సీతారాముల కళ్యాణం ఒక జీవన గుణపాఠం

సీతారాముల కళ్యాణం _ ఒక జీవన గుణపాఠం.

పెళ్లి… జీవితంలో మధురమైన ఘట్టం. ఇది రెండు మనసుల అనుబంధానికి ప్రతీక. కానీ కాలానుగుణంగా ఈ బంధానికి అర్థం మారిపోతూ వస్తోంది. పెళ్లిని ఒక వేడుకగా, ప్రదర్శనగా చూస్తున్నామే గానీ, దాని అంతరార్థాన్ని గుర్తించడం తగ్గిపోతోంది. 

ఈ సందర్భంలో సీతారాముల వివాహం మనకు ఎంతో విలువైన పాఠాలు నేర్పుతుంది.

"జానక్యా: కమలామలాంజలి పుటే యా: పద్మరాగాయితా:"

ఈ శ్లోకం లేకుండా వివాహ ఆహ్వాన పత్రిక పూర్తి కాదనిపించేంతటి మహత్యం దీని సొంతం. ఇది సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల ఘట్టాన్ని వర్ణించే అద్భుత కవిత్వం. సీతమ్మ వడిలో మెరిసిపోయే ముత్యాల తలంబ్రాలు ఎర్రని పద్మరాగ మణుల్లా, రాముడి తలపై మల్లెపూల్లా, ఆయన నీలమేఘ శ్యామ శరీరంపై ఇంద్రనీలాలా జాలువారినట్లు ఈ శ్లోకంలో వర్ణించబడింది. ఇది కేవలం ఒక శ్లోకం కాదు, ఒక మనోహర దృశ్యం!

పెళ్లిలో తలంబ్రాల ఘట్టం ఎంతో మధురం. పెళ్లికూతురు లజ్జతో తలవంచుకొని వరుడిపై తలంబ్రాలు పోయే దృశ్యం హృదయాన్ని హత్తుకునే అనుభూతి. కానీ ఈ ఘట్టం వెనుక ఉన్న అర్థాన్ని కొందరు మాత్రమే గుర్తించగలరు.

అంతరార్థంగా చూస్తే, తెల్లని ముత్యాలు చంద్రునికి ప్రీతికరమైనవి. ఆనాటి ఋషులు, జ్యోతిష్కులు దాంపత్య బంధం బలపడాలంటే చంద్రగ్రహ ప్రభావం మేలు చేయాలని భావించారు. అందుకే ముత్యాలను తలంబ్రాలుగా ఉపయోగించారు. కానీ నేటికాలంలో ఈ ఆచారం పసుపు కలిపిన బియ్యం, మరెక్కడో కొన్నింటిలో నవరత్నాలతో భర్తీ అయింది. మార్పు సహజమే, కానీ మార్పు వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రామాయణంలో రామచంద్రుడు సీతను చూసిన క్షణంలోనే ప్రేమించలేదు, ఆమె అభిప్రాయాన్ని అడగలేదు. సీతా స్వయంవరంలో జనక మహారాజు శివధనుస్సును విరచిన వారికే సీతను ఇచ్చిపెడతానని ప్రకటించారు. ఇది వరుడి శారీరక బలం పరీక్ష మాత్రమే. కానీ రాముడు కేవలం బలవంతుడేగాక, ధర్మబద్ధుడు, ఆదర్శనీయుడు. ఆయన తన జీవితంలో ఏ కష్టమైనా ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సీతమ్మను విడిచిపెట్టలేదు.

కాని నేటి పెళ్లిళ్లు? వధూవరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ప్రేమ సందేశాలు పంపుకుంటారు, తరచూ కలుస్తారు, అన్నీ అర్థం చేసుకున్నట్టు అనుకుంటారు. అయినా పెళ్లి తర్వాత చిన్న చిన్న మనస్పర్థలకే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకు?

• సహనం తగ్గిపోతోంది – ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే తపన తగ్గిపోయింది.
• స్వేచ్ఛా భావనలో అపార్థం – ఇద్దరు వ్యక్తులు తమ స్వేచ్ఛను వ్యక్తిగతంగా మాత్రమే అనుభవించాలనుకుంటున్నారు, భాగస్వామిగా కాక.
• ఆర్థిక స్వావలంబన – అనుబంధాలపై ప్రభావం – ఇద్దరు సంపాదిస్తుండటంతో ఓర్పు తగ్గిపోతూ, 'నాకు నచ్చకపోతే విడిపోతా' అనే ధోరణి పెరిగిపోతోంది.
• సాధారణ సమస్యలకూ విడాకులు – గతంలో దాంపత్య జీవితంలో ఒడుదొడుకులు సహజమేనని అర్థం చేసుకుని, ఓర్పుతో జీవించే వారు. కానీ ఇప్పుడు చిన్న తేడాకే విడిపోవాలనే ఆలోచన.
• 
సీతారాముల బంధం అనేక కష్టాలను ఎదుర్కొంది. రాజ్యభ్రష్టుడైన రాముని వెంట సీత వెళ్లింది. అరణ్యంలో దుర్భరమైన కష్టాలను అనుభవించింది. లంకలో బంధనాన్ని భరించింది. కానీ ఎక్కడా నిస్పృహ చెందలేదు. 

అదే విధంగా రాముడు కూడా తన బాధను తన భార్యపై చూపలేదు. నేటి తరానికి ఇదే గుణపాఠం. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం ముఖ్యం.

పెళ్లి అంటే కేవలం వేడుక కాదు. అది ఒక జీవన విధానం. ఒక్క రోజు తలంబ్రాలు వేసి నవ్విపోతే సరిపోదు, జీవితాంతం కలిసిమెలిసి ఉండే నిశ్చయాన్ని పాటించాలి. మధురమైన వివాహ జీవితం గడపాలంటే సీతారాములను ఆదర్శంగా తీసుకోవడం సముచితం.

పెళ్లి అనేది కుటుంబ వ్యవస్థకు, మన సంస్కృతికి మూలస్థంభం. దీనిని గౌరవంగా చూసి, ఒకరి కోసం ఒకరు జీవించాలన్న సంకల్పాన్ని కలిగి ఉండాలి. హఠాత్తుగా మనస్పర్థలు వచ్చాయంటే విడాకుల బాట పట్టడం కాకుండా, సహనం, పరస్పర అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించాలి.

నేటి సమాజంలో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఆ వైభవాన్ని ఆస్వాదించే స్థానం దాంపత్య జీవితానికి ఉండాలే కానీ, కోర్టు గదులకు కాదు. సీతారాముల బంధం మనకు నేర్పే గొప్ప పాఠం అదే!

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం