రాజమహేంద్రవరం

 రాజమహేంద్రవరం.


నేను ఎందుకు ప్రత్యేకo

ఎన్నిసార్లు పేర్లు మారినా 

నేను రాజరాజ నరేంద్రుని 

రాజధానినే

చరిత్ర ఎవరు చెరిపేయగలరు 


ఒకళ్ళ ఇద్దరా

ఎన్ని రాజవంశాలు 

నన్ను నడిపించాయో 


ఎంతో మంది కవులు 

ఎంతోమంది సంఘసంస్కర్తలు 

తీర్చిదిద్దిన సాంస్కృతిక రాజధానిని 

రాజమండ్రి ని 


గాలిలో ఎగురుకుంటూ వచ్చేవాళ్లు 

జాతీయ రహదారిపై రివ్వున 

దూసుకు వచ్చేవాళ్ళు 

చుకు చుకు బండి 

దిగేవాళ్లు 

షికారుగా బోటు లో  

రోజు ఎంతోమంది

అంతకంటే ముఖ్యం 

ఏ నగరానికి లేని అదృష్టం 

గలగల పారే గోదావరి 

నా పక్కన ఉండడం 


ఎప్పటి బిపిన్ చంద్రపాల్ 

ఇప్పటికీ గాలిలో ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది 

నా నగరంలోని పాల్ చౌక్ లో

అదేనండి కోటిపల్లి బస్టాండ్ 


బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినా 

కలెక్టర్ గారి పేరు మీదుగా నా నగరంలో  

ఇన్నిసుపేట మిగిలిపోయింది.


అక్కడ అందమైన పూల తోటలు లేవు.

మనసును మల్లెపూలలా మార్చే 

దివ్యజ్ఞాన సమాజం నాయకుడు 

ఆల్కాట్ పేరుతో ఏర్పడిన వీధి 

ఆల్కాట్ గార్డెన్స్


ఆ రామదాసు రామ భక్తుడు 

ఈ ఎడ్ల రామదాసు జానపద గాయకుడు 

పాటతో ప్రజల గుండెలను దోచి 

ఆ ఊరిలో ఆ వీధికి నామకరణంగా మిగిలిపోయాడు. 

అదే రామదాసు పేట. 


ఆర్యులు నివసించే ప్రదేశం 

ఆర్యాపురం.


ఒకరి కన్నతల్లి పేరు 

ఆ వీధికి పేరుగా నిలిచింది 

ఎందుకోసం 

ఆ నివాస స్థలం కాండ్రేగుల వంశం వారిది 

వారి తల్లి సీతమ్మ తల్లి.


అక్కడ నివసించే వాళ్ళు 

వలస వచ్చిన వాళ్ళు 

ఏ ఊరి నుండి ?

విశాఖపట్నం జిల్లా జామి నుండి 

కాలం జాంపేట గా మార్చింది. 


దాని చరిత్ర తెలియదు గానీ 

దానవాయిపేట అంటే అందరికీ తెలుసు 


నాగుల చెరువు అంటే 

పాములు ఉండవండి 

 అప్పట్లో నాగులు గారు చెరువు త్రవ్వించారు. 

ఇప్పుడు గవర్నమెంట్ వారు 

ఆటలాడుకునే ప్రదేశం గా మార్చారు 


 రంగరాజుపేట వెడితే

 రత్నం పెన్నులు కొనుక్కోకుండా

ఎవరు వెళ్లరు. 


ఆ మహానుభావుడు మంచి మనసుకు 

సాక్ష్యం వీరభద్రపురం 

ఇంతకీ ఎవరు ఆ మహా వ్యక్తి 

దువ్వూరి వీరభద్రరావు. 


రాజు గారి కోటలు కాలగర్భంలో

కలిసిపోయాయి

కానీ పేరు మాత్రం మిగిలింది 

అదే కోట గుమ్మం


ఇలా ఒకటా రెండా 

ప్రతి వీధికి ఒక చరిత్ర 

ప్రతి చెరువుకు ఒక జ్ఞాపకం 

గతించిన పెద్దలకు చేసే కర్మలకు 

కంభం సత్రం, కంబాల చెరువు 


నగరం పల్లెలకు పాకింది 

ఎన్నో కొత్త వీధులతో

అందంగా మారింది. 


ఈ దరి నుంచి ఆ దరికి చేర్చేది 

గోదావరి వారధి 

అది లేకపోతే మనకు ఏది దారి.


రైలు దిగుతినే గోదావరి మాత దర్శనం.

గలగల పారె గోదావరి కి ఒక నమస్కారం. 

చల్లని తల్లికి నిత్యం కర్పూర హారతి.


బ్రిటిష్ వాడు అయితేనేమి ప్రతిరోజు 

గోదావరి ప్రజలకు ఇంత అన్నం పెడుతున్నాడు.

అందుకే ఆయన గుర్తుగా 

కాటన్ దొర మ్యూజియం.

ఉన్నది ధవలేశ్వరంలో 


పరదేశీయుల వస్తువులు

చూడాలంటే పదండి

రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం కి

విజ్ఞాన శాస్త్రం విజయాలు చూడాలంటే 

ఆర్యభట్ట సైన్స్ మ్యూజియం చూడవలసిందే


వాళ్లు మనుషులే 

క్షణికావేశం వాళ్ళని అక్కడికి చేరుస్తుంది 

బయటకు వచ్చేది ఎప్పుడు 

అదే కేంద్ర కారాగారం.

ఉండేది రాజమహేంద్రవరం. 


నగరాన్ని చల్లగా కాపాడుతుంది 

నగర దేవత సోములమ్మ.

క్షేత్రపాలకుడు వేణుగోపాలుడు


చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది 

సారంగధర మెట్ట .

ఆ సారంగ ధరుడు కి మోక్షం ఇచ్చింది 

సారంగధీశ్వరుడు. 


భక్తుడేమో మార్కండేయుడు 

అజేయుడుగా నిలిపింది ఉమామహేశ్వరుడు 

అదే మార్కండేయ ఉమామహేశ్వరాలయం


ఇక్కడ నిత్యం భస్మాభిషేకమే 

అదే మహా కాలేశ్వరాలయం ప్రత్యేకం 


 స్వాతంత్ర సమరయోధులకు ఒక పార్కు

 కార్గిల్ సైనిక వీరులకు ఒక పార్కు

 చూడవలసిన ప్రదేశం 


తెలుగు సినీ దర్శకుడు ఆదుర్తి 

సంఘసంస్కర్త కందుకూరి 


అపర అన్నమయ్య గరిమెళ్ళ

ఆంధ్ర కేసరి టంగుటూరి


అందాల నటి సూర్య కుమారి 

చిత్ర కళాకారుడు దామెర్ల 


మన అక్క దుర్గాబాయి 

ఆదికవి నన్నయ్య 

ఆంధ్ర పురాణకర్త మధునా పంతుల 

నడయాడిన ప్రదేశం. 


ఎందరో కవులకు

 కళాకారులకు 

నటులకు

జన్మస్థలం 


గోదావరి నది మీద వంతెన 

పుష్కర్ ఘాట్, కాటన్ మ్యూజియం 

తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. :


అందుకే అంటారు—

రాజమండ్రి అనేది పట్టణం కాదు, పౌరాణిక ప్రాణం.

గోదావరి ఒడ్డున శ్వాసించే ఒక చరిత్ర.

ఒకటికి వంద కథల కలయిక,

వీధి పేరు వెనుక ఒక వ్యక్తిత్వం,

చెరువు వెనుక ఒక సమాజపు కళ.


ఇది నన్నయ్య అడుగుల గడప

కందుకూరి కలల తోట

ఆదుర్తి ఫ్రేములో నాటి సాంస్కృతిక శిల్పం

గరిమెళ్ల గాత్రంలో నూతన భారత గీతం


ఇది సాంస్కృతిక రాజధాని,

వీధులలో కవిత్వం ఊసెత్తుతుంది

చెరువులలో చరిత్ర ప్రతిబింబిస్తుంది

గోదావరిలో తల్లి స్పర్శ లభిస్తుంది


రాజరాజ నరేంద్రుని ఆశీర్వాదం

గోదావరి తల్లిగారి మాతృత్వం

ఈ రెండింటి మధ్య

పుట్టిన నగరం నా రాజమండ్రి


ఒకటే మాట—

రాజమండ్రి కాదు నా పరిచయం,

రాజమండ్రే నా గుర్తింపు.


రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట