పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం.
అసుర సంహారం చేయడానికి దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు దశరధ మహారాజుకు కొడుకుగా పుట్టి సకల శాస్త్రాలు విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేసి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవిని భార్యగా చేపట్టి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యే సమయంలో పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు నార చీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉండగా మాయావి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. వానర వీరుడు సుగ్రీవుడు సైన్యం సహాయంతో సముద్రాన్ని దాటి లంక నగరాన్ని చేరుకుని రావణ సేనతోయుద్ధం చేస్తూ అనేకమంది రాక్షసులను సంహరిస్తాడు. చివరిగా రావణాసురుడు తోటి తలపడతాడు.
ఇలా భీకరంగా జరిగిన రామ రావణ యుద్ధంలో దశకంఠుడు శ్రీరామచంద్రమూర్తి చేతులో ప్రాణాలు కోల్పోతాడు. సమస్త దేవతలు ఆనంద ఉత్సాహాలతో పుష్ప వర్షం కురిపించారు. రామచంద్ర మూర్తికి అభినందనలు ఆశీస్సులు అందజేశారు విభీషణుడిని లంకా రాజ్యానికి అధిపతిగా చేసి రామచంద్రుడు అయోధ్య నగరానికి బయలుదేరుతానని తగిన ఏర్పాట్లు చేయమని కోరుతాడు .
కాలినడకన అయోధ్యకు బయలుదేరడం చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి రామచంద్ర మూర్తి మీ పరివారంతో పుష్పక విమానం అధిరోహించి అయోధ్యకు వెళ్ళమని కోరుతాడు విభీషణుడు.
విభీషణుడు కోరిక ప్రకారం శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతోటీ వానర వీరుల తోటి పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరే సమయంలో సీతాదేవి శ్రీరామచంద్రమూర్తిని ఒక కోరిక కోరుతుంది. వానర వీరుల భార్యలందరినికూడా అయోధ్య నగరానికి తీసుకువెళ్లాలనీ . ఇలా శ్రీరామచంద్రుడు సీతాదేవి తన సమస్త పరివారము వానర వీరులు వారి భార్యలను కూడా వెంటబెట్టుకుని ఆకాశమార్గంలో ప్రయాణం చేస్తూ యుద్ధభూమి దాటుతున్న సమయంలో ఇది రామ రావణ యుద్ధం జరిగిన ప్రదేశం ,కుంభకర్ణుడు వధించబడిన ప్రదేశం, ఇంద్రజిత్తు చనిపోయిన ప్రదేశం, ఇది చిత్రకూట పర్వతం ,ఇది గుహు డు రాజధాని అంటూ వివిధ ప్రదేశములను చూపిస్తూ దారిలో భరద్వాజ ముని ఆశ్రమం వద్ద దగ్గర ఆగుతారు.
భరద్వాజ మహర్షి రామచంద్ర మూర్తిని సాదరంగా స్వాగతం పలుకుతూ నువ్వు రావణాసురుని వధించి భూభారం తొలగించావని నా దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాను . నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి నవ్వి అయోధ్య నగరానికి వెళ్లే దారిలో ఉన్న వృక్షములన్ని ఫలములు పుష్పములుతో నిండుగా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటాడు.
తన వెంట తీసుకువచ్చిన వానర మూకకి ఆతిథ్యం ఇవ్వాలి కదా మరి. ఎంత దూరదృష్టి ఈ మహానుభావుడుది. మళ్లీ భరద్వాజ ఆశ్రమం నుంచి బయలుదేరే సమయంలో హనుమంతుడిని పిలిచి హనుమ నువ్వు నా మనిషిగా ముందు గుహడికి ఈ వర్తమానం అందజేయి. అలాగే నంది గ్రామం వెళ్లి భరతుడికి సీతాపహరణం దగ్గర నుంచి రామ రావణ యుద్ధం వరకు అన్నీ తెలియజేసి నేను అయోధ్యకు వస్తున్నానని అయోధ్య మీద తనకు రాజకాంక్ష లేదని కావాలంటే భరతుడు రాజుగా కొనసాగ వచ్చని నా మాటగా చెప్పమని హనుమంతుడిని పంపిస్తాడు శ్రీరామచంద్రమూర్తి.
అలా ప్రభువాజ్ఞ అనుసరించి హనుమంతుడు మానవ రూపంలో నంది గ్రామం చేరుకుని అక్కడ నార చీరలు ధరించి విరాగిలా బ్రతుకుతున్న భరతుడికి ఈ విషయం తెలియచేస్తాడు. భరతుడు సంతోషించి మూర్చపోయి తేరుకుని హనుమంతుడిని భరతుడు తగిన రీతిగా సత్కరిస్తాడు.
అప్పుడు శత్రుఘ్నుడుకి ఈ వర్తమానం అందజేసి శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అయోధ్యలో ఉన్న శత్రుఘ్నుడు కైకేయి కౌశల్య సుమిత్ర సమస్త మంత్రులు అందరూ నందిగ్రామం చేరుకుంటారు. రాముడు తిరిగి వస్తున్నాడుఅనే విషయం తెలుసుకొని అయోధ్య ప్రజలు కూడా నంది గ్రామం చేరుకుంటారు.
భరతుడు రామపాదకులను, రాజచత్రమును, చామరములను తీసుకుని సమస్త ప్రజానీకము సమస్త పరివారము తన వెంట శంఖానాదములు సుమధుర నాథధ్వనులు మ్రోగించుకుంటూ పురోహితులు వేదమంత్రోచ్ఛరణ చేస్తూ శ్రీరామచంద్రమూర్తికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో ఎంతసేపటికి రామచంద్ర మూర్తి జాడ కనిపించకపోయేసరికి మీరు నాతో పరిహాసమాడుతున్నారు ఎక్కడ రామచంద్రమూర్తి కనిపించడం లేదు అంటూ హనుమంతుడితో భరతుడుచెప్పగా హనుమంతుడు ఆకాశం వైపు చూపిస్తాడు.
ఆ సమయంలో పుష్పక విమానం వచ్చి ఆగుతుంది.
అందులోంచి దిగివచ్చిన రామచంద్ర మూర్తి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ప్రజలంతా జయ జయ ధ్వనాలు చేస్తారు శ్రీరామచంద్రమూర్తి ముందుగా తమ్ముడు భరతడిని ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసి తదుపరి మాతృమూర్తులను గురువులను పురోహితులను సమస్త ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం చేస్తాడు.తర్వాత శ్రీరామచంద్రమూర్తి పుష్పక విమానాన్ని తన యజమాని దగ్గరికి వెళ్లి పోవాల్సిందిగా కోరుతాడు.
అటు పిమ్మట భరతుడు రామచంద్ర మూర్తి ఎదుట శ్రీరామపాదుకులను ఉంచి మీరు అరణ్యవాసం చేస్తున్నప్పుడు నేను పర్యవేక్షించిన అయోధ్య రాజ్యం ఇప్పుడు సమస్త సంపదలతోటి తులతూగు తోంది .ప్రజలందరూ ఆనందంగా సుభిక్షంగా ఉన్నారు.
నేను వీటిని అన్నిటిని త్యజించి మీకు ధారాధత్తం చేస్తున్నాను అంటాడు. అలాగే వశిష్టుల వారిని పిలిచి పట్టాభిషేక మహోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు.
కుల గురువులైన వశిష్టులవారు రామచంద్ర మూర్తి కి శిరోము oడనము కావించి జటజూటాదుల నుండి విముక్తి కలిగిస్తాడు. రామచంద్ర మూర్తికి సర్వ ఆభరణములతో పుష్పమాలతో అలంకారం చేస్తారు. రాజోచితమైన దుస్తులు ధరింప చేస్తారు. అలాగే సీతాదేవికి కూడా ముగ్గురు మహారాణులు అలంకరణ చేస్తారు. వచ్చిన వానరు వీరులకి, విభీషణుడికి తగిన అతిధి మర్యాద ఏర్పాట్లను శత్రుఘ్నుడు పర్యవేక్షిస్తాడు. సమస్త నదీ జలాలు , కళ్యాణ మహోత్సవానికి కావలసిన సామాగ్రి అంతా కులగురువు వశిష్ఠులు వారికి అందజేయగా బ్రాహ్మణోత్తమములు, వశిష్టుడు వేదమంత్ర పఠనం చేస్తుండగా సీతారాములు అయోధ్య నగర సింహాసనాన్ని అధిరోహిస్తారు.
సమస్త ఋషులు సీతారాములను సమస్త నదీ జలాలతో అభిషేకిస్తారు. దేవగంధర్వులు ఓషధులతో అభిషేకం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న కిరీటాన్ని రామచంద్రమూర్తి శిరస్సుపై అలంకారం చేస్తారు
శత్రుఘ్నుడు గొడుగు పట్టుకొనగా విభీషణుడు సుగ్రీవుడు వింజామరలు వీచుతారు. అప్సరసలు ఆనంద నృత్యాలు చేయగా సమస్త ప్రజానీకo రామచంద్ర మూర్తి కి జై అంటూ ఉత్సాహంగా అరుస్తుంటే సమస్త దేవతలు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిపిస్తారు . అందరూ తగిన కానుకులు ఇచ్చి రామచంద్ర మూర్తిని ఆశీర్వదించారు. వచ్చిన తిధులు అందరినీ సత్కరించి తగిన రీతిలో కానుకలు అందజేసి కృతజ్ఞతలు తెలియ చెప్పుతాడు రామచంద్రమూర్తి.
ఇలా పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించిన రామచంద్ర మూర్తి రాజ్యంలో ప్రజలందరూ ఆనందంగా సుభిక్షులై పాడిపంటలతో ధనరాసులతో కాలక్షేపం చేసేవారు. అటువంటి రామచంద్ర మూర్తిని వేనోళ్ళ కొనియాడేవారు. నిత్యం రామ నామ జపం చేస్తూ జగమంతా రామమయంగా ఉండేది.
అటువంటి రామచంద్ర మూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించగా అదే రోజున మనము శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం ,శ్రీ రామ పట్టాభిషేకం కూడా జరుపుకుంటాం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి