పాపం సత్తయ్య
పాపం సత్తయ్య !
ఉదయం నుంచి కుండ పోతగా వర్షం పడుతోంది. రోడ్డు మీద ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు. అప్పుడే నిద్ర లేచిన సత్తయ్య గబగబా గొడుగు వేసుకుని తన రేకుల షెడ్డు దగ్గరికి పరిగెత్తాడు. ఒక్కసారిగా ఆ రేకుల షెడ్డులో ఉన్న బొమ్మలు చూసేటప్పటికి సత్తయ్య గుండె గుభేలు మంది. ఆ రేకుల షెడ్ లో పూర్తిగా తయారైన వినాయకుడు బొమ్మలు ,సగం వరకు తయారైనవి, ఇంకా ముడి సరుకు రకరకాల దేవతల బొమ్మలు అన్ని నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఒకసారి సత్తయ్యకి నీరసం వచ్చేసింది. ఒక్కసారిగా నాలుగు రోజుల్లో వస్తున్న వినాయక చవితి పండుగ కోసం డెలివరీ చేయవలసిన బొమ్మలు, పుచ్చుకున్న అడ్వాన్స్ అమౌంట్లు ,షావుకారు దగ్గర ముడిసరుకు కోసం ఇవ్వవలసిన ఎమౌంటు ,అలాగే వినాయక చవితి ఉత్సవాల కమిటీ వారికి ఏం సమాధానం చెప్పాలి ?అని ఒక్కసారిగా గుర్తుకొచ్చి కళ్ళు తిరిగినట్లు అయింది.
అదేమిటి మహానుభావా! పది రోజుల ముందుగానే నిమజ్జనం అయిపోయావు. పూజా పునస్కారం ఏమీ అందుకోకుండానే , వినాయక చవితి ఉత్సవాలు జరగకుండానే అనుకుంటూ వినాయకుడి ని తలుచుకుని మదన పడిపోసాగాడు సత్తయ్య.
సత్తయ్య తాత తండ్రుల కాలం నుంచి బొమ్మలు తయారు చేయడమే వారి వృత్తి. రోడ్డు పక్కన ఉన్న స్థలంలో రేకుల షెడ్డు అద్దెకు తీసుకుని దేవతల బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేస్తుంటాడు. కుటుంబమంతా అదే వృత్తిలో చాలా కాలం నుంచి ఉన్నారు. ఒక అడుగు పొడవు గల బొమ్మ నుండి ముప్పై అడుగుల పొడవు గల గణేశుడు బొమ్మలు దుర్గాదేవి బొమ్మలు కృష్ణుడి బొమ్మలు రాముడు బొమ్మలు రాధాకృష్ణుడు బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు.
ప్రతిరోజు తయారుచేసిన బొమ్మల్ని అందమైన రంగులు వేసి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటాడు సత్తయ్య. ఇదే ఆ కుటుంబం జీవనాధారం.ఇక గణేష్ ఉత్సవాలు దేవీ నవరాత్రులకి మూడు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించి కావలసిన వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పుచ్చుకొని ఉత్సవాలకు రెండు రోజులు ముందు ఆ దేవతల బొమ్మలు ఇస్తుంటాడు. నిజానికి ఆ బొమ్మలు చూస్తే నిజమైన ఆ దేవతలు ఆ లోకం నుండి క్రిందికి దిగివచ్చినట్లుగా ఉంటాయి. తయారీలో అంత నైపుణ్యం సంపాదించాడు సత్తయ్య.
నిజానికి బొమ్మల తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన కళ. ఎన్ని కలలు కన్నా ఆ కళ ఎవరికి రాదు. అది దైవ సంకల్పం. కొన్ని దేవతల బొమ్మలు చూస్తుంటే మనం కళ్ళు తిప్పుకోలేం. వినాయకుడు బొమ్మలో ముఖ్యంగా తొండం, వినాయకుడి పెద్ద బొజ్జ, వినాయకుడికి వాహనమైన ఎలుక స్పష్టంగా కనబడేలా తయారు చేయడమనేది అందరికీ రాదు.
ఆధునిక కాలంలో పర్యావరణం మీద శ్రద్ధ పెరిగి అందరూ మట్టి బొమ్మల్ని తయారు చేస్తున్నారు. అయినా ఇంకా కొన్నిచోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన బొమ్మల్ని కూడా పెడుతున్నారు. ఈ రెండు రకాల ముడి పదార్థాలతోటి బొమ్మల తయారు చేయగల సత్తా సత్తయ్య కి ఉంది. ఎక్కడో దూర ప్రదేశాల నుంచి సత్తయ్య దగ్గర బొమ్మలు కొనుక్కోవడానికి
వస్తా రు.
ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్న ఎప్పుడూ ఇటువంటి సమస్య రాలేదు. పెద్ద పెద్ద గొడౌన్లు తీసుకుని వ్యాపారం చేసే స్తోమత సత్తయ్యకు లేదు. మామూలుగా ఇటువంటి ప్రకృతి విపత్తుల సందర్భంలో దుకాణాలలోని సరుకుకి నష్టం కలిగితే కొద్దో గొప్పో ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక ప్రభుత్వ సహాయం తప్పితే ఈ వ్యాపారానికి వచ్చేది ఏమీ లేదు. అయినా ప్రభుత్వం మటుకు ఎంత సాయం చేస్తుంది అని బాధపడ్డాడు సత్తయ్య.
రేపటి నుంచి కుటుంబాన్ని ఎలా పోషించాలి?షావుకారికి అప్పులు ఎలా కట్టాలి? కమిటీ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి ?
అయినా ఈ వరద ఎప్పటికి తగ్గుతుందో!. వరద తగ్గినప్పటికీ మళ్లీ ముడి సరుకు తెచ్చుకోవాలి. మళ్లీ అంత పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడానికి సమయం సరిపోదు. నిజానికి వినాయక చవితి కి రెండు నెలల ముందు నుంచి దసరా వెళ్లే వరకు చేతినిండా పని ఉంటుంది.
మరి ఈ ఏడాది పరిస్థితి ఏమిటి. షావుకారు ఏమంటాడో! ఎన్ని తిట్లు భరించాలో! మళ్లీ రేకుల షెడ్ అంతా ఇప్పి కట్టుకోవాలి. దానికి ఎంత ఖర్చవుతుందో! భవిష్యత్తు ఏమీ అర్థం కాలేదు సత్తయ్యకి. ఎప్పుడూ ఎవరి చేత మాట పడని సత్తయ్య ఇప్పుడు ఇంతమందికి సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
అలా నాలుగు రోజులు గడిచింది. వర్షం తగ్గింది. వరద క్రమేపి తగ్గుముఖం పట్టింది. బొమ్మలు కి అడ్వాన్స్ ఇచ్చిన ఉత్సవ కమిటీ వాళ్లు ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు. సత్తయ్య పనిచేసే రేకుల షెడ్ దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి చూసి కళ్ళు తిరిగినట్లు అయింది ఆ కమిటీ వాళ్ళకి. ఎక్కడ చూసినా కరిగిపోయిన దేవతా విగ్రహాలు, ఒక పక్కకు ఒరిగిపోయిన రేకులు షెడ్డు, నీటిలో మునిగిపోయిన ముడిసరుకు చూసి కన్నీళ్లు వచ్చాయి కమిటీ వాళ్ళకి. మాకే ఇలా ఉంటే మరి సత్తయ్య పరిస్థితి ఏమిటో! అనుకుంటూ సత్తయ్య గురించి ఫోన్ చేశారు కమిటీ వాళ్లు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ సమాధానం లేదు. పోనీ అంత పెద్ద బొమ్మ కాకపోయినా ఈ ఏడాదికి చిన్న బొమ్మ తయారు చేయించుకుని ఉత్సవం చేద్దామనుకున్నారు కమిటీ వాళ్ళు. కానీ సత్తయ్య జాడ ఎక్కడ కనపడలేదు. ఏమి చేసేది లేక తిరుగు ముఖం పట్టిన కమిటీ వాళ్ళకి ఒక చెట్టు కింద జనం ,పోలీసులు గుమి గూడి ఉండడం కనిపించింది. సాధారణంగా ఒక పదిమంది ఒకచోట కనబడితే ఏం జరిగిందని దారిన పోయే దానయ్యలు కూడా ఆగి తెలుసుకుంటారు.
అలా కమిటీ వాళ్ళు ఏం జరిగిందని చెట్టు కేసి చూసి ఒక్కసారిగా విస్తు పోయారు. ఆ చెట్టు కింద నిర్జీవంగా పడి ఉన్నాడు దేవుడు సృష్టించిన ఆ బొమ్మ. ఎన్నో దేవతల బొమ్మలు తయారు చేయడానికి వాడిన చేతిని పురుగుల మందు నోటికి అందించడానికి ఉపయోగించాడు. కాలం పెట్టిన బాధల్ని తట్టుకోలేక. ఆ శవం పక్కన కూర్చుని ఏడుస్తున్న సత్తయ్య భార్య పిల్లల్ని చూసి మనసు ద్రవించి పోయింది కమిటీ వాళ్ళకి. సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఆ కుటుంబం తోటి. ప్రతి ఏటా వాళ్ళు బొమ్మలు అక్కడే కొంటారు.
ఒక్కసారిగా కమిటీ సభ్యుల్లో మానవత్వం మేల్కొంది. ఇటువంటి వాళ్లకు సహాయం చేస్తేనే నిజంగా దేవుడు సంతోషిస్తా డు అనుకొని ముందుగా ఇచ్చిన సొమ్ము పోను మిగిలిన సొమ్ము సత్తయ్య భార్య చేతిలో పెట్టి వెనకకు తిరిగి వెళ్ళిపోయారు కమిటీ సభ్యులు. ఎన్నో ఏళ్లుగా ఆ బొమ్మల్ని తయారు చేసే వృత్తిని నమ్ముకున్న ఆ కుటుంబానికి ఇది దేవుడు చేసిన సహాయం అని అనుకున్నారు అందరూ.
ఇలా గుర్తింపు లేని వ్యాపారాలు చేస్తూ జీవితం గడుపుతున్న వరద బాధితులు ఎంతోమంది. ప్రభుత్వం వారి వరద నష్టం లెక్కల్లో ఇటువంటి వారు చేరుతారో లేదో దేవుడికే తెలియాలి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి