దసరా
దసరా
ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే
రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు.
ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు.
సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.
ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస్తాం. వారి కష్టం మనకు తెలుసు. పైగా జీతభత్యాలు కూడా చాలా తక్కువ. ఏదో పండక్కదా అడిగిన అర్థం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకు
ఏం పోయేకాలం. కొన్ని ప్రదేశాల్లో ఈ ప్రబుద్ధులు కూడా దసరా మామూలు కోసం డిమాండ్ చేస్తున్నారు. అసలు దసరా మామూలు కథ ఏమిటి అని ఆలోచిస్తే
పూర్వకాలంలో బడిపంతులు కి జీతభత్యాలు చాలా తక్కువ ఉండేవి. బతక లేక బడిపంతులు ఉద్యోగం అనేవారు. ఈ బడిపంతుళ్లు దసరా సెలవుల్లో పిల్లల్ని వెంటపట్టుకుని పిల్లల చేతిలో వెదురు బొంగు తో తయారు చేసిన గిలకలు పెట్టి ఇంటింటికి తిరిగి దసరా పద్యాలతో పాటలతో ఇంటి యజమానిని ప్రసన్నం చేసుకుని వారిచ్చే బహుమతులు తీసుకొని పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టించి గిలకల నుండి పూలు ఆకులు వర్షం కురిపించి ఇంటి యజమానినిసంతృప్తిపరిచేవారు.
తర్వాత కాలంలో దసరా మామూలు చాప కింద నీళ్లలా ప్రవహించి అన్ని రంగాలకి పాకి పెద్ద తలనొప్పిగా తయారైంది.
ఎవరు పడితే వారు దసరా మామూలు అడుగుతున్నారు. సామాన్య సంసారికి ఎంత కష్టమో
ఒకపక్క పండుగ ఖర్చులు కొత్త బట్టలు, అల్లుళ్లు కొత్త సినిమాలు ప్రయాణాల ఖర్చులు ఒకటేమిటి అన్ని రూపాయలతో ముడిపడినవే. బజార్లో అన్ని పండగ ఆకర్షణలే. అన్ని పండగ ఆఫర్లే. బట్టలు కొనుక్కుందాం అని వెళ్లి ఆఫర్లు చూసి ఒకటికి రెండు కొనుక్కుని ఇంటికి ఆనందంగా వచ్చేస్తోంది ఓ ఇల్లాలు. వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ టీవీ ఒకటేమిటి అన్నిటికీ దసరా ఆఫర్లే.
సరే దసరా మామూలు పక్కన పెడితే మన రాష్ట్రంలో గత
తొమ్మిది రోజుల నుంచి దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభం అయ్యాయి. ఏ వీధి చూసిన పచ్చ టి పందిళ్లలో అమ్మవారి బొమ్మలు దేదీప్యమానంగా వెలిగిపోతూ పూజలు అందుకుంటున్నాయి.
ఈ దసరా ఉత్సవాలు వెనుక ఉన్న చరిత్ర పరిశీలిస్తే
మహిషాసురుడనే రాక్షసుడు లోకంలోని చాలా మంది ప్రజల్ని
బాధపె డుతూ ఘోర తపస్సు చేసి పురుషుల చేతిలో చావు లేకుండా వరం సంపాదించాడు. ఆ వరం పొందిన మహిషాసురుడు గర్వంతో దేవతలతో యుద్ధం చేసి ఇంద్ర పదవిని అధిష్టించాడు
దేవేంద్రుడు త్రిమూర్తులతో ఈ విషయం మొరపెట్టుకొనగ త్రిమూర్తుల అంశతో ఒక స్త్రీ మూర్తి పుట్టింది.ఈ స్త్రీ మూర్తి మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి సంహరించి సకల లోకాలను ఆనందింపజేసింది.
మొదటి రోజు అంటే ఆశ్వీయుజ పాడ్యమినాడు చేతిలో త్రిశూలం నంది వాహనంగా గల శైలపుత్రి రూపంలో దేవి దర్శనం ఇస్తుంది. ఈ శైలపుత్రి హిమవంతుడు కుమార్తె. ఈ ఆనంద సమయానికి గుర్తుగా విజయదశమి పండగ జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. పాండవుల అజ్ఞాతవాసం ముగించుకుని జమ్మి చెట్టుపై దాచి ఉంచిన ఆయుధాలను ఈరోజే తీసుకున్నారని అందుకనే మనం ఆయుధ పూజ జమ్మి చెట్టు కి పూజ చేయాలని పురాణాల ఆధారంగా తెలుస్తోంది.
ఈ తొమ్మిది రోజుల పండగలో బొమ్మల కొలువు పేరంటం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. దసరా వేషాలు తోలుబొమ్మలాటలు పులి వేషాలు డప్పుల నృత్యం బతుకమ్మ పాటలు అబ్బో ఒక మాదిరిగా ఉంటుంది దసరా హడావిడి. ఇక మనం ఉపయోగించిన వాహనాలని పనిముట్లని పూజ చేయడం కూడా మన సాంప్రదాయం. ఆఖరి రోజు న నిమజ్జనంలో పాల్గొనడం కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏమైనా పండగ పండగే మరి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి