స్పూర్తి దీపావళి
స్ఫూర్తి దీపావళి
దీపావళి అంటే కేవలం దీపాల పండుగ కాదు, అది మనసులను వెలిగించే స్ఫూర్తి పండుగ. ప్రతి సంవత్సరం చీకటిని తొలగించి వెలుగు తెచ్చే ఈ పర్వదినం మన జీవితంలో కూడా అజ్ఞానం, అసూయ, ద్వేషం వంటి చీకట్లను తొలగించమని గుర్తు చేస్తుంది.
మన ఇంటి ముందు వెలిగించే చిన్న దీపం మన హృదయంలోని వెలుగుకు చిహ్నం. ప్రతి దీపం ఒక స్ఫూర్తి —భౌతికంగా మనకు కనిపించే దీపం వెలుగులు పంచుతుంది కానీ మనలోని అజ్ఞానం తొలగించుకోవడానికి జ్ఞాన దీపం నిజాయితీగా జీవించడానికి ధర్మ దీపం ఇతరుల పట్ల ప్రేమ కారుణ్యం పెంచుకోవడానికి ప్రేమ దీపం, కారుణ్య దీపం వెలుగులు ప్రసరించేలా ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన మానవత్వం మనలో మేల్కొంటుంది.
దీపావళి పండుగ మనం కేవలం ఇంటిని శుభ్రం చేయడమే కాకుండా, మన మనసును కూడా శుభ్రం చేసుకోవాలని నేర్పుతుంది. ఈ దీపావళి మన జీవితంలో కొత్త ఆశలు, సత్సంకల్పాలు, వెలుగైన ఆలోచనలను నింపాలి.
“మనసులో వెలిగిన దీపమే నిజమైన స్ఫూర్తి దీపావళి.”
దీపావళి అంటే వెలుగుల పండుగ. ఆ వెలుగులతో పాటు బాణసంచా కూడా దీపావళి ఉత్సవంలో భాగం. పిల్లలు, పెద్దలు అందరూ ఆకాశం వైపు చూసి ఆనందంతో నవ్వుతారు. కానీ ఈ బాణసంచాలో కూడా మనకు జీవితానికి ఒక స్ఫూర్తి దాగి ఉంది.
బాణసంచా నిప్పు తగలగానే ఒక్కసారిగా మంట పుడుతుంది, ఆ తర్వాత రంగులు, వెలుగులు చిందిస్తుంది. అది మన జీవితంలాంటిదే. కష్టాలు, పరీక్షలు మన జీవితానికి నిప్పులాంటివి. కానీ వాటిని సహనంతో ఎదుర్కొంటే, మనం కూడా బాణసంచాలా వెలుగులు చిందిస్తాం.
కొన్ని బాణసంచాలు పెద్ద శబ్దం చేస్తాయి — అవి మనకు చెబుతున్నాయి, ధైర్యంగా మాట్లాడి సత్యం చెప్పాలి అని.
కొన్ని నిశ్శబ్దంగా ఆకాశంలో రంగులు వెదజల్లుతాయి — అవి నిశ్శబ్దంగా పనిచేసినా లోకానికి వెలుగు ఇవ్వగలమని చెబుతాయి.
కొన్ని చిన్నవైనా ఎంతో అందంగా మెరిసిపోతాయి — అంటే పరిమాణం కాదు, ప్రభావం ముఖ్యం అని స్ఫూర్తినిస్తాయి.
ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఇల్లాలి కళ్ళు దీపావళి దీపంలా కళకళలాడుతూ ఉండాలి. ఆకాశంలోనికి దూసుకుపోయే తారాజువ్వలు యువతకి స్ఫూర్తిదాయకం. చూడడానికి చిటికెన వేలంతా కూడా ఉండదు కానీ అది వేసే చిందులు దాని ఉత్సాహం చిన్నపిల్లలకు ఆదర్శం.
తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చే కొవ్వొత్తి ఇంటి యజమానికాదర్శం .కొంతమంది పలకరించగానే కాకరపువ్వొత్తి లాగా చిటపటలాడిపోతారు. అయినా దీపావళి సంబరంలో అది కూడా ముఖ్యం. అలాగే కుటుంబంలోని వ్యక్తులు కూడ కొంతమంది అలాగే ఉంటారు. అందర్నీ కలుపుకుంటూ పోతేనే దీపావళి సంబరం. నిప్పు తగిలించగానే నోటి వెంట మంచి ముత్యాలు రాల్చే చిచ్చుబుడ్డి మతాబులను చూస్తే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. బాధ కలిగిన కోపం వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి వెంట వచ్చే మాటలు మంచి ముత్యాలలా
ఉండాలని అవసరమైనప్పుడు మాటలు టపాకాయల భయం పుట్టించాలి.
కొండెక్కిపోతున్న దీపానికి చమురు పోసి నట్లు జీవితంలో ఆశలు తగ్గిపోతున్నప్పుడు మనం మనకే స్ఫూర్తినిచ్చుకోవాలి
ఇతరుల ప్రశంసల కోసం కాకుండా మన అంతరాత్మలో వెలిగిన దీపాన్ని కాపాడుకోవాలి. ఎన్ని తుఫానులు వచ్చిన ఎన్ని చీకట్లు కమ్ముకున్న ఆ దీపం మళ్లీ వెలిగించుకుని ముందుకు సాగిపోవాలి. అదే నిజమైన స్ఫూర్తి దీపావళి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి