గుఱ్ఱం బండి

గుర్రం బండి

"అమ్మా రేవు దగ్గరికి బండి వెడుతోంది వస్తారా అంటూ చేతిలో చెర్నాకోలు పట్టుకొని తలకి తలపాగా చుట్టుకుని ఒంటిమీద బనియన్ తొడుక్కుని నిక్కర్ వేసుకుని ఒకమనిషిచాలామందికి తారసపడి ఉంటాడు. దూరంగా ఒక మూల గుర్రపు బండి కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చగడ్డి తింటూ నిలబడి ఉన్న నాలుగు కాళ్ల జంతువు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మన చిన్నతనంలో మనం చూసే ఉంటాము. ఆ రోజుల్లో అది అతి ముఖ్యమైన ప్రయాణ సాధనము.

మానవుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు తక్కువగా ఉండేవి. ఒకటి సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి రిక్షా. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆటోలు బస్సులు కార్లు మోటార్ సైకిల్ వచ్చి ఈ గుర్రపు బండి రిక్షా ఎడ్ల బండి సైకిలు మరుగున పడిపోయాయి. అయితే ఇంకా కొన్ని ఊర్లలో గుర్రపు బండి సామాన్లు ఒకచోట నుండి ఇంకొక చోటకు చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు.

ఈ గుర్రపు బండిని జట్కా బండి అని కూడా పిలుస్తారు. జట్కా బండి అంటే గుర్రము చేత లాగబడే బండి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో టాంగా అంటారు. ఈ బండి ఇంధనం అవసరం లేని బండి ఇరుసుతో నడిచే బండి.యజమాని చేతిలో కీలుబొమ్మగా మారి ఒక మూగ జంతువు తో నడిచే బండి.

 ఈ గుర్రాలు పూర్వకాలంలో రాజుల రధాలు లాగేవి . సైనికులకు వాహనంగా ఉపయోగించుకునేవారు. రాజకుమారులు గుర్రపు స్వారీలు చేసేవారు. పురాణ కాలంలో కూడా యాగాల్లో ఈ గుర్రాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఉదాహరణకు అశ్వమేధ యాగం. గుర్రాలు అతివేగంగా పరిగెత్తగల నాలుగు కాళ్ల జంతువు. మహారాజ భోగం అనుభవించిన ఈ అశ్వాలు పాపం బండిని లాగుతూ బ్రతుకు వెళ్లదీస్తున్నాయి. కళ్లకు గంతలు కట్టుకొని యజమాని చెప్పినట్లు నడుచుకుని ఎగుడు దిగుడు రోడ్డులు కొండలు గుట్టలు ఏవైనా సరే దాటుకుని గమ్యం చేర్చి యజమానిని బ్రతికించే ఒక బడుగు జీవి ఈ గుర్రం.

ఏం చేస్తాం కొందరు తలరాత అంతే. బ్రతుకంతా బరువు మోస్తూనే ఉండాలి. బానిసలాగే బ్రతకాలి.

చాలామందికి ఈ బండిలో ప్రయాణించిన అనుభవం ఉంటుంది. ఒక్కసారి గతంలోకి వెళ్తే గుర్ర బండికి రంగురంగుల గూడు ఇరుసు ఆధారంగా నడిచే రెండు చక్రాలు కింద ప్రయాణికులు కూర్చోవడానికి గడ్డి పరుపు ప్రయాణికుల సామాన్లుపెట్టుకోడానికి
తాళ్లతో అల్లిన ఒక చిక్కం, ప్రయాణికులు పడిపోకుండా పట్టుకోవడానికి అడ్డంగా ఒక ఇనుప కమ్మి అబ్బా ఎంత బాగుండేది ఆ అనుభవం. బండి ముందుకు పరిగెడుతుంటే మనం అటూ ఇటూ ఉయ్యాల ఊగే వాళ్ళ o. గతుకులో పడినప్పుడు ఈ లోకంలోకి వచ్చేవాళ్ళం. చాలా చలనచిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఈ గుర్రపు బండి షార్ట్ తీసేవారు. బండి గతుకులలో పడినప్పుడు కథ వర్తమానం లోకి వచ్చేది. 
బండి యజమాని తన చర్నాకోలను చక్రాల మధ్యలో పెట్టి దాని నుండి వచ్చే ఒక రకమైన శబ్దంతో రోడ్డు క్లియర్ చేసుకునేవాడు. అంటే పాపం గుర్రానికి గంతాలు కదా . అలా రోడ్డు మీద పోతుంటే చిన్నప్పుడు మనం తిరిగిన వీధులు రోడ్లు ఆడుకున్న పొలాలు ముందుకు సాగుతూ ఉండే అనుభవం మర్చిపోలేనిది.
బండి వాడు చేసిన శబ్దానికి ఇంట్లోంచి అందరూ బయటకు వచ్చి ఎవరింటికి చుట్టాలొస్తున్నారు అబ్బా అని తొంగి తొంగి చూసి వారు. బండిలోకి చూసి బంధువులను గుర్తు పట్టి ఆనంద సముద్రంలో మునిగి పోయేవారు. ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్లి ఒక స్టూల్ తీసుకొని వచ్చి బంధువులను జాగ్రత్తగా దింపుకునేవారు. అది ఆనాటి వింత అనుభవం. గుర్రపు బండి ప్రయాణం.

సాధారణంగా కొన్ని జంతువులు మానవుడికి ఏదో విధంగా సహాయకారిగానే ఉంటాయి. పొలం దున్నేందుకు రైతుకి ఎద్దులు
వీధుల్లో తిరిగే బిక్షగాళ్ళకి కోతులు గంగిరెద్దులు ఆడించే వారికి
గంగిరెద్దులు సర్కస్ కంపెనీ వారికి అన్ని రకాల జంతువులు సహాయంగా ఉంటాయి. అవి తాము బ్రతుకుతూ తమ యజమానిని కూడా పోషిస్తాయి. జీవన పోరాటానికి తీసుకుని వెళ్లేటప్పుడు యజమాని వీటన్నింటినీ అలంకరణ చేస్తాడు.

అలాగే ఈ గుర్రం బండి యజమాని కూడా గుర్రానికి కళ్ళకి గంతలు నడుముకి జీను కాళ్ళకి నాడాలు తల పైన ఎర్రటి కుచ్చు పెట్టి అందంగా తయారు చేసి చేతిలో కళ్లెం పట్టుకుని చర్నాకోలుతో అదిలిస్తూ అవసరమైన చోట ఒక దెబ్బ వేస్తూ ముందుకు పరిగెత్తించేవాడు.అలా పరిగెత్తుకెళ్లే గుర్రం తల మీదనున్న కుచ్చు గాలికి అటు ఇటు తిరుగుతూ చూపరులకి ఆనందం కలిగించేది

అలా యజమాని జీవిత పోరాటంలో భాగస్వామిగా ఉంటూ అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంలో బేరం వస్తుందో ఎవరికి తెలుసు. ఆ మూగ జీవికి యజమాని కడుపు నింపడమే తెలుసు. యజమాని చెప్పినదల్లా చేయడమే. కాలం గురించి దానికి ఏమి తెలుసు. ఎప్పుడూ కళ్ళకి గంతలే. బ్రతుకంతా చీకటి. ఎప్పుడూ పరోపకారమే. కాలం దాని కడుపు కొట్టేసింది. యజమాని ఏం సంపాదించాడో తెలియదు గానీ కళ్ళు కనపడడoలేదని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కొడుకు రమ్మంటున్నాడని అయినా గుర్రం కూడా ముసలిదైపోయిందని ఊరు వదిలి వెళుతూ బీచ్ దగ్గర పోరగాళ్ళకి అయిన కాడికి వదిలించుకున్నాడు.

ఇన్నాళ్లు ఊర్లు తిరిగిన గుర్రం ఆ సముద్రపు ఒడ్డులో ఈ చివర నుంచి ఆ చివరికి ఆ పోరగాడు చెప్పినట్లు నడుచుకుని వాడి కడుపు కూడా నింపి ఎందరికో రోజు గుర్రపు స్వారీ సరదా తీర్చే 
గుర్రం కథ ఇది. బండి ఏమైపోయిందో.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం