కోరిక

కోరిక

సాయంకాలం నాలుగు గంటలు అయింది. 

కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు కేకలు గోలలు ఈలలతో
సందడిగా ఉంది. ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా బొద్దుగా ఉన్న కుర్రాడు మూడేళ్ల వయసు ఉంటుందేమో ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్ కి అర్థమైంది. ఆ చూపు రాకేష్ కి ఏమీ కొత్త కాదు. 

పార్కుకి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం ఆ పిల్లవాడి వేపు భార్య రమ ఆశగా చూడడం లేదంటే ఎత్తుకొని ముద్దాడడం రమ రాకేష్ వేపు ఆశగా చూడడంప్రతిసారి జరుగుతున్నదే. రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది. ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. అవును మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు అనుకుని రమ నిట్టూర్చి ఇంటికి వెళదామా అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది. అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. 

రాకేష్ ఇంటికి వెళ్ళాడన్నమాట గాని రాత్రి నిద్ర పట్టలేదు. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు నాలుగు సంవత్సరములు అయినా చెవుల్లో గింగుర మంటున్నాయి. చూడు రాకేష్ ఈ అమ్మాయిని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ పిల్లలు కనడం అంత మంచిది కాదు. ఎందుకంటే పుట్టపోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ అమ్మాయికి గర్భం దాల్చి బిడ్డను కనే శక్తి లేదు. అందుకనే నువ్వు పెళ్లికి ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిది. లేకపోతే జీవితాంతo జాగ్రత్తలు తీసుకో లేవు కదా అంటూ డాక్టర్ గారు చెప్పిన మాటలకి రాకేష్ అన్నింటికీ తల ఊపి రమని పెళ్లి చేసుకున్నాడు.

రమ రాకేష్ ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. సన్నంగా అందంగా తెల్లగా ఉండే రమ అంటే రాకేష్ కి డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఇష్టం ఏర్పడింది. రమ కాలేజీలో చదువుతోపాటు ఆటల్లో పాటల్లో బొమ్మలు గీయడంలో చాలా ఉత్సాహంగా ఉండేది. అలాగే ఒకసారి కాలేజీ వార్షికోత్సవాలలో పోటీల్లో పాల్గొనడానికి రోజు కష్టపడి ప్రాక్టీస్ చేసే రమ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమనేవాళ్ళు తప్పితే ఎవరూ ముందుకు రాకపోవడంతో రాకేష్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ఊర్లో ఉన్న తల్లిదండ్రులకి కబురందించాడు. ఇలా ప్రతిసారి శ్రమ పడినప్పుడల్లా కళ్ళు తిరిగి పడిపోవడం రమకి అలవాటుగా మారిపోయింది.

 ఒకసారి డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి గుండెకు రక్త సరఫరా సరిగా లేదని ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి అని జాగ్రత్తగా ఉంటూ మందులు వాడడం తప్పితే మరి ఏ విధమైన వైద్యం లేదని చెప్పిన మాట విని రమ తల్లిదండ్రులకి ఏం చేయాలో తోచలేదు . తాము బ్రతికున్నంత కాలం బాగానే ఉంటుంది తర్వాతే పిల్లని ఎవరు చూస్తారు అనుకుంటూ దేవుడు ఈ రకమైన శిక్ష విధించాడు ఏమిటి అనుకుంటూ బాధపడుతుండేవారు.పెళ్లి చేసి అత్తారింటికి పంపించవలసిన పిల్ల ఇలా అయిపోయింది ఏంటని ఏడుస్తూ ఉండేవారు. ఇంతలో రమ రాకేష్ మధ్య అనుబంధం బాగా పెరిగింది. సెలవు రోజుల్లో సినిమాలు షికార్లు పార్కులు హోటల్ లో డిన్నర్లు ఇలా తిరుగుతూ ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కానీ రాకేష్ రమ అనారోగ్యం గురించి తల్లికి ఎప్పుడూ చెప్పలేదు కానీ రమ వేరే కులానికి చెందిన అమ్మాయిని మటుకు తల్లితో చెప్పాడు.

 రమ చాలా రోజుల వరకు తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పలేదు కానీ రమ మాట్లాడే ప్రతి పది మాటలలో తొమ్మిది మాటలు రాకేష్ గురించి చెప్తుంటే తెలివైన తల్లిదండ్రులకి అర్థం కాకుండా ఎలా ఉంటుంది. నిలదీసి అడిగితే ఆ అబ్బాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని కచ్చితంగా చెప్పేసింది. 

 రమది చిన్నప్పటి నుంచి మొండిపట్టు. పైగా రమ పరిస్థితి అందరికీ తెలిసి బంధు వర్గoల్లో ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. చేసేదేమీ లేక రాకేష్ తల్లి గారితో మాట్లాడి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి పిల్లని అత్తారింటికి పంపించారు రమ తల్లిదండ్రు లు. కానీ డాక్టర్ గారు చెప్పిన సంగతులు ఏవి రమ అత్తగారికి చెప్పలేదు. ఈ విషయాలు ఏవి రమకి కూడా తెలియదు

అలా పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదని రమ రోజు బాధపడుతుండేది మనసులో. అత్తగారి సూటి పోటీ మాటలు భరించలేకపోయే ది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాకేష్ పిల్లలు గురించి ఏమీ మాట్లాడటం లేదు. కనీసం డాక్టర్ గారి దగ్గరికి చెకప్ కూడా తీసుకెళ్లి ప్రయత్నం చేయటం లేదు. అంటే ఏమైనా లోపం ఉందా రాకేష్ లో. ఇలా పరిపరి విధాల ఆలోచించుకుంటుండేది రమ.

ఒకరోజు రమ ధైర్యం చేసి చూడు రాకేష్ నాకు చిన్న పిల్లలంటే ఇష్టం. ఎవరిలో లోపం ఉందో ఎవరికి తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా మనం చేయలేదు. అందుకునే నేను అనాధ శరణాలయం నుంచి ఒక పిల్లవాడిని తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటున్నా ను. మీ అమ్మగారిని ఒప్పించే బాధ్యత నీదే అని చెప్పింది.

 రాకేష్ గుండెల్లో రాయి పడినట్లు అయింది. ఈ వార్త వింటే అమ్మ ఏమంటుందో అనాధ పిల్లవాడిని తన వంశోద్ధారకుడుగా ఒప్పుకుంటుందో లేదో అని చాలా రోజులు తల్లితో ఏమి చెప్పకుండా కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఇలా ఏడాది పాటు ఎదురుచూసిన రమకి భర్త పరిస్థితి అర్థం కాక ఒకరోజు ధైర్యంగా అత్తగారి తోటి ఈ విషయం చెప్పేసింది. రమ నోటి నుండి ఈ మాట వినగానే అత్తగారి మొహంలో రంగులు మారిపోయేయి. ఏదో తప్పు చేసినట్లు తడబడుతూ ఎందుకమ్మా మీరిద్దరూ ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోండి అంటూ చెప్పిందే గాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొడుకు సంగతి తెలిసిపోతుంది అని గబుక్కున గుర్తుకొచ్చి సరేనమ్మా మీ ఇష్టప్రకారం కానివ్వండి అంటూ మాట మార్చేసింది రాకేష్ తల్లి. రాకేష్ చిన్నప్పుడు ఆడుకుంటూ చెట్టు ఎక్కి కింద పడిపోయాడు. అప్పుడు తగలరాని చోట తగిలిన దెబ్బ వలన అతను తండ్రి అయ్యే అర్హత కోల్పోయాడు. ఈ భయంకర నిజం రాకేష్ కి తల్లికి తప్ప ఎవరికీ తెలియదు. కానీ రాకేష్ పెళ్లి గురించి నిజంగానే బెంగ పెట్టుకున్న తల్లి ఇతర కులం అమ్మాయిని చేసుకోవడానికి అందుకునే వెంటనే ఒప్పేసుకుంది. పైసా కట్నం లేకుండా అన్నిటికి ఒప్పేసుకుంది. బిడ్డను పెంచుకోవడానికి తల్లి ఒప్పుకోవడంతో రాకేష్ ఆనంద పడిపోయాడు. నిజానికి తనలో లోపం ఉందని తెలిసి రాకేష్ ఆపరేషన్ చేయించుకోలేదు.

తనలాంటి సమస్యలు ఉన్నవాళ్లు బిడ్డలను కనడం మంచిది కాదని అది పుట్టబోయే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుందని ఇంటర్నెట్లో చదివిన రమకి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఏమి ఉపయోగం లేదని అప్పుడు అర్థమైంది పాపం. ఇన్నాళ్ళు భర్తని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మనసులోనే బాధపడింది. 

అలా ఒక శుభ ముహూర్తంలో అనాధ శరణాలయంనుంచి బాబును తెచ్చుకుని ఆనందంగా ఆ దంపతులు కాలక్షేపం చేయసాగారు. రమ తప్పితే మిగిలిన వాళ్ళందరూ సమస్యని తప్పించుకోవడం కోసం ఆడిన నాటకమే ఈ కథ.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం