చిలిపి పనులు
చిలిపి పనులు
అర్ధరాత్రి 12 గంటలు అయింది.
వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో ఒక పదిమంది యువకులు
నిలబడి ఉన్నారు. "ఎవరండీ ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు గోవిందరావు . 'చలపతి రావు గారు పంపించారండి ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా యువకులు. వస్తున్నాను ఉండండి. కొట్టు తీస్తాను అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వచ్చి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు.
గోవిందరావు అంటే మా ఊర్లో ఉన్న ఏకైక కోమటి .కిరాణా కొట్టు వ్యాపారం అక్కడ లేని సరుకుంటూ ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపిన సరుకు అప్పిస్తాడు. లేదు లేదంటూనే కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టువాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది వ్యవసాయం పనులు కోసం అప్పు తీసుకుని పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యo కొనుగోలు కూడా ఆయనే. మా ఊరుకి బ్యాంక్ లాంటివాడని చెప్పొచ్చు.
ఆయుర్వేదిక్ డాక్టర్ గా పనిచేసే సదరు చలపతిరావు గారు ఎప్పుడూ ఇంగువ గురించి గోవిందరావు గారిని అర్ధరాత్రి అపరాత్రి లేపుతూనే ఉంటారు. చలపతిరావు గారు కూడా ఆ ఊర్లో ఉన్న ఏకైక ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయుర్వేద మందులతో పాటు ఇంగ్లీష్ వైద్యం కూడా చేస్తుంటారు. పురుడు వచ్చిన వాళ్ళకి ఇంగువ తప్పనిసరిగా వేస్తుంటాడు చలపతి రావు గారు. అంత మంచి ఇంగువ దొరకాలంటే పక్క ఊరికి వెళ్లాలి. గోవిందరావు కొట్లో కూడా మంచి ఇంగువ దొరుకుతుంది. అలా డబ్బా గురించి వెతకడం మొదలెట్టిన గోవిందరావుకి ఇంగువ డబ్బా దొరకలేదు.
"అబ్బాయిగారు ఇంగువ అయిపోయింది. రేపు ఉదయం తెచ్చిస్తాను అని చెప్పండి అని అన్నాడు గోవిందరావు . అయ్యో! అనవసరంగా మిమ్మల్ని నిద్ర లేపేమే అంటూ మెట్లు దిగుతూ ఏమనుకోకండి మర్చిపోయాం . ఈ సామాన్లు కూడా కావాలట అంటూ లిస్టు చేతిలో పెట్టారు. ఉదయాన్నే ఎవరో బంధువులు వస్తున్నారుట అంటూ చెప్పారు. ఇంతకీ ఆ లిస్టులో ఏముంది శెనగపిండి, కారం ,జీలకర్ర , నూనె ,టీ పొడి ,పంచదార అని వ్రాసి ఉంది. గోవిందరావు మనసులోనే తిట్టుకుంటూ ఆ ఊరి ఏకైక డాక్టర్ కదా ఏదైనా అవసరం వస్తే ఆయన వైద్యం చేయడని భయపడి సరుకులన్నీ కట్టి ఇచ్చాడు. ఆ వచ్చిన యువకుల్లో చలపతిరావు గారి పెద్దబ్బాయి కూడా ఉన్నాడు. అందుకే నమ్మకం కుదిరింది. అందుకే చలపతిరావు గారి పేరు మీద పద్దు రాసుకున్నాడు. అబ్బా ఇవాళ పొద్దున్నుంచి బేరాలు లేవని అనుకున్నాను.
తేదీ మారకుండా దేవుడు కొద్దిగా గొప్ప బేరం తీసుకొచ్చాడు అనుకుని దేవుడికి దండం పెట్టుకుని అలా మంచం మీద పడుకున్నాడు.
అలా సరుకు పట్టుకుని ఆ యువకులు మెట్లు దిగి రోడ్డుమీదికి వచ్చి తమలో తాము నవ్వుకుంటూ అసలు పక్క మీద నుంచి లేస్తాడని అనుకోలేదు. మనం చెప్పిన మాట బాగానే నమ్మేడనుకుంటూ తదుపరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అసలు వీళ్ళు ఎవరు ఎందుకు అర్ధరాత్రిలా తిరుగుతున్నారు అని అందరికీ సందేహం కలగొచ్చు. వీళ్లంతా యువకులు కాదు. కొంతమందికి పెళ్లిళ్లు కూడా అయ్యే యి. ఇంకా జీవితంలో పూర్తిగా స్థిరపడని వాళ్ళు వీళ్ళు. రాత్రిపూట నిద్ర పట్టక అర్ధరాత్రి వరకు అరు గుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుని ఏవీ తోచక ఇలా పలహారాలు తయారు చేసుకుని తినేసి ఎవరింటికి వారు వెళ్లిపోయే వారు. ఇది వాళ్ళ దినచర్య. ఇంతకీ వీళ్లు ఇలా అర్ధరాత్రి వేళ ఎందుకు తిరుగుతున్నారు. ఆ ఊర్లో అప్పట్లో దొంగల భయం ఉండేది. అందుకని యువకులంతా కలిసి రాత్రి కాపలా కాసే వారు. ఆ కాపలా లో భాగంగా ఇలా ఫలహారాలు తయారు చేయడం మొదలు పెట్టారు. దాంతోటి సమయం గడిచిపోతుంది, నిద్ర నుండి తప్పించుకోవచ్చు, అంతేకాదు సందడిగా ఉంటే దొంగలు ఎవరూ రారని వీళ్ళ మాస్టర్ ప్లాన్.
ఆ రోజు వాళ్ళ మెనూ అరటికాయ బజ్జి మరియు వేడివేడి టి. ముడి సరుకు అంతా సమకూర్చుకున్నారు. వాళ్ల పని ఏమిటంటే రేపు తయారు చేయబోయే ఫలహారానికి ప్లాను తొలిరోజే తయారు చేసుకునేవారు.అలాగా ఆ ఊరి కరణం గారి దొడ్లో అరటి గెల కనబడింది. ఇంకేముంది తొలిరోజే అరటికాయ బజ్జి ప్లాన్ తయారయిపోయింది. స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసారు. అర్ధరాత్రి కరణం గారి దొడ్లోని అరటి గె ల కి కాళ్లు వచ్చి తొక్క ఊడిపోయి చక్రాల కింద మారిపోయి గిన్నెలోని నీళ్ళల్లోకి చేరిపోయేయి. మరి వంట తయారు చేయడానికి ఒక అడ్డా ఉండాలి కదా. ఇంటి వెనక తయారు చేస్తే ఇంట్లో వాళ్ళు లేచిపోతారు. అందుకే తోటలో చింత చెట్టు కింద నాలుగు ఇటికలు పెట్టి వంట చెరుకు దొబ్బుకొచ్చి బూర్లు మూకుడు పెట్టి అందరిలోకి పెద్దాయన పెద్ద వంట మనిషి లాగా బజ్జీ రూపు తీసుకొచ్చేసాడు.
చుట్టూ చీకటి. కట్టెల మంట వెలుగు తప్పితే ఇంకేమీ కనబడటం లేదు.వాయి తీస్తూనే ఉన్నాడు. తీసినవి తీసినట్టు అయిపోతున్నాయి. చివరికి ఆ వంట చేసే ఆయనకి మిగలవని సందేహం వచ్చింది. ఒరేయ్ అన్నీ తెచ్చాం కానీ పాలు తీసుకురాలేదు రా. ఇప్పుడు ఎలాగా అంటూ ఒకళ్ళకొకళ్ళు మొహాలు చూసుకున్నారు. ఇంతలో అందరికంటే పొడవుగా ఉన్న ఒక పెద్దాయన లేచి నేను తీసుకొస్తాను పాలు అంటూ వీరుడిలా బయలుదేరాడు. అయినా ఇంత అర్ధరాత్రి వేళ వీడు పాలు ఎలా తీసుకొస్తాడు అంటూ అనుమానంగా చూశారు మిగతా వాళ్ళు.
మళ్లీ అంతలోనే భయం ,నువ్వు ఒక్కడివే వెళ్లొద్దు మేమిద్దరం కూడా వస్తాం అంటూ ఇద్దరు యువకులు లేచి మొత్తం ముగ్గురు బయలుదేరారు. ఇంతకీ ఆ పెద్దాయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఆ ఊరి ప్రెసిడెంట్ గారి దొడ్లో ఉన్న కొమ్ములు లేని ఆవు బాగా సాధు జంతువు. పాలు ఎప్పుడు పితికిన ఎవరు పితికిన అర్ధరాత్రి అయినా సరే పాలిచ్చేస్తుంది. అంత మంచి జాతికి చెందిన ఆవు దగ్గరకి చెంబు తీసుకుని బయలుదేరారు. బ్యాటరీ లైట్ వెలుగులో ఆ పాకలో ఆవు ఎక్కడ ఉందో వెతుక్కోవడం కష్టమైంది. మొత్తానికి ఎక్కడో మూలన ఉన్న ఎర్ర ఆవును పట్టుకుని ఆ చెంబులోకి పాలు పితుకున్నారు. ఆ పాలు పితికిన ఆయనకి ఎవరెస్టు శిఖరం ఎక్కిన అంత ఆనందం కలిగింది. మొత్తం అందరూ కలిపి ఆ పాల చెంబు పట్టుకుని గమ్యం చేరేటప్పటికి దూరంగా కాలవ గట్టుమీద ఏదో వెలుగు కనబడుతుంది. చేతిలో హరికేన్ లాంతరు అటు ఇటు ఊగుతోంది. ఎవరబ్బా ఆ మనిషి. దొంగ కాదు కదా. దొంగ అయితే లైట్ పెట్టుకుని ఎందుకు తిరుగుతాడు. ఇలా అనుమానిస్తూ ుయువకులు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. వీళ్ళను చూసి ఆ మనిషి వేగం పెంచి పొలాల్లోంచి పరిగెత్తుకుంటూ అలా ఊర్లోకి వెళ్ళిపోయాడు.
ఇంతలో టీ పొంగిపోతోందంటూ ఎవరో అరిచారు గట్టిగా.
ఆ యువకులు తిరిగి వచ్చి గ్లాసుల్లో పోసుకుని తాగుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో ఊర్లోంచి ఎవరో వస్తున్నట్టు చప్పుడు అయింది.
బ్యాటరీ లైట్లు పట్టుకుని కర్ర లు పట్టుకుని ఆ ఊరి జనం వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్యాటరీ లైట్ వెలుగులో వీళ్ళను చూసి మనవాళ్లే రా మన పిల్లలే దొంగలు కాదు గాడిద గుడ్డు కాదు. మంచి నిద్ర పాడు చేసావ్. నువ్వు గొప్పవాడివి రా బాబు అంటూ ఆ పొలంలోంచి పరిగెత్తి కి వెళ్లి పూరి జనాన్ని తీసుకొచ్చిన వాడిని తిట్టడం మొదలుపెట్టారు. నేను దొంగలనుకోలేదండి దెయ్యాలనుకున్నాను అందుకే అలా పరిగెత్తాను. దయ్యాలంటే మీరు ఎవరూ రారనిఎందుకేనా మంచిదని దొంగలని చెప్పాను అటు నవ్వుతూ చెప్పాడు. అలా నెలరోజులు గడిచింది. ప్రతిరోజు ఈ యువకులు ఫలహారాలు మామూలుగానే తయారు చేసుకుని తింటున్నారు.
అయితే ఈసారి గోవిందరావు గారిని అర్ధరాత్రి లేపటం లేదు. ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజులో ఏదో ఒక సమయంలో ఆ పలహారానికి సంబంధించిన ముడిసరుకు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడ చలపతిరావు గారి ఖాతా పెరిగిపోయింది. ఎందుకంటే ఆ ఊర్లో చలపతిరావు గారి పేరు చెబితే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది . అది అవకాశంగా తీసుకుని చలపతిరావు గారి పేరు వాడుకున్నారు ఈ యువకులు . రోజు రాత్రి నూనె సరుకు తింటుంటే యువకులకు పొట్టలు పెరిగిపోయే యి.
రోజు వీళ్లే వచ్చి సరుకులు పట్టుకెళ్తున్నారని గోవిందరావుకు ఒక రోజు అనుమానం వచ్చింది. ఒక శుభముహూర్తoల్లో చలపతిరావు గారి ఇంటికి గోవిందరావు బాకీ వసూలుకొచ్చాడు. బాకీ కోసం వచ్చానని అనకుండా ఒంట్లో బాగుండటం లేదని చెబుతూ మరి పద్దు పెరిగిపోతోందండి అటు నీళ్లు నమిలేడు.
ఏం పద్దు గోవిందరావు అని చలపతిరావు గారు అడిగేసరికి గోవిందరావుకి ముచ్చమటలు పోసేయి. అప్పుడు గోవిందరావు కథంతా చెప్పుకుంటూ వచ్చాడు. చలపతిరావు గారు ఇది మన కుర్రకారు పని అని మనసులో అనుకుని పద్దు చెల్లించి తర్వాత కుర్ర గారిని పిలిచి సున్నితంగా మందలించాడు. చలపతిరావు గారికి కుర్ర కారు మీద అనుమానం ఎలా వచ్చింది అంటే రోజు ఈ కుర్రకారు లో ఎవరో ఒకరు కడుపునొప్పి విరోచనాలు డోకులు అని వైద్యం కోసం వస్తున్నారు. ఇంకేముంది ఎవరు వైద్యుల దగ్గర నిజం దాచలేరు. రాత్రి ఏం తిన్నావ్ అని అడిగితే ఏదో సరుకు పేరు చెప్పేవారు. అలా అందరికీ ఒకేసారి అనారోగ్యం వచ్చింది. అప్పుడు దొరికిపోయారు.ఆ తర్వాత ఇటువంటి పనులకు స్వస్తి చెప్పారు యువతరం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి