నిజ స్వరూపం
నిజ స్వరూపం
సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం.
రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు.
రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. వాళ్ల కుటుంబం అంతా మొదటినుంచి అంతే. రామారావు గారికి ఇద్దరు ఆడపిల్లలే. పెద్దమ్మాయికి పెళ్లి చేసి పంపించేశారు.
రెండో అమ్మాయి రాధ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పని చేస్తోంది.చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగుండదు. జన్యు పరంగా వచ్చే గుండె సమస్య. నీరసం గుండె దడ కాళ్లు చేతులు లాగడం ఒకరోజు పని చేస్తే రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి. అలా మంచం మీద పడుకున్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్నప్పుడల్లా తల్లిదండ్రులు రెండు రోజులు కానీ మామూలు మనుషులు కాలేరు. కడుపున పుట్టిన పిల్లలు బాగుంటేనే కదా తల్లిదండ్రుల ఆనందంగా ఉండేది. ఏ జన్మలో చేసుకున్న పాపమో. ఈ రకంగా బాధిస్తోంది. ఇది తల్లిదండ్రులకు తీరని సమస్య. కనుచూపుమేరలో ఎక్కడ పరిష్కారం లభించడం లేదు . తల్లిదండ్రులు ఉన్నంతకాలం బానే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి. బాధ్యత ఎవరు తీసుకుంటారు అలాంటి ఆలోచనలతో రామారావు దంపతులు ఏమీ చేయలేక అన్నీ దైవానికి వదిలేసారు. పైగా ఆమె ఎప్పుడూడాక్టర్లపర్యవేక్షణలోనే ఉండాలి.
ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో తెలియదు. జీవితకాలం అంతా మందులు వాడుతునే ఉండాలని గాజుబొమ్మలా చూసుకోవాలని డాక్టర్లు పదేపదే చెప్పారు. కానీ మంచి తెలివితేటలు అయిన పిల్ల. పట్టుదలగా చదువుకుని ఉద్యోగం చేస్తోంది.
దేవుడు అన్ని ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. పెళ్లి చేయడానికి ఏమీ ఇబ్బందిలేదని కానీ పిల్లలుకనడానికి ఆమె ఆరోగ్యపరిస్థితి సహకరించదని పుట్టబోయే బిడ్డలకు కూడా ఈ జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పదే పదే చెప్పారు. రెండు మూడు సంబంధాలు చూసారు కానీ ఎవరు ఈ ఆరోగ్య సమస్యతో ముందుకు రావడం లేదు.
రామారావు గారు ఉండేది ఒక అగ్రహారంలో. అందరూ బంధువులు కాకపోయినా ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. రామారావు గారు అందరూ తో మంచిగా ఉంటూ అందరికీ మంచి సలహాలు ఇస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని కాలక్షేపం చేస్తుంటాడు.మనం ఒకరికి నీతులు చెప్పే స్థాయిలో ఉండి ఇలా కులం కాని వాళ్లతో పెళ్లి సంబంధం కలుపుకుంటే ఊరంతా ఏమనుకుంటారు బంధువులకి మొహం ఎలా చూపించాలి. పెళ్లంటే ఒక రోజుతో పోయేది కాదు. కలకాలం వాళ్ళ ఇంటికి మనం వెళుతుండాలి వస్తుండాలి. హోటల్ లో కూడా భోజనం చేయకూడదని నియమం పెట్టుకున్న కుటుంబం అది. అలాంటిది కులం కాని వాళ్ళతో సంబంధం అంటే రేపటి పరిస్థితి ఏమిటి. ఇన్ని సమస్యలున్నాయి .ఈ అమ్మాయిని అబ్బాయి ఎందుకు ఇష్టపడ్డాడు. వెనకాల ఉన్న ఆస్తి చూశా. అమ్మాయి అందం చూసా. రేపు అత్తారింటికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏమిటి.
కోడలుగా ఎంతవరకు తన బాధ్యతలు నిర్వర్తించగలదు. జీవితాంతం ఒక అనారోగ్యంగా ఉన్న పిల్లని ఎవరు కూర్చోబెట్టి పనులు చేస్తారు. అమ్మాయి పరిస్థితి తెలిసి చేసుకుంటానని ముందుకు వచ్చిన వాళ్ళతో సంబంధం కలుపుకుంటే తప్పేముంది. ఎలా వ్రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అనుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తన అంగీకారం తెలియజేశారు.
మరొకసారి అమ్మాయిగురించి అన్నివివరాలు ఫోన్లోపెళ్ళికొడుకుకి తల్లి గారికి తెలిపి తన బాధ్యత తీర్చుకున్నారు రామారావు గారు. నిశ్చితార్థం మగపెళ్లివారింట్లో జరగడానికి నిర్ణయం తీసుకుని భార్యను తీసుకుని హైదరాబాద్ మగ పెళ్లి వారి ఇంటికి వెళ్లారు రామారావు గారు. ఇల్లంతా బంధువులతో హడావిడిగా ఉంది. మగ పిల్లవాడికి బంధు వర్గం చాలా ఎక్కువ. అతిధి మర్యాదలు పూర్తయ్యాయి. హాల్లో బంధువులంతా కూర్చుని ఉన్నాిరు. డ్రెస్ చేంజ్ చేసుకుందామని పక్క గదిలోకి వెళ్లారు రామారావు గారు.
పక్క గదిలోంచి గట్టిగా మాటలు వినపడుతున్నాయి . ఎన్ని రోజులైంది ఇప్పటికి వడ్డీ కూడా ఇవ్వలేదు మీరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. మీ అమ్మగారు కూడా ఫోన్ తీయడం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇదేం మర్యాద అయిన వాళ్ళని ఇచ్చాం. ఒకటి కాదు రెండు కాదు కోటి రూపాయలు. లేదు అంకుల్ నేను ప్రేమించిన అమ్మాయి అమ్మాయి బాగా ఆస్తిపరురాలు.
పెళ్లయిన వెంటనే మీ బాకీ తీర్చేస్తా ము. ఒక ఆరు నెలలు ఓపిక పట్టండి. నా మీద ఒట్టు. ఇంట్లో బంధువులంతా ఉన్నారు గొడవ చేయకండి. అంటూ పెళ్లి కొడుకు సమాధానం చెబుతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తావా అంటూ అవతల వ్యక్తి మాటలు వినబడుతున్నాయి. లేదండి ఈ రోజుల్లో ఇది మామూలే డబ్బు గురించే నాటకాలన్నీ. ఎవరు చేసుకుంటారు అనారోగ్యం పిల్లని. నేను తప్పితే వాళ్లకి దిక్కులేదు అంటూ చెబుతున్న పెళ్లి కొడుకు మాటలు విని రామారావు గారికి కళ్ళు నీళ్లు తెప్పించాయి.
రామారావు గారికి ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. అంటే ఏమిటి ఈ ప్రేమంతా మోసమేనా. ఇదంతా నాటకమేనా. ఇదంతా ఒక రకమైన కుట్ర. ఇప్పుడు దీని నుంచి బయటపడ్డ ఎలాగా అనుకొంటూ డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేసాడు.
ఇంతలో అవతలి గదిలో నుంచి పెళ్ళికొడుకు , ఇంకొక వ్యక్తి బయటకు వచ్చారు. నిశ్చితార్థ ముహూర్తానికి ఇంకా టైం ఉంది. అందరూ టిఫిన్ చేసేద్దాం రండి అంటూ ఆహ్వానించారు మగ పెళ్లివారు. కావాలని రామారావు గారు పెళ్ళికొడుకుతో ఘర్షణ పడుతున్న వ్యక్తి పక్కన కూర్చుని మాటలు కలిపాడు. మగ పెళ్ళి వారు ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు. అయ్యా నమస్కారం నా పేరు రామారావు ఈ పెళ్ళికొడుకు కాబోయే మామ గారిని ఇవాళ మా అమ్మాయి నిశ్చితార్థం. నేను మీతో కొంచెం మాట్లాడాలంటూ నెమ్మదిగా చెప్పాడు.
నాతో మీకు ఏమిటి మాటలంటూ ఆశ్చర్యార్థకంగా చూసిన అవతల వ్యక్తితో ప్లీజ్ అండి ఇది నా కూతురు జీవిత సమస్య అంటూ బతిమాలుతున్న రామారావు గారిని చూసి సరేనండి అన్నాడు.
గబా గబా ఇద్దరు టిఫిన్ చేసి లిఫ్ట్ దిగి పార్కింగ్ లోకి వచ్చారు.
అయ్యా మీ మాటల్ని విన్నాను. నా కూతురుఅమాయకురాలు. నిజం చెప్పండి అంటూ చేతులు పట్టుకుని బతిమాలారు రామారావు గారు. పెళ్ళికొడుకు తండ్రి గారి వ్యాపారంలో చాలా నష్టపోయి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారనివీళ్ళకి ఊరు నిండా అప్పులని తనకే కోటి రూపాయలు ఇవ్వాలని చావు కబురు చల్లగా చెప్పాడు.
రామారావు గారు అవతల వ్యక్తి కాళ్లు పట్టుకుని మీకు పెళ్లి కొడుకుకి మధ్య జరిగిన సంభాషణ యధాతధoగా బంధువులందరికీ ముందు చెప్పి మా అమ్మాయి జీవితం కాపాడండి అంటూ బ్రతిమాలాడు.
రామారావు గారికి విషయం అర్థమైంది. మన అదృష్టం బాగుంది ఇంకా నిశ్చితార్థం కాలేదు. భార్యనీ కూతురు రాదని పిలిచి
విషయం అంత విపులంగా చెప్పాడు. మళ్లీ ఏమీ తెలియనట్లు అందరూ పైకి వచ్చి పెళ్ళికొడుకుని వారి తల్లి గారిని అందరి ముందు నిలదీశారు.
ఎదురుగుండా సాక్ష్యం ఉండగా వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారు. మౌనంగా తలదించుకున్నారు.
చూడండి నాకు మొదటి నుంచి ఏదో అనుమానం పీడిస్తోంది.
ఇన్ని లోపాలు ఉన్న ఈ అమ్మాయిని చేసుకోవడానికి ముందు వచ్చారంటే పెళ్ళికొడుకులో కూడా ఏదో లోపం ఉండాలి. కానీ పైకంతా బాగానే ఉన్నారు. నా కూతురు గురించి నేను ఏమి దాచలేదు. కానీ మీకున్న ఇంత పెద్ద సమస్యని మాకు చెప్పకపోవడం మీరు చేసిన నేరం. కేవలం డబ్బు కోసమే మా అమ్మాయిని ఇష్టపడినట్లుగా తేలిపోయింది.
పెళ్లి కాకపోయినా పర్వాలేదు మా అమ్మాయి అలాగే ఉంటుంది. చూస్తూ చూస్తూ దాని గొంతు కోయలేను. కావాలంటే నేను ఇప్పుడు పోలీస్ కేసు పెట్టొచ్చు. కానీ మానవతా దృక్పథంతో వదిలేస్తున్నాను అంటూ ఆవేశంగా రామారావు గారు నాలుగు మాటలు చెప్పి రాదని తీసుకుని రామారావు దంపతులు బయటికి వచ్చేసారు.
అవకాశం ఎక్కడ వస్తే అక్కడ నమ్మించి మోసపుచ్చి తమ పబ్బంగడుపుకొనేఅవకాశవాదులుఈలోకంలోఎక్కువైపోయారు. సాధారణంగా పెళ్లి చూపుల్లో పిల్ల నచ్చిందన గానే ఇంకేమీ ఆలోచించకుండా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వాస్తవంలోకి వచ్చిన తర్వాత అసలు రంగులు బయటపడుతున్నాయి. నిజం తెలిసిన తర్వాత ప్రశ్నిస్తే గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయి పీక నొక్కేసి చేతులు దులుపు వేసుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు.
రోజు ఎన్నో వార్తలు వింటున్నాం. చదువుతున్నాము. ప్రేమలు ఎంత వరకు నిలబడతయో ఈ ఆకర్షణ ప్రపంచములో.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి