కరోనా నెప్పులు
కరోనా నెప్పులు.
ఆ వార్త విన్న దగ్గర్నుంచి చాలా ఆనందంగా ఉంది. పెళ్లయిన మూడు సంవత్సరాలకి నా చిట్టి తల్లి కడుపు పండింది . ఆనందంతో పాటు మరి కొంచెం గుండెల్లో భయం ఆందోళన కూడా తిష్ట వేసే యి. ఏమి చేయలేని పరిస్థితి. కాసిన్ని పచ్చ కాగితాలుతో జేబు నిండగానే ఇది నా ప్రయోజకత్వమే అని మురిసిపోయి గర్వపడే మానవుడు ఏమీ చేయలేకపోయాడు ఆ పరిస్థితిలో. ఏదో కంటికి కనబడని జీవి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించింది. ఎన్నో ప్రాణాలు తీసుకెళ్లి పోయింది. ఎన్నో సంసారాలు చిన్నా భిన్నం అయిపోయాయి.
గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ముక్కు నోరు మూసుకుని ఎవరైనా ఎదురుపడితే పక్కకు తిరిగి పారిపోయే దేశకాల పరిస్థితి. దేశం అంతా అలా ఉంటే నాకు మాత్రం ఆ వార్త ఆనందం కలిగించింది.
సరే మొదటి కాన్పు. ఆ పిల్లకి భయం ఆందోళన. దానికి తోడు బయట పరిస్థితి భయంకరం. ఏ భయంకర వార్త ఆమెకు చేరకుండా ఎంత జాగ్రత్త పడిన మొహం లో అయితే ఆందోళన ఎప్పుడు కనిపిస్తూనే ఉండేది.కొన్ని నెలల్లో అమ్మగా ప్రమోషన్ వచ్చే అమ్మాయిని చంటి పిల్లలలాచూసుకోవాలి. మంచి వాతావరణం. మంచి ఆహారం. మంచి వసతి. ఇదే కదా మన పెద్దలు చెప్పిన జాగ్రత్తలు.
బజార్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి. అడుగుపెట్టి తెచ్చిన కాయ పండు మీద ఆ జీవి ఎక్కడ దాక్కుందోనని భయం. ప్రతి నెల డాక్టర్ గారి దర్శనం అయితే చేసుకోవాలిగా. లేదంటే మనకు భయం. పైగా స్కానింగ్ లు , బ్లడ్ టెస్ట్ లు. హాస్పటల్ అంటే రకరకాల వ్యక్తులు వస్తుంటారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో. అయినా చేయించుకోవాల్సిన పరీక్షలు చేయించుకోకపోతే లోపల పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. పరీక్ష ఫలితం వచ్చిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటా ము. ఇది సర్వసాధారణమైన విషయం. కానీ అప్పటి పరిస్థితి వేరు. ఒకపక్క సర్కార్ వారు వ్యాక్సినేషన్ వేసుకోమని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ అమ్మాయి చేయించుకోవచ్చా లేదా. వేయించుకుంటే ఏమిటి వేయించుకోకపోతే ఏమిటి రకరకాల మన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరుంటారు డాక్టర్ గారు తప్పితే.ఆ డాక్టర్ గారికి సమయం సరిపోదాయే. మనం అక్కడ ఉన్న పావుగంటసేపు అడగవలసిన ప్రశ్నలు కాగితం మీద రాసుకుని వెళ్లిన కొన్ని మాటల్లో పడి సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.దానికి తోడు డాక్టర్ గారు ఇచ్చిన సలహా ప్రకారం బెడ్ రెస్ట్. నెలలు పెరుగుతున్న కొద్దీ ఆ జీవి ఈ మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి లోపల నుంచి చేసే తాపత్రయం ఆ తల్లికి ఆ అనుభవం కొత్తగా ఉన్నా బాధగా ఉన్నా ఆనందంగా పైకి చెప్పేది. అంత తొందరగా అటు ఇటు తిరుగుతుంటే ఆడపిల్లేమో అనుకునేవాళ్లం. ఇది ఊహమటుకే.
దానికి తోడు డాక్టర్ చెప్పిన బెడ్ రెస్ట్ మూలంగా మూతికి గుడ్డ కట్టుకుని ఎప్పుడూ పడుకుని ఉండాలంటే ఆ పిల్లకి అత్తవారింట్లో మొహమాటమే కదా. ఇవన్నీ చూసి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ తల్లిదండ్రులకి నిత్యం భయమే పిల్ల ఎలా ఉందో అని. దానికి తోడు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోదామని ఎదురుచూస్తూ ఉండేది ఆ పిల్ల. రైళ్ళు లేవు బస్సులు లేవు విమానాలు లేవు ఇంకా మిగిలిందల్లా ఒక సొంత కారు ఒకటే. ఎకా ఎకిన ప్రయాణం చేయకూడదు మధ్యలో రెస్ట్ తీసుకుని వె ళ్ళు అని డాక్టర్ గారు సలహా. సీమంతo మాట దేవుడెరుగు నాలుగు స్వీట్లు పట్టుకెళ్ళి వియ్యాలవారి నోరు తీపి చేద్దామని గట్టిగా ప్రయత్నం చేస్తే స్వీట్లు తయారు చేసే వాళ్ళందరూ వంట పొయ్యిలు ఆపేసి షట్టర్ దించేశారు. పెళ్లిళ్లకి పేరంటాల కి వార్షికంగా చేసే స్నేహితుడి ని బతిమాలితే పాపం వాళ్లు నేను కోరినవన్నీ తయారు చేసి ఇచ్చారు. ఇంకో అనుమానం కరోనాకాలం కదా ఎవరైనా స్వీట్లు ముట్టుకుంటారా లేదా అని. అయినా వట్టి చేతులతో ఎలా వెళ్తాం. కడుపుతో ఉన్న పిల్ల కదా అని ధైర్యం చేసి స్వీట్లు తయారు చేయించాం.
రెండు రోజులు ముందుగా సొంత కారు శానిటైజేషన్ చేయించి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని ముక్కు నోరు మూసుకుని నోరు కట్టేసుకుని ఇంటి దగ్గర నుంచి పట్టికెళ్లిన పదార్థాలతోటి కడుపు నింపేసుకుని భాగ్యనగరం చేరాం.
ఇది భాగ్యనగరమేనా అని అనుమానం వచ్చింది. ఎక్కడ ట్రాఫిక్లు గాని షాపులు గాని బస్సులు కానీ ఆటోలు కానీ ఏ శబ్దము లేదు అంతా నిశ్శబ్దమే.
మర్నాడు ఉదయం కార్యక్రమం అయిందనిపించి భోజనం చేసి బయలుదేరాము. ముందు సీట్లో మురిపెంగా కూర్చోబెట్టాము. ఇంటికెళ్తున్నామనే ఆనందంలో ఒక గంట సేపు ఏ సమస్య చెప్పలేదు. నగర సరిహద్దులు దాటాం. అక్కడి నుంచి మొదలైంది. కారు వేగం తగ్గించు. రోడ్డుమీద గుంటలు చూసుకో. అలా గంట గంటకు చెప్తూ మధ్యలో ఫుట్పాత్ మీద కారు దిగి నాలుగు అడుగులు వేస్తూ ఆపసోపాలు అష్ట కష్టాలు పడి రాత్రి 11 గంటలకు విజయవాడ లో అంతకుముందే అనేక పరిశోధనలు శోధనలు చేసి ప్రశ్నలతో హోటల్ వాడిని విసిగించి కరోనా జాగ్రత్తలు గురించి గూగుల్ రివ్యూ ని చూసి బుక్ చేసుకున్న ఆ ఐదు నక్షత్రాల హోటలకి చేరేటప్పటికి నాకు చుక్కలు కనిపించేయి.
మా అబ్బాయికి ఏకంగా బుద్ధ భగవానుడు కనిపించి కావలసినంత జాలి కరుణ సహనం ఇచ్చి ఆశీర్వదించాడు. ఎందుకంటే పాపం డ్రైవింగ్ సీట్లో ఉన్నది వాడే కాబట్టి. ఇంతకీ మేము ఏ ఊరు వెళ్లాలి. చెప్పలేదు కదూ మేము పంచారామ క్షేత్రం సామర్లకోట వెళ్లాలి. ఇది నా స్వగ్రామం కాదు. సర్కార్ వారి నౌకరీ చేసే గ్రామం. ఏదో ఆ రాత్రి వియ్యాలవారిచ్చిన టైగర్ ఫుడ్ తో కడుపు నింపేశాం.
అసలే ప్రయాణం గురించి మనసులో ఆందోళన. రేపటి గురించి చింత. కంటిమీద కునుకు ఎలా వస్తుంది. గొంతులో కాస్త కాఫీ చుక్క పోసుకుని మళ్లీ రోడ్ ఎక్కాము. మధ్యలో ఆత్మారాముడిని చల్లబరుద్దామని. కానీ అంతరాత్మ ఎక్కడో హెచ్చరిస్తోంది. అది కరోనా హెచ్చరిక. పలహారశాలలు ఉంటాయా లేదా అనే అనుమానం లేకపోలేదు. మళ్లీ పిల్ల పరిస్థితి మామూలే. అరగంటకు ఓసారి నడిచి నాలుగు అడుగులు వేస్తే గాని కూర్చోలేని స్టేజ్ కొచ్చేసింది. ఒకపక్క జాలి. మరొకపక్క. ఆత్మ రాముడు గోల .కడుపుతో ఉన్న పిల్లని ఖాళీ కడుపుతో ఉంచకూడదని బెంగ. రోడ్డు పక్కన కళ్ళు పత్తికాయిలా చేసుకుని వెతికిన ఎక్కడా కాకా హోటల్ కూడా కనపడలేదు. అయినా ఆశ చావలేదు. ప్రయాణం సాగుతూనే ఉంది.
గన్నవరం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు కరుణించాడు. రోడ్డు పక్కనే నాలుగు చక్రాలు బండి. చుట్టూ జనం. అప్పుడు కరోనా గుర్తుకు రాలేదు. కడుపు మంట గుర్తుకొచ్చింది. పది నిమిషాలకి ఆత్మా రాముడు హమ్మయ్య అని త్రేనుపు రూపంలో చెప్పాడు. అలా గంటకొకసారి దిగి నడుస్తూ ఆపసోపాలు పడుతూ అష్ట కష్టాలు పడుతూ కొన్ని మాకు చెప్పి కొన్ని చెప్పకుండా గమ్యస్థానం చేరేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది.
ఇంతకీ మా ప్రయాణం హైదరాబాద్ నుంచి సామర్లకోట వరకు. కరోనా ముమ్మరంగా ఉన్న రోజులు. తప్పక చేసిన ప్రయాణం.
మా వసతి గృహంలో మూలగా ఉన్న రెండో గది ఎప్పుడూ ఖాళీగా ఉండే గది. ఆ గదిలో పెద్ద డబుల్ కాట్ మంచం సహాయకురాలికి ఒక సింగిల్ కాట్ అటాచ్డ్ బాత్రూo. దానికి పురిటి గది అని నామకరణం చేసి అమ్మాయికి అది కేటాయించాం. అది ఒక మిలటరీ క్యాంపస్. అడుగు పెట్టాలంటే కావాలి పర్మిషన్. అసలే బెడ్ రెస్ట్. దానికి తోడు కరోనా. పాపం ఆ పిల్ల గది వదిలి బయటకు రావాలంటే వణికి పోయేది.
అయినా డాక్టర్ గారి చెకప్ కి ప్రతినెల కాకినాడ నగరానికి వెళ్లక తప్పలేదు. బ్లడ్ టెస్ట్ లు స్కానింగ్ లు మామూలే. ప్రతిసారి అత్యంత జాగరూకతతో మూడు నెలలపాటు నెలకి ఒకసారి కాకినాడ వరకు ప్రయాణం సాగేది. ఆ పురిటి సమయం దగ్గర పడేకొద్దీ ఒక రకమైన ఆందోళన. మామూలుగానే పురుడు అంటే పునర్జన్మంటారు . అలా మూడు నెలలు ఇట్టే గడిచిపోయి ఒక శుభ ముహూర్తంలో శస్త్ర చికిత్స కోసo ఆపరేషన్ థియేటర్లో ని టేబుల్ ఎక్కవలసివచ్చింది. ఆపరేషన్ థియేటర్లో మామూలుగా మాటలు నడుస్తున్నాయి. మత్తు ఎక్కడ ఇచ్చారో తెలియదుట. ఒక్కసారిగా ఉన్నట్టుండి పెద్ద ఏడుపు. ఇంతలో నర్సుఆపరేషన్ థియేటర్ లోనుంచి వస్తూ గులాబీ రంగు టర్కీ టవల్లో చుట్టి బిడ్డని బయటకు తీసుకొచ్చి ఆడపిల్ల పుట్టిందండీ అంటూ ఆనందంగా చెప్పింది. తల్లి గారు బాగానే ఉన్నారు.
ఆ మాటతో గుండెల్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రెండు రోజుల తర్వాత డాక్టర్ గారికి కృతజ్ఞత చెప్పి బయటకు వస్తుంటే రేపు ఇంటికి తీసుకెళ్ళి పోవచ్చు అంటూ డాక్టర్ గారు చెప్పిన మాటలకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. బిల్లు చూసి గుండె గుబేలు మంది.హాస్పిటల్ వెళ్లే ముందు భయం భయంగా కారెక్కిన అమ్మాయి చేతిలో చంటి బిడ్డతో ఆనందంగా కారు దిగి ఆ మూల గదిలో ఆనందంగా బిడ్డని పక్కన పెట్టుకుని విశ్రాంతి తీసుకునేది.
అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు పుట్టించాడు అంటే మన ఆనందంగా ఉండడానికి . పిల్లలు ఉన్న ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఉంటే అసలు చెప్ప అక్కర్లేదు.
మా చిట్టి తల్లి కి మరో బుల్లి తల్లి. నా బుల్లి తల్లి రాకతో మా ఇల్లు స్వరూపమే మారిపోయింది. నడుముకు బెల్టు, చెవులకు గుడ్డ,కాళ్లకు ప్లాస్టిక్ చెప్పు లతో నా చిట్టి తల్లి రూపం మారిపోయింది. చంటి దాని ఏడుపుతో ఇల్లంతా మార్మోగిపోతోంది . గుట్టలుగా ఉన్నా మా ఆవిడ పాత చీరలు ముక్కలుగా మారిపోయి ప్రతి గదిలోనూ కనపడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉండని మా అత్తయ్య గారు ఆరోగ్యం బాగా లేకపోయినా తన టెంపరరీ అడ్రస్ సామర్లకోటకు మార్చి చంటి దానితో బిజీ అయిపోయింది. అసలు చంటి పిల్లల్ని పెంచడం కూడా ఒక కళే. ఆమె అలనాటి సుధీర్ఘ అనుభవంతో నా చిట్టి తల్లి ని ,చంటి దాని కూడా కంటికి రెప్పలా చూసుకునేది. ముత్త అమ్మమ్మ గా ఆమె జీవితం మరో మారు ధన్యమైంది.
వర్క్ ఫ్రం హోం లో ఉన్న మా అల్లుడు అన్నీ తానై ఇద్దరిని చూసిన విధానం మర్చిపోలేనిది.. ఇక మా ఆవిడ ఇంటా బయట పనులతో బిజీ బిజీ.. నా చిట్టి తల్లికి పెట్టే పథ్యం కూరలు గురించి మా ఆవిడ రాత్రంతా ఆలోచిస్తూ ఉండేది. నేను మా ఆవిడ తాత అమ్మమ్మ లాగా కొత్త పాత్రలోకి మారి పోయాము.
మా పనిమనిషి కి ప్రమోషన్ వచ్చి చంటి దానికి స్నానం చేయించే పనికి కుదిరింది . అమెజాన్ వారి ఉయ్యాల, గోద్రెజ్ వారి దోమతెర ,చిన్న దానికి పెద్ద దానికి మందులు సీసాలు, పాత గుడ్డలు, సాంబ్రాణి వే సే కుండ ,విసిన కర్ర ,జల్లెడ, స్నానం చేయించే పీటలతో గది కొత్త రూపు సంతరించుకుంది. రోజంతా స్నానం గురించి కబుర్లు పోలిక గురించి కబుర్లతో ఎక్కడ సమయం తెలియడం లేదు . కాయపు ఉండలు, పాత చింతకాయ పచ్చడి, బీరకాయ ,సొరకాయ ,శొంఠి పొడి డబ్బాలతో నా వంటిల్లు కొత్త వాసనలతో నిండిపోయింది. ఒక జీవి రాకతో ఎన్ని మార్పులు ఎంత హడావిడి.
ఇక మా పిల్ల పిల్లల పెంపకం గురించి అంతర్జాలంలో కోచింగ్ తీసుకుంటోంది .చంటి దాని మామూలు ఏడుపు కూడాకూడా నెట్లో కారణం వెతుకుతోంది. ప్రతినెలా వచ్చే పుట్టిన తేదీ కి రకరకాల ఫోజులు తో వాళ్ళకి ఫోటోలు తీస్తూ కాలక్షేపం చేస్తోంది. ఈ తరం వారికి ఇదో రకమైన ఆనందం. రోజు బీరకాయ సొరకాయతో నాలుక చచ్చిపోయి వెరైటీ పెట్టండి అంటూ రాగాలు తీస్తోంది. మా అత్తగారు మాత్రం చూసి చూడకుండా పత్యం మారుస్తున్న వాళ్ళ అమ్మ మాత్రం లక్ష్మణ గీత దాటడం లేదు. పిల్ల మీద ప్రేమ లేక కాదు చంటిపిల్లకు తేడా చేస్తుందని.
ఇలా రెండు నెలలు గడి చేయి. బారసాల కి ముహూర్తాలు పెట్టి పంపించారు వియ్యాలవారు. మూడో నెలలోనే వారికి ఆనవాయితీ. మా వియ్యాల వారికి ఇద్దరూ మగపిల్లలే. ఈ పిల్లే ఆడపడుచు. మా బావ గారు రోజు whatsup call lo మనవరాలు ఆట పాటలు చూసి మురిసిపోతున్నారు.
అల్లుడు, కూతురు పేరు ఖరారు చేయడానికి కుస్తీ పడుతున్నారు. పేరు ఇంకా లీక్ అవ్వలేదు. నేను మా ఆవిడ బారసాల ఏర్పాట్లు డెకరేషన్ లు ఇన్విటేషన్ లిస్టు సామాన్ల లిస్టు హోటల్ గది బుకింగ్ తో బిజీ బిజీ. క్యాటరింగ్ ఇవ్వడమా వంట వండించడం మా అని తర్జనభర్జన . కరోనా కారణంగా వంట చేయించడానికి నిర్ణయం. హోమాలు జపాలు దానాలు కోపాలు తాపాలు బంధువుల రాకపోకలుతో నామకరణ ఆ మహోత్సవం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య స్వామి వారు అమ్మవారి పేరుతో కలిపి కొల్లూరు చాంతాడులా ఉన్న పేరుని పంతులుగారు గుక్క తిప్పు కోకుండా చదివారు.
వీడియో వాడు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ చంటిపిల్ల ఫోజులకు , తనకు రానీ విద్యను ప్రదర్శించడానికి తంటాలు పడుతున్నాడు. మామిడికాయ పప్పు పులుసు వంకాయ కూర కందా బచ్చలి బూర్లు పులిహార తాపేశ్వరం కాజా తో విందుభోజనం ముగిసింది. ఆఖరి బ్యాచ్ వారికి వర్షం కొంచెం చికాకు చేసిన వరుణ దేవుడి ఆనందభాష్పాలు అని సరి పెట్టుకున్న.
ఇది మా కరోనా నెప్పులు కథ. అప్పుడు పరిస్థితి నిప్పుల్లో ఉన్నట్టు ఉండేది. కడుపులో ఉన్నoత సేపు కలవర పెట్టి బయటకు వచ్చి ఇప్పుడు రోజు తన కబుర్లతో ఆనంద లోకాలలో విహరించేలా చేస్తోంది మా కరోనా మనవరాలు . కాదు కాదు కరోడా మనవరాలు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి