క్యాలండర్
క్యాలెండర్
ఏ ఇంటిలో చూసిన గోడ మీద అందమైన చిత్రపటాలు లేకపోయినా క్యాలెండర్ మటుకు వేలాడుతూ ఉంటుంది
ప్రతి నెలకి ఒక పేజీ కేటాయించి పన్నెండు పేజీలతో ప్రతిరోజు పంచాంగం చూడనవసరం లేకుండా తిధి వార నక్షత్రం వర్జ్యం కరణం యోగం అన్ని ఒకే చోట మనకు చూపిస్తూ మంచి చెడ్డలు చెప్పే క్యాలెండర్ మన దినచర్యలో ఒక ముఖ్యమైన వస్తువు.
తిధి వార నక్షత్రాలతో సంబంధం లేదు. మన జీవితాలకు సంబంధించి ఏ ముఖ్యమైన రోజు అయినా అన్నీ తేదీలు తోటే ముడిపడి ఉన్నాయి . పలానా రోజు ఫలానా తేదీ పలానా సంవత్సరం . గవర్నమెంట్ వారు కొలువులో చేరడానికి కొలువు నుండి దిగిపోవడానికి అన్నీ తేదీలే ముఖ్యం .
పెళ్లిరోజు కూడా ఫలానా తేదీ అని చెప్తాం అంతేకానీ పలానా తిధినాడు అని చెప్పం. కేవలం పితృ కార్యాలు, పండగలు మాత్రమే తిధుల ప్రకారం జరుపుకుంటాం.
ఏ శుభకార్యానికి అయినా ముహూర్తాలు అయితే తిథి వార నక్షత్రం తారాబలం చూసి పెట్టుకుంటాం గానీ అంకెలతో కనిపించే ఆ తేదీలు మన జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
దేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగితే తదుపరి అది మన చరిత్ర పేజీలో ఒక ముఖ్యమైన రోజు అవుతుంది.ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 1947 వ సంవత్సరము నాడు వచ్చింది. అది మన భారత దేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు. అలాగే రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. అలాగే గాంధీ గారి పుట్టినరోజు నెహ్రూ గారి పుట్టినరోజు అన్నీ తేదీలు ప్రకారమే.
అలాగే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఆంగ్ల సంవత్సరాదిగా జరుపుకుంటాం. ఆంగ్ల సంవత్సరాది ఒక ప్రత్యేక చట్టం ద్వారా పుట్టినది. ఈ సంవత్సరానికి కూడా 365 రోజులు
12 నెలలు . ఈ నెలలకి ఇంగ్లీష్ పేరు పెట్టుకుని మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఎవరినైనా ఇది ఏ నెల అని అడిగితే
టక్కున ఆంగ్ల సంవత్సరంలో నెలల పేరు చెప్తారు. తెలుగు నెలల పేర్లు చెప్పరు. అంతగా ప్రజల్లో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రాముఖ్యం పొందింది.
ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానించే తీరు భిన్నంగా ఉంటుంది. అంటే డిసెంబర్ 31వ తేదీ నుంచి హడావుడి మొదలవుతుంది. అర్ధరాత్రి వరకు ఐదు నక్షత్రాల హోటల్లో రంగురంగుల సీసాలోని ద్రవం నోటిలోకి ఒంపుకుని కేకు ముక్క కోసుకుని మత్తు మత్తుగా ప్రతి సంవత్సరం శుభాకాంక్షలు తెలపడం ఒక ఆనవాయితీ.
ఒక ధనిక వర్గానికి మాత్రమే పరిమితమై ఉండేది ఇది. క్రమేపి మధ్యతరగతి వారికి కూడా పాకింది. ఇంకా యువత ఉత్సాహం ఆ రోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది.పగ్గాలు లేకుండా ఉంటుంది. అర్ధరాత్రి వరకు మోటార్ సైకిల్ మీద బలాదూర్ తిరుగుతూ సైలెన్సర్ లేకుండా బండి నడుపుతూ బాణసంచా మోతతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహం ప్రతి ఏటా పెరిగిపోతోంది. ఏ మొబైల్ నెట్వర్క్ చూసినా నూతన సంవత్సర సందేశాలతో ఇంతకుముందు ఎప్పుడూ లేని బిజీ గా బిజీ గా ఉంటోంది. ప్రకృతి వాతావరణం కూడా ఆనందకరంగా ఉంటుంది. చుట్టూ పొగ మంచు వణికించే చలి వీధుల్లో గొబ్బెమ్మలు నేల మీద తెల్లటి ముగ్గులు దేవాలయంలో ధనుర్మాస పూజలు అంతా ఉత్సాహభరితంగా ఉంటుంది.
తేదీలు నెలలు సంవత్సరాలు తిథులు వారాలు నక్షత్రాలు ప్రతిరోజు ప్రతిక్షణం మనకి గుర్తు చేయడానికి అందంగా గోడమీద వేలాడుతుంటుంది ఆ అందాల బొమ్మ క్యాలెండర్.
కొన్ని క్యాలెండర్లు అందమైన దృశ్యాలతోనూ, బొమ్మలతోనూ,
దేవుడి బొమ్మలతోను ,చంటి పిల్లల బొమ్మలతోనూ మనల్ని మురిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ క్యాలెండర్ వాళ్లు పడుకునే గదిలో పెడుతుంటాం. ఆ బొమ్మను చూస్తూ ఉండు నీకు అలాంటి పిల్లాడు పుడతాడు అని ఉత్సాహపరుస్తాం. దేవుళ్ళ బొమ్మలు అయితే ఫ్రేములు కట్టించుకుని అందంగా గోడల మీదకు చేరుస్తాం.
ప్రతి సంవత్సరము ఆఖరి రోజున అంటే డిసెంబర్ 31 నాడు కొత్త క్యాలెండర్ కోసo కొట్టుకుపోతాం. ఒకప్పుడు బజారులో బట్టలు కొనుక్కుంటే షాపులు వాళ్ళు క్యాలెండర్ చేతిలో పెట్టేవారు. అందమైన బహుమతులు కూడా కొంతమంది ఇచ్చేవారు.
ఈ రోజుల్లో అన్ని మనము ఆన్లైన్లో నే కొనుక్కుంటున్నాం. ఎవరి దగ్గర కొంటున్నామో తెలియదు. సరుకు ఎవరు పంపిస్తున్నారో తెలియదు. మనిషికి షావుకారికి సంబంధం లేదు. క్యాలెండర్లు ఎవరు ఇస్తారు. అయితే మా నగరంలోని ( కాకినాడ)ప్రముఖ బంగారo షాపు వాళ్లు ఒక వ్యాన్ లో క్యాలెండర్లు పంచుతూ కనిపించారు. చాలా ఆనందం వేసింది.
అలాగే బ్యాంకులు కూడా ప్రతి సంవత్సరం తమఖాతాదారులకి క్యాలెండర్ ఇస్తుంటాయి. బ్యాంకు క్యాలెండర్ అంటే చాలామందికి మోజు ఎక్కువ. ముఖ్యంగా బ్యాంకు సెలవు దినాలు తెలుసుకో డా నికి.
బ్యాంకులు కూడా ప్రతి పేజీ మీద తమ తమ డిపాజిట్ స్కీములు రుణాల స్కీములు గురించి సమాచారం ఇస్తూ ఉంటాయి. ఇది ఒక రకంగా వాళ్ళకి ఎడ్వర్టైజ్మెంట్.
బ్యాంకు క్యాలెండర్ గురించిచాలామంది ఖాతాదారులు ప్రతి జనవరి ఒకటో తేదీ నాలుగు రోజుల ముందు నుంచి క్యాలెండర్ గురించి ఎంక్వయిరీ చేస్తుంటారు.
బ్యాంకులో అకౌంట్ ఉన్నా లేకపోయినా వచ్చి క్యాలెండర్ తీసుకునే వాళ్ళు చాలామంది. వారికి అదొక ఆనందం.
పూర్వకాలంలో నేను ఉద్యోగం చేసిన రోజుల్లో ప్రతి బ్రాంచ్ లోను ఎవరెవరికి క్యాలెండర్ ఇవ్వాలో ఒక ముఖ్యమైన రికార్డు ఉండేది. ఆ రికార్డు ప్రకారం ఉద్యోగస్తులు ఆ క్యాలెండర్లు వాళ్ల షాపులు కానీ కార్యాలయాలు కానీ ఇంటికి కానీ వెళ్లి ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ ఉండేవారు. అదే కాకుండా బ్యాంకుల కౌంటర్లలో ప్రతి కౌంటర్లలోనూ క్యాలెండర్లు పెట్టి వచ్చిన ఖాతాదారులందరికీ పంచి పెడుతుండేవారు.
నూతన సంవత్సరం వచ్చిన వారం రోజుల వరకు కూడా ఈ క్యాలెండర్లు అడుగుతూనే ఉండేవారు. బ్యాంకు కేలండర్ అంటే ప్రజలకు అంత మోజు. సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో చేతిలో ఉన్న ఈ బుజ్జిముండను (cell) తెరిచి చూస్తే తేదీలు కనపడతాయి ఇంకొంచెం లోతుకు వెళితే ఆరోజు ప్రాముఖ్యత అంతా తెలుస్తుంది కానీ గోడ మీద వేలాడిన క్యాలెండర్ లేకపోతే చూడకపోతే మనకు తోచదు.
ఆ అందమైన క్యాలెండర్ డిసెంబర్ 31 నాడు
గోడకు అందంగా అలంకరించేస్తాం. ఈ క్యాలెండర్ రాగానే లో ఉన్న పిల్లలు తమ తమ పుట్టినరోజులు ఏ రోజున వచ్చాయో
చూసుకుని పెన్నతోటి మార్కు చేసేసుకుంటారు.
ఇంక నా హ్యాపీ బర్త్డే మూడు నెలలే ఉంది నాలుగు నెలలే ఉంది అంటూ వాళ్ళ అమ్మకి గుర్తు చేస్తూ ఉంటారు.
ఇంకా పెద్దవాళ్ళు అయితే పండగలు ఎప్పుడెప్పుడు వచ్చాయోమరియు ఆ కుటుంబమునకు సంబంధించిన వరకు ముఖ్యమైన రోజులు అంటే పెద్ద వాళ్ళ తిధులు ఏ తేదీన వచ్చాయా చూసుకుని దానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రణాళిక వేసుకుంటారు. ఉద్యోగస్తులు సెలవు రోజుల గురించి యువ జంటలు తమ పెళ్లిరోజులు గురించి క్యాలెండర్ లో వెతుక్కుంటారు.
అయితే గృహిణిలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలవాడి నాగాలు, గ్యాస్ వచ్చిన తేదీ పనిమనిషి డుమ్మా కొట్టిన తేదీ అన్ని వ్రాసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.
మొబైల్ నెంబర్లు వ్రాసుకోవడానికి ఇదే చాలా ఉపయోగం.
ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరికి రాబోయే కొత్త సంవత్సరం క్యాలెండర్ తో గోడని అలంకరిస్తుంది. ప్రతిరోజు తిథి వార నక్షత్రం తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరి భవిష్యత్తును కూడా చెబుతుంది.భవిష్యత్తును తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ. అందుకే క్యాలెండర్ పేజీలు వెనక్కి తిప్పి రాబోయే కాలం ఎలా ఉందో తెలుసుకుంటాడు.
ఏమి మాటలు రాని చిలకలు చేత భవిష్యత్తు చెప్పించుకుంటున్నాము. గోడ మీద ఉన్న క్యాలెండర్ చెబితే తప్పేమిటి?
ఒక్కొక్కసారి క్యాలెండర్ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది
కారణం ఏమిటి ఆదివారం పూట జాతీయ పండుగలు వస్తే సెలవులు పోయిందని ఉద్యోగస్తులు అందరికీ కోపం. అది ఏం చేస్తుంది పాపం కాలచక్రం ఎలా తిప్పితే అలా నడుస్తుంది. అదే మనకు చూపిస్తుంది.
గోడ మీదనున్న పాత క్యాలెండర్ తీసి కొత్త క్యాలెండర్ పెడుతుంటే ఒక రకమైన భయం కూడా. ఎందుకంటే మన వయసు ఇంకొక ఏడాది పెరుగుతోందని.
మన ఆశలు ఆశయాలు తీరిన తీరకపోయినా నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అటు పాత సంవత్సరం కొత్త క్యాలెండర్ గోడకు తగిలించి మరీ వెళ్ళిపోతుంది. మళ్లీ కొత్త ఆశయాలు ఆకాంక్షలు మామూలే. ఆ మంచి రోజు కోసం ఎదురుచూపులు మామూలే. ఆశ పడడం వరకే మన వంతు ఆ తర్వాత పై వాడి దయ .మన ప్రయోజకత్వం ఏమీ ఉండదు.
ఈ ఏడాది అయినా పెద్ద మనవడికి పెళ్లయితే బాగుండును అనుకుంటుంది ముసలమ్మ. కూతురు కాపురం స్థిరపడాలని మంచి ఇల్లు కట్టుకోవాలని పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని ముఖ్యంగా ఆరోగ్యాలు బాగుండాలని అన్నీ మంచి కోరికలే.
కానీ కాలం అకస్మాత్తుగా తీసుకొచ్చే ప్రమాదాలకి తట్టుకునే శక్తి కూడా ఇవ్వమని దేవుడిని ప్రార్థించే వాళ్ళు ఎవరూ ఉండరు. చెడు అంటే అందరికీ భయం. మంచి చెడులు కలయకే మన జీవితం.
పాపం తళ తళలాడుతూ ఇంటిలో ప్రవేశించిన క్యాలెండర్ రాగానే చుక్కలు పెట్టించుకుని నెలకొకసారి మొహం తిప్పుకొని కొత్త మొహంతో ముందుకు వచ్చి మన ఇంటిలో అతి ముఖ్యమై దిగా మన్నన పొందుతోంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి