ఇదే నా పండుగ
గ్రామీణ జీవితంలో సంత అంటే ఒక జాతర లాంటిది. వారానికి ఒకసారి జరిగే సంతలో కూరగాయలు, వెచ్చాలు కొనుక్కోడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంత జరిగే ప్రదేశానికి వచ్చి, నెత్తి మీద బుట్ట, చేతిలో పదేళ్ల కూతురు కావమ్మని పట్టుకుని నడుచుకుంటూ, సంతలో ప్రతి దుకాణం తిరుగుతోంది యాదమ్మ.
ప్రతీ వారం గ్రామంలో ఒక రోజు “సంత రోజు”గా జరుపబడుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఒకే చోటకి చేరి కొనుగోళ్ళు చేస్తారు. ఈ సంతలు మానవ మేళాలను పోలి ఉంటాయి — సరికొత్త వస్తువులు, మిత్రుల కలయిక, ప్రజల సందడి, చిన్న చిన్న సంతోషాలు అన్నీ అక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా సంతలో ఉన్న దుకాణాలు ఇవి సమాజ జీవన శైలికి ప్రతిబింబంగా నిలుస్తాయి.
సంతలో ఎన్నో రకాల దుకాణాలు కనిపిస్తాయి. కొన్ని స్ధిరంగా ఉంటే, కొన్ని తాత్కాలికమైనవి. ముఖ్యంగా కనిపించే దుకాణాలు:
కొత్తగా తీయబడిన దుంపలు, ఆకుకూరలు, మిరపకాయలు, టమోటాలు మొదలైనవి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడుతూ ఉంటాయి.
చక్కెర, ఉప్పు, పెప్పర్, నూనె, సబ్బులు, అల్లాలు మొదలైన అవసరమైన దినసరి సరుకులు చిన్న చిన్న పొట్టిదుకాణాల్లో విక్రయిస్తారు.
గ్రామీణ శైలిలో వేషధారణకి అనుగుణంగా చీరలు, షర్ట్లు, పంచెలు మొదలైన వస్త్రాలు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.
చిన్న పిల్లలకు ఆకర్షణగా ఉండే ఆటబొమ్మలు, లలిత కళలతో చేసిన వస్తువులు, పగడ బొమ్మలు ఈ దుకాణాల్లో దొరుకుతాయి.
మురుకులు, జిలేబీలు, బండారు లడ్లు, పల్లీలు, మామిడి తురుము తినుబండారాల దుకాణాల్లో మహా రుచిగా ఉంటాయి పల్లెటూరుల వారు స్థానిక మందులతో చికిత్స చేసే ఆయుర్వేద దుకాణాలు సంతలో తరచూ కనిపిస్తాయి.
సంతలో దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కావు. అవి స్నేహ బంధాలను బలపరిచే వేదికలు కూడా. అక్కడ చేనేత దుస్తులు కొనడం ఒక మానవీయ అనుబంధం. ఒక కూరగాయలు అమ్మే అమ్మ మరుసటి వారం మా మామగారికి “నాలుగు ఉల్లిపాయలు మిగిల్చి పెట్టమా” అన్న మాటలు వినిపించడం — ఇవి మన ఊరి జీవితం
చిన్న వ్యాపారులు, కర్షకులు, కళాకారులకు సంతలో దుకాణాలు ఒక జీవనాధారం. పెద్ద వ్యాపార కేంద్రాలలేక గ్రామస్తులకు ఇది నిత్యావసరాలు అందించే మార్గం. అలా ఒక్కొక్క దుకాణాన్ని దాటుకుంటూ ముందుకు నడుస్తోంది యాదమ్మ .
ఏ దుకాణం దగ్గరికి వెళ్లినా, కావమ్మ "ఇది కావాలి"ంటూ చెయ్యి పెట్టి చూపిస్తూ ఏడుస్తోంది. "వద్దమ్మా, అది తింటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది" అంటూ ఏదో ఒక సాకు చెప్పి దూరంగా తీసుకెళ్లిపోతూ ఉంటుంది. చిన్నపిల్ల కదా, అమ్మ పరిస్థితి తెలియని వయసు. దానికి తోడు తోటి పిల్లలు చేతిలో ఏదో ఒకటి చూస్తుంటే, కావమ్మ కూడా అదే అడుగుతుంది ప్రతిసారి.
ప్రతి వారం సంతకు వచ్చిన పాపం కావమ్మ కోరిక ఏ ఒక్కటి తీర్చలేని స్థితి యాదమ్మది. ఒకసారి మిఠాయి కావాలని, మరొకసారి జీళ్ళు, ఐస్ ఫ్రూట్, జంతికలు, చేగోడీలు—ఇలా కావమ్మ ప్రతిసారి సంతకు వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటుంది.
"ఈసారి పెద్ద పండక్కి నీకు నేను కొనిపెడతాగా!" అంటూ ఎప్పుడో వచ్చే పెద్ద పండక్కి కావమ్మ కోరికలన్నిటిని వాయిదా వేసేసింది. వారం అంతా కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేది యాదమ్మ మాత్రమే. తాగుడుకు బానిస అయిపోయి, కూతురు బాధ్యతను వదిలేసి ఎప్పుడో చనిపోయాడు గంగయ్య.
పోనీ ఇంటిదగ్గర కావమ్మను వదిలేసి వద్దాం అంటే చిన్నపిల్ల కదా—భయం. రోజులు అసలే బాగాలేవు. అందుకే కూడా వెంటబెట్టుకుని వస్తుంది సంతకి. పోనీ కావమ్మ అడిగిన దాంట్లో ఏదో ఒకటి కొనిద్దాం అంటే, యాదమ్మ ఆదాయం అంతంత మాత్రమే. మొగుడు చేసిన అప్పులు తీరుస్తూ, వారం అంతా కష్టపడి, వారానికి సరిపడే సరుకులకి సరిపడే సొమ్ము మాత్రమే తీసుకుని వస్తుంది సంతకి
అందులో సరుకుల కోసం రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లిన గొంతు ఎండిపోతున్న ఒక షోడా కొనుక్కోడానికి కూడా స్తోమత లేని జీవితాలు వాళ్ళవి.
ఈ వారం సంతలోకి అప్పుడే అడుగుపెట్టిన కావమ్మ దృష్టి గాజుల దుకాణం మీద పడింది. రకరకాల రంగులతో అందంగా మెరిసిపోతున్నాయి గాజులు. ఆ గాజులు కొనుక్కున్న వాళ్లు చెయ్యి ఎదరకు పెట్టి గాజులబాబు చేత గాజులు వేయించుకుంటుంటే, ఉత్సాహంగా అటు వైపు చూసింది కావమ్మ. ఇన్నాళ్లు ఇవి అడగలేదు ఎప్పుడూ. ఇప్పుడు కొత్తగా దీనికి ఎలా తెలిసింది?
ఇంతలో పక్కింటి పుల్లమ్మ పిల్లలు గాజుల దుకాణం దగ్గర గాజులు వేయించుకుంటూ కనబడ్డారు. అందుకే వాళ్లని చూసి అడుగుతోందనుకుంది యాదమ్మ.
"అమ్మా... నాకు కూడా గాజులు కావాలి!" అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కావమ్మ. ఒక్కసారి యాదమ్మ, కావమ్మ చేతులు చూసింది. బోసిగా ఉన్నాయి. ఇన్నాళ్లు ఈ దృష్టి రాలేదు అసలు. గాజులంటే ఆడపిల్లలకి అందం, దానికి తోడు సౌభాగ్యం. గాజులు కొనలేనని చెప్పలేదు, కొనకూడదని చెప్పకూడదు.
అబ్బా! ఆ ఎర్ర గాజులు ఎంత బాగున్నాయి! నల్లటి కావమ్మ చేతులకు ఆ ఎర్ర గాజులు, ఆకుపచ్చ గాజులు మెరిసిపోతాయి. ఎదుగుతున్న పిల్ల. ఈ పిల్లకి ఒంటి మీద ఏది లేకపోయినా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
ఆ పక్కనే పౌడర్ డబ్బాలు కాటుక డబ్బాలు అద్దం దువ్వెన బొట్టు బిళ్ళలు తలలో పెట్టుకునే క్లిప్పులు అమ్మే షాపులు ఉన్నాయి. ఆ పక్కనే నేల మీద గోనెసంచి పరిచి, దాని మీద పెట్టిన రెడీమేడ్ బట్టలు—ఇవన్నీ కావమ్మకు అవసరమైనవి. ఇన్నాళ్లు ఈ సంగతి మర్చిపోయింది. ఇవి ఆడపిల్లలకు అలంకరణ సామాగ్రి కాదు, అవసరమైనవి. దానికి తోడు, ఇప్పుడు కావమ్మ వయసు పెరుగుతోంది. వయసుకు తగ్గ మెరుగు, రక్షణ తల్లిదండ్రులే కదా ఇవ్వాల్సింది అనుకుంది యాదమ్మ.
"కావమ్మా… నీవు ఇన్ని రోజులు అడగలేదు. కానీ నిన్ను ఇప్పుడు నిరుత్సాహపరచడం నా చేత కాదు," అనుకుంది యాదమ్మ. గాజులు వేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. అందులో పెద్ద పండక్కూడా వస్తోంది. అందరూ కొత్త బట్టలు , శరీరానికి అలంకరణ చేసుకుంటే తప్పకుండా అప్పుడైనా కావమ్మ ఏడుస్తుంది. ఇన్నాళ్ళు కావమ్మ కోరికలన్నీ పెద్ద పండక్కి వాయిదా వేస్తూ వచ్చాను . కానీ ఇప్పుడు తప్పదు అని యాదమ్మ అనుకుని చేతిలో ఉన్న కాసులు లెక్కేసింది.
అన్నీ నువ్వులు నులిమినట్టు ఉన్నాయి. కానీ, కూతురి కన్నీళ్లు చూస్తే మనసు కరిగిపోయింది. చిన్నపిల్ల అయినా ఆరేళ్ల నుంచి పెద్దదానిలా వర్థిల్లుతోంది కావమ్మ. మనసుపెట్టి అడిగిన ప్రతి కోరికను వాయిదా వేసుకుంటూ వచ్చింది తాను. గాజులు మాత్రం వాయిదా వేయలేని కోరిక.
“ఏయ్ బాబు, ఆ ఎర్ర గాజులు ఎంత బాబు ?” అని అడిగింది యాదమ్మ.
“రెండు చిల్లరలే అక్కా,” అన్నాడు గాజులబాబు.
రెండు రూపాయలు. సంతోషంగా కనిపించిన గాజులు. చేతిలో ఉన్న డబ్బు ఓసారి చూసింది. కూరగాయల కోసం తెచ్చిన మొత్తం. కానీ, ఒక వారం కూరగాయల్లో కొంచెం తక్కువ కొంటే ఎవరో చచ్చిపోతారా? అసలు గాజులు దొరికితే కావమ్మ ప్రాణమే పరవశించిపోతుంది!
“ఇవి సరిపోతాయి. నీ చేతులు ఇంకా సన్నగా ఉన్నాయి. జాగ్రత్తగా పెట్టుకో,” అంటూ గాజులు చేతికి పెట్టించాడు గాజులబాబు. అలా పక్కనే ఉన్న అలంకరణ సామగ్రి, పరికిణి అన్నీ కొని బుట్టలో పెట్టుకుంది యాదమ్మ. ఎప్పుడు సరుకులతో నిండిపోయే బుట్ట కావమ్మ ఆనందానికి కారణమయ్యే వాటితోటి నిండిపోయింది.
కావమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ గాజులు వేసుకున్నాక మళ్లీ చేతులు మెలికలు పెడుతూ, చూసుకుంటూ, ఆనందంగా నవ్వుతోంది. కావమ్మ ముఖంలో ఆనందం చూసి వారం రోజులు కాదు కాదు నెల రోజులు ఎలా గడపాలో అన్న ప్రశ్న సంగతే మర్చిపోయింది యాదమ్మ.
“అమ్మా… చూడమ్మా… ఎలా మెరిసిపోతున్నాయో… ఇదే నా పండగమ్మా!”
ఆ మాట వినగానే యాదమ్మ కన్నీళ్లను వెనక్కు మింగేసింది. ఆ చిన్న గాజుల చప్పుడు లో తాను చూడదలచిన గొప్ప జీవితం కనబడింది. తన తల్లి మాటల్లో చెప్పాలంటే—
"ఒక్కోసారి మనకున్నది తక్కువైనా, మనం ఇచ్చేది ఎవరి హృదయాన్ని తాకుతుందో చూసుకుంటే, అది బ్రహ్మానందాన్నిస్తుంది."
కావమ్మకు కావలసినవన్నీ కొనిపెట్టి గాజుల దుకాణం దగ్గర నుంచి వెనక్కు తిరిగి వచ్చేసారు ఇద్దరూ. ఆ తర్వాత నెల రోజులు ప్రతిరోజూ అన్నంలో కారంపొడి వేసుకుని తింటుంటే, కన్నీళ్లు వచ్చినా, కావమ్మ చేతి గాజుల చప్పుడుకి, నుదుటన పెట్టుకున్న తిలకాన్ని చూసినప్పుడు, సంతలో కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ పరికిణి కట్టుకుని కావమ్మ కళ్ళల్లో వచ్చిన ఆనందాన్ని చూసి, తన నోటి మంటనూ, కడుపు మంటనూ మర్చిపోయింది యాదమ్మ.
కాని ఇవేమీ తెలియని కావమ్మ, అమ్మవి ఆనందభాష్పాలని అనుకుంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి