పెళ్లి దొంగ
పెళ్లి దొంగ
"
అయ్యా సోమేశ్వరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి. అన్నిచోట్ల వెతికాము. ఆరోజు లెక్క కట్టి అప్పచెప్పాము మీకు .వీటి ఖరీదు మీరు భరించవలసిందే. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో వీటి ఖరీదు తగ్గించుకుంటాము అంటూ కన్యకా పరమేశ్వరి సత్రం గుమస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లు అయింది సోమేశ్వరావుకి.
ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఈ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు. బయట పని వాళ్ళు ఎవరూ రాలేదు.మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మగ పెళ్లి వారు ఆ మాట పైకి అనడానికి వీలు లేదు. మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడుతా రు.
అవును ఆ ఇత్తడి గ్లాసులు దుక్కల్లా ఉన్నాయి. పెళ్ళి వారి విడిదిలోకి కాఫీ కోసమని మంచినీళ్ల కోసం అని పంపించిన గ్లాసులు. బాగా గుర్తున్నాయి. ఏమిటో ఈ సమస్య. ఏమీ ఎవరిని అడగడానికి వీలులేదు. పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు.
మగ పెళ్లి వారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రం అంతా ఎప్పుడు తిరుగుతూనే ఉండేవారు. ఎక్కడ స్థిమితంగా ఒక గంట కూడా కూర్చున్న పాపాన పోలేదు. ఎప్పుడు వాళ్ళని వెతుక్కోవడమే.
మరి వాళ్ళు ఎవరో ఏమిటో. అలా అని ఎలా అనుమానిస్తాం. సరేలే పెళ్ళిలో ఇలాంటి నష్టాలు మామూలే అని కన్యాదాత సోమేశ్వరరావు డబ్బులు కట్టేసి బయటపడ్డాడు. అయినా ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత కన్యాదాతకి ఇటువంటి నష్టాలు మరీ భారం. ఏం చేస్తాడు పాపం. అలా బాధపడుతూ పెళ్లి అనుభవాలన్నీ నెమర వేసుకుంటూ ఒకపక్క బాధ్యత తీరిందని ఆనందంగానూ మరొక పక్క ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది అని బాధతోను నిద్ర పట్టలేదు సోమేశ్వరరావు కి.
సోమేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిరుద్యోగి. నలుగురు ఆడపిల్లల తండ్రి. పిల్లలందరినీ పెద్ద చదువులు చదివించకపోయిన నౌకరీ లో ఉన్నప్పుడే బాధ్యతలు తీర్చుకోవాలని గబగబా సంబంధాలు చూసి అందరికీ పెళ్లిళ్లు చేశాడు. ఇదిగో ఇప్పుడు జరిగిన పెళ్లి ఆఖరి అమ్మాయి పేరు రత్నం. గుణం కూడా రత్నమే. పెళ్ళికొడుకు చాలా పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన వాడని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని మంచి గుణవంతుడు అని తండ్రి చెబితే ఈ కాలం పిల్లల కాకుండా పెళ్లికి ఒప్పుకుంది రత్నం. పెళ్ళికొడుకు ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు అనుకుంది.
మగ పెళ్లి వారు ఆస్తిపరులు కాకపోయినా గౌరవ మర్యాదలు కల కుటుంబం అని మర్యాద కోసం ఎక్కువ తాపత్రయపడతారని తెలుసుకొని తాహతుకు మించిన డబ్బు ఖర్చుపెట్టి ఆ ఊరిలో ఉన్న మంచి సత్రం విడిది కింద ఏర్పాటు చేసి ఎక్కడ మర్యాదలకు లోటు లేకుండా చూసి పెళ్లి జరిపించాడు
ఊరి వాళ్ళ అందరిదీ ఒక ఎత్తు ఉలిపిరి కట్టది ఒక ఎత్తు అనే సామెత లాగా ఆ వచ్చిన పెళ్లి వాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు బహుశా పెళ్లి వారికి దూర బంధువులు అనుకుంటా ఎప్పుడూ గదిలో కూర్చోకుండా ఆ సత్రం అంతా తిరుగుతూనే ఉన్నారు. ఏమిటో వాళ్లు విచిత్రంగా అనిపించారు. మళ్లీ ఒక్కొక్కళ్ళు నలుగురు పిల్లలతో సహా మరీ వచ్చారు.
అలా అన్ని తంతులు ముగిసిన తర్వాత పెళ్ళి వారి బస్సు ఎక్కి తరలి వెళ్లి వెళ్ళిపోతూ రేపు జరిగే సత్యనారాయణ వ్రతానికి తప్పకుండా మీరు మీ బంధువులు రండి అని మాటిమాటికీ చెప్పి బస్సు ఎక్కేసారు మగ పెళ్లి వారు.
అలా మగ పెళ్లి వారి ఆహ్వానం మేరకు మర్నాడు భార్యను తీసుకుని మగ పెళ్లి వారి ఇంటికి వెళ్లిన సోమేశ్వరరావు ను సాదరంగా ఆహ్వానించారు. అక్కడ కూడా ఇదే తంతు ఆ ఇద్దరు ఆడవాళ్లు అలాగే హడావుడిగా తిరుగుతూ కనిపించారు. సత్యనారాయణ వ్రతం ముగిసింది. ఊరి సంతర్పణ కూడా ముగిసింది.
అయితే ఆ ఇత్తడి గ్లాసులు మాట మటుకు భార్య కూడా చెప్పలేదు సోమేశ్వరరావు. అయితే సోమేశ్వరరావు ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఉండబట్ట లేక మీది ఏ ఊరు అండి అని పలకరించాడు. మాది రాజమండ్రి అని హడావిడిగా సమాధానం ఇచ్చారు.
ఇంతలో పెళ్ళికొడుకు తల్లి ఎవరో ఆవకాయ కుండ బద్దలు కొట్టేశారు ఆవకాయ వంటిల్లు అంతా కారిపోయింది. కుండ నిండా ఉండాలి ఊరగాయ. ఏమైందో ఏమిటో అని గట్టిగా మాట్లాడుతున్న మాటలు వినిపించేయి సోమేశ్వరరావుకి.
ఎవరంటే ఎవరని మొహ మొహాలు చూసుకుంటున్నారు పెళ్ళివారు.
పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ప్రయాణాలు మొదలుపెట్టారు. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఎడ్ల బండి మీద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్తే కానీ బస్సు ఎక్కలేరు. వీధిట్లో రెండు ఎడ్లబండ్లు ఆగి ఉన్నాయి. బంధువుల మర్యాదలో భాగంగా ఒక్కొక్కరి సామాన్లు బండి ఎక్కిస్తున్నారు పనివాళ్ళు. అలా రెండు పెట్లు మాత్రం బరువుకి బండి మీద పెట్టలేక మధ్యలోనే క్రిందకు జారవిడిచారు. ఇంకేముంది తాళం ఊడి సామాన్లన్నీ బయటపడ్డాయి. తళ తళ మెరిసిపోతున్న ఇత్తడి గ్లాసులు తలో మూలకి పరుగులు తీసేయి. క్యారేజీ లో ఉన్న ఎర్రటి ఆవకాయ నేల మీద పడి సిగ్గు పడింది. అంతేకాదు మిఠాయి ఉండలు నేల మీద బంతుల్లాగా దొర్లిపోయే యి.
ఈ పెట్టెలు ఎవరివండి? అంటూ అరుస్తున్నారు పనివాళ్ళు. తేలు కుట్టిన దొంగల్లాగా ఆ ఇద్దరు ఆడవాళ్లు తల దించుకుని నడుచుకుంటూ వచ్చారు. ఇంతలో పెళ్లికొడుకు తండ్రి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు పెట్లో ఇన్ని గ్లాసులు ఉన్నాయ్ ఏమిటి అంటూ ఆ గ్లాసులన్ని ఒకదాంట్లో ఒకటి పెడుతూ ఒక్కసారి ఆ గ్లాస్ మీద ఉన్న కన్యకా పరమేశ్వరి దేవి సత్రం అనే పేరు చూసి ఆశ్చర్యపడిపోయాడు.
ఇదేమిటి పెళ్లి జరిగిన సత్రం కదా ! అంటే వీళ్ళు ఈ పను లేవి మానలేదన్నమాట అనుకొని ఏమి మాట్లాడకుండా ఆ గ్లాసులన్నీ ఒక సంచిలో పెట్టి లోపలికి తీసుకెళ్లిపోయాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సోమేశ్వరరావు గబుక్కుని అటువైపు చూడడం మానేసి బాగుండదని చెప్పి అక్కడే ఉన్న పేపర్లోకి తల దూర్చాడు.
గత అనుభవం కొద్దీ ఆవకాయ కూడా వీళ్ళిద్దరే తీసి ఉంటారని
ముందుగానే ఊహించి చెప్పిన భార్య మాటలు కొట్టి పడేసిన సంఘటన గుర్తొచ్చింది పెళ్ళికొడుకు తండ్రికి. ఎప్పుడైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు ఆవకాయ మిఠాయి ఉండలు ఎవరికి పనికిరాకుండా అయిపోయేయి. అయిన వాళ్ళు అయ్యుండి ఇలాంటి పనులు చేయడం ఏమిటి? అసలు పెళ్లి అనేది చాలామందికి మంచి సమయం ఇలాంటి దొంగతనాలు చేయడానికి అనుకుని వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడ్డాడు పెళ్లి కొడుకు తండ్రి.
అయినా ఆడపిల్ల వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మాటవరసకైనా గ్లాసులు పోయాయని చెప్పలేదు .పాపం డబ్బులు కట్టుకునే ఉంటారు. పరాయి చోటుకు వెళ్ళినప్పుడు మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఎవరిని కష్టపెట్టకూడదు. మన గౌరవం మన నిలబెట్టుకోవాలి. ఇక జీవితంలో ఏ పెళ్ళిళ్ళకి వీళ్ళని పిలవకూడదు అనుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి.
మరునాడు ఉదయం ఊరికి బయలుదేరుతున్న పెళ్లికూతురు తండ్రిని పిలిచి మా వాళ్లు చూసుకోలేదు మా సామాను తో పాటు ఈ గ్లాసులు కూడా వచ్చేసేయి. ఏం అనుకోకండి అంటూ ఆ గ్లాసులు సంచి అందించాడు పెళ్ళికొడుకు తండ్రి.
ఏమీ పరవాలేదు లెండి ఎవరికైనా జరుగుతుంది పొరబాటని అన్నాడు పెళ్లికూతురు తండ్రి.
ఆ తరం వాళ్లు కాబట్టి అలా గౌరవంగా ఆ సమస్యను పరిష్కరించారు ఇరు కుటుంబాలు వారు. కానీ ఈ రోజుల్లో అయితే కయ్యానికి కాలు దువ్వుతారు వెంటనే .
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి