పాత బట్టలు
నిజానికి ఇది ఒక కుటుంబ సమస్య .... సాంఘిక సమస్య కూడా పర్యావరణ సమస్య కూడా... ఇంతకీ ఏమిటిది? పాత బట్టలు.
ఏ ఇంట్లో చూసినా కబోర్డ్ లు నిండిపోయి ఉంటాయి పాత బట్టలు. క్రితం సంవత్సరం పండగకి కొనుక్కున్న బట్టలు మళ్లీ వచ్చే పండక్కి పాత బట్టలు అయిపోయి అవి కబోర్డ్ లో అలాగే అడుగున ఉండిపోతాయి. దాన్ని తీసుకుని మళ్లీ కట్టుకునే నాథుడు ఉండడు.
ఆధునిక కాలంలో ప్రతి బెడ్ రూమ్లో పెద్ద పెద్ద కబోర్డ్ లు అది కాకుండా బీరువాలు ఎన్ని ఉన్నా బట్టలు నిండిపోయి ఉంటున్నాయి ప్రతి ఇంట్లో. ప్రతిసారి ఆ ఇల్లాలికి అవన్నీ మడతలు పెట్టి సక్రమంగా కబోర్డ్ లో అమర్చడం ఒక పెద్ద పని.
మా చిన్నతనాల్లో పండగలకి పుట్టినరోజులకి మటుకే బట్టలు కొనుక్కుని వాళ్ళం. ఇప్పుడు అలా కాదు ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కోవడం మోజు తీరేవరకు కట్టుకోవడం అవి చివరికి పాత బట్టలు అయిపోతున్నాయి. నిజానికి ఇది కుటుంబంలో ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టి దగ్గర నుంచి రకరకాల డ్రస్సులు కొంటూ ఉంటారు ఎదిగే పిల్లలు కదా అవి వాళ్లకి రానురాను సరిపోవు. అలాగే ఆడ మగ తారతమ్యం లేకుండా వెలిసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు మన కబోర్డ్ లో ఎన్ని ఉంటాయో లెక్కలేదు
నిజానికి బట్టలు కట్టుకోవడం కూడా ఒక కళ. ఎందుకంటే ఇవాళ రేపు బట్టల మెయింటెనెన్స్ కి చాలా ఖర్చు అయిపోతోంది. మనం వాషింగ్ మిషన్లు కరెంట్ ఖర్చులు ఇస్త్రీ ఖర్చులు ఇవన్నీ తడిపి మోపుడు అవుతున్నాయి. డబ్బు విషయంలో పొదుపు ఎలా పాటిస్తామో బట్టలు కట్టుకోవడం కోవడంలోనూ, కొనుక్కోవడంలోనూ అంత పొదుపు పాటించవలసిన అవసరం ఉంది .
అయితే పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదనే ఒక సమాచారం యూట్యూబ్ లో చక్కర కొడుతోంది. దానికి నాకు తెలిసినంతవరకు అది పచ్చి అబద్ధం. ఎవరు పుట్టిస్తారో తెలియదు.
మనం రోజు రోడ్డుమీద వెళ్తున్నప్పుడు అనేకమంది ఒంటిమీద బట్టలు లేకుండా తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఏమో బట్టలు ఎక్కువైపోయాయి. అక్కడ వాళ్లకి ఒంటిని కప్పుకోవడానికి బట్టలు లేవు. అలాగే అనేక అనాధ శరణాలయాలు, పేదవాళ్లు తమ ఒంటిని కప్పుకోవడానికి బట్టల కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. మనం చుట్టుపక్కల చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. మనం చేయవలసిన పని కూడా మనకు అర్థం అవుతుంది. మనకు అవసరం లేని వస్తువు ఇంకొకరికి అది అవసరం కదా. మరి ఈ విషయం గురించి ఆలోచించ వలసింది ఎవరు. ఎవరికి వారే.
ఒక ఆదివారం పూట మనకు పనికిరాని చిరిగిపోని బట్టలన్నీ చక్కగా ఉతికించి ఆనందంగా మనకు దగ్గరలో ఉన్న అనాధ శరణాలయం కానీ పేదలు ఉండే ప్రదేశానికి కానీ పిల్లలతో సహా వెళ్లి వారికి ఇచ్చినపుడు వారి కళ్ళల్లో కనిపించే ఆనందం వల్ల మనకు కలిగే సంతృప్తి అనంతం. పిల్లల్ని ఎందుకు తీసుకు వెళ్ళమంటున్నాను అంటే భవిష్యత్తులో వాళ్లు కూడా ఇటువంటి మంచి పద్ధతులను నేర్చుకుంటారు మనల్ని చూసి. అలాగే బట్టలు ఒకటే కాదు వంటింటి సామాన్లు ఉంటాయి అవి ఎప్పుడూ వాడము అలా కబోర్డ్ లో పడి ఉంటాయి. ఇది దానం అని నేను అనను. కారణం ఇవి కొత్త వస్తువులు కాదు. అవసరమైన వారికి అవసరమైన వస్తువు ఇస్తున్నాము అంతే. ఇవి ఇచ్చేటప్పుడు రెండు మూడు ఫోటోలు తీసుకుని వాట్సాప్ లోను ఫేస్బుక్లో ఇంస్టాగ్రామ్ లోను పెట్టక్కర్లేదు. ఇది కేవలం మన మానసిక సంతృప్తి కోసమే.
పోనీ మనం ఎవరికీ ఇవ్వకుండా విసుగెత్తి ఈ బట్టలు చెత్తలో పడేసామనుకోండి. అది భూమికి భారం. పర్యావరణ సమస్య దాని మూలాన బాధపడేది కూడా మనమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి