తీర్థ యాత్ర
తీర్థయాత్ర
ఉదయం ఆరు గంటలు అయింది
షిరిడి వెళ్లే సాయి నగర్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో వచ్చి ఆగింది. ఎప్పటినుండో షిరిడి వె డదామనుకున్న భాస్కరరావు కుటుంబ సభ్యులందరి తోటి S7 బో గిలో
స్లీపర్ క్లాస్ లో అడుగు పెట్టాడు. బెర్త్ నంబర్లు చూసుకుని సామాన్లు సర్దుకుని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఎన్నాళ్లనుంచో షిరిడి వెళ్దామనే కోరిక బాబా గారు ఇప్పటికి తీర్చుతున్నారని మనసులోనే బాబా గారికి నమస్కారం చేసుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లోనే బోగి అంతా నిండిపోయింది. కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఏకైక రైలు ఇదొక్కటే. మర్నాడు ఉదయం 9:00కు కానీ సాయి నగర్ అంటే షిరిడి చేరుకోలేరు. అయినా అందరూ ఈ రైలుకే బుక్ చేసుకుంటారు.
భాస్కర్ రావు కాకినాడలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో చిరు ఉద్యోగి. షిరిడి సాయిబాబా భక్తుడు. ప్రతి లక్ష్మీవారం కాకినాడ అశోక్ నగర్ లోని బాబా గుడికి వెళ్లి వస్తుంటాడు. బాబా గారి ఆజ్ఞ లేనిదే శిరిడీలో అడుగు పెట్టలేమనే బాబా చెప్పిన మాటలు కచ్చితంగా నమ్మి ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అనుకోకుండా పిల్లలందరికీ సెలవులు ఇవ్వడం రెండు రోజుల ముందే ఆలోచన రావడం తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకోవడం షిరిడి దర్శనానికి ,బసకి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం అలా అనుకోకుండా అయిపోయాయి. తల్లి తండ్రి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్లకి ప్రత్యేక దర్శనం ఉంటుంది పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని ఆలోచించి కుటుంబ సమేతంగా బయలుదేరేడు శిరిడికి. ఆ సాయి బాబా వారి చరిత్ర షిరిడీలోనే పారాయణ చేయాలని ఎప్పటినుంచో భాస్కర్ రావు కోరిక. ఆ కోరిక తీరిన తర్వాతే ఇంటిదగ్గర బాబా వారి చరిత్ర పారాయణ చేస్తానని మొక్కుకున్నాడు. అందుకే ఇప్పటివరకు బాబా వారి చరిత్ర ముట్టుకోలేదు భాస్కరరావు.
ఇంతలో సామర్లకోట స్టేషన్లో రైలు ఆగింది. ప్రయాణికులను తో సుకుంటూ ఒక జంట చేతిలో చిడతలతో ఘంటసాల గారి పాటలు పాడుతూ ఒక అతను గుడ్డివాడు కాబోలు భార్య భుజం మీద చెయ్యి వేసి పాపం భోగిలో ఆ చివరి నుంచి ఈ చివరికి నడుచుకుంటూ వస్తున్నారు.ఆ గొంతులో నిజంగా పాట ఘంటసాల గారు పాడినట్లే ఉంది. తోచిన వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు. ఆ జంట భాస్కరరావు గారి దగ్గరికి వచ్చారు. అప్పుడే మొదలైంది "వెధవ గోల. అసలు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగానే గుడ్డివాళ్లేనా. కష్టపడి పని చేసుకోవచ్చు కదా. దున్నపోతు లా ఉన్నారు అoటు కసిరి కొట్టాడు. పాపం వాళ్లకి ఇది అలవాటే. రోజు ఎంతో మందిని ఇలాంటి వాళ్ళని చూస్తుంటారు. వాళ్ళు ఏమీ కోపగించుకోరు. కోపగించుకుంటే జీవితం గడవదు. భాస్కర్ రావు తిట్టిన తిట్లకి వాళ్లు మాట్లాడకుండా ముందుకు సాగిపోయారు.
ఇంతలో రైలు వేగం పుంజుకుంది. ప్రయాణికులు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు కొంతమందికి రైలు ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. చిన్నపిల్లలు కిటికీల దగ్గర కూర్చుని వేగంగా దాటిపోతున్న పొలాలని కరెంటు స్తంభాల్ని దూరంగా కనిపిస్తున్న భవంతులను చూస్తుంటారు. కొంతమంది ఆలోచనలో పడుతుంటారు. ఎవరిని పట్టించుకోకుండా తను విధి నిర్వహణలో రైలు పట్టాల మీద పరిగెడుతూనే ఉంటుంది.
మన జీవితం లాగే రైలులో కూడా ఎంతోమంది ఎక్కుతుంటారు తమ స్టేజి రాగానే దిగిపోతుంటారు. రైలు గమ్యం చేరేటప్పటికి ఎవరు ఉండరు. అన్ని బోగీలు ఖాళీయే. మన జీవితం కూడా అంతే. ఏదో స్టేషన్ వస్తుందనుకుంటాను. బండి స్లోగా నడుస్తోంది. రాజమండ్రి అనుకుంటా టిఫిన్ చేద్దామంటూ భాస్కర్ రావు టిఫిన్ బ్యాగ్ పైనుంచి కిందకి దింపాడు. దిబ్బరొట్టి అల్లం పచ్చడి బెల్లం పానకం అబ్బా చాలా రుచిగా ఉన్నాయి అంటూ భాస్కర్ రావు తల్లిదండ్రులతో సహా అందరూ బాక్సులు ఖాళీ చేసేసారు.
ఎక్కే వాళ్లతోటి దిగే వాళ్లతోటి బోగి అంతా హడావిడిగా ఉంది. ఇంతలో వేడివేడిగా ఇడ్లీ అంటూ ఒక ప్లాస్టిక్ తొట్టిలో ఇడ్లీలు పొట్లాలు పట్టుకుని ఒకడు, కాఫీ చాయ్ అంటూ బరువుగా ఉన్న క్యాన్లు మోసుకుంటూ ఒకడు బోగిలోకి ఎక్కారు.
"వేడి వేడి ఇడ్లీ ఏమిటి వాడి మొహం పాచిపోయిన ఇడ్లీ ఇలాగే ఈ దరిద్రులు ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు అంటూ ఇడ్లీ వాడిని దుమ్మెత్తి పోసాడు భాస్కర్ రావు. వాడి గొడవ మనకెందుకు అండి అందర్నీ నోటితో అలా మాట్లాడకూడదు అంటూ భార్య చెప్పిన మాటలకి మాట్లాడకుండా కూర్చున్నాడు భాస్కరరావు. టీ తాగుతారా అని కుటుంబ సభ్యులను ఉద్దేశించి అడిగాడు భాస్కర్ రావు. ఎవరూ మాట్లాడలేదు.
భాస్కర్ రావు కి ఆఫీసులో గంట గంటకి టీ తాగడం అలవాటు. పది రూపాయలు ఇవ్వండి అంటూ టీ కప్పు చేతిలో పెట్టాడు టీ అమ్మేవాడు . ఇవి పాలు కాదు. నీళ్ల పాలు ఇలాగే దోచేస్తున్నారు వెధవలు అటు మళ్లీ తిట్ల పురాణం ప్రారంభించాడు. రైలు గోదావరి బ్రిడ్జి మీద నుంచి పరిగెడుతోంది. పిల్లలు కిటికీలోంచి రూపాయి బిళ్ళలు గోదావరిలో విసరడం మొదలుపెట్టారు. పెద్దలు గోదావరి తల్లికి నమస్కారం చేసుకుంటూ గోదావరి బాగా ఎండిపోయింది నీళ్లు లేవు అoటు ఏదో కామెంట్లు విసురుతున్నారు. అలా మళ్లీ రైలు వేగం పుంజుకుంది.
ఒరేయ్ భాస్కర్ నాకు నడుం నొప్పి వస్తోంది.నేను కాసేపు పడుకుంటాను. బెర్త్ లు పరుచుకుందాం అoటు తండ్రి చెప్పిన మాటలకి సరే నాన్న అంటూ బెర్త్లు పైకి ఎత్తాడు. తల్లి తండ్రి లోయర్ బెర్త్ లు మీద భాస్కర్ రావు అతని భార్య మిడిల్ బెర్త్ మీద పిల్లలు పైనుండే బర్త్ మీద ఎక్కి పడుకున్నారు. తొలిరోజు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు ప్రయాణం హడావిడి మూలాన్ని. దానికి తోడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచారు. అందరూ పడుకోగానే నిద్రలోకి జారుకున్నారు.
భాస్కర్ రావుకి మెలకువ వచ్చి వాచి చూసుకునేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలు అయింది. రైలు ఆగిపోయిందిఏదో స్టేషన్ వచ్చింది అనుకుంటూ కిటికీలోంచి తొంగి చూసాడు. కాజీపేట స్టేషన్ వచ్చింది అనుకుంటూ బెర్త్ నుంచి లేచి కుటుంబ సభ్యులు లేపి భోజనం క్యారేజీలు ఉండే సంచి కిందకి దింపాడు. అందరూ మొహాలు కడుక్కుని వచ్చి సీట్లు మీద కూర్చున్నారు. కార్తీక మాసంలో పిక్నిక్ కి వెళ్లినట్లుగా క్యారేజీ విప్పి ఎవరు మటుకు వాళ్ళు వడ్డించడం ప్రారంభించారు.
పదార్థాలు చూడగానే ఒక్కసారి ఆకలి ముంచుకొచ్చింది అందరికీ. టిఫిన్ తిన్న తర్వాత ఎవరు ఏమి తినలేదు కదా. ఇంటి దగ్గర ఉంటే ఫ్రూట్స్ తినడం అలవాటు ముసలి వాళ్లకి. బంగాళదుంప వేపుడు కొత్త ఆవకాయ పప్పు పులుసు అప్పడాలు వడియాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ అన్నం కడుపునిండా తిని సుమతిని మెచ్చుకున్నారు భాస్కర్ రావు తల్లిదండ్రులు.
ఎందుకంటే పాపం సుమతి బయట కొనుక్కున్న వస్తువులు తింటే ఆరోగ్యాలు పాడవుతాయని తెల్లారి జామున మూడు గంటలకే లేచి అన్నీ తయారుచేసింది . నిజమే ఈ శ్రద్ధ ఎవరికి ఉంటుంది. ఒక ఇంటి ఇల్లాలికి తప్పితే. ఏమండీ గిన్నెలో మిగిలిన అన్నం ఎవరైనా ఉంటే చూడండి ఇచ్చేద్దాం సాయంకాలానికి పాడైపోతుంది వేసవికాలం కదా వాసన వస్తుంది అంటూభార్య చెప్పిన మాటలకి ఎందుకు సాయంకాలం పిల్లలు పెరుగు అన్నం తింటా రు. ఎవరికి ఇవ్వద్దని సమాధానం చెప్పాడు భాస్కర్ రావు.
ఇంతలో చేతిలో ఒక గుడ్డ ముక్క పెట్టుకుని బోగి అంతా ఊడుస్తూ అందరి దగ్గరికి వెళ్లి చేతులు చాస్తూ అడుక్కుంటున్నాడు ఒక వ్యక్తి. దూరప్రాంతాలు వెళ్లే రైలు మధ్యలో ఎక్కడ శుభ్రం చేయరు డిపార్ట్మెంట్ వాళ్ళు. మన ఇల్లు కాదు కదా ఎవరు మటుకు వాళ్ళు చెత్త చెత్తగా చేస్తారు బో గీలు మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు మూలంగానే శుభ్రంగా ఉంటాయి బోగీలు. నడవలేడనుకుంటాను. అలా డేక్కుంటూ బోగి అంతా శుభ్రం చేస్తున్నా డు. అలా భాస్కర్ రావు దగ్గరికి వచ్చేటప్పటికి అంతవరకు ఆ మనిషిని గమనిస్తున్న భాస్కరరావు ఒక్కసారిగా మొహం అటువైపు తిప్పేసుకున్నాడు
భర్త ప్రవర్తన చూసి సుమతికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. మన ఆనందాలకి అవసరాలకే లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. ఒక రూపాయి వాడికి ఇస్తే ఏమి పోయింది. ధైర్యం చేసి ఇస్తే ప్రతిరోజు సాధిస్తూనే ఉంటాడు భర్త అనుకుంది సుమతి .
రైలు బండి నిజంగా ఒక అన్నపూర్ణ లాంటిది. ఎంతోమందికి కడుపు నింపుతోంది. ఏ ఆధారం లేని వాళ్ళకి తన స్టేషన్లోనే వసతి కల్పిస్తోంది. రైల్వే స్టేషన్ చూస్తే ఎన్నో రకమైన జీవితాలు అక్కడ జీవితం గడుపుతూ ఉంటాయి. ఆకలి తీర్చే క్యాంటీన్ వాళ్లు దాహం తీర్చే కూల్ డ్రింక్ షాపుల వాళ్లు పల్లీలమ్మి జీవితం గడుపుకునే ముసలమ్మ తోపుడు బండి మీద అరటి పళ్ళు పుస్తకాలు అమ్ముకునేవాళ్లు ఆ ప్లాట్ ఫారం మీద గంజాయి అమ్ముకునే కాషాయవస్త్ర దారులు, పగలు ప్లాట్ ఫారం మీద రాత్రి రైల్వే వారి బెంచీల మీద తమ సంసారం గడుపుకునే ముష్టి వాళ్ళు బ్యాగులు కొట్టేవాళ్ళు ,కుట్టేవాళ్లు, షూ పాలిష్ చేసేవాళ్ళు ఒకరేమిటి సమాజంలో అనేక రకాల వర్గాల ప్రజలకి ఆశ్రయమిస్తోంది.
అలా ఎంతోమందికి ఆశ్రయమిస్తున్న రైలు బండి పరిగెడుతూ పరిగెడుతూ సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చి ఆగింది. అప్పటికి సాయంకాలం నాలుగు గంటల 30 నిమిషాలు అయింది. ఇక్కడ రైలు కొంతసేపు ఆగుతుంది ఎవరైనా దిగుతారా అంటూ అడిగాడు భాస్కర్ రావు.
భాస్కర్ రావు తో పాటు భార్య సుమతి పిల్లలు కూడా దిగి ఎదురుగుండా కనబడిన క్యాంటీన్లో టీ తాగి బయటకు వచ్చేసరికి ఎదురుగుండా చేతిలో ఒక పిల్లతో మాసిపోయిన బట్టలతో సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి ఒక యువతిa ధర్మం చేయండి బాబు అంటూ భాస్కర రావు వేపు చేయి చాపింది.
చంటి పిల్ల తల్లినీ బాబు అంటూ దీనంగా అడిగింది. అంత పెంచలేని దానివి ఎందుకు కన్నావు అంటూ కసిరి కొట్టాడు భాస్కరరావు. అందరూ బో గిలోకి ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు.భాస్కర్ రావు తల్లిదండ్రులు మధ్యాహ్నం పూట టీ తాగరు. బ్యాగులోంచి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన జామకాయలు ముక్కలు కోసి అందరూ శుభ్రంగా తిన్నారు. మళ్లీ రైలు బండి తన డ్యూటీలో జాయిన్ అయిపోయింది. అలా తన విధినిర్వాహణ ప్రకారం ప్రతి స్టేషన్ లోను ఆగుతూ పొ రుగు రాష్ట్రంలో నీ బీదర్ చేరేటప్పటికి రాత్రి 8 గంటలయింది. పిల్లలకు పెరుగన్నం పెడదామని క్యారేజీ మూత తీసేటప్పటికి గుప్పుమని చెత్త వాసన వచ్చింది. చేసేది ఏమీ లేక బీదర్ స్టేషన్లో దొరికిన ఇడ్లీ తినేసి యధావిధిగా బెర్ట్లు ఎక్కి నిద్రలోకి జారుకున్నారు భాస్కర్ రావు కుటుంబ సభ్యులు.
భాస్కర్ రావు భార్యకి మటుకు నిద్ర పట్టలేదు. భాస్కరరావు ప్రవర్తన ఏమి నచ్చలేదు. ఎవరికి పది పైసలు దానం చేయడు. పైగా అందరినీ మాటలంటాడు. ఎవరు శాపాలు పెడతారో ఏమిటో. అనవసరంగా రెండు గిన్నెలు అన్నం బయట పారబోసాము. పాపం ఆ బోగి తుడిచిన కుర్రాడికి పెడితే ఆనందంగా తినుండేవాడు. పైగా వెళ్ళేది తీర్థయాత్రలు. చేసేది ఇటువంటి పనులు. పైగా బాబా గారి భక్తుడని చెప్పుకుంటూ ఉంటాడు. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు. చెప్పేవి శ్రీరంగనీతులు. ఆచరణలో మటుకు శూన్యం అనుకుంటూ ఎప్పటికో నిద్రలో జారుకుంది.
ఉదయం 9 గంటలకి సాయి నగర్ స్టేషన్ లో రైలు ఆగింది. సామాన్లు తీసుకుని కిందకు దిగి భాస్కర్ రావు కుటుంబ సభ్యులు రెండు ఆటోలు చేసుకుని సాయి భక్త నివాస్ కి చేరుకున్నారు. స్నానాలు చేసి టిఫిన్ తినకుండానే మళ్లీ దర్శనానికి వెళ్లిపోయారు. అప్పటికే గుడి అంతా చాలా రష్ గా ఉంది. ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చిన భక్తులతో బాగా రద్దీగా ఉంది. కొంతమంది దర్శనం అయిన వాళ్ళు కొంతమంది దర్శనం కావాల్సిన వాళ్ళు దర్శనమై ప్రసాదాలు తీసుకునే వాళ్ళు ఇలా రకరకాల జనాలతో గుడి ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది.
బాబా వారు ఒక ఆధ్యాత్మిక మానవతావాది. తన నిజ జీవితంలో అతి సాధారణంగా బిక్ష తీసుకొని గడుపుతూ ఆ బిక్షని ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టి మిగిలినది తను తినేవాడు. తన నిజ జీవితంలో చెప్పిన మాటలని ఆచరణలో పెట్టిన మహా వ్యక్తి. అన్ని మతాల వాళ్ళను సమానంగా ఆదరించిన వ్యక్తి. సబ్కా మాలిక్ ఏక్ హై అనేది బాబా నినాదం.
తల్లితండ్రులతోపాటు ప్రత్యేకమైన ద్వారం గుండా గుడి లోపలికి ప్రవేశించిన భాస్కర్ రావు కి ఆ విగ్రహం చూస్తుంటే ఒక్కసారిగా కళ్ళు నీళ్లు వచ్చా యి. ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఇన్నాళ్లు మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. బాధలంటూ ఏమీ లేవు. ఏదో ఆ శాంతి. ఆ శాంతికి కారణం ఎవరు .తెలీదు . కానీ అక్కడికి ప్రవేశించినప్పటి నుంచి బాబా గారి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు. ఎందుకు.
ఏదో తప్పు చేశాననే భావన మనసులో దొలిచి వేస్తోంది. అది ఏమిటో తెలియడం లేదు అంటూ ఆలోచనలో పడిన భాస్కర్ రావుని టైం అయింది పదండి అంటూ వెనకాల సెక్యూరిటీ వాళ్ళు హెచ్చరించడంతో తల్లిదండ్రులను తీసుకుని బయటకొచ్చి అక్కడ వేప చెట్టు దగ్గర ఉన్న దిమ్మ మీద తల్లిదండ్రులను కూర్చోబెట్టి పారాయణ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క అధ్యాయము చదువుతుంటే సమయం తెలియలేదు.
మన చుట్టూ ఉండేవారిని , సమస్త జీవరాసుల తోటి ప్రేమగా ప్రవర్తించమని, మనలో ఉండే దుర్గుణాలు బయటకు వెళ్ళగొట్టుకోకపోతే జ్ఞానం లభించదని అంటూ చెప్పుకుంటూ వచ్చారు తన జీవిత చరిత్రలో అంతేకాదు. తను సేవించడానికి వచ్చిన భక్తుల్ని కాదు చీమ దోమ కుక్క లాంటి సమస్త జంతుజాలాన్ని కూడా ఎంతో ప్రేమగా అదిరించి వాటికి ఆహారం పెట్టి మిగిలింది మాత్రమే తను తినేవారు. ఈ భూమ్మీద నివసించే జీవరాసులు సమానమే అని అన్నింటిలోనూ తాను ఉన్నాడని వాటి వాటి కర్మల ఫలితంగా వాటికి అటువంటి జన్మ లభించిందని చెప్పుకుంటూ వచ్చేరు.
ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటే తప్పితేే ఏ జంతువు కానీ మనుషులు కానీ దగ్గరికి రారని అటువంటి వారిని ప్రేమతో ఆదరించాలి కానీ కసిరి కొట్టరాదు. ఆకలితో ఉన్న వాడికి గుప్పెడు అన్నం, దాహం తీర్చమని అడిగిన వాళ్ళకి ప్రేమతో వారి కోరిక తీర్చడం మానవులుగా మనకు కనీస కర్తవ్యం అని చెప్పిన మాటలు చదివి కళ్ళు వెంట నీళ్లు వచ్చే యి భాస్కర్ రావు కి.
అన్ని మతాలవారు సమానమేనని ఓర్పు సహనము అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఆయుధాలని సహనం ఉంటే ఎంతటి సమస్య నైనా దాటవచ్చని అనే మాటలు భాస్కర రావు లో ఎంతో మార్పు తీసుకొచ్చే యి. చేసిన తప్పు అర్థమైంది భాస్కరరావు కి. ఆ తప్పు చేయటం వల్లనే బాబా గారి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను అనుకున్నాడు భాస్కర్ రావు.
వెంటనే తీర్థయాత్రలకు బయలుదేరిన దగ్గర నుంచి తన దగ్గరకు వచ్చి సహాయం అడిగిన వాళ్ళని కసిరి కొట్టిన సంఘటన అంతక ముందు తన తోటి వారితో ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది. మనం ప్రతిరోజు మన పాప పుణ్యాలు రెండు లెక్కలు వేసుకుంటూ ఉండాలి. డబ్బులు లెక్కలు కాదు. నిత్యజీవితంలో ప్రతిరోజు చేసే పని మాట్లాడే మాట ఆలోచించి చేయడం చాలా మంచి పని. చాలామంది తీర్థయాత్ర లేదో మొక్కుబడిగా చేస్తారు. దేవుడి దగ్గర పూజలు చేస్తారు. కానీ గుడిమెట్ల దగ్గర కూర్చున్న వాళ్ళ వైపు కన్నెత్తి చూడరు. నిజమైన సమస్య ఉండి సహాయం అర్థించిన వాళ్ళకి మనము చేయూతనివ్వడం అనేది మానవుల కనీస కర్తవ్యం. అదే భగవంతుడు మెచ్చేది.
ఆ తర్వాత సాయంకాలం బాబా గారి గుడిలోకి వెళ్లి బాబా గారి క్షమాపణ చెప్పి తేలికబడిన మనసుతో కాకినాడ చేరుకున్నారు. అప్పటినుంచి బాబా వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రతి లక్ష్మి వారం రోజున ఇద్దరు బిచ్చగాళ్లకు అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకుని మొదలుపెట్టాడు
ఒక షిరిడీ యాత్ర కాదు ఏ పుణ్య స్థలానికి వెళ్ళిన ప్రతి మనిషి నడవడికలో తప్పకుండా మార్పు చేసుకోవాలి. ఏ దేవుడు చెప్పిన ఒకటే మాట. ఏ గ్రంథం చదివిన ఒకటే విషయం. ఆ విషయం నిజజీవితంలో మనం గుర్తుపెట్టుకుంటూ ముందుకు నడిస్తే చాలు పిల్లలతో సహా ప్రతి ఒక్కరి జీవితం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ఇదే తీర్థయాత్ర ఫలితం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
చివరిగా మీరు చెప్పిన వాక్యం బాగుంది .. "ఏ పుణ్య స్థలానికి వెళ్ళిన ప్రతి మనిషి నడవడికలో తప్పకుండా మార్పు చేసుకోవాలి. "
రిప్లయితొలగించండి