నన్ను వదిలి ఉండగలవా
"నన్ను వదిలి ఉండగలవా!
మనమందరం ఎలాగా బందీ అయిపోయాము. బందీ అయిపోయామంటున్నారు. దేనికో చెప్పకుండా సందేహం పెంచారు. సాధారణంగా బందీలు అనే మాట వ్యసనానికి సరిపోతుంది. నిజమే నాకు కూడా ఒక సందేహం .ఇది వ్యసనమా కాదా. అవునని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదని చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి.
ఎక్కడో జపాన్లో పుట్టి జగమంతా వ్యాపించింది. అది లేకపోతే మనకు జరుగుబాటు లేకుండా ఉంది. మనం అత్యధికంగా ప్రేమించే వస్తువుల్లో ఇది కూడా జేరిపోయింది.
ఎక్కడో మూలగా నడవలో బల్ల మీద కూర్చుని సమాచారాన్ని మోసుకొచ్చే ఆ యంత్రాన్ని పడగొట్టేసి సాంకేతికంగా ఎదిగిపోయి చిన్న బొమ్మగా చేతిలో చేరిపోయి సమాచారాన్ని ఇట్టే మోసుకొస్తోంది, తీసుకుపోతోంది. సమాచారంతోపాటు మన సరదాలు కూడా తీరుస్తోంది. సమయం చెబుతోంది. పది పైసలు ఖర్చు లేకుండా మన ప్రతిబింబాలన్నీ క్షణాల్లో చూపిస్తోంది.
ఆ బుజ్జిముండ మీద మీకు ఎందుకు అంత కోపం? రోజు మీ బంధువుల స్నేహితుల పిల్లల క్షేమ సమాచారం తీసుకొస్తోంది కదా అని సమర్థించే వాళ్ళు ఇది వ్యసనం కాదని ఓటేశారు. ఇంకా అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇది లేకపోతే ఒక క్షణం విడిచి ఉండలేని పరిస్థితి. కనపడకపోతే కాలు గాలిని పిల్లిలా తిరుగుతాము. మనసంతా అయోమయం. ఎవరో పిలుస్తున్నారని గుర్తుగా వచ్చే ధ్వని మన గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది.
మన జీవితం అంతా దానిలోనే ఉంది. మన ఆరోగ్య పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితినీ అందులో పెట్టుకుని నిశ్చింతగా మనం దానిని జేబులో పెట్టుకుంటున్నాం.
ఇది మన జేబులో చేరి ఫోన్ డైరీ ని, డైరెక్టరీని దూరం పెట్టేసింది అవసరమైనప్పుడల్లా స్నేహితుల బంధువుల నంబర్లతో పాటు ఫోటోలు కూడా చూపిస్తోంది.
ఇదివరలో జేబు నిండా డబ్బు, ఖరీదు చేయవలసిన సామాన్ల లిస్టు పెట్టుకుని బజారుకు వెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఆ బుజ్జిముండ ఒకటి ఉంటే చాలు.
నేనుండగా మీకు ఎందుకు చింత అంటూ ఫోన్ పే లు, గూగుల్ పేలు మనకు అభయం ఇస్తే సామాన్ల లిస్టు ఫోటో వాట్సాప్ లో చూసుకుంటే బజారు పని అయిపోతుంది. దారి తెలియక కొట్టుమిట్లాడుతుంటే తనకు నచ్చిన దారిలో తీసుకెళ్లి గమ్యస్థానం చేరుస్తోంది.
పిల్లల అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న మన నటింట్లో ఉన్నట్టు మనం పని చేసుకుంటూ మాట్లాడడానికి అవకాశం కల్పిస్తోంది. భాగవత రామాయణ మహాభారత గ్రంథాలు చదువుకునే బామ్మగారు తాతగారికి యూట్యూబ్లో ప్రవచనాలు వినిపిస్తూ కాలక్షేపానికి అవకాశం ఇచ్చింది.
ప్రతి ఇంట్లో బామ్మ గది నాన్న గది పూజ గది అనే పేర్లు ఉన్నట్టే అమ్మ మొబైలు ,నాన్న మొబైలు,బామ్మ మొబైల్ ఇలాంటి పేర్లు రోజు వినపడుతున్నాయి. దాని పేరు మొబైల్ అయినా అది పట్టుకుని ఎవరికి మొబిలిటీ ఉండటం లేదు. అది ఉన్న చోటు నుంచి కదల నివ్వడం లేదు .
అందరి పేరున ఆస్తులు ఉన్నా లేకపోయినా చేతిలో మటుకు మొబైల్ ఫోన్స్ తప్పకుండా ఉంటున్నాయి. ఎవరికి ఫోన్ లేకపోతే వాళ్లు బుంగమూతి పెట్టేస్తున్నారు.
ఇంక యువతరం చెప్పక్కర్లేదు. రాత్రి పగలు దాంతోటే సహవాసం. వేలకు వేలు ఖర్చుపెట్టి గోడకు తగిలించిన ఆ బొమ్మల పెట్టినీ వదిలేసి ఈ చిన్నదాన్ని పట్టుకుని జేబులో పెట్టుకుని ఇష్టమైనవి ఇష్టమైన చోట కూర్చుని వీక్షించడమే కాదు అందమైన వన్ని ఫోటోలు తీసి పీకల మీదకు తీసుకువచ్చే సమస్యలకు కారణం అవుతోంది. రోజంతా కాలక్షేపం చేసేసి రోగాలు తెచ్చుకోవడమే కాదు జీవితం యాంత్రికం అయిపోతోంది అంటూ ఆ మొబైల్ ఫోన్ గురించి మంచి చెడ్డలు అందరూ చెప్పుకుంటూ వచ్చేసారు.
మేము ఇదివరకు పాలేరుని పిలవాలంటే పొలికేకలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు సెల్ లో పిలుస్తున్నాం. మా పని సులువు అయిపోయింది అంటున్నారు రైతులు. ఒక్కరోజు చెప్పా పెట్టకుండా నాగా పెడితే అమ్మగారు కోప్పడేవారు. ఇప్పుడు రాత్రిపూట చెప్పేస్తున్నాను అమ్మగారికి.
నా ప్రాణం హాయిగా ఉందంటుంది పని పిల్ల. పాలవాడు కూరగాయల వాడు పచారి కొట్టువాడు ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇది వచ్చాక మాకు ప్రాణం హాయిగా ఉందండి అంటూ ఆనందంగా చెప్పేస్తున్నారు.
బజార్లు అన్ని తిరగకుండా కావలసిన సరుకు ఇంటి దగ్గర తెచ్చిపడేస్తోందండి అంటుంది ఒక గృహిణి. ఇది వచ్చిన తర్వాత మా ఇంట్లో ఖర్చు పెరిగిందండి. అవసరమైనవి అనవసరమైనవి సామాన్లు పెరిగిపోయాయి కోరికలు పెరిగిపోయాయి అంటాడు బరువులు మోసే ఇంటి యజమాని. సినిమాలు షికార్లు వంటలు పెళ్లి సంబంధాల్ని సమస్తం చూపిస్తానంటోంది . నటింట్లో కూర్చుని విశ్వమంతా చుట్టి రావచ్చు అంటోంది .
అన్నీ బాగానే ఉన్నాయి. మరి బుజ్జి పిల్లల ఆట వస్తువుల్లో ఇది కూడా బొమ్మలా చేరిపోయి వాళ్ల మనసులను దోచేసుకుంది. ఆమధ్య ఒక ఫంక్షన్లో చూసాను. పట్టుమని యెనిమిది ఏళ్లు కూడా ఉండవు. బొమ్మతో ఆడుకుంటే పర్వాలేదు. సాక్షాత్తు ఆ సెల్లు తోటే కాలక్షేపం చేస్తూ కనపడ్డాడు. ఎవరితోటి మాట మంతి లేదు. మంచి చెడ్డ లేదు. ఇప్పటినుంచి వాడికి అదే పని. అలా ఉంది పిల్లల పరిస్థితి.
సాయంకాలం పూట అమ్మ వడి వదిలి ఆటలకు పరిగెత్తేవారు పిల్లలు. కానీ ఆ నీలి ప్రపంచం వాళ్లని బందీలు చేస్తోంది. కేరింతలు కొట్టే బాల్యాన్ని ఈ బుల్లి యంత్రం మంత్రం వేసి ఆపేస్తోంది. పిల్లల కళ్ళు ఎప్పుడు ఆ యంత్రం కోసం వెతుకులాడుతున్నాయి.
అమ్మ చెప్పే కథలు కన్నా ఆ బొమ్మ చెప్పే యూట్యూబ్ కథలు వైపు మొగ్గు చూపుతున్నారు. అక్షరాలు నేర్చుకోవాల్సిన సమయంలో ఆ నీల రంగు తెరతో ఆడుకుంటున్నారు. బొమ్మలతో ఆడే బాల్యం పోయి వీడియోలు చూసి నవ్వడం మొదలైంది. అమ్మ పెట్టే కితకితలకు నవ్వడం ఆపేసి ఆ బొమ్మతోనే అనుబంధం పెరిగిపోయింది.
స్నేహితుడు భుజం మీద చేతులు వేసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అమ్మ పెట్టిన తాయిలం కాకి ఎంగిలి చేసి పంచుకుంటూ నవ్వుకుంటూ తుళ్లుకుంటూ పరిగెత్తుతూ మనసుకు తోచిన పనులు చేస్తూ ఆనందంగా సాగే బాల్యం ఆ యంత్రంలో పలకరింపులకు మాత్రమే పరిమితమై పోయింది.
బిడ్డని చంకనెత్తుకుని ఊరువాడ తిప్పుతూ గోరుముద్దలు తినిపించే అమ్మ ఆ బుజ్జిముండ ఆశ చూపి చేతిలో పెట్టి బొమ్మలు చూపించి అన్నం తినిపిస్తోంది వాకిట్లో. ఇది మన బుల్లి యంత్రం బుజ్జిగాడిని చేస్తున్న మాయ.
ఆ మధ్య ఎప్పుడో పేపర్లో చదివాను. స్క్రీన్ టైమ్ తగ్గించండి . పిల్లల మానసిక రోగాలకి ఈ యంత్రం కారణమని పాపం ఒక డాక్టర్ గారు చెప్పారు.
ఏం చేస్తాం.
ఇంకా ఎన్ని మాయలు చేస్తుందో! గారడీలు చేస్తుందో! వేచి చూద్దాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి