రాజశేఖర్
రాజశేఖర్.
ఉదయం 9.00 అయింది.
కాకినాడలో భానుగుడి సెంటర్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అటు మెయిన్ రోడ్డు వైపుకు వెళ్లే వాహనాలు బస్సు కాంప్లెక్స్ కి వెళ్లే వాహనాలు ఇటు పిఠాపురం వెళ్లే వాహనాలు కాలినడకని వెళ్లేవాళ్లు స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఆటోలు మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్లతో రద్దీగా ఉంది. స్కూలుకు వెళ్లే పిల్లలు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు తో హడావిడిగా ఉంది రోడ్ అంతా.
అటు జనానికి ,ఇటు వాహనాలకి దిశా నిర్దేశం చేస్తూ ఎండని తట్టుకుంటూ కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిలా తన విధి నిర్వహణ చేస్తున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్. అన్ని రంగాల్లో యాంత్రికరణ పెరిగినట్లు నగరంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ లైట్లు పెట్టిన విధి నిర్వహణ మాత్రం కత్తి మీద సాము లాంటిది ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి. అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు కానీ పాటించే వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ ఒకటే తొందర అందరికంటే ముందు గమ్యం చేరాలని. పోటీ తత్వం పెరిగిపోయి యువతరం, ఆఫీసులకు ఆలస్యం అవుతుందని ఒక తరం ఇలా ఎవరు తొందర వారిది.
ఏదైనా జరగకూడని జరిగితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంతే. పాపం ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు అవుతుంది.
సినిమాల్లో హీరో రాజశేఖర్ పోలీస్ ఇన్స్పెక్టర్ వేషాలు చూసి పోలీసు ఉద్యోగం మీద మమకారం పెరిగి పట్టు పట్టి కష్టపడి చదివి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు రాజశేఖర్. దానికి తోడు ఆరడుగుల పొడవు సమానమైన శరీరం ఉండే రాజశేఖర్ డిపార్ట్మెంట్ కి మొదటి ప్రయత్నంలోనే ఎంపిక అయ్యాడు.
రాజశేఖర్ పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి నాలుగు సంవత్సరములు అయింది. ముందు పోస్టింగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఇస్తారు అక్కడ నక్సల్స్ భయం ఎక్కువగా ఉంటుంది అని భయపెట్టే స్నేహితుల మాటలకి భయపడిపోయి తీరా ఆర్డర్ వచ్చిన తర్వాత పోస్టింగ్ సొంత ఊళ్లోనే ఇవ్వడం చూసి అంతా నూకాలమ్మ అమ్మవారి దయ అనుకున్నాడు. రాజశేఖర్ కి ఆ నూకలమ్మ అమ్మవారి అంటే చాలా ఇష్టం. రోజు డ్యూటీ కి వెళ్లే ముందు వచ్చే ముందు ఒక్కసారి ఆ తల్లికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటాడు.
సొంత ఊర్లో ఉద్యోగం వచ్చిందని సంతోషపడిన సమయం ఎంతో కాలం నిలబడలేదు. కారణం ఏమిటంటే అదే సమయంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా బాధితుల కోసం ప్రత్యేక డ్యూటీ రాజశేఖర్ కి వేశారు. అసలే ఉద్యోగం కొత్త పైగా పై అధికారి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లి డ్యూటీ చేయవలసి వచ్చేది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆసుపత్రిలో తెల్లవారులు డ్యూటీ. అది అసలే అంటురోగం.
ఇంక చూసుకోండి. ఎంత పోలీస్ అయినా సొంత ప్రాణం మీద మమకారం ఉంటుంది కదా! సెలవు దొరికేది కాదు. డ్యూటీ కి టైమింగ్ లేవు. ఇలా ఉండేది పాపం. ఎందుకు చేరాను రా ఈ ఉద్యోగం లో అనిపించింది శేఖర్ కి .
అసలు పోలీస్ అంటే కొత్త నిర్వచనం వానల్లో వరదల్లో కాశ్మీర్ అల్లర్లో కరోనా లాక్ డౌన్ లో రాష్ట్ర విపత్తులో ప్రజలందరినీ కంటికి పాపలా కాపాడేవాడు పోలీసు. అవును ఇందుగలడందు లేడని సందేహము వలదు అన్నట్టు రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఉత్సవం వచ్చిన రాష్ట్రానికి ముఖ్య అతిథి వచ్చిన రాజకీయ నాయకుల పర్యటన లోను పోలీస్ అనేవాడు లేకుండా ఉండదు.
రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేసేవాడు పోలీసు. పోనీ అది అందమైన కార్యాలయంలో ఏసీ గదుల్లో చేసే ఉద్యోగం కాదు. ఎండా వానల్లో కొండా కోనల్లో అవసరమైనప్పుడు అడవుల్లో కూడా చేసే ఉద్యోగం. రెస్ట్ లేని జీవితం. పండగల్లోనూ పబ్భంలోనూ కూడా ప్రజాసేవకే జీవితం అంకితం.
ప్రభుత్వం వారు పెట్టిన నియమాలను పాటించని జనంతో సహవాసం చేయడం వల్ల మాటలో కరుకుదనం, నెత్తి మీద ధరించే టోపీ వలన బట్టతలే బహుమానం. ఎప్పుడు రోడ్డుమీద పనిచేయడం వల్ల దుమ్ము ధూళి వలన అనారోగ్య సమస్యలు. చెవుల్లో ట్రాఫిక్ మోత.
తీవ్రమైన మానసిక ఒత్తిడి. దొంగలను దోపిడీ దారులను భయపెట్టడానికి ధరించే తుపాకీ వలన గుంజుతున్న చెయ్యి ఇవన్నీ వృత్తిపరమైన సమస్యలు. సెలవు రోజుల్లో కూడా అవసరమైతే పరిగెత్తుకు వెళ్లి డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం. ఇవన్నీ నాలుగు సంవత్సరాలలోనే అనుభవించిన రాజశేఖర్ కి తన ఉద్యోగం అంటే ఏమిటో అర్థమైంది. అయినా వేరే దారి లేదు వేరే ఉద్యోగం రాదు ఇప్పుడు చేయగలిగిందేముంది
ఎప్పటికైనా ప్రమోషన్ రాకపోతుందా అనే ఆశతో కాలం గడుపుతూ వృత్తికి అంకితం అయిపోయాడు రాజశేఖర్. ఎప్పుడైనా పెళ్లి మాట ఎత్తితే నా చిన్న సంపాదన తో పెళ్ళాన్ని ఏం పోషిస్తాను అనేవాడు రాజశేఖర్. నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ కదరా అందుకే బోల్డ్ సంబంధాలు వస్తున్నాయి అంటూ నవ్వుతూ చెప్పింది తల్లి.
నిజమే ప్రభుత్వం వారి నిబంధనలని పాటించని ప్రజల్ని చూసి చూడకుండా వదిలేసి వారి దగ్గర నుంచి ఎంతో కొంత పుచ్చుకునే వాళ్లు కనబడ్డారు రాజశేఖర్ కి అయినా వృత్తిని ఒక నిబద్ధతతో పనిచేసే రాజశేఖర్ అటువంటి వారి దగ్గర నుండి రసీదు ఇచ్చి ముక్కు పిండి సొమ్ము వసూలు చేసే రాజశేఖర్ కి జీతం తప్పితే ఆదాయం ఏమి ఉంటుంది. అసలు ట్రాఫిక్ అంటేనే పెద్ద తలనొప్పి. హెల్మెట్ లేకుండా వచ్చేవాళ్ళు. బండి మీద ముగ్గురు నలుగురు కూర్చునేవాళ్లు. కారులో సీటు బెల్ట్ పెట్టుకోని వాళ్ళు. ఎర్ర సిగ్నల్ చూపిస్తున్న పొరపాటున ముందుకి ఉరికే వాళ్లు, ఇలా ఎన్నో రకాలు.
హెల్మెట్ లేదని పట్టుకుంటే రోజు పై అధికారుల దగ్గర్నుంచి రాజకీయనాయకులు దగ్గర నుంచి వచ్చే ఒత్తిడిలు ఎన్నో. నిబంధనలు పెట్టేది వాళ్లే. నిబంధనకు నీళ్లు వదులుకొని పనిచేయమనేది వాళ్లే. ఏమిటో ఇది . ఇలా ఆలోచిస్తూ ఉంటే వయసు పెరిగిపోతుందని మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి ఒక ఇంటివాడు అయ్యాడు.
అలా సంవత్సరం గడిచింది. ఏదో పెళ్లి అయిన కొత్తలో కొన్ని సరదాలు ఉంటాయి కొత్తజంటలకి. ఒకపక్క ఆర్థిక సమస్య, మరోపక్క డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పనివేళలు వీటి తో భార్య భర్తల మధ్య సమస్యలు తీసుకుని వస్తోంది కాలం.
ఒకరోజు నవ్వుతూ ఉన్న ముఖంతో భర్తకి గుడ్ మార్నింగ్ చెప్పి తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టుకోమని ఇచ్చింది రాజశేఖర్ భార్య సుజాత. ఏమిటి ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తోంది భార్య అనుకున్నాడు రాజశేఖర్. ఇవాళ ఐనా కాస్త తొందరగా ఇంటికి రండి సాయంకాలం గుడికి వెళదామని చెప్పింది భార్య. ఏమిటి ఇవాళ స్పెషల్ అని అడిగాడు. అయ్యో రామ ఇవాల్టికి మన పెళ్లి అయ్యి సంవత్సరం అయింది. అప్పుడు గాని గుర్తుకు రాలేదు రాజశేఖర్ కి. ఏమిటో ఈ డ్యూటీ లో పడి అన్ని మర్చిపోయాడు.
అలా బట్టలు మార్చుకుని డ్యూటీకి వెళ్ళబోయే ముందు మనసులో అనుకున్నాడు రాజశేఖర్ కనీసం ఇవ్వాళైనా ఏ సమస్య లేకుండా రోజు గడిస్తే బాగుండును అని దేవుడికి మొక్కుకున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య. రోడ్డు మీద జరిగే ప్రమాదాలు జరిగి ఎవరైనా మరణిస్తే ఇంక చెప్పక్కర్లేదు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించి కేసు రిజిస్టర్ చేసి మళ్లీ ఆ శరీరాన్ని కుటుంబ సభ్యులకి అందజేసే వరకు ఆ కానిస్టేబుల్ దే బాధ్యత. ఒక్కొక్కసారి ప్రమాదం జరిగిన చోట్లో ట్రాఫిక్ అంత ఆగిపోయి వాటిని క్రమబద్ధీకరించడానికి తల ప్రాణం తోకకి వస్తుంది అలా ఉంటుంది పోలీసువారి జీవితం. అందుకే కనీసం ఈ రోజైనా సెలవు అడుగుదామని నిర్ణయించుకుని పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు.
రాజశేఖర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి అంతా హడావిడిగా ఉంది. రాజశేఖర్ ని చూడగానే హెడ్ కానిస్టేబుల్ మూర్తి రారా గన్ను తీసుకుని తొందరగా బయలుదేరు వ్యాను ఎక్కు అన్నాడు. ఎక్కడకు ఏమిటి ఎందుకు ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పలేదు మూర్తి. కాదండి ఇవాళ నాకు సెలవు కావాలి అని తన మనసులో మాట చెప్పిన ఏమిటి ఎందుకు అని అడగకుండా ముందు వ్యాన్ ఎక్కు మనం నర్సీపట్నం ఏజెన్సీ ఏరియాకి అర్జెంటుగా వెళ్లాలి ఇది ఎస్పీ గారి ఆర్డర్ అంటూ చెప్పేసరికి ఏమి మాట్లాడకుండా వ్యాను ఎక్కాడు
. అలా నాలుగు గంటల ప్రయాణం చేసి మధ్యలో ఆకలేస్తున్న ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుని అడవిలోకి వెళ్లి అక్కడ ఇదివరకు ఉన్న పోలీస్ గుడారంలో అడుగుపెట్టి అక్కడ వాళ్ళు పెట్టిన చల్లారి పోయిన అన్నం రుచి పచీ లేని కూర తిని భోజనం అయిందనిపించి అక్కడ పై అధికారులు చెప్పిన విధంగా గన్ తీసుకుని నక్సల్స్ ని వెతుక్కుంటూ బయలుదేరాడు రాజశేఖర్ తన సహోద్యోగులతో.
అలా ఎంత దూరం నడిచారో తెలీదు. ఎంత దూరం నడవాలో తెలియదు. ఒకపక్క ప్రాణభయం. అయినా తప్పదు కదా డ్యూటీ. మామూలు ఉద్యోగాల్లో అయితే ఇవాళ సెలవు పెట్టుకుని భార్యను తీసుకుని ఏ హోటల్ కో సినిమాకో అందమైన ప్రదేశాను కో వెళ్లుండేవాడు. అవన్నీ అలా ఉంచితే కనీసం ఈరోజు మంచి భోజనం కూడా దొరకలేదనుకున్నాడు రాజశేఖర్.
అలా కొంత దూరం వెళ్లేసరికి వెనక వైపు నుంచి ఎవరో ఫైర్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత తుపాకీ కాల్పుల శబ్దం అమ్మ అంటూ అరుపులు మళ్లీ ఎదురు కాల్పులు .ఆ మర్నాడు పేపర్లో నక్సల్స్ ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి అంటూ వచ్చిన వార్త చూసి ప్రజలందరూ ఎవరు ఏమిటో అనుకున్నారు కానీ రాజశేఖర్ భార్య పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన ఫోన్ ద్వారా ఈ వార్త విని జీవితాంతం బాధపడుతూనే ఉండిపోయింది. పెళ్లయి ఏడాది నిండకుండానే ఆమె జీవితo తెల్లారిపోయింది.
ఇలాంటి పోలీసు ఉద్యోగులు ఎంతోమంది. జీవితంలో ప్రమాదం పొంచి ఉందని తెలిసి ఉన్న ఇటువంటి ఉద్యోగాలకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం నిజంగా వారికి ఒక నమస్కారం. చాలా చలనచిత్రాల్లో పోలీసు ఉద్యోగిని ఒక లంచగొండిగా తిరుగుబోతుగా చూపించి నవ్విస్తుంటారు. అన్ని ఉద్యోగాలలోను ఇటువంటి వాళ్ళు ఉంటారు. నిజానికి సమాజంలో ఈ మాత్రం భయం లేకుండా మనం జీవిస్తున్నావంటే వెనకాల ఏదో ఒక అభయ హస్తం ఉందని నమ్మకం . అదే పోలీసు వ్యవస్థ. దేశ రక్షణలో సైనికులు మాదిరిగానే అకాల మరణం చెందిన అమర వీరులందరికీ వందనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి