మర్యాద
మర్యాద
పెళ్లి మండపం అందంగా మెరిసిపోతోంది. అది లక్షలు ఖర్చుపెట్టి చేయించిన కళ్యాణమండపం కాదు. అందంగా తోటలో దొరికే పూలు పళ్ళు కాయలతో తయారుచేసిన కళ్యాణమండపం. అదే పూల మండపం. సుముహూర్తం అయిపోయింది. ఆహ్వానితులంతా వధూవరులందరినీ ఆశీర్వదించారు. పంతులుగారి అనుమతి తీసుకుని కామేశ్వర రావుగారు భార్యతో కలిసి ఆహ్వానితులందరినీ పలకరించి వియ్యంకుడు గారి దగ్గరకు వెళ్లి" బావగారు శుభ ముహూర్తం అయిపోయింది కదా భోజనాలు ప్రారంభిస్తాం లేదంటే అందరూ వెళ్ళిపోతారంటూ చెప్పి వియ్యాలవారి పర్మిషన్ తీసుకుని తమ్ముడు నీ భార్యని పిలిచి వచ్చిన అతిథులకు స్నేహితులకి వియ్యాలవారికి బొట్టు పెట్టి భోజనానికి రండి అని గౌరవంగా పిలవండి ఎవరిని మర్చిపోవద్దు. చిన్నపిల్లలకు కూడా చెప్పాలి. ఇది మన ఆచారం అంటూ చెప్పి భోజనాల హాల్లోకి వెళతాడు కామేశ్వర రావు గారు భార్య సుందరితో కలిసి.
కామేశ్వరరావు గారు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న మన సాంప్రదాయాలకి ఆచారాలకి పూజలకి పునస్కారాలనీ బాగా గౌరవిస్తాడు. ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. అది పెద్దలను చూసి నేర్చుకున్నది. గుమ్మoల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిని నవ్వుతూ పలకరించి మంచినీళ్లు తాగుతారా అని అడగమని ఎవరు చెప్పరు.
అలాంటి సాంప్రదాయక కుటుంబంలో పుట్టిన వాడు కామేశ్వరరావు. అలా భోజనం హాల్లోకి వెళ్ళేటప్పటికి అప్పటికే టేబుల్ మీద అందంగా ముగ్గులు పెట్టి అరిటాకులు వేసి రెడీగా ఉన్నాయి. ముగ్గులు వియ్యాలవారి కోరిక. అతిధులందరూ ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. అతిధుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది నియమం నిష్ఠ ఉన్నవాళ్లు ఉంటారు. ఈమధ్య పెళ్లి భోజనాల్లో ఇటువంటివాళ్లు భోజనాలు చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ తరం వ్యక్తులకి ఆ బఫె భోజనాలు అంటే ఇష్టపడట్లేదు. వారు ప్లేట్ పట్టుకు వెళ్లి ప్రతి కౌంటర్ కి వెళ్లి అడిగి వేయించుకోవడం అనేది ఆ కాలం వాళ్ళకి నచ్చటం లేదు. మన ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా వెళ్తే మనకి చాలా బాధగా ఉంటుంది. అయినా ఇటు ఈ బఫే భోజనాలు వచ్చిన తర్వాత ఎవరు తింటున్నారో ఎవరు తినటం లేదో ఎవరికీ తెలియడం లేదు. దీనికి ఒక క్రమ పద్ధతి కూడా లేదు. ఒక క్రమ పద్ధతిలో వడ్డించడం కూడా లేదు. ఎవరికి ఇష్టమైన పదార్థం వాళ్ళు తినేయడమే. ఒకరి గురించి ఒకరు ఆగక్కర్లేదు. ఎవరి భోజనం అయిపోతే వాళ్ళు ప్లేటు అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. ఇది చాలామందికి నచ్చట్లేదు. మగ పెళ్లి వారు అంటూ అక్కడ ప్రత్యేకంగా ఎవరూ కనిపించరు. గుంపులో గోవిందమే. అందరూ ఒకేసారి వచ్చేసేప్పటికీ అందమైన డ్రస్సులు వేసుకుని టేబుల్ దగ్గర నిలబడి వడ్డించే వాళ్లకి కంగారు అయిపో తోంది. ఒక దానికి ఒకటి వడ్డించేస్తున్నారు.
అందులో అన్ని ఆధునికమైన వంటలే. మసాలాలతో కూడిన పదార్థాలు విపరీతమైన వాసనలు వేసి కొంతమంది కడుపులో తిప్పి అతిథులు చాలామంది భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అతిధులు అలా వెళ్ళిపోయిన సంగతి కన్యాదాతకి తెలియదు. ఎందుకంటే కన్యాదాత కి భోజనాలు సంగతి పట్టించుకునే అంత ఖాళీ ఉండదు. అంతా ఫోటోల తోటి వీడియోలు తోటే గడిచిపోతోంది.
ఆహ్వానితుల్లో అందరూ ఒకే రకమైన వాళ్ళు ఉండరు. చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఆరోగ్యం బాగా లేని వాళ్ళు నిజానికి వాళ్ళకి ఈ అధునాతన వంటకాలలో తినడానికి ఏమీ కనిపించదు ఒక గ్లాసుడు మజ్జిగ తప్పితే. నిజానికి అక్కడ 30 రకాల వంటకాలు ఉంటాయి . కన్యాదాతకి ఖర్చు కూడా బాగానే అవుతుంది. కానీ ఆహ్వానితుల్లో సంతృప్తి కనిపించడం లేదు.అయితే ఆ వంటకాలలో ఏ నూనెలు వాడతారో కానీ రుచిమటుకు బాగానే ఉంటుందని కుర్రకారు మధ్య తరగతి వారు కూడా రుచి చూద్దామని ముందుకి ఉరుకుతున్నారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత చాలామందికి ఆరోగ్యం బాగాలేదనే మాట వినిపిస్తుంది. కన్యాదాత ఎన్నిసార్లు చెప్పినా క్యాటరింగ్ వాడికి లాభాలే కావాలి. ఇలా ఉంది ఆధునికమైన ట్రెండు.
ఎందుకు బఫే భోజనాలు పెడుతున్నారు అనే విషయం ఆలోచిస్తే బల్లలు వేసి కూర్చోబెట్టి పెడితే వడ్డించే నాధుడు కనపడక అంటూ సమాధానం చెబుతున్నాడు కన్యదాత. ఆ మాట నిజమే అనిపించినా అయిన వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ క్యాటరింగ్ వాడిని వడ్డించే వాళ్ళు కూడా తెచ్చుకోమని అడిగి మన రిక్వైర్మెంట్స్ చెబితే అలా తెచ్చి వడ్డించేవాళ్ళు కూడా ఉన్నారు. అది కొంతవరకు హాయి అనిపిస్తుంది. ఏది ఏమైనా భోజనాలను మానిటర్ చేసే ఒక బాధ్యత గల వ్యక్తి అక్కడ లేకపోతే యజమాని పేరు పోతుంది. ఇది ఆ కన్యాదాతకి తెలుసు. కానీ చాలామంది మౌనంగా ఉండి పోతున్నారు. వంటల రుచి మన చేతుల్లో లేదు. కానీ మర్యాద అనేది మన చేతుల్లో ఉన్నది మాత్రమే. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి.
పూర్వకాలంలో చక్కగా నేలంతా అలికి ముగ్గులు పెట్టి నేల బల్లలు వేసి ఎదురగుండా అరిటాకులు వేసి భోజనాలు వడ్డించేవారు. ఒక బంతిలో అందరి భోజనాలు అయితే కానీ ఎవరూ లేచి వెళ్ళిపోయేవారు కాదు. భోజనాలు ప్రారంభించే ముందు భోజన కాలే హరినామస్మరణ అంటూ గోవిందా గోవిందా అని నామస్మరణ చేసి భోజనం ప్రారంభించే వారు. వడ్డన కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగేది. ఒకసారి బంతి భోజనం వైపు చూసి ఎవరు ముద్ద నోట్లో పెట్టుకోకుండా ఉన్నారో చూసి వారి దగ్గరకు వెళ్లి మీకేం కావాలి అని అడిగి మరి వడ్డించేవారు. చాలా నిదానంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేవి. ఎవరో తరుముకొస్తున్నట్లు వడ్డిస్తే తినే వాళ్ళు ఎలా తింటారు. మన పని అయిపోవడం కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా భోజనం చేయాలని ఆ రోజుల్లో అనుకునేవారు. ముందుగా పప్పు కలుపుకున్న తర్వాత కొమ్ముజారీ పట్టుకుని నెయ్యి వడ్డించే వాళ్ళు వరుసగా వడ్డించుకుంటూ వెళ్లేవారు. మళ్లీ తర్వాత కొంచెం పప్పు అంటూ మారు అడిగి తర్వాత కూరలు మళ్లీ కూరలు మారు అడిగి పులుసు వేసి ముక్కలు వెయ్యమంటారా అని ఆప్యాయంగా అడిగి వడ్డించేవాళ్ళు. ఈ విస్తర ముందు కూర్చున్న వాళ్లు ఏమి మొహమాట పడకుండా దుంప ముక్క ఉంటే వెయ్యండి అని అడిగితే పాపం అంత తొందరలోను కూడా దుంప ముక్క వెతికి వేసి ఆ అతిధిని సంతృప్తిపరిచేవాడు. అలా పిండి వంటలు దగ్గరకు వచ్చేటప్పటికి బూర్లోకి నెయ్యి వేసుకోండి అంటూ మళ్ళీ కొమ్ముజారీ పట్టుకు తిరిగేవారు.
పులిహార తినడం అయిపోయిన తర్వాత మజ్జిగలోకి అరటిపండు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. కొంతమందికి మజ్జిగ అన్నంలో స్వీట్ తినే అలవాటు ఉంటుంది. మరొక మారు బూర్లు బుట్ట పట్టుకుని అటు ఇటు తిరుగుతూ వడ్డించేవారు. అందరూ భోజనాలు చేస్తే గాని చేతులు కడుక్కోవడానికి ఎవరూ లేచేవారు కాదు. ఒకవేళ ఆలస్యంగా తినే వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు ఏమీ అనుకోకుండా నిదానంగా కూర్చునే వారు. ఇవన్నీ చిన్నప్పటినుంచి చూసి పెరిగిన కామేశ్వరరావు గారికి భోజనాలు బఫే కాకుండా కూర్చోబెట్టి పెట్టాలని కాస్తం నియమం నిష్ఠ ఉన్నవాళ్లని ప్రత్యేకంగా ఒక బల్ల మీద కూర్చోబెట్టాలని అనుకున్నాడు.
ఒకవేళ ఇది ఎవరికైనా కోపం వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. ఆహ్వానితుల అందరి తృప్తి నూతన దంపతులకు నిజమైన ఆశీర్వాదం అని భావించి భోజనాలు హాలు గుమ్మం దగ్గర నిలబడి అయ్యా తప్పుగా అనుకోకండి మీలో ఎవరైనా నియమం నిష్ట ఉన్న వాళ్ళు ఉంటే మీకోసం ప్రత్యేకమైన బల్ల ఏర్పాటు చేశాము అంటూ ఆ బల్ల వైపు చేయి చూపించాడు. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు. మీరందరూ సంతృప్తిగా భోజనం చేయడం నాకు కావాల్సింది అంటూ ముందుగానే చెప్పేసాడు. అలా నియమం నిష్ట ఉన్నవాళ్లు ఒక వరుసలో కూర్చున్నారు. వడ్డనలు ప్రారంభం అయ్యాయి. పప్పుతో ప్రారంభమైన పదార్థాలు పనసకాయ కూర కంద బచ్చల కూర కొబ్బరికాయ పచ్చడి ముక్కల పులుసు అప్పడాలు వడియాల బూర్లు పులిహార పెరుగు తప్పితే ఒక మసాలా వాసన ముక్కుకి తగల్లేదు. ఆ పదార్థాలు చూసేటప్పటికి అతిధులకి చాలా ఆనందం వేసింది.వడ్డన పూర్తి అయిన తర్వాత పాత పద్ధతిలో హరినామ స్మరణ తోటి ప్రారంభమైంది. అలా కామేశ్వరరావు గారు భార్య తో కలిసి ప్రతి వరసకి తిరుగుతూ ఆప్యాయంగా పలకరించి అన్ని అందుతున్నాయా అని గౌరవం అడిగి చివరగా గోవింద నామస్మరణతో సీట్లోంచి లేచి చేతులు కడుక్కుని వచ్చిన వారికి అక్కడ టేబుల్ మీద ప్లేట్లో ఆకు చెక్క సున్నం డబ్బా పెట్టించాడు. ఇది చూసి నవ్వుకుని పూర్వం ఇలాగే పెట్టేవారు అనుకుంటూ కావలసిన వాళ్లు ఆకులు తీసుకుని నములుతూ కొంతమంది వక్క నములుతూ ఆనందంగా బయటపడ్డారు.
ముఖ పరిచయం లేని వాళ్ళని పదార్థాలు ఎలా ఉన్నాయి అని అడిగితే ఈ మధ్యకాలంలో ఇటువంటి భోజనం చూడలేదని చెప్తే ముఖస్తుతికి చెబుతున్నారు ఏమో అని అనుకుని చాలామంది నోటి వెంట ఇదే మాట వినపడడంతో కామేశ్వరరావు గారు ఆనందపడ్డారు. అలా వంటగదిలోకి వెళ్లి కనకయ్య తాతకి నమస్కారం చేశారు. అలా కామేశ్వరరావు గారి దంపతులు భోజనం అయ్యేటప్పటికి సాయంకాలం ఐదు గంటలు అయింది.
నాన్న మేమందరం ఫోటోలు తీసుకున్నాం. నువ్వు ఎక్కడా కనపడలేదు. ఏ ఫోటోలోను నువ్వు లేవు అంటూ పెళ్లికూతురు బుంగమూతి పెడితే కామేశ్వర రావు గారు మనసులో నవ్వుకున్నాడు. వీళ్ళకేం తెలుసు కుర్రకారికి పెళ్లంటే వీడియోలు ఫోటోలు కళ్యాణ మండపాలు అని మాత్రమే తెలుసు. ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఈ రెండు మాటలు కొత్తగా వచ్చి పడ్డాయి మన ప్రాణానికి. ఇంకా ఇక ముందు ఏమొస్తాయో. ఇవి ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో. అసలు సాంప్రదాయాలు పద్ధతులు పోయాయి.
పెళ్లి బాగా చేశారని చెప్పడానికి డబ్బు ఖర్చు పెడితే కుదరదు. డబ్బు ఎవరైనా ఇస్తారు. అప్పు చేసి తెచ్చుకోవచ్చు. కానీ మర్యాద మాట ఏమిటి? ఊరికే బ్యాండ్ మేళాలు పెట్టేసి అయిన వాళ్ళని కాని వాళ్ళందర్నీ పెళ్లిళ్లకు పిలిచి మండపంలోకి వచ్చిన వాళ్ళని పలకరించే నాధుడు లేకపోతే వాళ్ళంతట వాళ్ళు స్వయంగా ఆశీర్వచనాలు చేసేసి ఇంటికి వెళ్లి పోతున్నారు. భోజనాలు రెడీగా ఉన్నాయని ఎవరూ చెప్పకపోవడంతో. అంత పెద్ద పెద్ద కళ్యాణ మండపాలలో డైనింగ్ హాలులు ఎక్కడ ఉన్నాయో తెలియక కొంతమంది తిక మక పడుతున్నారు. ఇలా ఉంది అతిథి పరిస్థితి.
వచ్చిన అతిధుల్ని వియ్యాలవారిని ఆనందంగా ఆహ్వానించి గౌరవించి అన్నపూర్ణాదేవిలా కడుపు నింపి పంపించడమే పెళ్లి మర్యాద.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి