పట్టుదల
పట్టుదల
" అమ్మాా నేను వచ్చే వారమే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి! అంటూ చేతిలో కాగితం పట్టుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి ఆ చల్లటి వార్త చెప్పిన సుధాకర్ ని తల్లి పార్వతమ్మ చేతిలో ఉన్న పని వదిలేసి వచ్చి గట్టిగా కౌగిలించుకునికన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ళకి నీ కష్టం తీరుతో oది రా చాలా సంతోషo అంటూ ఎక్కడ జాయిన్ అవ్వాలి రా అని అడిగింది. హైదరాబాదులో పోస్టింగ్ ఇచ్చారు అంటూ సమాధానం చెప్పాడు సుధాకర్. దేవుడు ఒకదాంట్లో చిన్న చూపు చూసిన నీకు ఒక దారి చూపించాడు అంటూ సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుంది.
సుధాకర్ పార్వతమ్మ గారికి ఆరో సంతానం. పార్వతమ్మ గారి పిల్లలందరూ తెల్లగా బలంగా ఎత్తుగా ఉండేవారు . అంతా తండ్రి పోలిక. అందరిలాగే పుట్టిన సుధాకర్ ఐదేళ్ళు వచ్చేవరకు బాగానే ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం వచ్చి కాళ్లు చేతులు కదపలేకపోయాడు. సుధాకర్ తండ్రి రామారావు గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. పిల్లవాడి నాడి పరీక్షించి చూసి వాతం కమ్మిందని అనుకుని వైద్యం మొదలుపెట్టారు. అప్పటినుంచి సుధాకర్ కి అన్నీ మంచం మీదే. బిడ్డనీ అలా మంచం మీద చూసి వీడి భవిష్యత్తు ఎలాగని రోజు దిగులు పడుతుండేది పార్వతమ్మ.
ఎక్కడికి వెళ్లినా చంకనేసుకుని చంటి పిల్లాడిలా తీసుకెళ్లవలసివచ్చేది. అంత వయసున్న పిల్లవాడిని ఎత్తుకుంటే పాపం పార్వతమ్మ గారికి నడుం నొప్పి వచ్చేది. పైగా దూరం నుంచి నీళ్లు మోసుకు రావాల్సి వచ్చేది. ఏం చెప్తాం కష్టాలన్నీ ఒకసారి వస్తాయి.
పైగా పార్వతమ్మ అప్పుడు బాలింతరాలు కూడా. అటు ఈ చంటిపిల్ల తోను ఇటు మంచం మీద పడిన సుధాకర్ తోటి క్షణం తీరిక ఉండేది కాదు పాపం పార్వతమ్మ గారికి. ఉదయం లేస్తూనే తన కాల కృత్యాలతో పాటు సుధాకర్ కాలకృత్యాలకు సహాయం చేయవలసి వచ్చేది. చంటి పిల్ల లాగా స్నానం కూడా చేయించవలసి వచ్చేది. చంటి పిల్ల తో పాటు సుధాకర్ బాధ్యత లు కూడా పార్వతమ్మ గారి మీద పడ్డాయి.కంచంలో అన్నం పెడితే కలుపుకునే వయసొచ్చిన సుధాకర్ కి వచ్చిన రోగం వల్ల అన్నం కూడా కలిపి ముద్దలు తినిపించేది పార్వతమ్మ. పార్వతమ్మ మొక్కని దేవుడు లేడు. చిన్న రాయి కనిపించిన ఎందులో ఏ మహత్తుందో అనుకుంటూ అన్ని మొక్కులు మొక్కేది . తాయెత్తులు కట్టించేది. రోజు దిష్టి తీసేది. స్వాములవారికి మొక్కేది. ఒకసారి ఎదురింట్లో వెంకటేశ్వర స్వామి పూనకం వచ్చిన కనకమ్మ గారు సుధాకర్ గురించిచెప్పిన మాటలు పార్వతమ్మ గారిలో ఆశను పెంచే యి.
దానికి తోడు భర్త రామారావు ఆయుర్వేద వైద్యం చేసేవారు కానీ పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఏదో సామాన్య సంసారం. ఈ పిల్లవాడు భవిష్యత్తు ఏమిటి? చదువు సంధ్య ఎలా నేర్పించాలి ?అనుకుంటూ భార్య భర్త ఇద్దరూ బాధపడేవారు. అలా కొంతకాలానికి భర్త చేసిన ఆయుర్వేద వైద్యం మూలంగా రెండు చేతులు కుడికాలు బాగుపడి సుధాకర్ కూర్చోడం మొదలు పెట్టాడు. ఇంకా దంపతుల ఆనందానికి అంతులేదు. గుడ్డిలో మెల్ల ఇలాగేనా ఉంటే చాలు అనుకునీ ఆనందపడ్డారు.
పోనీ పట్టణంలో ఇంగ్లీష్ వైద్యం చేయిస్తే అని ఆలోచన వచ్చి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ సర్జన్ కి చూపిస్తే ఆయన చూసి చూడంగానే మీరు ఎంత వైద్యం చేయించినా ఈ పిల్లవాడికి కాళ్లు రావు అంటూ మొహం మీద చెప్పేశాడు. పైగా చక్రాల కుర్చీ ఒకటి వాడుకోమని సలహా ఇచ్చాడు.పాపం పార్వతమ్మ రామారావు గారు దేవుడు ఈ రకంగా శిక్ష వేశాడు ఏమో అని అప్పటినుంచి కుమిలిపోతూ నాటు వైద్యం చేయిస్తే ఫలితం ఉంటుందని ఎవరో చెబితే విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు సంవత్సరం పాటు వైద్యం చేసి ఫీజు అయితే తీసుకున్నారు గాని ఫలితం ఏమాత్రం లేదు. పరుగులు పెట్టవలసిన వయసున్న కుర్రాడు నేల మీద పాకుతూ, డేకుతూ ఉంటే పార్వతమ్మ గారు రామారావు గారు కుమిలిపోతూ ఉండేవారు. పాపం సుధాకర్ కి ఈ విషయం తెలుసుకునే జ్ఞానం లేకపోయినా ఏదో అందరూ తన గురించి బాధపడుతున్నారని విషయం మటుకు లీలగా తెలుసు.
ఈ కుర్రాడిని ఎలాగైనా చదువులో పెట్టాలని నిర్ణయించుకుని రామారావు గారు ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేశారు. మరి రోజు స్కూల్ కి వెళ్లడం ఎలాగా?. స్కూల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం ఎలాగా? ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు . పార్వతమ్మ గారికి మొదటినుంచి ధైర్యం ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా మౌనంగా భరించే శక్తి ఎక్కువ. ఎందుకంటే ఆమె సంసారంలో ఉన్న కష్టాలు పగవారి కూడా రాకూడదు అని అనుకునేది. పాపం అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన పెద్ద కూతురు భర్త కుక్క కరిచి చనిపోయాడు.
పైగా ఆడపడుచుకి మతిస్థిమితం లేదు. వచ్చిపోయే బంధువులు. చాలీచాలని సంపాదన. యిలా ఉంది ఆమె జీవితం. ఎప్పటికైనా కష్టాలు తీరక పోతాయా అనే నమ్మకంతో ముందుకు సాగిపోతోంది పార్వతమ్మ.
రామారావు గారు సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్దామంటే ఎక్కడ పడిపోతాడో అని భయం. రిక్షాలో పంపించే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఇవన్నీ ఆలోచించి పార్వతమ్మ గారు ప్రతిరోజు సుధాకర్ ని చంకన పెట్టుకుని స్కూలుకి తీసుకువెళ్లి దింపి సాయంకాలం తీసుకొస్తూ ఉండేవారు. మధ్యలో కాలకృత్యాలు తీర్చడానికి ఆ స్కూల్లో పనిచేసే ఆయాను బతిమాలి ఒప్పించారు. ఇలా పాఠశాల జీవితం మొదలైన సుధాకర్ కి క్రమేపి తన పరిస్థితి ఏమిటో అర్థమైంది. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతున్నానే బాధ గుండెల్లో దొలిచేది . తల్లితో ఆ మాట చెప్పలేకపోయినా సెలవు రోజుల్లో ఆడుకుంటున్న పిల్లల వైపు ఆశగా చూసే సుధాకర్ ని చూసి పార్వతమ్మ ఏడవని రోజంటూ లేదు.
ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఈ కుర్రవాడు
ఇ లాగా అరుగు మీదనే కూర్చుని ఉంటున్నాడని పాపం తండ్రి రామారావు గారు స్నేహితుల దగ్గర కన్నీళ్లు పెట్టుకునేవారు . మామూలుగా ఉన్న కుర్రవాడిని సాకడం చాలా ఈజీ తల్లిదండ్రులకి ఒక విభిన్నమైన కుర్రవాడిని పెంచడం చాలా కష్టసాధ్యమైన విషయం. అయినా ఎప్పటికైనా దేవుడు ఏదో దారి చూపించకపోతాడా అని సుధాకర్ ని చదివిస్తూ వచ్చారు.అలా సుధాకర్ ఆ ఊరి పాఠశాలలోని ప్రాథమిక విద్య పూర్తి చేశాడు.
ఆ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ హై స్కూల్ లేదు. సరైన రోడ్డు సౌకర్యం లేదు. మామూలు వాళ్ళకి సైకిల్ మీద వెళ్లడం చాలా కష్టం. అందులో విభిన్నమైన వ్యక్తి. పిల్లవాడిని స్కూల్ కి పంపించాలంటే ఎలాగా ఇది వాళ్ళ సమస్య. ఏదిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా కాలం కలిసి వస్తుంది. సుధాకర్ పరిస్థితి బాగా తెలిసిన ఒక మాస్టర్ గారి సహాయంతో ప్రైవేటుగా చదువుకోడానికి నిర్ణయించుకుంటాడు. మాస్టర్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేవాడు సుధాకరుకి.ఆ మాస్టర్ గారు చేతి చలవో లేకపోతే సుధాకర్ కు కలిసి వచ్చిన అదృష్టము కృషి అన్నీ కలిపి పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటుగా చదివి పాసయ్యాడు సుధాకర్. ఇంటిలో ఉండి చదువుకుంటూ మామూలుగా పాసైన స్కూల్ కి వెళ్లి చదువుకున్న వారు తెచ్చుకున్న ఫస్ట్ క్లాస్ తో సమానం అనేవారు మాస్టారు.
ఏదో విధంగా తనని నమ్ముకున్న విద్యార్థిని ఒక మెట్టు ఎక్కించాలని దృఢ సంకల్పంలో ఉండేవారు మాస్టారు జీవితమంతా వీల్ చైర్ కి అంకితం అయిపోయిన ఏదో సాధించాలన్న పట్టుదల మటుకు సుధాకర్ లో చాలా ఎక్కువ. మాస్టారు చెప్పిన పాఠాలన్నీ ఎంతో శ్రద్ధగా చదువుకుని జీవితంలో తనకు చదువు ఒక్కటే ముఖ్యమని గట్టిగా నమ్మి ఉద్యోగం రిజర్వేషన్ మీద సంపాదించడానికి చాలా గట్టి కృషి చేసి బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సంపాదించాడు.
సుధాకర్ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. మరి పోస్టింగ్ హైదరాబాదులో అంటున్నాడు ఇటువంటి పిల్లవాడిని ఒక్కడిని ఎలా పంపించడం అదే సమస్య పట్టుకుంది పార్వతమ్మ గారికి. రాత్రంతా ఆలోచనలో పడింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఈ కుటుంబం అంతా ఏమైపోతుంది.
అందుకే పెద్ద కూతురు రాజమ్మను సుధాకర్ తో పాటు హైదరాబాద్ పంపించింది. అలా అక్క గారితో పాటు హైదరాబాద్ వెళ్లి అక్కడ మూడు గదుల ఇల్లు బ్యాంకుకు దగ్గరగా తీసుకుని ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు సుధాకర్.
అక్కగారు సహాయంతో రోజు బ్యాంకు కి వెళ్లి ఉద్యోగం చేస్తూ ఇచ్చిన పని సక్రమంగా చేస్తూ తను ఉన్నత స్థాయికి వెళ్లాలని ఉద్దేశంతో పరీక్షల పాస్ అవుతూ బ్యాంకులో ఒక మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి అధికారిగా ప్రమోషన్ సంపాదించి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు సుధాకర్.
విధి చిన్నచూపు చూడడం వలన లేదంటే పూర్వ జన్మలోని పాప కర్మల ఫలితంగా దేవుడు ఈ రకమైన శిక్ష వేసిన విధిని ఎదిరించి ధైర్య సాహసాలతో బ్రతుకు సాగించి బ్రతుకును పండించుకున్న వారు ఎంతోమంది ఈ దేశంలో. ఇటువంటి వారికి కుటుంబ సభ్యుల సహకారం తల్లిదండ్రుల ప్రోత్సాహము చాలా అవసరం. లేదంటే మానసికంగా కృంగిపోతారు.
ఈ కథ నేను ఊహించి వ్రాసినది కాదు. ఒక జీవితం దగ్గరగా చూసి వ్రాసినది. అందులో కొన్ని మార్పులు తప్పవు కథ రక్తి కట్టాలంటే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి