రావి చెట్టు
రావిచెట్టు
ఏవండీ అప్పారావు గారు రేపు ఉదయం ఈ రావి చెట్టు కొట్టడం ప్రారంభించాలి. ఇంత పెద్ద చెట్టు కొట్టాలంటే కనీసం పది మంది కూలీలు నాలుగు రోజులు సమయం పడుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చూడండి అంటూ ఆ అధికారి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ ఈ చెట్టు కొట్టడం లేబర్ వల్ల సాధ్యం కాదు. పట్నం నుంచి కోత మిషన్ తెప్పించాలి. ముందు కొమ్మలు నరికేసిన తర్వాత చెట్టు మొదలు కోత మిషన్ చేత కోయించాలి. పైగా దీని చుట్టూ సిమెంట్ దిమ్మ కూడా ఉంది. ఈ దిమ్మ పడ కొట్టాలంటే బుల్డోజర్ కూడా కావాలి అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మేస్త్రి అప్పారావు . ఎలా లేదన్న పదిహేను రోజులు టైం పడుతుంది అండి అంటూ చెట్టు పైకి పరిశీలనగా చూశాడు అప్పారావు . సరే అంటూ అధికారి కారు ఎక్కి వెళ్ళిపోయాడు.
అబ్బా ఎంత పెద్ద చెట్టు . పెద్ద పెద్ద కొమ్మలు నిండా ఆకులు ఒక రాక్షసుడు లా ఉంది . ఈ గ్రామానికి సరిపడే ఆక్సిజన్ ఇదే సరఫరా చేస్తుందేమో. గాలికి అటు ఇటు ఊగే ఆకులు ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి.దీని వయసు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉంటుంది. ఎవరునాటారోమహానుభావులు. .
ఆ రోజుల్లో పుణ్యం కోసం రావి చెట్టుతో వేప చెట్టుకి పెళ్లి చేసి రెండు కలిపి నాటేవారుట. చుట్టూ పదిమంది కూర్చోవడానికి వీలుగా సిమెంట్ దిమ్మలు కట్టి ఈ చెట్లను సంరక్షించేవారు. చాలా గ్రామాల్లో ఇటువంటి చెట్లు ఉంటాయి. కానీ ఈ గ్రామానికి ఈ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ రావి చెట్టుకి కుడి పక్కన వ్యాసేస్వర స్వామి కొలువై ఉంటే ఎదురుగా విష్ణుమూర్తి కోవెల. ఈ ముగ్గురు ఆ గ్రామ ప్రజలను ఏ లోటు లేకుండా కాపాడుతున్నారు. ఆ గ్రామ ప్రజలు తీరిక సమయంలో ఆ దిమ్మ మీదకు చేరి పిచ్చపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇ లా ఆ రావి చెట్టు దిమ్మ కాలక్షేపానికి అడ్డాగా మారింది .పిల్లలు సెలవు రోజుల్లో దొంగ పోలీస్ ఆటలు అష్టాచమ్మా ఆడుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ సిమెంట్ దిమ్మ కార్తీకదీపాలతో కళ కళ లాడుతూ ఉంటుంది. అంతేకాదు దారిన పోయే దానయ్య లు పొరుగురు నుంచి పనిమీద ఆ ఊరు వచ్చిన వాళ్లు అలుపు తీర్చుకోవడానికి ఒక పది నిమిషాలు చెట్టు కింద కూర్చుని వెళ్తారు. రాత్రి సమయంలో ఆ ఊరికి వచ్చిన బిచ్చగాళ్ళు ఆ సిమెంట్ దిమ్మ శుభ్రంగా తుడుచుకుని పడుకుంటారు. ఇలా ఎంతోమందికి అనాధలకు ఆశ్రయంగాను ఊరి ప్రజలకి అశ్వద్ధ వృక్షంగాను ప్రశంసలు అందుకుని ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
పైగా ఎన్ని వేల పక్షులు కాపురం ఉంటున్నాయో లెక్కా పత్రం తెలియదు. ఉదయం సాయంకాలం ఆ చెట్టు కింద కూర్చుంటే పక్షుల అరుపులుతో చెవులు బద్దలై పోతాయి. ఉదయం సూర్యుడు తో పాటు లేచి ఆ పిల్ల పక్షుల్ని గూడులోనే వదిలేసి ఆహారం సంపాదించడం కోసం ఆకాశంలో ఎగిరిపోయి సాయంకాలం మళ్ళీ గూటికి చేరే పక్షులు ఎన్నో. అలాగే ఆ చెట్టు కింద నీడలో మధ్యాహ్నం పూట మేత కోసం బయటికి వచ్చిన పశువులు విశ్రాంతి తీసుకుంటాయి.
ఇప్పుడు ఈ చెట్టును నరికేస్తే ఈ నోరులేని పక్షులు ఎక్కడికి వెళ్లి పోతాయి? పైగా వాటి పొట్ట కొట్టడం మహా పాపం కూడా. పైగా ఇంత పెద్ద చెట్టు మళ్లీ ఎప్పటికీ ఎదుగుతుంతో. అయినా ఈ కాలంలో చెట్లను ఇంత శ్రద్ధగా పెంచి వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఇన్నాళ్లు ఈ గ్రామ ప్రజలు రోడ్లు సరిగా లేక బాధపడ్డారు. ఇప్పుడు సడన్ గా రోడ్డు విస్తరణ చేపట్టారు.
అందులో భాగంగానే చాలా రోడ్డు పక్కన ఉన్న చాలా పచ్చటి చెట్లు నిర్దాక్షిణ్యంగా నరికి పారేశారు. నిజానికి ఆ ఊరికి రోడ్ అవసరమే కానీ చెట్లు కూడా అంతకంటే ఎక్కువ అవసరం.
ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఏదో ఒక మంచి పని చేశావని చూపించుకోవాలి కాబోలు.
మేస్త్రి అప్పారావుకి ఈ పని చేయడానికి మనసు ఒప్పలేదు. ప్రెసిడెంట్ గారికి ఈ విషయం తెలుసో తెలియదో ఒకసారి చెప్పడం మంచిది అని అనుకుంటూ ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేశాడు ఎలక్షన్ లో.
అందుకే అధికారపక్షo వాళ్ళు ఏ పని చేపట్టిన ప్రెసిడెంట్ గారికి చెప్పరు .అందుకనే అప్పారావు ముందుగానే విషయం ఊహించి ప్రెసిడెంట్ గారి చెవులో ఊదాడు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఈ రావి చెట్టుని ఒక సాకుగా తీసుకుని జనాల్ని కూడగట్టుకుని రాత్రి పది గంటలకి రావి చెట్టు దిమ్మ మీద సమావేశం ఏర్పాటు చేసి నిరాహార దీక్ష ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు.
మర్నాడు ఉదయమే మండల కేంద్రానికి వెళ్లి రావి చెట్టుని నరికి వేయవద్దని మెమోరండం సమర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రావి చెట్టు దిమ్మ మీద నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రెసిడెంట్ వర్గo వాళ్లు
ఇలా పది రోజులు సాగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. రాజకీయంలో బాగా ఆరితేరిన ప్రెసిడెంట్ గారు ఒక మంచి ముహూర్తం చూసి వెంకటేశ్వర స్వామి విగ్రహం రావి చెట్టు గట్టుమీద ప్రతిష్ట చేసి పూజలు చేయడం ప్రారంభించారు
రావి చెట్టు గట్టును బద్దలు కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు దొరికాయని వెంటనే ప్రెసిడెంట్ గారు వెంటనే రావి చెట్టు కింద ప్రతిష్టించారని మేస్త్రి అప్పారావు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పుకుంటూ పోయాడు. ఆ ఊరి జనం కాకుండా పక్క ఊరి నుంచి కూడా జనం తండోపతండాలుగా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవడం ప్రారంభించారు.. ఇలా ఆ ఊరు ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తయారైంది.
ఎలక్షన్ల ముందు ఇటువంటి విషయాల్లో తలదూర్చి ఆ ఊరి ప్రజలతో గొడవలు ఎందుకని అధికారపక్షం కూడా రోడ్డు విస్తరణ పనులు ఆపేసి ఆ ఊరిని దగ్గరగా ఉన్న ప్రముఖ నగరంతో కలిపే బైపాస్ రోడ్డు వేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని వచ్చే నెలలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఎన్నికల ప్రచార సభలో అధికార పక్షం ఎమ్మెల్యే గారు జనం చప్పట్ల మధ్య హామీలు ఇచ్చారు.
మొత్తానికి అప్పారావు గారి సమయస్ఫూర్తి వలన ఆ రావి చెట్టు బతికి బట్ట కట్టింది. నగరాల్లో గాని గ్రామాల్లో గాని బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు కానీ చెట్లు వేసి పెంచి పోషించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ పరమేశ్వరుడి లాగా
విషవాయువుని మింగి ప్రాణవాయువుని ప్రాణికోటికి సరఫరా చేస్తుంది చెట్టు.
బతికున్నన్నాళ్ళు ప్రాణవాయువుని పండుని ఫలాన్ని ,పూజకు ఆకుని చనిపోయిన తర్వాత చితిమంటకు సహాయం చేస్తుంది. పచ్చని చెట్లు లేకపోతే ఇకముందు మానవ మనుగడ అనుమానమే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి