సత్య

సత్య

ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి పక్క మంచం మీద పడుకున్న
రాఘవమ్మ దగ్గరికి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా. ఒకే పోలిక ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనుకుంటా. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుతున్న రాఘవ మ్మ ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం గమనించింది. రాఘవ మ్మ ఆ పిల్లల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ ఇంతవరకు అమెరికాలో ఉండేవారని ఇప్పుడు ఇండియా వచ్చేసారని అందుకని తనని తీసుకువెళ్లడానికి వచ్చారని చెబుతూ తనకి అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో అని మనసులో బాధపడుతూ ఒక్కసారి తన గత జీవితం గుర్తుకొచ్చింది సత్యకి

" కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు మీ అమ్మాయి సత్యకి 
కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్తున్న మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది పిల్లలను చూద్దామని ఎత్తుకుని ముద్దాడాలనిపించింది కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది. కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లలు ఏడుపులు లీలగా వినిపిస్తున్నా ఏమీ చేయలేక పడుకుని ఉండిపోయింది. 

ఆ శుభవార్త వినగానే పార్వతమ్మ గారికి ఒక్కసారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే యి. ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు. ఎంత కష్టమో తల్లికి. ఒక్కసారి నొప్పులు భరించడమే మరణ యాతన. వెంటనే మరొక సారి నొప్పులు. పాపం సత్య ఎలా భరించిందో ఏంటో . రేపొద్దున్న వీళ్ళు ఆ పిల్లల్ని ఎలా పెంచుతారో. ఎవరు సాయం కూడా ఉండరు. ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజుల్లో ఒక పిల్లని పెంచడమే కష్టంగా ఉంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది పార్వతమ్మ. కానీ ఇది సంతోషించవలసిన విషయం. తన ఆలోచనలు ఇలా ఉన్నాయి ఏమిటి? వాస్తవంలోకి వస్తే ఇదే నిజం. బిడ్డకు జన్మనివ్వడం తల్లికి వరమే కానీ ఎంత కష్టం. 

కవల పిల్లలు పుట్టడం ఆ వంశం చేసుకున్న పుణ్యం అంటారు పెద్దలు. ఒకే కాన్పు లిప్త పాటు తేడా . ఒకరి తర్వాత ఒకరు. ఒకే పోలిక. ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరు చెప్పగలరు. పుట్టించిన బ్రహ్మకే అయోమయం. మత్తులో ఉన్న తల్లి మటుకు ఏం చెప్పగలదు. బ్రహ్మకి అమ్మకి కూడా తెలియని సత్యం. అందుకే కవల పిల్లలు అంటే అందరికీ అపురూపం.

మర్నాడు ఉదయం సత్యకి మెలకువ వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరు ఏడుస్తూ కనబడ్డారు. పాల కోసం అనుకుంటా. ఇప్పుడు మొదలవుతుంది అసలు కష్టం. పిల్లల్ని చూడగానే సత్య కళ్ళల్లో ఆనందం పొంగుకుని వచ్చింది.
 నిన్నంతా డబ్బా పాలు పోయమన్నారు. ఒకరు ఏడుపు మొదలుపెడితే రెండో పిల్ల కూడా ఏడుస్తోంది. ఇద్దరికీ ఒకేసారి ఆకలి అంటూ పార్వతమ్మ చెప్పిన మాటలకి ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో సత్య కి అర్థమైంది. ఓపిక ఉన్నా లేకపోయినా ఆపక్క ఈ పక్క పిల్లల్ని పడుకోబెట్టుకుని పిల్లల కడుపు నింపడానికి ప్రయత్నం ప్రారంభించింది. మొదటిసారిగా మాతృత్వపు అనుభవం. పిల్లలు నాలుగు చుక్కలు తాగి కళ్ళు మూసుకుని పడుకున్నారు.

ఏ ప్రాణిజన్మకైనా అమ్మ ఆధారం. బిడ్డను లాలించి పోషించి పెంచి పెద్ద చేసేది అమ్మ. కానీ కవల పిల్లల తల్లిగా ఆమె పాత్ర అమోఘం. అసలు అమ్మ పాత్ర విలువ అనంతo. ఎంత బాధ్యత. బాధ్యత ఆమె సహనాన్ని రెట్టింపు చేస్తుంది.

 పెదవి విప్పకుండా పిల్లల్ని కసురుకోకుండా తిట్టుకోకుండా వాళ్ల అవసరాలు అన్ని తీరుస్తుంది. అటువంటిది ఇద్దరు పిల్లలు అవసరాలు ఒకేసారి తీర్చాలి. ఒకేసారి ఆకలేస్తుంది. ఇద్దరికీ స్నానం చేయించాలి. ఒక బిడ్డ ఏడిస్తే రెండో బిడ్డ కూడా రాగం తీస్తుంది. ఇద్దరికీ స్తన్యం ఒకేసారి పంచాలి. ఎవరిని ముందు సముదాయించాలో తెలియని అయోమయం. ఒక బిడ్డ నవ్వితే రెండో బిడ్డ కూడా కేరింతలు కొడుతుంది. ఇద్దరి ఆటపాటలను ఒకేసారి ఆనందించడం మనసు నేర్చుకోలేని పాఠం .అభిరుచులు మాట ఎలా ఉన్నా రుచులు తీర్చడం చాలా కష్టం. ఇద్దరూ ఒకేసారి ఎత్తుకోమనేవారు. ఇద్దరికీ తల్లే కావాలి. అలా పిల్లలతో స తమతమయ్యేది సత్య.
భవిష్యత్తు ఊహించుకుంటే మనసు ని భయపెడుతుంది. ఒక్కసారి రంగంలోకి దిగితే భయపెట్టిన పరిస్థితులే అలవాటైపోతాయి అనుకుంటూ సత్య చేతికి ఏమిటో చల్లగా తగిలిందని చూసుకుంటే ఇద్దరూ బట్ట తడిపేసారు. అన్నీ ఒకేసారి ఒకే రకమైన రెండు పనులు చేయాలి. ఇలా ఆసుపత్రిలో ఉండగానే ఒకేసారి ఒకే రకమైన పనులు చేయడం అలవాటైపోయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యి ఇంటికి వచ్చిఅప్పుడే మూడు నెలలు అయిపోయింది. పిల్లలఇంక పేర్లు పెట్టాలి . ఇది ఇంకా పెద్ద పని. ఇంటర్నెట్లో రెండు రోజులు వెతికి మొత్తానికి పెద్ద దానికిఆర్య అని చిన్న దానికి అన్య పేర్లు సెలెక్ట్ చేశారు. కవల పిల్లలకి పేర్లు సెలెక్ట్ చేసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. చాలామంది ప్రాస కోసం ప్రయత్నిస్తారు. అలా బారసాల కార్యక్రమం ఘనంగా చేసుకుని భర్త రామారావుతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయింది సత్య.

పుట్టింట్లో ఉన్ననాళ్లు పాపం పార్వతమ్మ గారు పిల్లల పెంచే ది. కానీ ఇప్పుడు భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత సత్య ఒక్కర్తి పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఇంటి పని వంట పని పిల్లల పని పూర్తి చేసుకునేటప్పటికీ సమయం అసలు తెలియడం లేదు. శరీరం అలిసిపోతున్న బాధ్యతలను మటుకు యధావిధిగా పూర్తి చేస్తూనే ఉంది సత్య. ఇద్దరు ఒకేసారి బోర్లపడడం ఇద్దరికీ ఒకేసారి నడక రావడం ఒక పిల్లకి జ్వరం వస్తే రెండో పిల్లకి జ్వరం రావడం ఇద్దరికీ ఒకే రకమైన బట్టలు చెప్పులు అన్ని రెండు రెండు. ఇద్దరికీ ఒకేసారి కాలకృత్యాలు. ఆ తల్లికి ఎంత కష్టం. ఒక్కొక్కసారి తిండి తినడానికి కూడా సమయం ఉండేది కాదు సత్య కి. కాలం ఎవరి గురించి ఆగదు. అలా నడిచిపోతూనే ఉంటుంది. రామారావు ఒక ప్రభుత్వ సంస్థలో చిరుద్యోగి . ఇద్దరు పిల్లలను పెంచడం చాలా కష్టంగా ఉండేది. రామారావు ఆర్థికంగానూ సత్య చాకిరీ చేయలేక బాధపడుతూ ఉండేవారు. 
ఒకేసారి పిల్లలు ఇద్దరినీ స్కూల్లో జాయిన్ చేయడం క్లాస్ మారే కొద్ది ఫీజులు పెరిగిపోవడం ఇవన్నీ తట్టుకుని బాగా చదువుకుంటున్న పిల్లల్ని ప్రోత్సహిస్తూ అనవసర ఖర్చులు తగ్గించుకుంటూ రోజు ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతూ రామారావు పిల్లలు ఇద్దరినీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. 

పెద్ద చదువులు చదివించడం ఈరోజుల్లో మాటలు కాదు. సొంత ఊర్లో ని ఇల్లు అమ్మేసి పిల్లలు ఇద్దరినీ ఎమ్మెస్ చదువుకోడానికి అమెరికా పంపించాడు రామారావు. ఎమ్మెస్ అయిపోగానే ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగాలు రావడం తమ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమని ఆనందపడ్డారు ఆ దంపతులు. అమెరికా వాతావరణం, డాలర్ లో సంపాదన , వీకెండ్ లో టూర్ లు వీటి తోటి తల్లిదండ్రులతోటి పది రోజులకు ఒకసారి మాట్లాడేవారు పోనీలే పిల్లలేదో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకునేవారు ఆ దంపతులు. అలా కొద్ది రోజులకి ఆ పిల్లలు ఇద్దరు దగ్గర నుంచి పిడుగు లాంటి వార్త వచ్చింది.

 తాము ఇద్దరు ఇక్కడ తమతో పని చేస్తున్న ఇద్దరుఅమెరికన్ అబ్బాయిలని ప్రేమించామని వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఫోన్ చేసి చెప్పారు. తల్లిదండ్రుల నిర్ణయంతో పనిలేదు. సత్య ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. చేసేదిలేక మౌనంగా ఉండి పోయారా తల్లిదండ్రు లు. దానితో రామారావు బెంగపెట్టుకుని హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు ఇద్దరు కూతుళ్లు వచ్చి 
పోయిన తండ్రి గురించి ఒక మాట మాట్లాడకుండా అమెరికా గొప్పలన్ని చెప్పుకుంటూ ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉండి తల్లి గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత సత్య వృద్ధాశ్రమo లోకి అడుగుపెట్టి ఆరు నెలలు అయ్యింది. అలా గతమంతా గుర్తుకొచ్చి ఏడుస్తూ పడుకుండిపోయింది సత్య.
 

నవ మాసాలు మోసి కనిపెంచి పెద్ద చేసిన పిల్లలు ఇలా అయిపోతున్నారు ఏమిటి? బాధ్యత లేకుండా! పెంపక లోపమా! పరిస్థితుల ప్రభావమా! లేదంటే డాలర్ల మహిమా! క్రమేపి సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలకి దూరం పెరుగు తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అయితే ఆశ్రమంలోనూ లేదంటే ఓపిక ఉన్న లేకపోయినా సొంత ఊరిలో సొంత ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారు. కాలం గడుపుతున్నారు. వీళ్ళ పరిస్థితి మారేది ఎప్పుడో!

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట