కార్తీక మాసం సందడి
కార్తీకమాసం సందడి
" ఏరా చిట్టి నీరసంగా ఉందా! పిల్లలు పాలు తాగొచ్చు రా మధ్యలో. అయినా మేం పెద్ద వాళ్ళు ఉంటున్నాం కదా మీకెందుకురా ఈ ఉపవాసాలు అంటూ మాటిమాటికి పేరుపేరునా పిల్లలందరినీ ఆ ప్రత్యేకమైన రోజున అడుగుతూ ఉండేది ఆ పిల్లల తల్లి సీతమ్మ. మామూలుగా అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక చిరుతిండి నములుతూ ఉండే పిల్లలకి ఆరోజు నోరు కట్టేసినట్లు ఉండేది. ఏవి తినడానికి వీల్లేదు. పిల్లలు ఉపవాసం ఉండాలనే రూలేమీ లేదు కానీ వాళ్లు సరదా కొద్దీ ఉపవాస ఉండేవారు.ఇంతకీ ఆ ప్రత్యేకమైన రోజు ఏమిటి ?కార్తీక సోమవారం. అసలు కార్తీకమాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజు.
కార్తీకమాసం వచ్చిందంటే చాలు బోల్డు హడావుడి ఇంట్లో. అమ్మ తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానం చేసి దీపాలు పెట్టుకోవడం. దగ్గర ఉన్న గుడిలో దీపాలు పెట్టడం. నాలుగు సోమవారాలు ఉపవాసాలు. నాగుల చవితి కార్తీక పౌర్ణ మి లక్ష పత్రి పూజలు కార్తీక సమారాధనలు వనభోజనాలు అబ్బ ఒకటేమిటి చాలా సందడిగా ఉండేది మా చిన్నతనాల్లో. పెద్ద వాళ్లతో పాటు పిల్లలు కూడా ఒకపక్క ఆకలి వేస్తున్న సరదాకి ఉపవాసాలు ఉండేవాళ్ళం. ఆకలి వేస్తుంది అని చెప్పడానికి మళ్లీ అహం అడ్డు వచ్చేది. పెద్దవాళ్లు పిల్లల పరిస్థితి మధ్యలో కనిపెట్టి వాళ్లే బలవంతంగా ఏదో ఒకటి తాగించేవారు. అదో సరదా.
సాయంకాలం నాలుగు గంటలు అయితే చాలు అమ్మ స్నానం చేసి మడి బట్ట కట్టుకుని వంట ప్రారంభించేది. అప్పట్లో అన్ని కట్టెల పొయ్యిలు. ఒకపక్క ఉపవాసo ఉంటూ ఇంతమందికి రకరకాల పదార్థాలు రుచిగా శుభ్రంగా తయారుచేసే ఆ తల్లులకే ఉపవాస పుణ్యం . మామూలుగా చేసే వంట కాదు అది. ప్రతి సోమవారం ఏదో ఒక స్వీట్ హాట్ స్పెషల్ . చీకటి పడిన దగ్గర్నుంచి నక్షత్ర దర్శనం ఎప్పుడు అవుతుందని ఎదురుచూడడం అదొక సరదా. సరదా ఏముందిలెండి. చిన్నపిల్లలం కదా ఆకలి దంచేస్తుండేది. మరొక పక్కన నీరసం. మధ్యలో అమ్మతోపాటు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని రావడం అదొక వింత అనుభూతి. మామూలు రోజుల్లో అయితే కొబ్బరిచిప్ప ప్రసాదం అక్కడే కొట్టుకుని తినడం అలవాటు. ఉపవాసం రోజున ముట్టుకోవడానికి వీల్లేదు. చాలా కష్టంగా ఉండేది. ఏదో తెలిసి తెలియని వయసు.
అమ్మ వంట చేసి కూర్చున్న నక్షత్రాలు కనపడకపోతే విస్తరి వేయడానికి లేదు. స్నానం చేసి మడిబట్టగట్టుకుని నక్షత్రాలు కోసం ఆకాశం వైపు చూడడం అది రాగానే దండం పెట్టుకుని ఆత్రుతగా అరిటాకు ముందు కూర్చుని ఇంక మాటల్లేవ్ ముద్ద దింపడమే. అరిటాకు భోజనం అంటేనే చాలా సరదా. ఆకుపచ్చటి అరిటాకులో వడ్డించిన రకరకాల పదార్థాలు చూడడానికి చాలా అద్భుతమైన బొమ్మలా కనపడేవి.
ఆకులో పదార్థాలు వడ్డించడం కూడా ఒక కళ. బహుశా ఏ చిత్రకారుడు అటువంటి బొమ్మ గీయలేడేమో. మూలన ఉన్న ముద్దపప్పు కమ్మని నెయ్యితో మొదటి ముద్ద తినిపించేది.
నోరు దురద పెడుతుందని భయపడిన కాస్తంత ఆవ పెట్టి బెల్లం కలిపి వండిన కంద బచ్చలి కూర తింటుంటే స్వర్గమే కనిపించేది. కొత్తిమీర వేసిన దప్పళం తెల్లగా మల్లె పువ్వు లాగమెరిసిపోతున్న పంచదార వేసిన పరమాన్నం ఒకపక్క పులిహోర ఆఖరి అంకం పెరుగు ఇలా భోజనం చేసి వచ్చిన తర్వాత అప్పుడు నిజంగా శివుడు కనపడేవాడు. ఇలా నాలుగు సోమవారాలు ఆనందంగా గడిచేవి. అయితే ఆకులోని పదార్థాలు మటుకు మారిపోయేవి. ఇక పిండి వంటలు అయితే చెప్పక్కర్లేదు.
ఇంక నాగుల చవితి పండగ అయితే చెప్పక్కర్లేదు. పిల్లలం ఉపవాసం ఉండే వాళ్ళం కాదు గాని ఇంట్లో ఉండే అమ్మలు తప్పనిసరిగా ఉపవాసం ఉండేవారు. మేము ఉదయమే లేచి స్నానం చేసి పొట్టలో ఏమి పోసుకోకుండా పుట్టలో పాలు చలిమిడి చిమిలి ఆ నాగేంద్రుడికి నైవేద్యం పెట్టి చెవులకి పుట్టమన్ను పెట్టుకుని దండం పెట్టుకునేవాళ్ళం. " ఈ నూకను నువ్వు తీసుకుని నీ మూకను మాకు ఇవ్వు తండ్రి అని దండం పెట్టుకునే వాళ్ళు పెద్దవాళ్లు.
సాధారణంగా సంతాన క్షేమం కోసం వివాహం ఆలస్యం అయినవాళ్లు పిల్లలు పుట్టని వాళ్ళు నాగేంద్రుడు గురించి ఎక్కువగా పూజలు చేస్తారు. ఆరోజు తోటలు దొడ్లు వీధులు అన్ని పుట్టల కోసం వెతుక్కునే ప్రజల తోటి సందడిగా ఉండేవి.
ఇంకా దీపావళి రోజున కాల్చగా మిగిలిన బాణసంచా కొన్ని ఆరోజు కాల్చుకునే వాళ్ళం. ఇంకేముంది ఆ రోజంతా చలివిడి చిమిలి అంతు తేల్చే వాళ్ళం. ఆ మర్నాడు సంగతి మీకు చెప్పక్కర్లేదు.
కార్తీక మాసo నెల రోజులు పవిత్రమైన రోజులైనప్పటికీ మరొక ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయడం దీపాలు వెలిగించడం పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట ఫలహారం చేయడం చంద్రుడికి చలిమిడి నైవేద్యం పెట్టడం శివారాధన సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ వింత అనుభూతులు. ఆ వెన్నెల వెలుగులో చంద్రుడు అందం చెప్పక్కర్లేదు. ఈరోజు శివుడికి విష్ణువుకి కూడా ప్రీతికరమైన రోజు. ఇకపోతే సాయంకాలం శివాలయంలో జ్వాలాతోరణం ఒక ప్రత్యేకత.
ఇది పార్వతి దేవి మ్రొక్కు.
వరిగడ్డిని ఒక పెద్ద తాడులా చేసి ఈ పక్క ఆ పక్క స్తంభాలు పాతి ఈ వరి గడ్డి తాడుని ఆ స్తంభాలకు కట్టి కాగడాతో ఆ తాడును వెలిగించి మూడుసార్లు పల్లకిలో పార్వతీ పరమేశ్వరులను ప్రదక్షిణం చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఆ గడ్డి తాడు పూర్తిగా వెలగకుండా లాగి పశువులకు పెట్టడం పుణ్యం గా భావిస్తారు.. శివాలయం ఉన్న ప్రతి చోట తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ పల్లకి మోయడం చాలామంది అదృష్టంగా భావిస్తారు. చంటి పిల్లలను చంకలో ఎత్తుకున్నప్పుడు ఒక రకమైన వింత అనుభూతిని పొందుతాం .సాక్షాత్తు ఈ జగతికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో ఎత్తుకొని ప్రదక్షణం చేయించడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేం.
ఇంకా కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఇంచుమించుగా ప్రతిరోజు లక్ష పత్రి పూజలు జరుగు తాయి శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం. వేద పండితులు లక్ష మారేడు దళాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు తోటి ఈ లక్ష పత్రి పూజ జరుగుతుంది. ఈ 11 మంది రుత్వికులు పగలు ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే భోజనం చేస్తారు. మధ్యాహ్నం పూట కొంచెం పలహారం తింటారు. మా పల్లిపాలెం గ్రామానికి పక్కనుండే నామవానిపాలెం గ్రామం లో ఉండే క్షత్రియ కుటుంబాలన్నీ కలిసి మా గ్రామంలో ఉండే వ్యాసేశ్వర స్వామి వారికి ప్రతి ఏట లక్ష పత్రి పూజ చేయించి మా ఇంట్లో అందరికీ కార్తీక సంతర్పణ చేసేవారు. ఆ రోజుల్లో గాడిపొయ్యిలు పెద్ద పెద్ద గుండిగలు తో వంటలు. ఆ గాడి పొయ్యిలు చాలామందికి ఈ రోజుల్లో తెలియవు. మా తరం వాళ్లకు తప్పితే.
ఆ సందడి ఆప్యాయత ఆ వంటల రుచులు ఆ పదార్థాలు ఆ అభిమానాలు ఈరోజుల్లో కనపడవు. అందరూ కలిసికట్టుగా ఒకచోట ఏదైనా కార్యక్రమం జరిగితే సహాయం చేయడం నవ్వుతూ ఆప్యాయంగా వడ్డనలు చేయడం ఇప్పటి రోజుల్లో కనపడవు. ఎవరైనా మొహమాట పడతారేమో అని కొసరి కొసరి వడ్డించడం చాలా ఆనందంగా ఉండేది. ఇంకా వడ్డ న చేసే పాత్రల పేర్లు కూడా విచిత్రంగా ఉండే వి. నెయ్యి వడ్డించడానికి కొమ్ము చెంబు, పప్పు వడ్డించడానికి గోకర్ణం, అన్నం, బూర్లు వడ్డించడానికి తాటాకు బుట్టలు, పులిహార కలపడానికి అన్నం ఆరబెట్టడానికి తాటాకు చాపలు ఇప్పుడు అవన్నీ లేవు. మరొక వింత అనుభవం బూరి మధ్యలో గుంటలా చేసుకుంటే అందులో కొమ్ము చెంబు తోటి నెయ్యి వడ్డించేవారు.ఒక వరుసలో కూర్చున్న వాళ్లు అందరి భోజనం అయితే కానీ ఎవరూ లేచే వారు కాదు. ఆఖరున గోవింద నామస్మరణతో బంతి లేచేది.
ఈ రోజుల్లో పిక్నిక్లు అంటున్నారు. ఏదో విహార యాత్ర స్థలాలకు నదీ తీరాలకి వెళ్లి భారీ ఎత్తున పండగ జరుపుకోవడం ఈ రోజుల్లో ఆచారం. అన్ని ఆధునికమైన వంటకాలతో భోజనం. ఆటలో పాటలు డాన్సులు ఇది ఈనాటి సరదా.ఆ రోజుల్లో కూడా తోటల్లో ఉసిరి చెట్టు కింద కుటుంబాలన్నీ కలిసి భోజనాలు స్వయంగా వండుకుని పిల్లలతోటి బంధువుల తోటి ఆటపాటతోటి కాలక్షేపం చేసి సాయంకాలం పూట ఇంటికి చేరే వాళ్ళం. సాధారణంగా ఇది పిల్లలకి సెలవు రోజుల్లోనే ఉండేది. ఎంతో సరదాగా ఉండేది. కుటుంబాల మధ్య ఆత్మీయత పెంచేది
ఇంకా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం పూట తులసి మొక్కకు పూజ చేసి చుట్టూ దీపాలు వెలిగించి అటుకులు బెల్లం కొబ్బరి ముక్కలు కలిపిన ప్రసాదం దక్షిణతో కలిపి ఇచ్చేవారు. ఆ రాత్రి అందరి ఇళ్లకు వెళ్లి ప్రసాదాలు తెచ్చుకుని తిని ఎన్ని డబ్బులు వచ్చాయో లెక్కపెట్టుకునేవాళ్లం. అదొక సరదా. కార్తీకమాసం అంటేనే ఏ వీధి చూసినా ఏ దేవాలయం చూసిన ఏ ఇల్లు చూసినా దీపాల వెలుగులో కళకళలాడుతూ ఉండేది.
ఆ రోజుల్లో ముసలి వాళ్లు నెల రోజులు పాటు ఒంటిపూట భోజనం చేసేవారు.
ఇంకా ఆఖరి రోజున అరటి డొప్పలలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించి కాలువలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ ఆఖరికి పళ్లెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ దీపాలు పెట్టి పోలిని స్వర్గానికి పంపించడంతో కార్తీక మాసం సందడి ముగిసేది. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికి ఆనందమే.
రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి