నగరంలో మా ఊరు
నగరం లో మా ఊరు
ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు అయింది. వాలు కుర్చీలో పడుకుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు రామారావు మాస్టారు. ఇంతలో పక్కన రింగ్ అవుతున్న మొబైల్ ని తీసి ఎవరిదో నెంబర్ అని చూశాడు. అమెరికా నుంచి డాక్టర్ శేఖర్ ఫోన్. రామారావు మాస్టర్ దగ్గర పదవ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి చదువులో బాగా తెలివితేటలు ఉన్న శేఖర్ అంటే రామారావు మాస్టా రు కి చాలా అభిమానం. అందుకే ప్రత్యేక శ్రద్ధతో శేఖర్ కి చదువు చెబుతూ ఉండేవాడు ఒక ట్యూషన్ మాస్టర్ గా. పదవ తరగతి తర్వాత శేఖర్ ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకొని డాక్టర్ కోర్స్ చదివి పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు శేఖర్
శేఖర్ ది రామారావు మాస్టర్ ది ఇద్దరిదీ ఒకటే ఊరు. అది కోనసీమలోని చిన్న పల్లెటూరు. మాస్టారికి ఆ ఊరు అంటే చాలా ఇష్టం. మాస్టర్ కి మొక్కలంటే చాలా ఇష్టం . ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ ముక్కలు పెంచుతూ ఉండేవారు మాస్టారు. ఎప్పుడూ పిల్లలకి ఆ మొక్కల మధ్య కుర్చీ వేసుకుని చాప మీద పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్తుండేవారు. మాస్టారి ఇల్లు ఒక గురుకులంలా అనిపించేది పిల్లలకి. ఆ తర్వాత వయసు మీద పడడంతో మాస్టారు హైదరాబాదులో ఉండే తన కొడుకు దగ్గరికి, శేఖరు పై చదువులు కి అమెరికా వెళ్లిపోవడం వలన ఊరికి దూరమయ్యారు.
అయినా మాస్టారంటే అభిమానం కొద్ది శేఖరు రెండు నెలలకి ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. అలా శేఖర్ దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో ఫోను వచ్చి అప్పుడే నాలుగు నెలల పైన అయింది. మాస్టర్ ఫోన్ ఎత్తి హలో శేఖర్ ఈ మధ్య ఫోన్ చేయట్లేదు ఏమిటి? బిజీగా ఉన్నావా! ఆరోగ్యం బాగానే ఉందా! అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. లేదు మాస్టారు! ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్నాను హైదరాబాదులో. ఇది మొదలుపెట్టి అప్పుడే రెండు సంవత్సరాలయింది . అందుకే కాస్త బిజీ బిజీగా ఉన్నాను.
రేపు భీష్మ ఏకాదశికి దాని ప్రారంభోత్సవం. మీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలి అంటూ చెప్పుకొస్తున్న శేఖర్ మాటలకు మధ్యలో అడ్డుతగులుతూ ఆ ప్రాజెక్టు ఏమిటి ?అంటూ అడిగిన మాస్టారు ప్రశ్నకి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దురుగాని! సస్పెన్స్! మాస్టర్ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను . వచ్చే ఆదివారం కాస్త ఖాళీ చేసుకోండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసాడు శేఖర్.
అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. డాక్టర్ శేఖర్ కార్ లో వచ్చి రామారావు మాస్టర్ ని ఎక్కించుకుని సుమారు ఒక రెండు గంటల సేపు ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు దగ్గరికి ఇద్దరూ చేరారు. ఎదురుగా ఉన్న గేటు దగ్గర పైన బోర్డు చూసి ఇదేమిటి ఇది ఏదో పెద్ద కంపెనీ అనుకున్నాను. తీరా పేరు చూస్తే
"నగరంలో మా ఊరు" అని ఉంది. ఇదేదో విచిత్రంగా ఉంది ప్రాజెక్టు అని అనుకుని లోపలికి ఇద్దరు అడుగు పెట్టారు.
గేటు దగ్గర నుంచి పెద్ద తారు రోడ్డు మీద కొంత దూరం నడిచేసరికి ఎదురుగుండా ఒక అమ్మవారి గుడి కనిపించింది. దాని పక్కనే ఒక చెరువు. ఇంతలో ఒక బ్యాటరీ కారు వారిద్దరు ముందు వచ్చి ఆగింది . ఇద్దరూ బ్యాటరీ కార్ ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్లేటప్పటికీ చుట్టూ వరి వేసిన పొలం,చుట్టూ గట్టు,గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలు , తాడిచెట్లు ఆ గట్టుమీద తాటాకులతో వేసిన పాక ,ఆ పాకలో పశువులు కనబడ్డాయి.ఒకసారి రామారావు మాస్టర్ కి తన సొంత ఊరు గుర్తుకొచ్చింది.
ఆ పక్కనే పెద్ద మండువా ఇల్లు బయట పెద్ద అరుగులుతో కనపడింది. ఆ మండువా ఇల్లుకి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ లోపల అన్ని రకాల మొక్కలు అచ్చు ఊర్లో ఉన్న తన ఇంటి లాగే అనిపించింది మాస్టారికి. ఇల్లంతటినీ తనివి తీరా చూసుకుని బయటకు వచ్చి మళ్ళీ బ్యాటరీ కారు ఎక్కి కొంత దూరంగా వెళ్ళేటప్పటికి ఒక పెద్ద ఖాళీ ప్రదేశం అందులో ఒకచోట గోలీలు ఆడుకునే ప్రదేశం అని బోర్డు పెట్టి అక్కడ రకరకాల గోళీలు గాజు సీసాలతో పెట్టి ఉన్నాయి.
చిన్నప్పుడు గ్రామాల్లో పెరిగిన ప్రతి పిల్లలు ఆడుకునే ఆట. ఒకరు మట్టిలో ఒక గోళీని పెడతారు. మరొకరు దాన్ని కొంత దూరం నుంచి మళ్లీ ఇంకొక గోళీతో దానిని కొట్టాలి . అలా కొట్టగలిగినవాడు ఆ గోళీనీ గెలుచుకుంటాడు. అలా ఆట అయ్యేసరికి ఎవరికి ఎక్కువ గోళీలు వస్తే వాళ్లు గెలిచినట్లు. ఒక్కసారి బాల్యం గుర్తుకొచ్చింది మాస్టర్ కి.
అలా నడుచుకుంటూ ముందుకు వెళ్లేసరికి " కర్ర బిళ్ళ" ఆడుకునే స్థలము అనే బోర్డు కనబడింది. ఒకచోట మోచెయ్యి అంత పొడవున్న కర్ర ముక్కలు దాని పక్కనే ఇంచుమించుగా మూడు అంగుళాలు పొడవున్న కర్ర ముక్కని రెండు వైపులా పదునుగా చెక్కి పెట్టారు. మోచెయ్యి అంత పొడవైన కర్ర ముక్కని చేతిలోకి తీసుకుని రెండు వైపులా ఉన్న కర్ర ముక్క నేల మీద పెట్టి సూదిగా ఉన్న వైపు కొడతారు. అది గాలిలోకి లేస్తుంది . గాల్లోకి లేచిన కర్రముక్కని చేతిలో ఉన్న కర్ర ముక్కుతో బలంగా కొడతారు. అది దూరంగా ఎక్కడికి వెళ్లి పడుతుంది. ఎవరు దూరంగా కొడితే వాళ్లు గెలిచినట్టు. దాన్ని చూసిన వెంటనే ఈ ఆటలో కన్ను పోగొట్టుకున్న తన స్నేహితుడు సుందర రామయ్య గుర్తుకొచ్చాడు రామారావు మాస్టర్ కి.
అలాగే చెమ్మచక్క ఆట, గచ్చకాయలాట, తొక్కుడు బిళ్ళ ఆట , అష్టాచమ్మా ఆటల గురించి , అవి ఎలా ఆడాలో చక్కగా ఒక నల్ల బోర్డు మీద పెయింట్ తో వ్రాయించిన బోర్డు కనపడింది మాస్టర్ కి. " మర్చిపోయిన ఆటలు మళ్లీ ఆడదాం" అని అక్కడ ఉన్న సందేశం చూసి మాస్టర్ కి ఆనందం వేసింది.అవును ఈ ఆటలన్నీ పిల్లలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్లు కంప్యూటర్ గేమ్స్ టీవీల మీద కూర్చుని శారీరక శ్రమ లేకుండా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు పిల్లలు అనుకున్నాడు మాస్టారు.
ఆ పక్కనే సైకిల్ టైర్లు వరుసగా కొన్ని కర్ర ముక్కలు పెట్టి ఉన్నాయి. పిల్లలు చిన్నప్పుడు ఈ సైకిల్ టైర్లు కర్రతో కొట్టుకుంటూ ముందుకు దొర్లించి ఊరంతా బలాదూర్ చేసేవారు.
అప్పట్లో పిల్లలకది అద్భుతమైన ఎక్సర్సైజ్.
ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉయ్యాల, అలాగే కబడ్డీ ఆట , దొంగ పోలీస్ ఆట లు ఆడుకోవడానికి స్థలం కూడా కనబడ్డాయి మాస్టర్ కి . ఈ ఆటల యొక్క నియమ నిబంధనలు ఎలా ఆడతారు అనే ప్రశ్నకు సమాధానాలు కూడా అందంగా బోర్డు మీద వ్రాసి పెట్టారు అక్కడ. ఈనాటి పిల్లలు ఎవరైనా సరే దీనిని సందర్శిస్తే ఇట్టే ఈ ఆటలను నేర్చుకుంటారు అనుకున్నాడు మాష్టారు.
ఆ పక్కనే ఉన్న తాటాకు ఇంట్లో పూర్వకాలం ఇంట్లో వాడే వస్తువులు హరికెన్ లాంతరు ,బ్యాటరీ లైటు, గుబ్బ గొడుగు, కిర్రు చెప్పులు, పెట్రో మాక్స్ లైటు ఇవన్నీ పేర్చి ఉన్నాయి . ఆ తాటాకుల పాకలో అడుగుపెట్టిన రామారావు మాస్టర్ కి లోపల అలనాటి గ్రామీణ ఆహార పదార్థాలు రాగి సంకటి ,గంజి, చద్దన్నం , పొట్టిక్కలు, అక్కడ మట్టి పాత్రలో రెడీగా ఉన్నాయి. ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉన్నాయి. వాకిట్లో రోలు రోకళ్ళు, తిరగలి, కవ్వం, రుబ్బురోలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. ఒకసారిగా గతంలో ఉపయోగించిన ఆ వస్తువులు చూడగానే మాస్టర్ కి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది.
అలా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఒక పెద్ద తోట అందులో రకరకాల చెట్లు, చెట్ల మీద ఏవేవో పక్షులు, తోటలో అక్కడక్కడ సిమెంట్ బెంచీలు వేసి ఉన్నాయి. మధ్య మధ్యలో గిలకబావి కనబడింది.
ఇవన్నీ నా చిన్నతనాల్లో ఉపయోగించేవాళ్ళం అని సంబరపడిపోయాడు మాష్టా రు.ఈ ప్రదేశం చిన్నప్పటి ఊహల్ని స్వచ్ఛమైన జీవితాన్ని చూపించిందని నవ్వుకున్నాడు
రామారావు మాస్టారు.
ఈ మహానగరంలో రకరకాల మ్యూజియంలు , జంతు ప్రదర్శనశాలలు, వాటర్ పార్కులు ఉన్నాయి. కానీ ఇటువంటి సాహసం ఎవరు చేయరు. మన ఊరు మీద నీ అభిమానానికి చాలా ఆనందించాను . కానీ చాలా డబ్బు ఖర్చు పెట్టి చేశావు. ఏమిటి నీకు లాభం? అని అడిగిన ప్రశ్నకు శేఖర్ సమాధానం ఇవ్వలేదు. నవ్వుతూ వేదిక దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు మాస్టారు ని. ఆ వేదిక చూస్తే ఒక్కసారి నవ్వు వచ్చింది. మన పల్లెటూర్లో ఒకప్పుడు ఉండే రచ్చబండ. అప్పటికే ఆహుతులు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు.
శేఖర్ సభకి మాస్టర్ ని పరిచయం చేసి తన ప్రాజెక్టు గురించి చెప్తూ నాది కోనసీమలోని ఒక పల్లెటూరు. మా ఊరు గురించి చెప్పాలంటే బాపు గారి బొమ్మల ఉంటుంది.
గోదావరి నది లాంటి స్వచ్ఛమైన మనసులు , స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన తిండి, చుట్టూ కంటికి ఇంపైన పచ్చటి వాతావరణం చాలాహాయిగా ఉండేది నా చిన్నతనం. అలాంటి ఊరు ఈ ప్రాజెక్టు పెట్టడానికి ఒక కారణమైతే ఇంకొక ముఖ్య కారణం చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు. మా తల్లి ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంత వాడిని చేసింది. చివరికి ఊరు విడిచిపెట్టి వెళ్లడానికి ఇష్టం లేక అక్కడే ఆఖరికి తనువు చాలించింది. నాకు మా ఊరి జ్ఞాపకాలే కుటుంబం గా మిగిలేయని ఆవేదనంగా చెప్పాడు శేఖర్.
నేను చదువులు కోసం ,ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లిపోయాను. నాలాగే ఎంతోమంది పొట్ట చేత పట్టుకుని ఊరు వదిలేసి వచ్చేసారు. నగరంలో జీవనం రోజురోజుకి ఒత్తిడిగా మారిపోయింది. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. చుట్టూ రకరకాల ఆకర్షణలు. రకరకాల భయాలు. అంతా పోటీ ప్రపంచం.
ఈ వాతావరణంలో పిల్లలు, పెద్దలు మానసికంగా ఎంతో అలసిపోతున్నారు. అటువంటివారు సేద తీరడానికి పల్లెటూరు అంటే ఇష్టం ఉన్నవారికి అటువంటి అనుభూతి పొందడానికి ఈ "నగరంలో మా ఊరు" ప్రాజెక్ట్ నిర్మించాను. మనలాంటి వాళ్లకి చిన్నప్పుడు పల్లెటూర్లో గడిపిన రోజులు గుర్తు చేసే ప్రదేశం ఇది.
పిల్లలకి నగరాల్లో దొరకని అనుభవాలను ఇక్కడ అందించాలని అనుకుంటున్నాం. ఆటలు ,సాంప్రదాయ వంటలు పల్లెటూరి జీవనశైలి ఇవన్నీ నగర జీవన శైలిలో నశించిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఒక జీవవంతమైన అనుభవంగా మార్చాలని మా ఉద్దేశం అని వివరించాడు శేఖర్.
రామారావు మాస్టారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పెట్టడం ఎంతో ఖర్చుతో కూడిన ఎంతో సాహసోపాతమైన చర్యగా వర్ణించి నా శిష్యులు ఎంతోమంది అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు.అయినా చిన్నప్పుడెప్పుడో పెరిగిన పల్లెటూరును ఒక ప్రాజెక్టుగా మార్చి ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా శేఖర్ మారతాడని నేను అనుకోలేదు
ఎప్పుడు. ఇప్పటికి పుట్టి పెరిగిన ఊరు అంటే అందరికీ చాలా అభిమానం. అలాంటి ఊరిని నగరంలో పెరిగే పిల్లలకి దగ్గర చేసే ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా శేఖర్ వదలలేదు. కోనసీమ అంటే గోదావరితో ముడిపడి ఉంది.ఇదే గోదావరి నదిని ఇక్కడికి తీసుకు రాలేడు కాబట్టి గోదావరి నది పుట్టిన ప్రదేశం నుంచి కోనసీమ అంతటా ఎలా ప్రవహిస్తుందో అంతా బొమ్మల్లో చూపించాడు. వివరంగా వ్రాసి పెట్టాడు. చాలా సంతోషించాను ఈ ప్రాజెక్టు చూసి అంటూ మాస్టారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అందరికీ చెరుకు రసం, పనస తొనలు, ఇచ్చి సభను ముగించారు.
శేఖరు రామారావు మాస్టర్నీ తగిన రీతిలో సత్కరించి కారులో ఇంటిదగ్గర దించడానికి బయలుదేరుతుంటే గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఎడం చేతి పక్కన చిన్నప్పుడు సినిమా హాళ్లల్లో ఉండే కౌంటర్ లాగా వరుసగా నాలుగు కౌంటర్లు పక్కనే పెద్ద పెద్ద బోర్డులు వాటి మీద టికెట్ వివరాలు, బ్యాటరీ కారుకి అదనంగా చార్జీ, లోపల తినుబండారాలకు అదనపు రుసుము వివరంగా వ్రాసి ఉన్నాయి. ఇందాక మాస్టారుకి శేఖరుని అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది ఇప్పుడు. పుట్టి పెరిగిన ఊరు ప్రాజెక్ట్ అయిపోయింది. సంపాదనకు మార్గం చూపించింది. ప్రజలకి కొత్తదనం చూపించింది. ఏది ఎలా ఉంటే ఏమిటి మరొక్కసారి ఆ పల్లెటూరి జ్ఞాపకాలను రుచి చూశానని ఆనందపడ్డాడు మాస్టారు.
రామారావు మాస్టర్ ఇంటి దగ్గర కారు దిగుతూ నాకు మళ్ళీ మన ఊరు చూడాలనిపిస్తోంది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి