కార్తీక్

కార్తీక్ 

" చూడండి ఈ బాబు మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. దీనికి ఏమి వైద్యం లేదు. అందుకే ఈ వయసు లో రావలసిన ఆటపాట ఆలస్యంగా వస్తున్నాయి. కానీ శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూ పిల్లల వైద్యుడు చెప్పిన మాటలకి పిల్లవాడు కార్తీక్ తల్లి రాధ బుర్ర తిరిగిపోయింది. తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏమి వినపడలేదు. ఆటోలో ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకుని ఆలోచనలలో పడింది.

పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు. అందాల చందమామలా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి నాడు పుట్టాడు. అందుకే పున్నమి చంద్రుడిలా ఉండేవాడు. గిరజాల జుట్టు తెల్లటి రంగు పొడవైన వేళ్ళు, కాళ్లు చేతులు అబ్బా తలుచుకుంటేనే ముద్దొచ్చేలా ఉండేవాడు. పుట్టి ఏడాది పైన అయినా ఆ వయసు వాళ్లకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళితే తెలిసిన నిజం. రాధ అత్తగారు రోజు సాధిస్తూనే ఉంది. 

పిల్లవాడు ఏమిటి ఇలా ఉన్నాడని. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టలేదు అంటూ రోజు ఒకటే గోల. పాపం కనిపెట్టుకోలేకపోయింది రాధ . అత్తగారు అనుభవంతో కనిపెట్టింది. అత్తగారు ఇప్పుడు ఏమంటుందో ఏమో. భర్త ఈ విషయం ఏ విధంగా తీసుకుంటాడో అనుకుంటూ ఏడుస్తూ పడుకుంది.

రాత్రి భోజనాల సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ విషయం ఏడుస్తూ చెప్పింది. ఎవరు ఏమి మాట్లాడలేదు. రాధ అత్తగారు మాత్రం పెద్దగా ఏడుపు మొదలు పెట్టింది. వీడు ఇలా అయితే మటుకు ఏమిటి రెండో కాన్పులో మంచి పిల్లాడు పుడతాడులే దానికి ప్రయత్నిస్తే సరి అంటూ అక్కడకు అక్కడ జడ్జ్మెంట్ పాస్ చేసి గదిలోకి వెళ్ళిపోయింది. రాధ భర్త మౌనంగా అన్నం తినేసి గదిలోకి వెళ్లిపోయాడు.

 రాధ వంటిల్లు అంతా సర్దుకుని వచ్చేసరికి భర్త గోపాల్ మొహం మీద చేతులు పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఏవండీ పడుకున్నారా అని రాధ ప్రశ్నించేసరికి లేదు అని సమాధానం చెప్పాడు. కానీ గొంతు ఏదో తేడాగా ఉంది. రాధ దగ్గరికి వచ్చి చేతులు తీసి చూసేసరికి ఏడుస్తూ కనబడ్డాడు గోపాల్. అలా భార్యాభర్తలిద్దరి మధ్య మాటలు ఏమీ లేవు . అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు.

ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పిల్లల పెంచడం చాలా కష్టంగా ఉంది తల్లికి. అందులో ఇలాంటి ప్రత్యేకమైన పిల్లవాడు. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది. కార్తీక్ వయసు పెరిగే కొద్దీ ఇంటికి వచ్చిన చుట్టాలు మీ పిల్లవాడు ఇంకా నడవడం లేదా! మీ పిల్లవాడికి మాటలు వచ్చాయా !అంటూ ప్రశ్నించేసరికి పాపం రాధ సమాధానం చెప్పలేకపోయింది. అందరూ పిల్ల వాడి గురించి గుసగుసలు చెప్పుకోవడం విని చాలా బాధపడుతూ ఉండేది. రోజు సమయానికి పాలు తాగి పడుకోవడం తప్పితే వేరే లక్షణాలు ఏమీ కనబడలేదు కార్తీక్ లో. పక్కనున్న పార్కులో పిల్లలందరూ ఆడుకుంటుంటే కార్తీక్ బెంచ్ మీద కూర్చుని కిందకు దిగేవాడు కాదు. అందరూ అదోరకంగా చూసేవారు. ఇలా ఐదు సంవత్సరాలు గడిచే యి. మాటలు సరిగా రాలేదు. మనం ఏదంటే అదే. ఒరేయ్ కార్తీక్ అని పిలిస్తే తను కూడా ఒరేయ్ కార్తీక్ అంటాడు. 

రాధ అత్తగారు మాత్రం ఏనాడు కార్తీక్ నీ దగ్గరకు తీసుకోలేదు. ఏడుస్తున్న ఏనాడు సముదాయించలేదు. మామూలుగా చంటి పిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే తల్లి దగ్గరగా లేకపోతే ఎవరైనా సరే గబుక్కుని దగ్గరకు తీసుకుంటారు. వీడు చంటి పిల్లాడే. కానీ వాడు ఏం పాపం చేశాడో ఇలాంటి జన్మ వచ్చిందని రాధ బాధపడుతూ ఉండేది .

ఇలా ఉండగా ఒక రోజు రాధఅత్తగారు పిడుగు లాంటి వార్త తీసుకొచ్చింది. సిటీలో ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైన పాఠశాల ఉందని అలాంటి దాంట్లో కార్తీక్ జాయిన్ చేయమని అన్నీ వాళ్లే చూస్తారని ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారని గోపాల్ కి భోజనాలు సమయంలో చెప్పింది. మనం ఎన్ని రోజులు పెంచిన ఇలాంటి వాళ్లలో మార్పు రాదు. వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉంటారు అంటూ పదే పదే చెప్పడంతో గోపాల్ రాధ వైపు చూశాడు.

 భర్త పరిస్థితి అర్థం చేసుకొని మర్నాడు పిల్లవాడిని తీసుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళింది రాధ. ఆ స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ లా ఉంది. పాపం అందరూ ఇలాంటి పిల్లలే. ఇక్కడే హాస్టలు ఉందని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వీలులేదని తాము ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి తమ పనులు తాము చేసుకొని లాగా కొంచెం జ్ఞానం వచ్చేలాగా తయారు చేస్తామని ప్రిన్సిపాల్ గారి మాటలు విని ఒకసారి స్కూలు హాస్టలు చూసి వస్తానని చెప్పింది రాధ. అలా క్లాసు రూములన్ని తిరుగుతూ ఉండగా కనబడి న దృశ్యాలను చూసి మనసు పాడైపోయింది. కొన్ని క్లాస్ రూములలో పిల్లలు ఎవరికి బట్టలు సరిగా లేవు. అదోరకమైన వాసన కొడుతూ ఉన్నాయి గదులు. కొంతమంది పిల్లలు తాడుతో కిటికీలు కట్టేసి ఉన్నారు. 

ఒకరిద్దరూ ఉపాధ్యాయులు దెబ్బలు కొడుతూ కూడా కనిపించారు. ఈ పిల్లలకు తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఎవరు ఏమనుకున్నా తెలియదు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు తెలియవు . వీళ్ళ ప్రపంచమే వేరు. ఇదంతా చూసి మనసు పాడైపోయి ఇంటికి తిరిగి వచ్చేసింది రాధ. అలా రెండు మూడు పాఠశాలలకు వెళ్లిన పరిస్థితి అలాగే ఉంది. దూరంగా ఉన్న పాఠశాలకు పంపించడం అలాగే హాస్టల్లో జాయిన్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు రాధకి. 

కార్తీక్ లో వయసు పెరుగుతోంది కానీ మార్పు ఏమి కనబడలేదు. స్నేహితురాలు సలహాతో ఒక మంచి టీచర్ ని కుదుర్చుకుని శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది రాధ. అయినా కార్తీక్ దృష్టి అంత టీవీలో వచ్చే మ్యూజిక్ ప్రోగ్రాములు వైపు మరలడం ఒకవేళ టీవీ కట్టేస్తే ఏడవడం ప్రారంభించడం టీవీలో వచ్చే పాటలకి కాళ్లు చేతులు కదపడంచూసిన రాధ ఒక మ్యూజిక్ టీచర్ ని పెట్టి పాటలను నేర్పించడం మొదలుపెట్టింది. చదువు మీద శ్రద్ధ లేదు. కానీ పాటలంటే శ్రద్ధ పెరిగింది కార్తీక్. వయసు పెరిగిన ఏది మంచి ఏది చెడు తెలియదు. వీధులలో వినాయక చవితి సంబరాలు జరిగితే తల్లి చూడకుండా వెళ్ళిపోతుండేవాడు కార్తీక్. ఎక్కడ చూసాడో ఏమో పుట్టినరోజు పండుగలకి హ్యాపీ బర్త్డే పాట పాడడం నేర్చుకున్నాడు. ఇలా కార్తీక్ కి పదిహేను సంవత్సరాలు వచ్చే యి. తన బట్టలు తను వేసుకోలేడు. పెద్ద పిల్లవాడు అవుతున్నాడు. ఎన్ని రోజులు ఇలా! తన తర్వాత ఎవరు చూస్తారు అనుకుని బాధపడుతూ ఉండేది రాధ.

ఈలోగా అత్తగారు ప్రతిరోజు సాధిస్తూనే ఉండేది రెండోసారి ప్రయత్నించమని. అమ్మో ఒకవేళ నిజంగా ప్రయత్నిస్తే రెండోసారి కూడా ఇలాంటి పిల్లాడే పుడితే అప్పుడేం చేయాలి. ఇలాంటి పిల్లవాడిని పెంచడం అంటే మాటలు కాదు. చాలా మానసిక ధైర్యం కావాలి. ఆర్థికంగా శారీరకంగా కూడా తట్టుకునేలా ఉండాలి అనుకుంటూ మరోసారి ప్రయత్నానికి అవకాశం లేకుండా ఆపరేషన్ చేయించుకుని కార్తీక్ మీద మరింత శ్రద్ధ పెట్టింది రాధ. 

మ్యూజిక్ టీచర్ చెప్పే ప్రతి పాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవడా నికి అలవాటుపడ్డాడు కార్తీక్. టీచర్ కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని శ్రద్ధగా సినిమా పాటలు చెప్పడం ప్రారంభించింది. అలా తన వెంట కార్తీక్ ని తీసుకుని చిన్న చిన్న పాటల పోటీలకు తీసుకెళ్లడం ప్రారంభించారు సంగీతం మాస్టారు. 

కాలం ఎప్పటికీ ఒకలాగే ఉండదు. ప్రతి సమస్యకి ఏదో ఒక సమయంలో పరిష్కారం భగవంతుడే చూపిస్తాడు. దానికి ఓర్పు చాలా అవసరం. పరిస్థితులకు తట్టుకుని నిలబడడం కూడా చాలా అవసరం. ఆ ఊర్లో ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు తెలుగు పాటల పోటీలు సెలక్షన్ ప్రారంభించారు. కార్తీక్ కూడా ఆ పాటలు పోటీకి సెలెక్ట్ అయ్యాడు .

హైదరాబాదులోని రవీంద్ర భారతి అంతా ఆహుతులతో నిండిపోయింది. వేదిక మీద ఒకపక్క న్యాయమూర్తులు ఒకపక్క సంగీత వాయిద్యాలు మరొక పక్క పాటల పోటీలో పాల్గొనే కళాకారులు కూర్చుని ఉన్నారు. సాధారణంగా పాటలు పాడే పిల్లల తల్లిదండ్రులు ఆహుతుల్లో కూర్చుని ఉంటారు. కానీ కార్తీక్ తల్లిదండ్రుల మటుకు కార్తీక్ పక్కనే కూర్చుని ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రత్యేకత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
కార్యక్రమం ప్రారంభమైంది పిల్లలందరూ పాడుతున్నారు. కార్తీక్ వంతు వచ్చింది. కార్తీక్ తో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చి వేదిక మీద నిలబడ్డారు. నీ పేరు ఊరు చెప్పమని అనౌన్సర్ అడిగితే అదే మాట మళ్లీ తిరగేసి చెప్పాడు కార్తీక్. న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాధ మైకు చేతిలోకి తీసుకుని కార్తీ కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత కార్తీక్ నోటి వెంట వచ్చిన పాటలు ఆహుతులు అందరికీ కళ్ళ నీళ్లు తెప్పించే యి. అందరూ అభినందనలు చెప్పిన కార్తీక్ ఏదో మాయలోకంలో ఉన్నట్లు ఉండిపోయాడు. పాటలోని తప్పొప్పుల మాట ఎలా ఉన్నా ఒక విభిన్నమైన వ్యక్తిని ఇంత స్థాయికి తీసుకువచ్చిన కార్తీక్ తల్లి తండ్రిని జడ్జిలు ఎంతగానో అభినందించారు. అందులో ఉండే ఒక ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు తన ట్రూపులోకి కార్తీక్ ని తీసుకుంటానని సభా ముఖంగా ప్రకటించాడు. రాధ ఆనందానికి అంతులేదు. 

ప్రపంచంలో దేవుడు అందర్నీ ఒకేలా పుట్టించడు. కొంతమంది మామూలు వాళ్ళ కంటే భిన్నంగా ఉంటారు. అంతేకానీ వాళ్లు తక్కువ కాదు.. వాళ్లని చేరదీసి మానసిక ధైర్యం ఇచ్చి ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. చీకట్లో ఏడుస్తూ కూర్చోక ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ కాంతి కొంతమంది కళ్ళల్లో వెలుగు తీసుకొస్తుంది. అలాంటి వ్యక్తులను సమాజం చిన్నచూపు చూడకూడదు. అవసరమైతే చేయూతనివ్వాలి. అప్పుడే వాళ్ళు ప్రతిభావంతులవుతారు.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట