భార్య అంటే
భార్య అంటే
భార్య అనేది కేవలం ఒక బంధం కాదు… ఒక ప్రపంచం. ఆమె తన ప్రేమను మాటల్లో కంటే పనుల్లో చూపిస్తుంది. తన ఆనందాన్ని భర్త, పిల్లల చిరునవ్వులో చూస్తుంది. మనం ఇంట్లోకి అడుగుపెడుతూనే అనుభవించే ప్రశాంతత వెనుక ఆమె కష్టమే ఉంటుంది.
ఆమె కాఫీలో చక్కెర తక్కువైందా ఎక్కువైందా అన్నది గుర్తుండదు, కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకుని చూసుకుంటుంది. పుట్టినరోజు మరిచిపోతే ఒప్పించలేం, కానీ మన ఒత్తిడిని మాత్రం మాటల్లో చెప్పకుండానే గ్రహిస్తుంది.
ఆమె జీవితం అద్దం లాంటిది. మనం ఎలా ఉన్నామో ప్రతిబింబించగలదు. మన భవిష్యత్తుకు బలం ఇచ్చే తోడు .
ఒక భార్య అంటే... తల్లి లా కాపాడే మనసు, స్నేహితురాలిగా హాస్యం పంచే మాటలు, గురువుగా మార్గదర్శనం చేసే జ్ఞానం, ప్రేమికురాలిగా మన హృదయాన్ని తాకే సానుభూతి.
పెళ్లికి ముందు మనం స్వేచ్ఛగా జీవించాం. పెళ్లి తర్వాత మన బాధ్యతలతో జీవించాం. కానీ ఆ బాధ్యతల్లోనూ భార్య చేతిని అందించినప్పుడు జీవితం తేలికగానే గడిచిపోతుంది.
ఎందరో భార్యల కృషిని గుర్తించకుండా మౌనంగా తీసుకుంటున్న సమాజానికి... ఈ మాట చెబితే సరిపోతుంది –
"ఆమె లేకుండా ‘ఇల్లు’ అనేది ఒక గది మాత్రమే."
ఆమె జీవితంలో సెలవులు ఉండవు. గంటల పట్టింపు ఉండదు. ఎవరి అభినందనకోసం కాదు… కానీ కుటుంబం బాగుండాలన్న తపనకోసం, ప్రతి రోజు నిశ్శబ్దంగా పోరాడుతుంది. ఎవరి దృష్టిలోనూ రాకపోయినా, ఆమె మౌన సేవలు ఒక్కో ఇంటిని ఆలయం చేయగలవు.
ఆమె మనసు విశాల సముద్రం లాంటిది. మన అలజడి కోపాలను, నిరుత్సాహాలను తన ఒడిలో చల్లగా కలుపుతుంది. మన విజయాల్లో మించిన ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తుంది. మన పరాజయాల్లో, మన కన్నా ముందుగా ఏడుస్తూ ఆదరిస్తుంది.
సమాజంలో "అతని భార్య" అనే మాట వింటాం కానీ, ఆ మాటలో ఆమె వ్యక్తిత్వం పరిమితమవుతుంది. కానీ నిజంగా చూడాలి అంటే – తన భర్తను మనిషిగా తీర్చిదిద్దే శిల్పి ఆమె. పిల్లలకు గుణశీలాన్ని నేర్పించే మొదటి గురువు ఆమె.
ఒక ఇంటిని సంస్కారం గల కుటుంబంగా మార్చే కళాకారిణి
కూడా ఆమె.
ఆమె అలసిపోయినా, “నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు?” అనే ప్రశ్న అడగదు. ఆమె చిరునవ్వు వెనుక నిద్రలేని రాత్రులు దాగి ఉంటాయి.
ఒక సారి ఆగి ఆలోచించండి…ఆమె కలలు ఏమయ్యాయి?
ఆమెకు నచ్చిన రంగులు, నచ్చిన పాటలు, నచ్చిన వంటలు ఎప్పుడో మాయమయ్యాయి.ఎందుకంటే... కుటుంబం కలలు నెరవేర్చుకోవడం ఆమె కల అయింది.
ఆమె ఒక సైలెంట్ పవర్. ప్రేమకి, త్యాగానికి జీవించిన రూపం. ఆమెని గౌరవించడం, గుర్తించటం మన బాధ్యత మాత్రమే కాదు… మన ఋణం.
ఆమె ఎదురుచూపుల్లో వెలుగు ఉంది. పగటి వెలుతుర్లో కనిపించని ఒక నిశ్శబ్ద తేజం. ఉదయాన్నే కుటుంబానికి అలారం అవుతుంది, రాత్రిపూట సంతోషంగా అందరికీ నిద్రపట్టేలా చేస్తుంది. తన స్వంత అలసటను జోలపాటగా మార్చగలదు ఆమె.
పెళ్లయ్యాక ఆమె పేరు మరిచి, "వాళ్లింటి కోడలు", "అతని భార్య", "అమ్మ" అనే కొత్త గుర్తింపులు పుట్టుకొస్తాయి. కాని ఈ మార్పులో ఆమెను ఆమెగానే గుర్తుపెట్టే వాళ్లు అరుదు. ఆమె చిరునవ్వు వెనుక ఒక చిన్న త్యాగం ఉంటుంది – అది తన స్వంతమైనది.
వేల మంది మధ్యన తన భర్తను గర్వంగా చూడగల కంటి వెలుగు ఆమెది. పిల్లలు చిన్నగా తింటే ఆహారం తృప్తిగా అయ్యింది అనేది ఆమె ఆనందం. ఒక్కసారి పిల్లలు రాత్రి సరిగా నిద్రపట్టకపోతే, ఆ బాధంతా ఆమెకు అంతరంగంలో అలజడి చేస్తుంది.
పండగ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఆమె మాత్రం వంటగదిలో వదిలిపెట్టిన పాత చీరలో సంతోషాన్ని వేసుకుంటుంది. ఎందుకంటే… తన ఆనందం కుటుంబం నవ్వుల్లో పోతుంది.
ఆమె నైతిక శక్తి – కుటుంబాన్ని నిలబెట్టే దీపం. జీవితపు ఆటుపోట్లలో, కష్టకాలంలో భర్తకు ఆసరాగా నిలబడే నీడ. తనను ఎవరూ అర్థం చేసుకోకపోయినా, ఆమె మాత్రం అందరినీ అర్థం చేసుకుంటుంది.
తన అస్తిత్వం కిరణాలా మెరుస్తుంది, కానీ ఎవరికీ స్పష్టంగా కనిపించదు.ఆమెను ప్రేమించడమే కాదు… గుర్తించాలి. గౌరవించాలి. ఆరాధించాలి.
ప్రపంచ వివాహ బంధం దినోత్సవం సందర్భంగా గృహస్తులందరికీ శుభాకాంక్షలు
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి