మామిడి పండు

అందాన్ని పండు తో పోలుస్తారు
మనిషి పండు లాఉన్నాడు అంటారు.

పండు చూడ్డానికి కాదు తినడానికి
పండు తింటే పండులా అవుతారు.

ప్రతి సీజన్ కి ఓ పండు
వేసవి వచ్చిందంటే చెప్పాలా
మామిడి పండే మహారాజు.

ఉగాది పండగ తోటే ప్రారంభం.
మామిడికాయ రుచి చూడడం.

వేసవిలో పిందెలతో పచ్చడి బద్దలు
అదేనండి మెంతిబద్దలు లేకుండా ముద్ద 
దిగదు మన తెలుగు ప్రజలకు.

పప్పులో ఓ పుల్ల మామిడి ముక్క 
వెల్లుల్లి తో తాలింపు చేస్తే
అడ్డ విస్తరి అర నిమిషo లో ఖాళీ

ఊరంతా వెతికి తెస్తారు ఊరగాయ కాయ.
నాణ్యం చూడ్డానికి స్నేహితులతో మంతనాలు
పెళ్ళి అంత పని ఊరగాయ పెట్టుకోవడం.
ఆ సందడే వేరు.
అమ్మలకి చేతినిండా పని.
ఈనాటి బొమ్మలకి నగిషీలు దిద్దుకోవడమే పని
కంచం ముందు కూర్చుంటే కాని ఊరగాయ గుర్తుకు రాదు.
అప్పుడు గుర్తుకు వస్తుంది అంగట్లోని పికిల్.

ఎర్రగా నూనెలో తేలుతూ చెరువులోని కలువ పువ్వులా ఉంటుంది కుండలోని ఊరగాయ.
వేసవి వెళ్ళేసరికి సగం కుండ ఖాళీ.
రోజుకో రకం ఆవకాయ తోటి అడ్డవిస్తరి
అద్భుతం అమ్మ చేతిలో ఏముందో మిస్టరీ.
బ్రహ్మ కూడా చెప్పలేడు పామిస్ట్రీ.

బెల్లం ఆవకాయ కలిపిన అన్నం ముద్ద. 
మరునాటికి కూడా నోరు పట్టుకుని వదలదు తీపిదనం.
గుప్పని కొడుతుంది వెల్లుల్లి ఆవకాయ వాసన.
వాసన పీల్చే గానే విస్తరి ముందుకి పరుగు.
మాగాయ మహా రాజు గురించి చెప్పేదేముంది
ఎప్పుడో వేటూరి వారే చెప్పేశారు.
మెంతికాయ ఆ ఊరికే ప్రత్యేకం.
ఆ వూరి తో మాకు చిరకాల బంధుత్వం.
ఆ ఊరే కాకరపర్రు.
మెంతికాయ పాళ్లు ఆ వూరి వారిని అడిగి తెలుసుకోండి.

మామిడి ముక్కల తో రోటి పచ్చడి
కాస్తంత బెల్లం జోడిస్తే అద్భుతః

మన వంటల్లో పప్పు పులుసు కాంబినేషన్ సూపర్
తీయతీయగా పుల్లపుల్లగా ఉండే మామిడి పులుసు
ఆహా నాలుకకి ఏమి అదృష్టం.

నాలుకకు అదృష్టం ఉంటేనే రకరకాల రుచులు చూస్తుంది.
వేసవి కాలం విస్తట్లో పచ్చడి పండు.
ప్రజలందరూ పడిచచ్చే పండు.
బుడ్డి దానికి బుడతల చెట్టు పండు
అన్న కి పాపయ్య రాజు గోవా
చెల్లి కి చెరుకు రసం
నాన్నకు నాలుగు రకాలు ఇష్టం
అమ్మ మిగిలిన పండు తో సంతృప్తి.

పరలోకం వారి పేరుతో ప్రతి యేటా తొలి పండు.
ఇహలోకంలో వేసవిలో పండుతోనే జనం పొట్ట నింపు.

మామిడి పళ్ళు సీజన్ అయిపోతే బెంగ ఎందుకు.
మ్యాంగో జల్లి ఉందిగా మీ చెంత.
కాకినాడ నుంచి నాలుగు అడుగులు వేస్తే
సర్పవరం లో మ్యాంగో జల్లి సందడే సందడి.
సందుల్లో గొందుల్లో మ్యాంగో జల్లి చాపల పందిళ్లు.
ముక్క తీసుకుని నములుతుంటే స్వర్గమే కనిపించు.

వడ దెబ్బకి మామిడి రసం 
చెప్పింది ఆయుర్వేదం.
పరోపకారి మామిడి నీకు నమస్కారం

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
           కాకినాడ 
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట