దీపావళి

దీపావళి

సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.

 ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది.

" అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.

 అన్నయ్య కి తారాజువ్వలు టపాకాయలు లక్ష్మీ బాంబులు సిసింద్రీలు ఇవి వాడి వాటా అంటూ ఎవరికి వాళ్ళకి పళ్లెంలో పెట్టి కాల్చుకోవడానికి రెడీగా ఉంచేది. రెండు రోజుల ముందు నుంచే కాల్చడం ప్రారంభించే వాళ్ళం. ఊరినిండా ఎంత సందడి. ప్రతి ఇల్లు పిల్లలతోటి దీపాలతోటి కళకళలాడిపోయేది. ఆ టపాకాయలు అంటే ఇప్పటికీ నాకు భయమే. అన్నయ్య పెద్ద హీరోలా రెండు చేతులతోటి జువ్వలు కాల్చేవాడు. 

కాకరపువ్వొత్తుల చిటపటలు, రంగురంగుల అగ్గిపుల్లలు వెలుగులలో దీపావళి మరింత అందంగా వెలిగిపోయేది. మతాబులు చిచ్చుబుడ్లు తెచ్చే వెలుగులు ఆకాశం నుండి జారిపడే నక్షత్రాల్లా ఉండేవి. చిటికెన వేలంతా కూడా ఉండదు ఈ సిసింద్రీ కానీ ఉన్న ఐదు నిమిషాలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నిప్పు ముట్టించగానే ఆకాశంలోని తారలను పలకరించి తన జీవితాన్ని ముక్కలు చేసుకుని చేసే పెద్ద చప్పుళ్ళు ఊరంతటికీ సందడే. దాని పేరే తారాజువ్వ. వెలుగులు చిమ్ముతూ భూమి మీద తిరిగే భూచక్రాలు గిరగిరా తిరిగే విష్ణు చక్రాలు దీపాల పండక్కి సందడి చేసే అతిథులు. అన్నింటికన్నా పిల్లల కళ్ళల్లోని వెలుగులు దీపావళికి మరింత అందం. అది ఆనంద దీపావళి . ఆ రోజుల్లో డబ్బు కోసం నాన్న ఇంటి పనుల కోసం అమ్మ పడిన కష్టం నిజంగా ఇవాళ తలుచుకుంటే ఏడుపొస్తుంది. ఎందుకు పిల్లల కళ్ళల్లో సంతోషం కోసం తాపత్రయపడేవాళ్లు.

 దివిటీలు కొట్టి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రాగానే అమ్మ నోట్లో పెట్టిన తొక్కుడు లడ్డు రుచి ఇప్పటికి గుర్తుకొస్తూనే ఉంటుంది. అమ్మను అందరు అనేవారు తొక్కుడు లడ్డు స్పెషలిస్ట్ అని. ఏ పనైనా ఎంత శ్రద్ధగా చేసేది.

ఇంటి విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ తినుబండారాలు విషయంలో కానీ ఎంత శ్రమైనప్పటికీ నాణ్యతకే ప్రాధాన్యత ఇచ్చేది. నాణ్యమైన శనగ పిండి బెల్లం దొరికే షాపు వెతికి పట్టుకుని ప్రతి ఏటా అక్కడే సరుకు తెప్పించేది. ఆ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఉప్పులేని జంతికలు తయారుచేసి రోకళ్ళతో దంచి జల్లించి బెల్లం పాకం పట్టి ఆ మిశ్రమం పళ్లెంలో పోసి పొత్రం తో నూరి ఉండలు చేయడం దీపావళి నాడు ఆ స్వీట్ తినిపించడం అమ్మ అలవాటు. నరక చతుర్దశి నాడు చక్ర పొంగలి దీపావళి నాడు బొబ్బట్లు పులిహార ఎంత ఓపిగ్గా చేసేదో అమ్మ. 

చిన్నతనం అంతా అలా సరదాగా గడిచిపోయి పెద్దయిపెళ్లయిన తర్వాత మొదటిసారి అమావాస్య పండుగని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లలేదు. కానీ రెండు రోజులు ముందుగానే లడ్డూలు పార్సిల్ వచ్చింది. రుచిలో ఏవి మార్పు లేదు. కానీ అమ్మతో కలిసి దీపావళి చేసుకోలేదని బాధ ఉండేది. ఆ తర్వాత మిగతా పండగలకు ఇంటికి వెళ్లిన దీపావళి పండుగ మా ఇంట్లోనే. కారణం ఆరోజు చీకట్లో మా ఇల్లు ని ఉంచడం ఇష్టం లేక. ఆ పండగ ఎప్పుడు మా ఇంట్లోనే. 
అమ్మ ఎప్పుడు లడ్డులు పార్సిల్ పంపిస్తూనే ఉండేది. నాకు మా వారికి బట్టలతోపాటు మా ఇద్దరి పిల్లలకి బట్టలు కూడా పార్సిల్ లో చోటుచేసుకున్నాయి. ఎప్పటిలాగే అమ్మలాగే నేను మా పిల్లల గురించి ఆందోళన. చేతులు కాల్చుకుంటారని భయం. అమ్మ ఏ విధంగా చేసేదో నేను కూడా దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే దాన్ని. అమ్మ పద్ధతులన్నీ అనుసరించే దాన్ని. కొద్ది రోజులకి లడ్డూలు పార్సిల్ ఆగిపోయింది. ఎందుకంటే మా నాన్నకి లడ్డూలు చేయడం చేతకాదు. సురుచి ఫుడ్స్ వాళ్ళు లడ్డు పంపిస్తానమ్మ అంటూ నాన్న ఫోన్ చేసేవాడు. పిల్లల మీద మమకారం చంపుకోలేక. ఆ తర్వాత కొద్దిరోజులకి నాన్న దగ్గర నుంచి వచ్చే ఫోన్ కూడా ఆగిపోయింది 

నా జీవితంలో కూడా మార్పులు వచ్చేసాయ్. ఇద్దరు పిల్లలు చదువులు ఉద్యోగాలు పెళ్లి ,పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి. పిల్లలు ఎక్కడో దూరంగా. దీపాల పండుగ కి రమ్మని ఒకటే ఫోన్లు. అన్ని గంటల ప్రయాణం చేసే ఓపిక లేదు ఇలా ఆలోచిస్తూ ఎంతసేపు ఉండిపోయిందో రమ్య. కానీ ఇప్పుడు ఇల్లంతా దీపావళి సందడిలేదు. ఇద్దరం ముసలి వాళ్ళమే. పిల్లలు ఉండే ఇల్లు ప్రతిరోజు దీపావళి లాగే ఉంటుంది అని చెప్పే తల్లి మాటలు గుర్తుకొచ్చి రమ్యకు ఒక్కసారి కళ్ళు నీళ్లు వచ్చాయి 

 "రమ్యా ఇదిగో ఈ మతాబు కాల్చంటూ భర్త ఇచ్చిన మతాబునీ కాల్చడం ప్రారంభించింది. ఏమిటి అలా ఉన్నావ్. ఒంట్లో బాగాలేదా అని అడిగాడు భర్త రమేష్ రమ్యని. 
లేదండి బాగానే ఉంది. రమ్య అలా ఎందుకు ఉందో రమేష్ కి తెలుసు. పిల్లలు పెళ్లి కానంతవరకు దీపాల పండుగకు వచ్చేవారు. వాళ్లకి పిల్లలు పుట్టడం బాధ్యతలు బరువులు సంసారం దానికి తోడు ఎవరి ఇల్లు వాళ్లు దీపావళి నాడు చీకటిగా ఉంచడం ఇష్టం లేక రావడం లేదు. పిల్లలు రాలేదని రమ్య బాధ . పిల్లలతోటే పండగ హడావుడి. వాళ్ల కోసం బాణసంచా కొనడం స్వీట్లు తయారు చేయడం కొత్త బట్టలు కొనడం ఇవన్నీ పనులే అనుకొంది రమ్య. 

ఇంతలో పిల్లలు ఇద్దరి దగ్గర్నుంచి వాట్సప్ కాల్. ఆ వాట్సప్ కాల్ లో పిల్లల బాణసంచా హడావిడి దీపాలు వెలుగు చూసి ఆనంద పడిపోయింది రమ్య. నానమ్మ ఇదిగో మతాబు కాల్చు అంటూ మనవలు చూపించిన మతాబును చూసి రమ్య మొహం వెలిగిపోయింది. నాకు టపాకాయలు అంటే భయం లేదు నీకు భయం కదా నాన్న చెప్పాడు అంటూ మనవళ్లు అడిగిన ప్రశ్నకి మనసారా నవ్వుకుంది. నానమ్మ నేను రెండు చేతుల తోటి జువ్వల కాల్చాను అంటూ పెద్ద మనవడు చెప్పిన మాటలకి రమ్యకి అన్నగారు గుర్తుకొచ్చాడు. కోడళ్ళు ఇద్దరు సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు కట్టుకుని చక్కగా దీపాలు పెట్టుకున్నారని ఆనందపడింది. తనకి తన పిల్లలకి చిన్నప్పుడు అమ్మ చెప్పిన విధంగా జాగ్రత్తలు చెప్పి తృప్తి పడింది. అత్తయ్య గారు ఈ తొక్కుడు లడ్డు రుచి చూడండి అంటూ వాట్సప్ కాల్ లో నోటి దగ్గర పెట్టిన తొక్కుడు లడ్డు చూసి నవ్వుకుంది రమ్య.

 మీరు చేసినట్లుగా వచ్చాయని చాలా రుచిగా ఉన్నాయి అని మీ అబ్బాయిలంటున్నారు అంటూ కోడళ్ళు చెప్పిన మాటలకి పొంగిపోయింది రమ్య. దూరాన ఉన్న పిల్లలు మనవలు చేసుకున్న దీపావళిని చూపించిన ఆ బుజ్జిముండనీ ముద్దు పెట్టుకుంది రమ్య. కానీ ఆ ఊరిలో ఉన్నట్లుగానే దీపావళిని ఈ బొమ్మలో చూసాం. ప్రతి ఏటా దీపావళి పండుగని ఈ బుజ్జిముండ లో రికార్డ్ చేసి దాచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అని కొడుకు చెప్పిన మాటలకి ఆ వీడియో వెంటనే పెట్టు అంటూ పిల్లలకి పెద్దలకి దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఫోన్ పెట్టేసింది రమ్య. 

ఈ బొమ్మను ఎవరు కనిపెట్టారో కానీ ఎంత తృప్తి తీసుకొచ్చిందో . మనసును ఆనందపరిచింది అనుకుంటూ తృప్తిగా నిద్రపోయింది.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట