నాన్న లాగ ఎవరు ఉంటారు!
" నాన్న రేపు నీ పుట్టినరోజుకి ఒక టీ షర్టు కొనుక్కుందాం పద అంటూ కొడుకు శరత్ చెప్పిన మాటలకు తల అడ్డంగా ఊపి వద్దురా నాకు ఇంట్లో బోల్డ్ బట్టలు ఉన్నాయి. అయినా టీ షర్ట్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అదేమిటి నాన్న నీ వయసు వాళ్ళు అందరూ టీ షర్ట్లు వేసుకుంటున్నారు కదా! . "అది వాళ్ళ ఇష్టం. "నా పుట్టినరోజు కంటూ నువ్వేమీ ప్రత్యేకంగా కొనకు అంటూ నిక్కచ్చిగా చెప్పేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు పరంధామయ్య.
పరంధామయ్య మండల ఆఫీసులో ఒక చిరుద్యోగి. లంచాలు వచ్చే ఉద్యోగం అయినా పది పైసలు ఎవరి దగ్గర పుచ్చుకోకుండా చాలా నిక్కచ్చిగా పని చేస్తాడు. చాలా సాదాసీదాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పిల్లలు ఇద్దరు పై చదువులకు వచ్చిన ఎవరిని పది పైసలు అడగకుండా తన కు వచ్చిన జీతంతోనే పిల్లలు ఇద్దరిని చదివించుకుంటున్నాడు. రోజు ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతుంటాడు.
ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకెళ్ళి మళ్లీ ఇంటికి వచ్చేవరకు ఏది ముట్టుకోడు. అంతా లెక్కలు వేసుకుని జీవితం గడుపుతూ ఉంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తెలుపు బట్టలే గాని ఎప్పుడు రంగు బట్టలు వేసుకుని ఎరగడు. ఏది తక్కువగా వస్తే అదే కొనుక్కుంటాడు. కానీ తన మీద ఆధారపడిన పిల్లలకి భార్యకిఏమాత్రం లోటు చేయడు .
ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న ఇంట్లో ఒక ఏసీ లేదంటే ఎవరూ నమ్మరు.ఇన్స్టాల్మెంట్ మీద అయినా కొనమని భార్య గొడవ పెడుతుంటే ఎందుకు కరెంట్ ఖర్చు హాయిగా మన అరుగు మీద మడత మంచాలు వేసుకుని పడుకుంటే చల్లటి గాలి వేస్తుంది అంటూ మాట దాట వేస్తాడు. పిసినారి అని చెప్పలేం కానీ అప్పు అంటే భయం. ఆడంబరాలు అంటే ఇష్టం ఉండదు. ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ జీవితం అతి జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాడు పరంధామయ్య.
ఎవరైనా చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి చల్లటి మంచినీళ్లు అడిగితే మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేదండి !అని చెప్పడానికి భార్య మొహమాటపడుతుంటే ఫ్రిడ్జ్ లో నీళ్లు ఆరోగ్యానికి మంచివి కావమ్మా! అందుకనే మేము కొనలేదు అంటూ మూల నున్న కుండలో నీళ్లు ఇస్తాడు ఇటీవల కాలంలో రిఫ్రిజిరేటర్ లు ఏసీలు మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు అండి అందుకే మేము వాటి జోలికి వెళ్ళలేదు అంటూ వచ్చిన వాళ్ళని సమాధానం పరుస్తాడు.
పరంధామయ్య గారి అదృష్టం ఏమిటి అంటే పెద్దవాడు రఘు చదువులో ఫస్ట్ ఈ ఏడాది తోటి ఇంజనీరింగ్ అయిపోతుంది.
భగవంతుడు అనుకూలిస్తే పెద్ద పిల్లాడు రఘు కి ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ వస్తే పరంధామయ్య కష్టాలన్నీ తీరిపోతాయి అనుకునేది భార్య శాంతమ్మ. పరంధామయ్య గారు చెప్పిన మాట తూచ తప్పకుండా నడుస్తూ సంసారాన్ని లాక్కోస్తోంది శ
అవును! భర్త ఆదాయం చూసే భార్య కూడా తగిన విధంగా నడుచుకోవాలి లేదంటే ఈరోజుల్లో ఇద్దరు పిల్లలతో నగరంలో బతకడం అనేది చాలా కష్టం. అటువంటి భార్య దొరకడం తన అదృష్టం అనుకుంటాడు పరంధామయ్య. పరంధామయ్య గారికి నిజంగా కోరికలు ఉండవా ఉంటాయి ఎందుకు ఉండవు. ఆయన కూడా మనిషే కదా. చుట్టూ ఉన్న మనుషుల్లాగా జీవించాలని ఉండదా. ఉంటుంది. కానీ అన్నిటికీ ఆ నెలాఖరికి వచ్చే జీతమే ఆధారం. ఆ జీతాన్ని బడ్జెట్ పరంగా లెక్కలు వేసుకుని ఖర్చు పెట్టే నాన్న. ఒక ఆర్థిక శాస్త్రవేత్త. పిల్లల్ని తా హతకు మించిన స్కూల్లో జాయిన్ చేసి ఉన్నత చదువులు చదివించి తను ఎన్నో త్యాగాలు చేసి పిల్లల క్షేమం కోసం పాటుపడే నాన్న ఒక మార్గదర్శి.
నిత్యం కుటుంబం కోసం మరియు నెలవారీ జీతం చెల్లించే కార్యాలయం కోసం తన జీవితమంతా పనిచేసి ఆరోగ్యం పాడైన లెక్కచేయకుండా జీవితం గడిపే నాన్న ఒక త్యాగమూర్తి. పదవి విరమణ కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా పిల్లల చదువులకి ఖర్చుపెట్టి తనకంటూ సొంతంగా ఏమీ ఖర్చు చేసుకోకుండా జీవితం గడిపే నాన్న నిజంగా ఒక నిశ్వార్థి. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు భార్యకు కూడా చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ సమస్య పరిష్కారం చేసుకోవడానికి నిరంతరం తపించే నాన్నని ఏ మాటతో పిలవాలి.
కష్టాలు కలకాలం ఉండవు ఈ ఒక్క నాలుగేళ్లు కష్టపడితే పిల్లలు పైకొస్తారు చేతికి అందిస్తారు వాళ్లు బతుకులు వాళ్ళ బతుకుతారు అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది ఆశతో బతుకుతున్న నాన్న పెద్ద ఆశాజీవి.
ఈ సంసార చక్రానికి నాన్న పెద్ద రథసారథి. యుద్ధంలో తప్పు జరిగితే భార్యతో సహా వేలెత్తి చూపేది నాన్నని. అయినా తప్పు నాదే అంటూ తలదించుకుంటాడు తప్పితే నేను కష్టపడ్డాను ఫలితం సాధించలేకపోయాను అని నోరు విప్పి చెప్పడు. తను నోరు విప్పితే గట్టిగా దెబ్బలాడితే కుటుంబ గౌరవం ఎక్కడ పాడైపోతుంది అని తన జీవితం అలా త్యాగం చేసే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.
కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు. ఒకప్పుడు కాలం బాధపెట్టిన దానికి జాలేసి బాధ పెట్టిన వాళ్ళకి మంచికూడా చేస్తుంది. అలాగే పరంధామయ్య గారి పెద్దబ్బాయి శరత్ కి క్యాంపస్ సెలక్షన్ లో రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరానికి ఇరవై లక్షలు జీతం. ఆ మాట విన్నంతనే పరంధామయ్య గారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇన్నాళ్లు భగవంతుడు నమ్ముకుని వృత్తినే దైవంగా నమ్ముకునీ కాలక్షేపం చేసిన తనకి కష్టాలు తీరాయి అని అనుకొని శరత్ ని హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ చేసి వచ్చాడు పరంధామయ్య .
అలా అయిదారు నెలలు గడిచిపోయాయి. ఈలోగా సంక్రాంతి పండుగ సెలవులకు వచ్చిన శరత్ "నాన్న మీరు వెంటనే రెండు బెడ్ రూముల ఇంట్లోకి మారిపోండి. నెల నెలా మీకు డబ్బులు పంపిస్తాను. ఇంక మనకి ఏమి ఇబ్బంది లేదు. మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు అంటూ బట్టల ప్యాకెట్ చేతిలో పెట్టిన కొడుకుతో ఎందుకురా అనవసరంగా నీ డబ్బులు పెట్టి కొన్నావ్. నీకు తెలుసు కదా నాకు బట్టలు చాలా ఉన్నాయి. అనవసర ఖర్చులు చేయొద్దు. ఇప్పుడు ఇల్లు మాకు సౌకర్యంగానే ఉంది . కొద్దిరోజులు ఆగితే తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. పెద్దింట్లోకి మారితే మేము అమ్మ చాకిరీ చేయలేదు. నేను ఉద్యోగం మానేస్తే నాకు కాలిక్షేపం ఏమిటి చెప్పు . చూడు అమ్మ గురించి నా గురించి నువ్వు ఏమీ డబ్బులు ఖర్చు పెట్టకు. నాకు సాదా సీదాగా జీవితం గడపడమే నాకు ఇష్టం.
రేపు నీకు పెళ్లి అయితే బోలెడు ఖర్చులు ఉంటాయి. డబ్బులు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా దాచుకో. మాకు ఉన్నది ఏదో మాకు సరిపోతుంది. చూడు ఆడంబరాల్లో లేదు జీవితం. సంతృప్తిగా బతకడం లోనే ఉంది. జీవితంలో నిజాయితీగా నిక్కచ్చిగా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా సంపాదించుకుంటే చాలా సంతృప్తి ఉంటుంది. ఎంత కొడుకు అయినా కొడుకు సంపాదించిన సొమ్మును ఆడంబరాలకి ఖర్చు పెట్టకూడదు. మేం పెద్దవాళ్ళం అయిపోతున్నా ము. మేము మీకు ఆదర్శంగా ఉండాలి తప్పితే. ఆడంబరాలు నేర్పకూడదు .
ఇప్పుడు మాకు ఏమీ లోటు . కడుపునిండా తింటున్నాము. కంటి నిండా హాయిగా నిద్రపోతున్నా ము. ఎక్కడ పది పైసలు అప్పు లేదు. వచ్చిందానితో బతకడం మాకు అలవాటైపోయింది.
అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలని కార్లలో
తి రగాలని పెద్దపెద్ద బంగాళాలలో కాపురం ఉండాలని డబ్బు సంపాదించాలని కోరిక నాకెప్పుడూ లేదు. అందుకనే నాకు ఈ వయసులో ప్రాణం చాలా హాయిగా ఉంది అంటూ చెప్పిన నాన్న మాటలు విని శరత్ నాన్నలు ఎప్పటికీ మారరు. నాన్న నాన్న గానే ఉండిపోయాడు అనుకుంటూ అటువంటితండ్రి కడుపున పుట్టినందుకు ఆనంద పడిపోయాడు. ఎందుకంటే శరత్ తోటి ఉద్యోగం చేసే రమేష్ తల్లిదండ్రులతో అనుభవం విన్న శరత్ కి తన తండ్రి గొప్పదనం అర్థమైంది అప్పుడు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి