శ్మశానవాటిక

శ్మశాన వాటిక

నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు
కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు

ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం.

ఈ స్మశాన స్థలంలో కన్నులు మూసి వచ్చినవాడు ఒక్కసారైనా కన్నులు తెరిచి లేచిన సందర్భాలు లేవు. బిడ్డలు పోగొట్టుకున్న తల్లుల రోదనలకి ఇక్కడ స్మశానo లో ఉన్న రాళ్లు క్రాగిపోయినవి అంటాడు. ఈ పద్యం కరుణారస పూరితంగా చదవగలిగే వారు చదివితే నిజంగానే మన మన కళ్ళు కన్నీళ్లు వర్షిస్తాయి.

ఆ మధ్య కాలంలో బాలు గారు బతికున్న రోజుల్లో ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమంలో ఒక గాయకుడు పాడిన ఈ పద్యానికి శ్రోతగా నా కళ్ళు కన్నీళ్లు వర్షించాయి.

ఒక పద్యానికి మించి మరొక పద్యం ఈ స్మశానస్థలికి కులమత వర్ణ వర్గ బేధం లేదు ఇక్కడ అందరూ సమానులే అందరూ ఇక్కడికి రావాల్సిందే.. రాజు ఒకటే ,బంటు ఒక్కటే . పరమాత్ముడికి ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ శివుడు తన అనుచర గణంతో శివతాండవం చేసే రుద్ర భూమి అని, మరణ దూతకు ఇది సింహాసనం అని స్మశానం గురించి అద్భుతమైన ఆవిష్కరణ ఇచ్చాడు.

ఈ స్మశానం అంటే మామూలు ప్రదేశం కాదు. ఎందరో కవుల కలాలు చిత్రకారుల కుంచెలు రాజుల రాజముద్రికలుఇక్కడ నిప్పుల్లో కాలిపోయాయి. అలా కాలిపోయిన శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. ఒక కుమ్మరి తయారు చేసే మట్టి కుండలో ఆ రేణువులు కూడా కలిసి ఉంటాయేమో కదా అంటాడు.

ఆ స్మశానాన్ని నాలుగు మూల నుంచి పరికించి తన ఆవేదన పద్య రూపంలో వ్యక్తపరిచాడు. దూరంగా కనబడుతున్న సమాధి నుంచి వెలుగుతున్న ఆముదపు దీపపు ప్రమిదలో ఆముదం నిండుకున్నా ఆ దివ్వె ఇంకా వెలుగుచున్నది. అది ఆ సమాధిలో నిద్రిస్తున్న ఒక అభాగ్యురాలి హృదయపు వెలుగు అంటాడు. ఏమిటీ పరిశీలనాసక్తి. కవికి ఒక విషయం గురించి ఇంత లోతుగా ఆలోచించాడు అంటే దైవానుగ్రహం ఉండాలి.
అంటే సమాధిలో ఉన్న ఆమె గుండె ఇంకా మండుతోంది అని అర్థం.

ఒక అనాధ శవం గురించి తన ఆవేదనను ఒక పద్యంలో వర్ణిస్తూ
అన్నిటికన్నా భయంకరమైనది పేదరికం దారిద్ర్యం అంటారు జాషువా.

తెలుగు వాడు గర్వంగా చెప్పుకోదగిన కవి గుర్రం జాషువా. కవితా వస్తువు ఏదైతేనేమి రాతి గుండెను కూడా కరిగించే శక్తి ఆ కవిత్వానికి ఉంది. కవి సామాజిక ప్రయోజనం గురించి ఈ పద్యాలు రాసిన ప్రతి వారి గుండెల్లో ఆ ప్రదేశం గురించి ఉన్న ఆవేదన తెలియపరిచాడు.

శ్రీ జాషువా గారి రచనలు అనేకo ఉన్నాయి. నా హృదయాన్ని తాకిన ఈ పద్య కావ్యం యధాతధంగా మీ ముందు ఉంచాను.
ఇది పద్య రూపంలో చదివితేనే దాని అర్థం హృదయాన్ని సూటిగా తాగుతుంది. ఆధ్యాత్మికత భావం ఏర్పడుతుంది. స్మశాన వైరాగ్యం కలుగుతుంది. 

మన భారతదేశం ,మన ప్రజలు చాలా అదృష్టవంతులo. ఇటువంటి మహాకవులు పుట్టిన ప్రదేశంలో మనం పుట్టి వారి రచనలు మనం చదువుకోగలుగుతున్నాం. మా తరం వాళ్లు పాఠ్యపుస్తకాలు లోనూ పెద్దలు చెబితేనో ఇటువంటి గ్రంధాలు నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. మరి ఈ తరం వాళ్లకి ఏమో.
నాకు ఎప్పటికీ తీరని ప్రశ్న. ఎప్పటికైనా కాలం మారుతుందేమో 
వేచి చూద్దాం. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
 కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట