నోము

నోము

సాయంకాలం నాలుగు గంటలు అయింది. చీకటి పడిపోతుందని ఒకటే భయం. ప్రతిరోజు చీకటి పడుతుంది. చీకటి అంటే భయం కాదు. ఇంకా గిన్నెలో సగం పైగా ప్రసాదం ఉండిపోయింది వచ్చే వాళ్ళు ఎవరూ కనబడటం లేదు. 

ఎలాగా ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాబోలు అనుకుంటూ దేవుడికి అనేక దండాలు పెట్టుకుంటూ ఆ అగ్రహారంలో ప్రతి ఇంటికి ఇద్దరు మనుషులను పంపించి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో అని లేదంటే ఇంట్లో ఉన్నవాళ్లు ప్రసాదం తినడానికి రాకుండా ఉండిపోయారేమో అని ఎంక్వయిరీ చేస్తూ ఎదురుచూస్తోంది సీతమ్మ. ఆ ఊరికి వచ్చే ఆఖరి బస్సు ఐదు గంటలకు వస్తుంది. ఆ బస్సులో ఎవరింటికైనా చుట్టాలు రాకపోతారా అని ఆశగా చూస్తోంది.

సాధారణంగా స్త్రీలు ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. ప్రతి నోము కి ఒక రకమైన నియమం ఉంటుంది. మరి సీతమ్మ గారు పట్టి న నోము పేరు చెప్పలేదు కదా. అదేనండి నంది కేశుడి నోము అన్నీ అయిపోయాయి కానీ ఒక్క సెనగలు మాత్రం మిగిలిపోయాయి సీతమ్మ గారికి. సూర్యాస్తమయం అయ్యే లోగా ఆ ప్రసాదం చెల్లిపోవాలి. ఇదివరకు ముందుగా వినాయకుడు పెట్టిన ఉండ్రాళ్ళు మధ్యాహ్నానికే చెల్లిపోయా యి. 
కాలభైరవుడికి పెట్టిన గారెలు కూడా ఉదయం టిఫిన్ సమయానికి పిలిచి పెట్టేసారు. గారెలు ఎవరైనా తినేస్తారు.దానికి కూడా ఏమి శ్రమ పడలేదు. అట్లుకి అసలు ఆలోచన లేదు. ఎందుకంటే నిత్యం మనం ఉదయం టిఫిన్ కి అట్లు కూడా వేసుకుంటాం. పరమాన్నం చిమిలి చలిమిడి తీపి వస్తువులు కదా అని భయపడిన చేయవలసిన విధానంగా చేసి అందరి చేత చాలా బాగున్నాయని ప్రశంసలు పొందింది సీతమ్మ. చేయవలసిన విధానం అంటే ఏమిటి అని అడిగితే తీపి వస్తువులు కదా ఎక్కువ తీపి వెయ్యకూడదు సమంగా వెయ్యాలి అప్పుడు ఎవరికి మొహం మొత్తదు. వికారం రాదు. అని మా అమ్మ చెప్పేది అంటూ చెప్పిన సీతమ్మ గారు నోము మధ్యాహ్నానికే అయిపోయింది. ఇంకా పులగం నోము కూడా ఏ సమస్య లేదు. ఒకటా రెండా ఐదుశే ర్లు ముడి సరుకుతో చేసిన ప్రసాదం.

 ఉదయం పూజ జరిపించేటప్పుడు పంతులు గారు చెప్పిన ఆ కథలోని ముత్తయిదు ఇంటికి వచ్చిన దేవతలందరినీ మరొకసారి తలుచుకుంది. ఎవరైనా తన కోరిక తీర్చకపోతారని. అందులో శనగలు కదా ఎక్కువ ఎవరు తినలేరు. మహా అయితే రెండు గుప్పిళ్ళు కన్నా తినలేరు. ఉదయం నుంచి అసలు టెన్షన్ గానే ఉంది చాలామంది ఉత్తి సెనగలు తినలేరు వడలు వేసి పెట్టండి అని సలహా ఇచ్చారు. కానీ శాస్త్రం అలా చెప్పలేదని సీతమ్మ గారు అందుకు ఒప్పుకోలేదు. 

ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంత టెన్షన్ పడలేదు. సాఫీగానే మిగిలిన నోములన్ని అయిపోయాయి కానీ ఈ సెనగలు ఒక్కటే ఇబ్బందిగా ఉంది. అనుకుంటూ బుర్ర పనిచేయక అటు ఇటు తిరుగుతున్నారు. వీధిలోకి మాటిమాటికి తొంగి చూస్తున్నారు. ఎవరైనా పొరుగురు నుంచి బ్రాహ్మణ లు వస్తున్నారేమో నని. ఇది వచ్చిన చిక్కల్లా బ్రాహ్మణులకే పెట్టాలి. బయటకి తీసికెళ్ళి పెట్టకూడదు.అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులు పది కొంపలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇంటి నిండా పిల్లలు ఉండడంతో నోములు ఆగ్రహారం లోని వాళ్లతోటే చెల్లి పోయేవి. .సూర్యాస్తమయానికి ఇంకో గంట టైమే ఉంది ఈలోగా చెల్లకపోతే గోమాతకు పెట్టేయాలి. 

ఇలా చేయడానికి సీతమ్మ గారికి మనసు ఒప్పలేదు. నిజమే నోము చె ల్లకపోతే మనసు అదో రకంగా ఉంటుంది. పల్లెటూర్లోనే ఇంత సమస్యగా ఉంటే పట్టణాల్లో ఇంకెంత సమస్య అనుకున్నారు సీతమ్మ గారు. అక్కడ దూరం దూరంగా ఉంటాయి ఇళ్లు.అందరి ఇళ్లకు వెళ్లి పిలవడం కూడా పూర్వకాలంలో ఒక సమస్య. ఆధుని కాలంలో వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లు చూసుకుని పనిగట్టుకుని వెళ్లి ఆ కార్యక్రమo పూర్తి చేయడానికి సహాయపడుతున్నారు నగరవాసులు. నోముల గ్రూపు చాలా ఉపయోగకరంగా ఉందిట అనుకుంది సీతమ్మ గారు. సీతమ్మ గారికి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు పార్వతి దేవికి మొక్కుకునేది. అది ఆవిడకి నమ్మకం. 

ఇంతలో బస్సు చప్పుడయింది. దేవుడు గుడి దగ్గరే బస్టాండ్. బస్టాండ్ లో బస్సు ఆగగానే ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారా అని ఎదురు చూశారు సీతమ్మ గారి భర్త రామశాస్త్రి గారు ఆ బస్టాండ్ కి వెళ్లి. ఇంతలో ఒక పెద్ద భారీ కాయం లుంగీపంచి రెండు జేబులు ఉన్న చొక్కా వేసుకుని వినాయకుడిలా బస్సు దిగుతూ కనిపించాడు ఒక పెద్దాయన రామశాస్త్రి గారికి. రామ శాస్త్రి గారు ఆయన చూడగానే తమ్ముడు గారు నమస్కారం ఇదేనా రావడం అంటూ పలకరించాడు. అవునండి అన్నయ్యగారు మా అక్కయ్య గారికి ఒంట్లో బాలేదు చూసి పోదామని వచ్చాను అటు బస్సు దిగాడు. ఆయన పేరు సూరప రాజుగారు. పేరులో రాజు ఉంది కానీ సాక్షాత్తు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడే. పైగా మా ఊరి కర్ణంగారి స్వయానా బావమరిది. 

ఆయనో బ్రహ్మచారి . కాకినాడలో ఉంటూ సుబ్బయ్య హోటల్ లో క్యారేజీ తెప్పించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. మంచి తిండి పుష్టి గల వ్యక్తి. తన ఇంట్లో ఉండే గదుల్ని స్టూడెంట్ లకు అద్దె కి ఇచ్చి వాళ్లు సుబ్బయ్య హోటల్ నుంచి తెప్పించుకునే క్యారేజీల్లో కూరలు కూడా కొన్ని తీసుకునేవారు.పైగా కూరలు సరిపోవట్లేదు అంటూ సుబ్బయ్య గారికి కంప్లైంట్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది.ఆయన బస్సు దిగిన వెంటనే రామశాస్త్రి గారు తన భార్య సీతమ్మ గారి నోము సంగతి చెప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన్ని గుమ్మoల్లో చూడగానే సీతమ్మ గారి మొహం వెలిగిపోయింది. తన నోము సంపూర్తి చేయడానికి వినాయకుడే మళ్ళీ వచ్చినట్లు భావించింది. గుమ్మoల్లోకి రాగానే కాళ్లు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి పట్టె మంచం చూపించారు కూర్చోమని. మామూలుగా కుర్చీలో ఆయన కూర్చోలేరు. సూరప రాజు గారు మంచం మీద కూర్చునిఇప్పుడు చెప్పండి ఏమిటి నోము అని అడిగారు .. ఈరోజు శనగల నోమండి మరిది గారు అoటు ఆ సెనగల గిన్ని ఆయన ముందర పెట్టారు. సూరప రాజు గారివి పెద్ద పెద్ద చేతులు వాటితో సెనగలు తీసుకుని నములుతూ మధ్య మధ్యలో మంచినీళ్లు తాగుతూ పావుగంటలో గిన్నె ఖాళీ చేసేసా రు. సీతమ్మ గారికి ఆయన శక్తిసామర్ధ్యాలు ఇదివరకే తెలుసు. 

పరమాన్నం నోము చెల్లిపోవడానికి ఆరోజు కూడా సూరప రాజు గారు చాలా సహాయం చేశారు. సీతమ్మ గారు బ్రహ్మానందం పడిపోతూ వేడివేడిగా కాఫీ కప్ అందించారు. సరేనమ్మా వెళ్ళొస్తానంటూ మంచం మీద లేచిన సూరప రాజు గారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందపడిపోయారు. దానికి ఏముందమ్మా మనం మనం ఒకటి నేను నా చేతుల్లో ఉన్న సహాయం చేశాను అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు సూరపరాజు గారు. చేతులతో సహాయం కాదు నోటితో సహాయం చేశారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సరదాగా నవ్వుకున్నారు. అలాంటి మనుషులు ఎక్కడున్నారు. అలాంటి అభిమానాలు ఎక్కడ ఉన్నాయి. 

 అలా ఎంతమందికి సహాయం చేశారో సూరప రాజుగారు. మొత్తానికి సీతమ్మ గారి నోము అయిపోయింది. ఆ కాలం కాబట్టి పిలిచిన వెంటనే ఆయన సరాసరి బస్టాండ్ నుండి రామ శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. కానీ ఈ రోజుల్లో అందరికీ బీపీలు షుగర్లు ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వాళ్ళు మొహమాటం కొద్ది మన ఇంటికి వస్తే రేపు పొద్దున్న వాళ్లకి ఏదైనా అయితే మనకి బాధగా ఉంటుంది. అయినా కూడా ఈ రోజుల్లో నగరాల్లో నోములు తొందరగానే చెల్లిపోతున్నాయి.

నేను విద్యార్థి దశలో ఉండగా కాకినాడ బ్యాంక్ కాలనీలో ఉండే రోజుల్లో ఇంచుమించుగా సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారా అంటూ ఒక ఆమె టెన్షన్ గా ప్రతి ఇంటికి తిరిగి అడుగుతూ వారింటికి తీసుకెళ్లింది. పాపం వారిది ఆరోజు పరమాన్నం నోము. పైగా వారు ఆరోజు వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. చిన్న పెద్ద అందరూ ఆ కాలనీలో ఉండేవాళ్ళం వెళ్లి నోము సంపూర్తి చేసి సంతృప్తిగా ఇంటిదారి పట్టాము. ఆ అనుభవం తలుచుకున్నప్పుడల్లా ఎంతో మధురంగా ఉంటుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం