
 ఈరోజుల్లో చాలామంది వియ్యాలవార్లు పెళ్లయిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలా ఉంది లోకం పరిస్థితి. పైగా బావ ఒక వేద పండితుడిగా రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. నాకు ఇంకేం కావాలి. మీ చివరి జీవితం హాయిగా గడిచిపోతుంది. ఇంకా పుట్టబోయే పిల్లల సంగతి అది దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. 

ఒకవేళ నేను సంబంధం చేసుకోకపోయినా నా తలరాత పిల్లల విషయంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవరు ఏది తప్పించలేరు. ఆ వంకతో రక్త సంబంధాలు పోగొట్టుకుంటున్నారు
అంటూ చెప్పిన కూతురు సీత మాటలు తలుపు చాటు నుంచి వింటున్న తల్లి సుభద్రమ్మ తండ్రి నరసింహ చార్యులు ఉప్పొంగిపోయారు. 

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం