శంకర జయంతి

శంకర్ జయంతి 

భారతీయ తత్త్వశాస్త్రంలో విలక్షణమైన కీర్తిని సంపాదించిన ఆది శంకరాచార్యులు జన్మించిన రోజును శంకర జయంతిగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ఆయన జీవితం, సిద్ధాంతాలు, హిందూ ధర్మానికి చేసిన సేవలను స్మరించుకునే పవిత్ర సందర్భం.

శంకరుడి జన్మస్థలం మరియు బాల్యం:

ఆది శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలోని కాలడీ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. బాల్యంలోనే ఆయన మేధా సామర్థ్యం, భక్తి భావం ప్రసిద్ధి పొందాయి. తల్లి కోరిక మేరకు సన్యాసాన్ని స్వీకరించారు. ఇది ఆ కాలంలో అసాధ్యమైన నిర్ణయం. కానీ ధర్మపరిరక్షణే ఆయన లక్ష్యమైంది. వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి సాక్షాత్తు శివుడే శంకరాచార్యులుగా పుట్టారని గ్రంథాలు చెబుతున్నాయి. 

శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికీ భారతదేశంలో బౌద్ధ మత ప్రభంజనం ఎక్కువగా ఉంది . వైదిక కర్మలు మూతపడ్డాయి. అటువంటి సందర్భంలో ఈ శంకరుల జననం జరిగింది.

ఎనిమిది సంవత్సరముల వయసులోనే సన్యసించి సకల శాస్త్రాలను చదివి బిక్షాటన చేస్తూ జీవితం గడిపే శంకరులు ఒకసారి ఒక ఇంటి ముందుకి వెళ్లి బిక్ష అడుగుతాడు. ఆ ఇంటి ఇల్లాలు కడుపు పేదరాలు. ఇంట్లో నుంచి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి బిక్షగా ఇస్తుంది. అప్పుడు శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ కనకధారా స్తోత్రం రచిస్తారు. దానికి సంతుష్టి చెంది లక్ష్మీదేవి ఆ ఇంటిలో కనక వర్షం కురిపిస్తుంది. 

శంకరుడు నర్మదా నదీ తీరాన ఉన్న గోవిందపాదుని వద్ద శిష్యత్వం పొందాడు. అక్కడ ఆయనకు అధ్వైత తత్త్వంపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. అనంతరం ఆయన జీవిత లక్ష్యం – హిందూ ధర్మ పరిరక్షణకు దేశవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభమైంది.

శంకరాచార్యులు బోధించిన తత్త్వం "అహం బ్రహ్మాస్మి", "తత్త్వమసి" వంటి వాక్యాల ద్వారా స్పష్టమవుతుంది. ఆయన అనుసరించిన ఆధ్వైత వేదాంతం ప్రకారం, బ్రహ్మం ఒక్కటే, అది సత్యం. జగత్ మిథ్య. జీవాత్మ – పరమాత్మ భేదం లేదు అనే తత్త్వాన్ని ప్రచారం చేశారు.

శంకరాచార్యులు దేశంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలను స్థాపించారు:

1. శృంగేరి (కర్ణాటక) – దక్షిణాది పీఠం

2. పూరీ (ఒడిషా) – తూర్పు పీఠం

3. ద్వారకా (గుజరాత్) – పడమర పీఠం

4. జ్యోతిర్‌మఠ్ (ఉత్తరాఖండ్) – ఉత్తరాది పీఠం

ఈ మఠాలు వేదాధ్యయనానికి, తత్త్వప్రచారానికి కేంద్రాలుగా నిలిచాయి.

శంకరుని రచనలు:

శంకరాచార్యులు వ్రాసిన గ్రంథాలు తత్త్వవేత్తలందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా:

బ్రహ్మసూత్ర భాష్యం

భగవద్గీతా భాష్యం

ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు

భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి వంటి అద్భుతమైన స్తోత్రాలు

ఈ రచనలు వేదాంతాన్ని సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చేయడంలో కీలకపాత్ర వహించాయి.

ఉపసంహారం – శంకర జయంతి సందేశం:

శంకరాచార్యుల జీవితం మనకు ఓ మహత్తర సందేశం –
"ధర్మం, తత్త్వం, భక్తి, సేవ – ఇవన్నీ ఒకే దారిలో నడిపించే సాధనాలు."
వేధాంతం పరమ సత్యాన్ని తెలియజేస్తే, భక్తి దానికి మార్గం. శంకరాచార్యులు భక్తిని తత్త్వంతో ముడిపెట్టిన మహాత్ములు.

శంకర జయంతి సందర్భంగా మనం ఆయన్ను స్మరించుకోవడం, వారి ఉపదేశాలను ఆచరణలో ఉంచడం ద్వారా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా సమృద్ధిగా మార్చుకోవచ్చు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట