చెవిలో చెబితే!

చెవిలో చెబితే! 

మనిషి జన్మంతా కోరిక మయం. బాధల మయం
కోరిన కోరికలు తీర్చుకోవడానికి మనిషి దేవుడిని నమ్ముతాడు. దేవాలయాల కి వెళ్తాడు. మ్రొక్కులుచెల్లిస్తాడు . ఏడుకొండలు ఎక్కితే గాని వెంకటేశ్వర స్వామి కరుణించడు. పదునెనిమిది మెట్లు ఎక్కితే గాని అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి కాదు. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే గాని శివయ్య కరుణాకటాక్షాలు భక్తులకు లభించవు. ఏ దేవాలయంలో నైనా గర్భగుడిలో భక్తులకు అనుమతి లేదు. కొన్ని దేవాలయాల్లో తప్పితే దేవుని భక్తులు తాకరాదు. కానీ ఒక అపురూపమైన స్వామి భక్తుల కోరికలను తన చెవిలో చెప్పించుకుని ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు

. ఆ స్వామి ఎవరో కాదు కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి. ఇది పురాతనమైన దేవాలయం. ఈ స్వామికి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలావిగ్రహం. భూమి లోపల ఎన్ని అడుగులు ఉందో ఎవరికీ తెలియదు . చాళుక్యుల కాలంలో కట్టిన గుడి అని చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ స్వామి అనుగ్రహం కోసం సుదూర ప్రాంతాల నుంచి
వచ్చి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం స్వీకరించి
వెళ్తుంటారు. పూజాదికాల సమయాలు ఎక్కడా వివరాలు లభించలేదు. గుడి ఉదయం 6:30 గంటలకు తెరుస్తారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ప్రతి నెల సంకటహర చవితినాడు లక్షపత్రి పూజ జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

భాద్రపద శుద్ధ చవితి మొదలు తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న
ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చేయవలసి ఉంది. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచవలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలోని కాకినాడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూర ప్రాంతంలో నుండి వచ్చేవాళ్ళు ద్వారపూడి రైల్వే స్టేషన్లలో దిగి రావచ్చు. రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి బస్సు సౌకర్యం కలదు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట