అన్ లిమిటెడ్

అన్ లిమిటెడ్

మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టేటప్పటికీ ఎక్కడా ఖాళీ లేదు. ముందుగా మేము రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మేము ఎనిమిది మంది టేబుల్ ఆక్రమించేసా ము. రోజు అదే రోడ్లో అనేకసార్లు ప్రయాణిస్తుంటాం. కానీ ఎప్పుడూ తల పైకెత్తి చూడలేదు. పేరు మటుకు విన్నాం. కొత్తగా కట్టిన షాపింగ్ మాల్లో పెట్టిన రెస్టారెంట్. ఆ నగరానికి అదే మొట్టమొదటి షాపింగ్ మాల్. దానికి తోడు ఎంత తిన్నా కట్టవలసింది ఏడువందల రూపాయలు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఆ రెస్టారెంట్ వాడు. అందులో వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి ఆ రెస్టారెంట్ లో . మామూలు వెజిటేరియన్ మిల్స్ కి ఎంత ఖరీదైన హోటల్ లో అయినా నాలుగు వందలు మించి ఉండదు. కానీ ముక్కల కొరికే వాళ్ళకి ఆ రేటుకి అన్లిమిటెడ్ పెడుతున్నాడు అంటే భలే మంచి చౌక బేరం అనుకుంటారు. 

ఏదో కొత్తగా కట్టిన షాపింగ్ మాల్ కదా కొన్నా కొనకపోయినా ఆదివారం పూట కాలక్షేపానికి పిల్లలతో పాటు వచ్చేవాళ్లు వయసు మీరిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్లు ఇంక చెప్పకండి ఇంట్లో ఉన్న బామ్మ గారిని తాత గారిని కూడా బయట ప్రపంచంలో తిప్పుదామని సరదా పడే మనవలు కూడా అక్కడ ప్రతి ఫ్లోర్ తిరుగుతూ కనబడ్డారు. చివరి మజిలీ ఆ రెస్టారెంట్. 

ఎంత అన్లిమిటెడ్ అయినా రోజు తినే పప్పు కూర సాంబారు పెరుగే కదరా అంటే కాదు నాన్న ఒక్కసారి నువ్వు అమ్మ వచ్చి చూడండి అంటూ మురిపించి తీసుకెళ్లాడు మా అబ్బాయి. ఇలాంటి వాటికి నేను దూరమని తెలిసిన వాడిని ఆరోజు బాధ పెట్టడం ఇష్టం లేక వాడిని అనుసరించాము. ఇంటికి వచ్చిన చుట్టాలు స్నేహితులతో సహా. ఆరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏమిటా ప్రత్యేకత. నన్ను బలవంత పెట్టి ఆ రెస్టారెంట్ కి తీసుకెళ్లినవాడి పుట్టినరోజు. అందుకే వాడి మాట కాదనలేకపోయాను.

విశాలమైన అందమైన టేబుళ్లు దానిమీద తెల్లగా మెరిసిపోయే పింగాణి ప్లేట్లు స్పూన్లు టేబుల్ మధ్యలో రెండు కుంపట్లు అవి ఎందుకు కొంతసేపు అర్థం కాలేదు. అందమైన డ్రస్సులతో అటు ఇటు తిరిగే వెయిటర్లు. కొంతమంది ఆడపిల్లలు కొంతమంది మగవాళ్ళు. ఇంతలో మంచి డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ మేనేజర్ అనుకుంటా ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుని సర్వీస్ బాగా లేకపోయినా సరుకు బాగా లేకపోయినా ఫీడ్ బ్యాక్ ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకా మేము ఏమి రుచి చూడలేదు. ఎదురుగా ఉన్న మెనూ కార్డు తీసి చూసాను. వాటి పేర్లు ఏమిటో నాకు అర్థం కాలేదు. అయినా అక్కడ ఆర్డర్ ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎదురుగుండా కనబడిన వాటిని మనం తెచ్చుకుని తినడమే. ఇంతలో అంత చల్లటి గదిలో కూడా లైట్ గా మాకు ఎందుకో వేడిగా అనిపించింది.

 అప్పుడు ఎదురుగుండా ఉన్న బొగ్గుల కుంపటి మీద ఒక ఇనుప కడ్డీకి మొక్కజొన్న పొత్తు పైనాపిల్ ముక్కలు గుచ్చి ఆ కుంపటి మీద పెట్టాడు. అవి చూస్తే రోడ్డు పక్కన కుంపటి మీద కాల్చే ముక్కలు గుర్తుకొచ్చాయి. మా బృందంలో ఇద్దరు నాన్ వెజిటేరియన్స్. వాళ్లు వాళ్ళ బిజీలో ఉన్నారు. మాతో పాటు వచ్చిన యువకులు మధ్య వయస్కులు రెస్టారెంట్లు బాగా అలవాటు ఉన్నవాళ్లు. అందుకే వాళ్లు బిజీ అయిపోయారు. 

ఆ వరుసలో స్టార్టర్లు కొన్ని రకాలు లైవ్ కౌంటర్లో పాస్తాల రుచి చాట్ లో రెండు మూడు రకాలు గోబీ మంచూరియా ఐస్ క్రీములు స్వీట్లు బ్రెడ్లు ఇవి కాకుండా ఫ్రూట్స్ ఇంకా ఏవో రకాలు పేర్లు తెలియనివి అలా ఒకదాని తర్వాత ఒకటి. ఏమిటి నిజంగా వీళ్ళకి ఇంత కెపాసిటీ ఉందా. ఇక్కడికి వచ్చిన తర్వాత పెరిగిందా. లేదంటే అన్లిమిటెడ్ అని తింటున్నారా అని అయోమయంగా చూస్తూ కూర్చున్నాం. మధ్యలో ఒకటి రెండు రుచి చూసిన ఎందుకో లోపలికి వెళ్లలేదు. ఈలోగా ప్రతి పది నిమిషాలకి ఫీడ్ బ్యాక్ ఎవరో ఒకరు వచ్చి అడుగుతూనే ఉన్నారు. ఒళ్ళు మండిపోయింది. తినడం పూర్తయిన తర్వాత కదా చెప్పేది. ఎంత బాగా లేకపోయినా ఫీడ్ బ్యాక్ బాగానే ఇస్తాం. వాళ్ల కడుపులు కొట్టడం ఎందుకని. ఆఖరికి ఏదో ఒకటి కడుపు నింపుకోవాలి గా అటువైపుగా చూస్తే వైట్ రైస్ అని వ్రాసింది ఒక గిన్నె మీద. దాని పక్కనే అప్పడాలు పప్పు హమ్మయ్య అనిపించింది. చివరికి మేము తిన్నది ఏమిటి అన్నంలో అప్పడాలు కలుపుకుని రెండు ముద్దలు తిని ఆకలి చంపుకున్నాం. 
మా బృందoల్లో మిగిలిన వాళ్ళ మొహం లో చాలా ఆనందం కనబడింది. చాలా బాగుంది హోటల్ అని ఎప్పుడైనా పుట్టినరోజులకి పెళ్లి రోజులకు వెళ్ళొచ్చని వాళ్లలో వాళ్లు చెప్పుకుంటుంటే మాకు ఏం మాట్లాడాలో తోచలేదు. ఇవి సరిపోలేదన్నట్టు ఒక చిన్న సైజు కేకు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి పెద్ద సౌండ్ తో హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసి ఉత్సాహపరిచారు. వెయిటర్ బిల్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. బిల్లు చూస్తే గుండె తరుక్కుపోయింది. ఆ అన్లిమిటెడ్ ఫుడ్ కి 8 మందికి 5600 అవుతుందనుకుంటే 7700 వేసాడు. ఏమిటని ఆరా తీస్తే సర్వీస్ ఛార్జ్ 5% ఎక్స్ట్రా అని చిన్న అక్షరాల్లో రాసి ఉంది. అయినప్పటికీ మిగిలిన మొత్తం ఏమిటి. మా నాన్ వెజ్ మిత్రులు ఏదో స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చారు ట. అది అన్లిమిటెడ్ లోకి రాదుట. బావుంది ఇది చాలా బాగుంది. ఆ లెక్కలన్నీ తేల్చే ఓపిక లేక బిల్లు కట్టి బయటపడ్డాము.

ఆ బిల్లు చూసి ప్రాణం ఉసూరు మంది. హాయిగా మన ఇంట్లో మనం శుచిగా శుభ్రంగా వండుకుని ఆ నలుగురు కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ తింటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఆ పని చేయవలసింది నేను. చేయలేకపోయాను. పైగా ఆ ఆహారం మా బృందల్లోని వారి ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిందో దేవుడికి ఎరుక. రోజు అనేకం వింటున్నా ము. చిన్న వయసులోనే అనారోగ్యం పాలైన వాళ్ళ పరిస్థితి విని మనసు పాడవుతుంది. మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటున్నామా అనిపిస్తోంది.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట