జోడెద్దులు
జోడెద్దులు.
ఉదయం 5:00 గంటలు అయింది.
హేమంత రుతువు ప్రతాపానికి తట్టుకోలేక దుప్పటి ముసుగు వేసి పడుకోవాలని అనిపించిన ఆ పల్లె బాధ్యతలు గుర్తు చేస్తూ గంప కింద కోడి ఆకాశంలోని పక్షులు పాకలోని పశువులు అరుపులతో తన బాధ్యత గుర్తుకొచ్చింది రామయ్యకి.
తూర్పు వైపు కాస్త వెలుగు కనిపిస్తే చాలు ఆ పాకలోని పశువులు అంబా అంబా అని అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపుల సంకేతం యజమాని రామయ్యకు ఒక్కడికే తెలుసు. గబగబా దంత ధావనం కానిచ్చి వాటి ఆకలి తీర్చి ఆ జోడు ఎడ్లను బండి దగ్గరికి తీసుకువెళ్లి కాడి భుజం మీద వేసి వాటిని తమ బాధ్యతలకు సిద్ధం చేశాడు. రామయ్య కూడా బండి ఎక్కి యజమానిగా వాటికి దిశా నిర్దేశం చేసి సత్తు గిన్నెల క్యారేజీ పట్టుకుని సుబ్బి రెడ్డి గారి పొలం వైపు పరుగులు తీయించాడు.
ఆ ఊర్లో సుబ్బిరెడ్డి గారు వంద ఎకరాల భూమికి యజమాని. రామయ్య మాత్రం ఆ జోడి ఎడ్ల బండికి యజమాని. ఆ బండి తోలడం తప్ప వేరే ఏ పని చేతకాదు. ఆధునిక కాలంలో యాంత్రికరణ పెరిగి జోడు ఎడ్ల బండికి గిరాకీ తగ్గిపోయినా రామయ్య ఎడ్ల బండికి మటుకు గిరాకీ తగ్గలేదు. చిన్న చిన్న పొలం పనులకి ట్రాక్టర్ తొట్లు ఉపయోగించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని.
అందుకే ఆ ఊర్లోని చిన్నచిన్న వ్యవసాయం పనులకి రామయ్య జోడెద్దుల బండిని బాడుగకు తీసుకుంటారు. అప్ప చెప్పిన పనిని బాధ్యతాయుతంగా పూర్తిచేసి ఒక గంట ఆలస్యమైనా మాట్లాడకుండా పని పూర్తి చేసి మౌనంగా కూలి డబ్బులు తీసుకుని వెళ్లిపోయే రామయ్య అంటే ఆ ఊరి వాళ్ళందరికీ చాలా ఇష్టం. రామయ్య తండ్రి అదే పని చేస్తూ అలాగే ఆ ఊర్లో మంచి పేరు సంపాదించుకుని చనిపోయాడు. రామయ్య తండ్రి చనిపోతూ ఉన్న అరెకరం పొలం ఆ జోడెద్దులు ,బండి రామయ్యకు అప్పచెప్పాడు. తండ్రితో పాటు కొద్ది కాలానికి జోడెద్దులు చనిపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో మళ్లీ జోడు ఎద్దులకి యజమాని అయ్యాడు.
ఇంకా ఆ జోడు ఎద్దులు అంటే రామయ్య కి చాలా ప్రేమ. కన్నబిడ్డల్లాగా పెంచుకుంటాడు. అవి జాతి ఎడ్లు కాకపోయినా మంచి ఎత్తుగా బలంగా తెల్లగా ఉండి పాపం రామయ్య జీవితానికి అవే ఆధారం అయ్యాయి. అందుకే వాటికి రాజు రవి అని పేర్లు పెట్టుకున్నాడు. తను తిన్నా తినకపోయినా వాటికి ఏ వేళకి ఏం కావాలో అన్ని సమకూరుస్తూ ప్రేమగా చూసుకుంటాడు.
సాధారణంగా ప్రతి ఆదివారం అందరికీ సెలవు. ఎంత ముఖ్యమైన వారింట్లో పని ఉన్న ఆదివారం పూట పూర్తిగా ఆ జోడెద్దుల బాధ్యతలకు సెలవే. ఆ నియమం వల్ల ఎన్నో కష్టనష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు రామయ్య.
అవి మూగజీవులు. వాటి బాధ అర్థం చేసుకునేది యజమాని ఒక్కటే. మనిషిలాగే అన్ని బాధలు వాటికుంటాయి. అందుకే వాటికి కాస్త విశ్రాంతి వారానికి ఒకసారి ఇవ్వాలని ఆలోచించాడు. ఇలా ఆలోచించే యజమాని ఎవరుంటారు. వంద ఎకరాలు ఉన్న ఆసామీ కూడా పశువులను సాకలేక అమ్మేస్తున్న రోజులు ఇవి. వాటి ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం వాటిని ఉపయోగించుకుని చివరికి అవి పనికిరాని సమయంలో అయిన కాడికి అమ్మేసే రోజులు ఇవి. అలాంటిది ప్రాణం లేని ఈ మూగజీవులు మీద అంత ప్రేమ ఎందుకు అని రామయ్య అని అడిగితే నేను మా నాన్న వ్యవసాయ కూలీలు గానే మిగిలిపోయాము ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో ఉన్నారు. నాకు ఇంకా వేరే ఆధారం ఏముంది. అంతా వీటి చలవే అంటాడు రామయ్య.
చేస్తున్న పనిని ప్రేమించి మనకు తిండి పెట్టే సంస్థ పట్ల కృతజ్ఞతతో వ్యవహరించి కష్టపడి పని చేస్తే కచ్చితంగా అది మన అభివృద్ధికి సహాయం చేస్తాయి అనే విషయం బాగా నమ్మిన వ్యక్తి రామయ్య.
మా కుటుంబం జోడెద్దుల బండి మీద ఆధారపడింది. నా మీద ఆధారపడి ఆ జోడు ఎద్దులు ఉన్నాయి. నా పిల్లల్లాగే వాటి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత కూడా నాదే అంటాడు యజమాని రామయ్య. చర్నాకోలు చేతిలో పట్టుకుని పశువుల్ని భయ పెడతాడు కానీ ఎప్పుడు ఒంటి మీద దెబ్బ వేయడు.
ఏదైనా ప్రమాదవశాత్తు పశువులకి ఒక దెబ్బ తగిలితే తల్లడిల్లిపోతాడు రామయ్య. వెంటనే పశువులు డాక్టర్ దగ్గరికి పరిగెత్తి మందు తెచ్చుకునే వరకు స్థిమితం ఉండదు రామయ్యకి.
ఏంటండీ రామయ్య గారు అందరూ నాటు వైద్యం చేసిన తర్వాతే ఆఖరిన మా దగ్గరికి పరిగెత్తుకొస్తారు. మీరు మాత్రం అలాగ కాదు అని అడిగే కాంపౌండర్ మాటలకి కోతి పుండు బ్రహ్మ రాక్షసవడం నాకు ఇష్టం లేదండి అంటాడు రామయ్య.
రామయ్యకి ఉన్న అర ఎకరం పొలాన్ని యంత్రాలతో కాకుండా నాగలితో దున్ని ఎరువులు లేకుండా పంట పండించుకునేందుకు కూడా ఆ జోడెద్దులే ఆధారం. పగలంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత వేడినీటితో శుభ్రంగా కడిగి ఆ జోడెద్దులకి దాణా పెట్టి ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలంలో ఉండే వాతావరణ పరిస్థితులకి వాటికి రక్షణ కల్పించి దోమతెరలు కట్టి పసిపిల్లాడిలాగా చూసే రామయ్య దొరకడం నిజంగా మూగజీవులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది చూసేవాళ్ళకి.
చాలామంది వెటకారం ఆడుతుంటారు రామయ్య ని ఉద్దేశించి వాడు మంచం మీద పడుకోడు ఆ పశువులు పక్కనే పడుకుంటాడు అంటారు అంటే అంత ప్రేమగా చూస్తాడు అని అర్థం. తల్లి కూడా పిల్లలు పక్కనే పడుకుంటుంది కదా అలాగ. వాడు రామయ్య కాదురా శ్రీకృష్ణుడు అంటారు అందరూ
పిల్లలకు పుట్టినరోజు ఎలా చేస్తామో అలా కనుమ పండుగ నాడు ఆ జోడు ఎద్దులను కడిగి బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి పూజలు చేసి హారతి ఇచ్చి అరటి పండ్లు తినిపిస్తే అవి మెడ ముందుకు చాపితే ప్రేమగా గుండెలకు హత్తుకునే వాడు రామయ్య.
అలా ఎన్నో సంక్రాంతి పండుగలు గడిపిన రామయ్యకి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి తమ కాళ్ళ మీద నిలబడి భార్య పిల్లలతో ప్రతి పండక్కి తమ సొంత ఊరికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తున్న పిల్లలు అంది వచ్చారు కదా !ఇంకా బాధ్యతలు ఏమున్నాయి మీరు కూడా పొలం పనులు చేయడం మానేయండి అని భార్య చెబుతున్న వినకుండా తన పనులు యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ మూగజీవాలతో.
అలా ఒక రోజు ఉదయాన్నే బండి కట్టుకుని పొలం పనికి
వె డదామని దాణా పెడుతుంటే ఎప్పుడూ దాణా చూడగానే
లేచి నించునే రవి గాడు లేవకపోవడంతో డాక్టర్ ను పిలిచి పరీక్ష చేయించాడు రామయ్య. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో నాలుగు రోజులకి లేచి నిల్చున్న రవి గాడు ఇకముందు ఇదివరకట్లా పనిచేయలేడని చెప్పిన డాక్టర్ మాటలకి రామయ్య చాలా బాధపడ్డాడు.
ఇన్నాళ్లు తనతో పాటు రాత్రి పగలు చాకిరి చేసి తన కుటుంబానికి ఎంతో మేలు చేసిన ఆ మూగజీవాలను చూస్తే చాలా బాధనిపించింది రామయ్య కి. ఇప్పుడు ఆ ఎడ్లు తోటి మీకు పని ఏమిటి వాటిని అమ్మేయండి. మేపడం దండగ. అనవసరంగా చాకిరీ చేయాలి. రోజు బోల్డంత శ్రమ అంటూ ఉచిత సలహాలు చెప్పే చుట్టుపక్కల రైతులు మాటలు రామయ్య మనసున్న ఎంతో బాధపెట్టే యి. అవి మూగజీవాలు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు.
మనుషులకు రోగాలు వస్తే ఏం చేస్తారు. అయినవాళ్లు చాకిరీ చేయకుండా వదిలేస్తారా అనుకున్నాడు మనసులో. అలా కొద్ది రోజులకి రాజు గాడికి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇదేదో అంటు రోగంలా ఉందని అనుకున్నాడు రామయ్య. ఆ జోడెద్దులు వచ్చే ఆదాయం లేక పోయిన వాటిని ఎంతో ప్రేమగా చూసుకో సాగాడు రామయ్య.
రామయ్య పరిస్థితి తెలుసుకున్న పిల్లలు నాన్న నా మాట వినండి. వాటిని గోసంరక్షణ కేంద్రంలో పెట్టండి మనము డబ్బులు కడదాము . మీరు అమ్మ ఇల్లు తాళం వేసి ఇక్కడికి వచ్చేయండి అంటూ చెప్పినా అక్కడ వాటి పరిస్థితి ఎలా ఉంటుందో రామయ్యకు తెలుసును కాబట్టి మౌనంగా ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు. రోజు చేయించే వైద్యం పెద్దగా ఫలితాన్ని ఇవ్వక పోయిన వైద్యం చేయించడం మటుకు మానలేదు.
ఒక తండ్రికి పెద్ద కొడుకు లాగా ఆ మూగజీవాలకి ఏ లోటు లేకుండా ప్రతిరోజు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండే రామయ్యకి ఒకరోజు పొద్దున్నే గొడ్లపాక నుంచి అరుపులు వినిపించలేదు. యధావిధిగా పాకలోకి అడుగుపెట్టిన రామయ్యకి అక్కడ దృశ్యం చూసి కన్నీళ్లు వచ్చే యి. తన పంచప్రాణాల్లో ఒక ప్రాణం గాల్లో కలిసిపోయినట్లుగా బాధపడ్డాడు.
ఆ మూగజీవాలకి యిన్నాళ్ళు తను ఒక యజమాని ఇప్పుడు ఒక కొడుకులా చేయవలసిన కార్యక్రమం చేసి మనసులో తృప్తి పొందాడు. కొంతమంది మనసు ఉన్నవాళ్లు రామయ్యనీ అభినందించారు. మరి కొంతమంది తలోరకంగానూ నవ్వుకున్నారు. ఏది ఏమైనా రామయ్య కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి రైతులందరికీ ఆదర్శంగా నిలిచాడు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి