నాటకం
నాటకం.
ఉదయం పది గంటలు అయింది.
అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రామరాజుకి ఎవరో ఇద్దరు మధ్య వయస్కులు స్కూటర్ మీద వచ్చి" నాటకాలు వేసే రామరాజు గారి ఇల్లు ఇదేనా అని అడిగారు. అవునండి మీరు అంటూ కుర్చీలోంచి లేచి నేనే రామరాజు ని అంటూ అరుగు మీదనున్న తాటాకుల చాప చూపించి కూర్చోమని చెప్పాడు రామరాజు. మేము సఖినేటిపల్లి నుండి వస్తున్నాము. మా ఊరిఅమ్మవారు సంబరాలకి శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించుదామని దానికోసం మిమ్మల్ని కలవడానికి మాట్లాడడానికి వచ్చాము అంటూ చెప్పారు.
ఏంటి బాబు మీరు చెప్పేది నిజమేనా! నేను కలగనటం లేదు కదా! అంటూ రామరాజు అయినా ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తున్నారు అండి. మీరు ఏదో పరాచకాలు ఆడుతున్నారు నాతో అన్నాడు. లేదండి మా ఊర్లో ఉన్న మీ పాత తరం వాళ్ళ కోరిక ప్రకారం ఈ నాటకం వేయించుదామని అనుకుంటున్నాం. నవతరానికి కూడా ఆ పాత ఆణిముత్యాలు లాంటి నాటకాలు అంటే అభిమానం పెరిగేలా చేయాలని సంకల్పించాం.ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈ లోగా మీరు రిహార్సల్స్ డ్రెస్సులు చూసుకోవాలిగా. అందుకనే ముందుగా చెబుతున్నాం.
అడ్వాన్స్ ఇచ్చి వెళదామని వచ్చాం అంటూ చెప్పిన ఆ యువకుల మాటలకి రామరాజుకి కన్నీళ్లు వచ్చే యి. ఎన్నాళ్ళు అయింది ఇలాంటి మాట విని. అప్పుడెప్పుడో సుమారు 20 సంవత్సరాలు క్రితం ఏ ఉత్సవాలనికైనా ముందు ఇలాంటి మాటలే వినబడేవి. అసలు ఎవరు ఇంతకాలం నుంచి గుమ్మం తొక్కిన పాపానిపోలేదు. నాటకం అనే పేరు వినలేదు. అందులో పౌరాణిక నాటకం. ఏమిటి మళ్ళీ కాలం తిరగబడుతో0దా! అనుకుంటూ ఆనందపడుతూ బాబు మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. అడ్వాన్సు వద్దు. మీకు ఏ విషయం ఒక వారం రోజుల్లో చెప్తాను. ఎందుకంటే ఇది పదిమందితో పని అంటూ చెప్పి ఆలోచనలో పడిపోయాడు రామరాజు.
ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోకుండా వెనకకు పంపేయడం ఇదే మొదటిసారి. అడ్వాన్స్ తీసుకునే ధైర్యం రామరాజుకు లేదు. ఒకప్పుడు ఆ ఊరినిండా నాటక సమాజాలే. ప్రతి ఇల్లు కళాకారుల నిలయమే. కొంతమంది రంగు పూసుకుని రంగస్థలం ఎక్కితే మరి కొంతమంది పాడిన పద్యానికి వాయిద్య సహకారాలు అందించే జనం. ఆ కాలంలో వాడే ఆయుధాలు గదలు బాణాలు కత్తులు ధరించే దుస్తులు ఇలా రకరకాల వాటిని అద్దెకిచ్చేవాళ్ళు ఆ ఊరి నిండా ఉండేవాళ్ళు.
రామరాజు తండ్రి తాతల కాలం నుంచి ఆ నాటకం మీద ఆధారపడి జీవించే వాళ్ళు. చిన్నప్పటినుంచి తండ్రి నటించే పాత్రలు చూసి వేసుకునే రంగులు ధరించే దుస్తులు చూసి మోజు పడి డిగ్రీ చదువును మధ్యలో ఆపేసి తండ్రి వారసత్వం నిలబెట్టాడు రామరాజు.
దానికి తోడు ఆరడుగుల భారీ విగ్రహం. అందమైన గిరజాల జుట్టు. శ్రావ్యమైన గొంతు. దానికి తోడు కొద్దిగా నేర్చుకున్న సంగీతం, సంభాషణలు స్పష్టంగా పలకగలిగే సామర్థ్యం అన్నిటికన్నా మించి ఆసక్తి రామరాజుని ఎక్కడికి వెళ్ళనీయకుండా ఆ కళామతల్లి తన ఒడిలోనే ఉంచేసుకుంది.
అబ్బో ఆ రోజుల్లో నాటకాలు అంటే చాలామందికి ఆసక్తి కాకుండా ప్రేక్షకులు కూడా గంటల తరబడి కూర్చుని నాటకాలు చూసేవారు. రాగయుక్తంగా పాడిన పద్యాలకి వన్స్ మోర్ అనేసరికి నాటకం అయ్యేసరికి తెల్లవారిపోయేది. ఎన్నెన్ని పాత్రల్లో జీవించాడు. రాముడిగా కృష్ణుడిగా హరిచంద్రుడిగా దుర్యోధనుడిగా జీవించాడు.
ఒకప్పుడు తాతలనాటి ఆ ఇంట్లో ఒక మూల గదిలో పద్యాలు ఎప్పుడు వినపడుతూ ఉండేవి. భారీ సంభాషణలు తో గది మారు మ్రోగి పోయేది. గదినిండా ఎక్కడపడితే అక్కడ దుస్తులు రకరకాల నాటక సామగ్రి ఉండేది.
చాలా సందడిగా ఉండే ఆ గది మూగ పోయింది. కానీ గత వైభవానికి సాక్ష్యంగా పెచ్చులు ఊడిపోయిన గది గోడల మీద రకరకాల ఫోటోలు ఫ్రేములు ఊడిపోయి వ్రేలాడుతున్నాయి. అద్దాల బీరువాలో పోటీలో సాధించిన పతకాలు, వెండితో చేసిన బహుమతులు షావుకారి కొట్టులో చేరిపోగా మిగిలినవి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి.
ఆ నాటక సమాజంలోని సభ్యులు ఏ వేళలో ఇంటికి వచ్చిన ఆదరించి కడుపునిండా అన్నం పెట్టే ఆ డొక్కా సీతమ్మ గారి వారసురాలు ఆమె పేరు కూడా సీతమ్మే . రాత్రి వేళలో కూడా పొయ్యి వెలిగించి తేనీరు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడి భర్తని నాటక సమాజ సభ్యులని ప్రోత్సహించే రామరాజు సతీమణి కూడా కనుమరుగైపోయింది. రామరాజు తండ్రి కామరాజు కూడా ఏడాదికి మూడు వందల రోజులు పాటు ఆంధ్రదేశం అంతటా నాటకాలు ఆడి ఐదు ఎకరాలు భూమికి రామరాజుని యజమానిని చేస్తే నాటక సమాజంలోని సభ్యులందరిని తన సొంత బిడ్డల్లా చూసి చేతి ఖర్చులు పెట్టుకొని నాటకాలను ఎవరు ఆదరించకపోయిన కొద్దిరోజులు ఆడించి ఉన్నదంతా ఊర్చి ఇదిగో ఇలా ఆ పాడుబడిన ఇంటికి యజమానిగా మిగిలాడు. గత వైభవం చూసుకొని మురిసిపోవడం తప్ప ఇంక ఏముంది.
ఎక్కడెక్కడో పల్లెటూర్లలో నాటకాలకు పిలిచేవారు. సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. రెండు ఎడ్ల బండిలో ఆ సామానంత తీసుకుని ఆ పల్లెటూరుకి వెళుతుంటే ఆ బండి వెనక నాటకాల వాళ్ళు వచ్చారు అంటూ బండి కూడా పిల్లలు, అరుగుల మీద నుంచి పెద్దలు, వీధి గుమ్మం లో నుంచి స్త్రీలు తొంగి చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపించేది రామరాజుకి. అలాంటి గౌరవం ఒక కళాకారుడికి తప్పితే వేరే ఎవరికీ ఉండదు.
బండి దిగిన వెంటనే చుట్టూ జనం చేరి నాటకం ఎన్ని గంటలకు మొదలుపెడతారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు. అలాగే ఒక్కొక్క ఊర్లో ప్రత్యేకమైన భోజనాలు, ఎంతో గౌరవం , మేకప్పులు వేసుకుంటూ ఉంటే తలుపు సందులో నుంచి చూసే కుర్ర కారు ని చూస్తే చాలా ఆనందంగా అనిపించేది. వేసుకునే పాత్రను బట్టి కొంతమంది ఉపవాసాలు కూడా ఉండేవారు. కొంతమంది చాలా నియమనిష్టలతో ఆహార నియమాలు పాటించేవారు. రాత్రి 7 గంటలకు మొదలైన నాటకం తెల్లవారులు వన్స్ మోర్ ల తోటి చప్పట్లు తోటి నడిచేది . ఒక్కొక్క పాత్రధారి శ్రావ్యమైన గొంతులో పద్యాలు పాడుతుంటే మైకులు అవసరం ఉండేది కాదు. స్త్రీ పాత్ర ధరించిన మగవారిని చూసి రంగస్థలం మీద నిజంగా ఈమె స్త్రీ ఏమో అని అనుకునేవారు.
ఎవరు గొంతుతో వారే సంభాషణలు కానీ పద్యాలు కానీ పాడుతూ ఉంటే నిజంగా ఆ పాత్రలు చెప్పినట్టుగానే ఉండేవి. అప్పట్లో నాటకం చివరి వరకు ప్రేక్షకులు ఎవరు కదలకుండా మెదలకుండా నాటకం చూసి ఆనందించేవారు. చివర్లో చదివింపులు మెడలో వేసిన రూపాయలు దండలు చూసి ఆ పాత్రధారులకి ఎంతో ఉత్సాహ o వచ్చేది. ఆఖరిలో కమిటీ సభ్యులు చెప్పిన ఉత్సాహపూరితమైన మాటలు మరింత ఆనందాన్ని ఇచ్చేవి. వారిచ్చిన ఉత్సాహంతో రాత్రంతా నాటకం ఆడిన బడలిక తీరిపోయేది. అలా ఆంధ్రదేశం అంతటా ఈ నాటక సమాజానికి పేరు ప్రఖ్యాతలు వచ్చి కాలం కొట్టిన దెబ్బకి ప్రజల అభిరుచి మారి ఇదిగో ఇలా నాటకం అరుగు మీద చతికిల పడిపోయింది.
ఇంతలో ఆత్మ రాముడు ఆకలి ఆకలి అంటూ కడుపులోనుంచి గొడవ పెడుతుంటే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి అలా బజారులోకి బయలుదేరాడు రామరాజు. జేబులో బరువు చూసుకుని దానికి తగినట్లుగా ఆత్మ రాముడిని సంతృప్తిపరిచి ఊరిలోని తన నాటక సమాజం సభ్యుల ఇంటి దారిపట్టాడు. ముందుగా అప్పట్లో అందరికంటే చిన్న వయసులో ఉండి అర్జునుడు పాత్రలు వేసే వీరన్న ఇల్లు ఎక్కడ కనబడలేదు. ఆ ఇంటి స్థానంలో అందమైన మేడ కనబడింది. ఎప్పుడో ఇల్లు అమ్మేసి ఈ నగరం విడిచి వెళ్లిపోయారని చెప్పారు. ధర్మరాజు పాత్రధారి కామరాజు కిళ్ళి కొట్టు యజమాని అయ్యి ఒక్కరోజు కొట్టు కట్టేస్తే నష్టాన్ని భరించలేనని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో నాటకాలు ఆడి ఇప్పుడు మళ్లీ దానివేపు చూడాలంటే చేతిలో ఉన్న పనిని వదిలేసుకోవాలి. ఆ నాటక రంగం మధ్యలో మమ్మల్ని పస్తులు ఉంచింది. ఇప్పుడు ఈ హోటల్ ని నమ్ముకుని హాయిగా కడుపునిండా తినగలుగుతున్నాo అంటూ భీమరాజు చెప్పిన మాటల్లో నిజం ఉందనిపించింది రామరాజు కి.
ఇప్పుడు ఏదో ఒకసారి అవకాశం వచ్చిందని మళ్లీ మళ్లీ అదే అవకాశం వస్తుందని నమ్మకం లేదు. ఖచ్చితమైన ఆదాయం లేదు. ఎన్నో రోజులు అవకాశం కోసం ఎదురుచూసి నిరాశ చెంది ఇదిగో ఇలా దొరికిన ఉద్యోగంలో చేరిపోయాను అన్నాడు దుర్యోధన పాత్రధారి. వాయిద్య సహకారం అందించే లవకుశలు ఊరు వదిలి టీవీ రంగంలోకి మారిపోయారు అని తెలిసింది.
అన్ని పాత్రలు వేయగలిగిన రామరాజు ఒక్కరే మిగిలాడు.
ఇంకేముంది బాగా అనుభవం ఉన్న నటులందరూ రంగస్థలం వదిలేసారు బతకలేక. అవకాశాలు లేక. ఆదరించేవారు లేక. ఇప్పటికిప్పుడు నటులను పుట్టించo లేము . రంగస్థలం మీద నటించి ప్రేక్షకులను మెప్పించడం నిజంగా ఒక వరం. పురాణాలలోని పాత్రలతో పౌరాణిక నాటకాల్ని , సమాజంలోని సమస్యలతో సాంఘిక నాటకాలు రెండింటిలో రక్తి కట్టించే నటులు ఉండేవారు ఒకప్పుడు. ఒకవేళ ఉన్న ఆ కళ మీద ఆధారపడి జీవించలేరు. నాటక సమాజాలన్నీ సమాజం ఆదరించక కనుమరుగైపోయేయి అని బాధపడుతూ రామరాజు ఇంటికి చేరాడు. అలా మూడు రోజులు గడిచేయి.
ఒక రోజు ఉదయం ఎవరో తలుపు గట్టిగా కొడుతుంటే తలుపు తీసిన రామరాజు ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణ రాయబారం లోని పాత్రధారులు అందరు కనిపించారు. ఒకరిద్దరు తప్ప. ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వచ్చి రామరాజు ఏమిటి అనుకోని మార్పు అని అడిగాడు. నాటకాలు లేని రోజుల్లో మాకు తిండిగడవని రోజుల్లో మమ్మల్ని ఆదరణగ చూసిన మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అంటూ వారు చెప్పిన మాటలకి ఆనందపడి చూడండి నటన అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అందులో రంగస్థలం మీద నటించే నటుడు నిజంగా చాలా గొప్పవాడు.
నిజ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆ పాత్రలో జీవించి ప్రేక్షకులని మెప్పిస్తాడు. ఏ కళకైనా ఈశ్వరానుగ్రహం ఉండాలి. కన్నతల్లికి ఆస్తి లేదని తల్లిని వదిలేయలేము కదా! అలాగే రంగస్థల నటులందరూ నాటక రంగాన్ని వదలకుండా ఉండి జీవించడానికి వేరొక వృత్తి మీద ఆధారపడాలి ప్రస్తుత పరిస్థితుల్లో. అంతకంటే చేసేది ఏమీలేదు అంటూ ఆ ఊరి వారికి కబురు పంపాడు రామరాజు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి