దుస్తులు

దుస్తులు

"
 పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.

 పోయేటప్పుడు అది నీ వెంట రాదు."

అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర
 భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు
 ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త
 అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి.

రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.

 అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి.
దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే.

ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకునేవాడు. కొంతకాలం జంతు చర్మాలను చుట్టుకునేవాడు.
క్రమేపీ నాగరికత పెరిగి దుస్తుల తయారీ మొదలైంది. 

విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు కలిగిన భారతదేశం లోని ప్రజలు వారి వారి ప్రాంతీయ అలవాట్లను బట్టి రకరకాల దుస్తులు ధరిస్తారు. వృత్తిని బట్టి కూడా ధరించే దుస్తులు మారిపోతాయి. ఉదాహరణకి రైతుకి పంచె తలపాగా బనియన్
సౌకర్యవంతమైన దుస్తులు. ఎందుకంటే గట్టు దిగి రైతు పొలంలో పని చేయాలి. కొంతమంది ధరించే దుస్తులను బట్టి వారి వృత్తి కూడా మనకు తెలుస్తుంది. నల్ల కోటు ధరించేవారు లాయర్లని తెల్ల కోటు ధరించేవారు డాక్టర్లని కాషాయ వస్త్రాలను బట్టి సన్యాసం తీసుకున్న వారని ఒక గుర్తు

యువకులకి ప్యాంటు చొక్కా చిన్నపిల్లలకి నిక్కరు చొక్కా స్త్రీలకు చీరా రవిక బాలికలకు పరికిణి ఓణి ఇవి పూర్వకాలంలో ధరించే దుస్తులు. కాలక్రమేణా సినిమాల ప్రభావం అయితే నేమి విదేశీ సంస్కృతి అయితే నేమి మనం అధునాతన దుస్తులను ధరిస్తున్నాము. 
పుట్టిన పిల్ల దగ్గర నుంచి వృద్ధుల వరకు రకరకాల పేర్లతో రకరకాల దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. మన కుటుంబీకులు కూడా సాంప్రదాయ వస్త్రధారణ మరిచిపోయి ( అందరూ కాదు) ఈ దుస్తులు మీద మొగ్గు చూపుతున్నారు.పెళ్లిళ్లకి పబ్బానికి పండగలకి ఈ సాంప్రదాయ దుస్తులను బయటకు తీస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లిలో కూడా అధునాతన దుస్తులే.

పగలంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి సౌకర్యంగా ఉండే దుస్తులు అంటే లుంగీ తేలికగా ఉండే షర్టు వేసుకునే వాళ్ళం మా కాలంలో. ఈనాటి కూడా మా తరం వారు అవే దుస్తులను ధరిస్తున్నారు. 

ఆఫీసులో ఎలాగా తప్పదు ఇంటికి వచ్చిన తర్వాత శరీరానికి గాలి తగిలేలాగా తేలికగా ఉండే దుస్తులు ధరించడం చాలా సౌకర్యంతంగా ఉంటుంది. అయితే స్త్రీల వస్త్రధారణ లో మార్పు ఏమీ ఉండేది కాదు. ఎప్పటిలాగే వారు చీర రవికా ధరించే వారు.

ఇక రాత్రి వేళ ధరించే దుస్తుల్లో కూడా అధునాతన దుస్తులు వచ్చాయి. ఉదాహరణకు మగ పిల్లలు పొట్టి నిక్కరు ఒక టీ షర్టు ఆడవారు ఒక నైటీ. ఏ ఇంటిలోచూసినఇదే పద్ధతి సాగుతోంది . క్రమంగా పగటి పూట కూడా ఇదే వస్త్రధారణ అలవాటుగా మారింది. 

వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి కొన్న పట్టు చీరలు అధునాతన వస్త్రాలు సూట్లు ఇవి ఆ బీరువాల్లో మూలుగుతూ ఉంటాయి.అవి ఏ పండక్కో పబ్బానికో పెళ్లిళ్లకి బయటకు తీస్తారు. ఎంత అనవసరమైన డబ్బు ఖర్చు. కట్టుకోకపోతే కొని దాచుకోవడం ఎందుకు.ఎవరికి సౌకర్యంగా ఉన్న బట్టలు వారు వేసుకోవడం తప్పులేదు. అనుకోకుండా అతిథులు వస్తే వీరు బయటకు రావడానికి సిగ్గుపడతారు. 

అత్యవసరమైన వస్తువులు కావలసి వస్తే వీరు అదే బట్టలతో ఆడ మగ తేడా లేకుండా రోడ్డు మీద నిర్భయంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మగ పిల్లలు మార్కెట్లోనూ ప్రయాణాల్లోనూ బజార్లోను పొట్టి నిక్కర్లు వేసుకుని టీ షర్ట్లు వేసుకుని కనబడుతున్నారు. ఆరడుగులు పొడుకున్న వ్యక్తి పొట్టి నిక్కరు వేసుకుంటే చూడడానికి బాగుండదు.రాత్రి పగలు ఒకటే వస్త్రధారణ.ఇది సమాజం హర్షించదు. మనం సమాజంలో సంచరించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.

రాత్రిపూట వేసుకునే దుస్తులు పగటి పూట కూడా ధరించి రోడ్డుమీద తిరిగితే అన్ని కళ్ళు మన మీదే ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు మనoఎత్తి చూపాలి. వాటి పేరే నైట్ డ్రెస్. రాత్రిపూట సౌకర్యంగా ఉండేలా వేసుకునే బట్టలు. ఎవరైనా పెద్దవాళ్ళు అభ్యంతరం చెబితే మా ఇష్టం మా శరీరం అనే మాటలు వినబడుతున్నాయి.

 ఎవరు వినినా వినకపోయినా పెద్దవాళ్లు చెప్పవలసిన మాట చెప్పాలి. అంటే మనం ఎవరిని కట్టడి చేయట్లేదు. ధరించకూడని వస్త్రములు ధరించి బయటకు తిరగకూడదని చెబుతున్నా ము. 

గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం ఎవరో చెప్పక్కర్లేదు. అది ఒక పవిత్ర స్థలం. మనసు భాష వేషం కూడా పవిత్రంగా ఉంచుకుని దైవ సన్నిధికి వెళ్లాలి. లేదంటే మనలో ఏది ప్రత్యేకంగా కనిపించిన దేవుడు వైపు దృష్టి ఉండదు ఎవరికి.

ఇదివరకు పుట్టినరోజు పండక్కి మన పండుగలు అన్నింటికీ బట్టలు కొనుక్కునేవాళ్ళం. రెడీమేడ్ సాంప్రదాయం వచ్చిన తర్వాత బజార్లో కనబడిన బట్టలు సమయం సందర్భం లేకుండా కొని ఇంటికి తెచ్చుకుంటున్నాము. మన సంపాదించిన డబ్బులాగే బట్టలను కూడా పొదుపుగా వాడుకోవాలి. అంటే రోజు బట్టలు మార్చవద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దుస్తులు ఎక్కువైన కొద్దీ ఖర్చు ఎక్కువవుతుంది. ఈ రోజుల్లో నగరాల్లో చాకలి వాళ్లు అందుబాటులో లేరు. ఒకవేళ ఉన్న వారి చార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.మనమే వాషింగ్ మిషన్ లో ఉతుక్కుని ఇస్త్రీ చేసుకోవాలి. కరెంటు ఖర్చు ఎంత అవుతుందో లెక్క చూసుకోండి. మనం కొనుక్కున్న బట్టలన్నీ మనం కట్టుకో ము. ఎందుకంటే ఎప్పుడు మనం నైట్ డ్రస్సులతోటే ఉంటున్నాము. ఇంకెందుకు అనవసరంగా ఈ ఖర్చు. పోనీ పాత బట్టలు లేని వాళ్లకి ఇవ్వడానికి మనసు
ఒప్పదు.

ఇక పెళ్లిళ్లలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ప్రత్యేకమైన దుస్తులు కొంటున్నారు. పెళ్లి కూతురికి ఖరీదైన పట్టు చీరలు వేలకు వేలు పోసి కొని ఆనంద పడుతున్నారు. ఈ పెళ్లి హడావుడిలో అవి అమ్మాయి కట్టుకుంటుంది తప్ప మిగతా రోజుల్లో అవి బీరువాల్లో మూలుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లి కొడుకి కొన్న ప్రత్యేకమైన బట్టలు కూడా అంతే. అవి రోజు ఆఫీసుకు వేసుకుని వెళ్లలేడు. రోజు ఫంక్షన్ ఉండవు. పెళ్లి పీటల మీద సాంప్రదాయక దుస్తులు ధరిస్తేనే అందంగా ఉంటుంది. 

చంటి పిల్లలు పుట్టిన తొలి రోజు నుంచి మొదలవుతుంది డ్రెస్సులు హడావుడి. పూర్వకాలంలో బట్టలు కొనుక్కోవాలంటే మనo షాపులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది ఏముంది. మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లు ఆపద్బాంధవులు. మనసు మెచ్చితే ఆర్డర్ పెట్టొచ్చు. మూడు నాలుగు రోజుల్లో ప్యాకెట్లు మన ఇంటికి వచ్చేస్తాయి. పూర్వకాలంలో పిల్లలకు చాలా రోజుల వరకు పల్చటి జుబ్బాలు వేసేవారు. ఇప్పుడు పుట్టిన మరునాటి నుంచి కంపెనీ దుస్తులు. పిల్లలు ప్రతి నెల పెరుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉంటారు. అది వాళ్ళ తత్వం. మొదటి నెలలో వేసిన బట్టలు మూడో నెల నుంచి పనికిరావు. మూలన పెట్టవలసిందే. ఆ బట్టల మీద పెట్టే ఖర్చు పొదుపు చేస్తే బాగుంటుంది. పైగా పిల్లలకి బట్టలు అసౌకర్యంగా ఉంటాయి.
ఆలోచించండి.

చిన్నపిల్లలకి చిన్నప్పటినుంచి దుస్తుల ప్రాధాన్యత గురించి చెబుతూ ఉండాలి. సభా మర్యాద పాటించాలి. సందర్భానుసారం ధరించవలసిన దుస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తల్లి తండ్రి చెబుతూ ఉండాలి. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. చిన్నపిల్లలు తెలియక వేసుకున్న దుస్తులు పెద్దవాళ్ల గౌరవాన్ని పాడుచేస్తాయి. ఆలోచించండ
"దుస్తులు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కాలం మారినా, సందర్భం మారినా, మన మనసు మారినా — దుస్తులు మన సంస్కృతిని, మన విలువలను చెప్పే మౌన భాష. అవసరమైనప్పుడు విలువైన దుస్తులు ధరించడంలో తప్పేమీ లేదు. కానీ, అభిమానం కన్నా అవసరాన్ని ముందుకు పెట్టుకోవాలి. చూపులకు కాని, పోటీకి కాని బడ్జెట్‌ను తాకట్టు పెట్టే రోజులు ఇవి కావు. ధరించేది మనిషి గౌరవానికి గుర్తు కావాలి కానీ, అప్పుల భారానికి ముద్ర కాకూడదు.
అందుకే...
'చూపులకు కాదు... చక్కదనానికి... అవసరానికి అనుగుణంగా దుస్తులు ధరించడమే నిజమైన ఫ్యాషన్.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట